Jump to content

రౌడీ ఇన్‌స్పెక్టర్

వికీపీడియా నుండి
రౌడీ ఇనస్పెక్టర్
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం బి. గోపాల్
నిర్మాణం త్రివిక్రమరావు
కథ ఎ. ఆంజనేయ పుష్పానంద్
చిత్రానువాదం ఎ. ఆంజనేయ పుష్పానంద్
తారాగణం బాలకృష్ణ,
విజయశాంతి
మోహన్ రాజ్
సంగీతం బప్పీలహరి
నేపథ్య గానం ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం,
చిత్ర
నృత్యాలు తార, ప్రభు,
శివ-సుబ్రహ్మణ్యం
గీతరచన భువనచంద్ర
సంభాషణలు పరుచూరి సోదరులు
ఛాయాగ్రహణం వి.ఎస్.ఆర్. స్వామి
కళ భాస్కరరాజు
కూర్పు కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ విజయలక్ష్మీ ఆర్ట్ మూవీస్
భాష తెలుగు

రౌడీ ఇన్స్ పెక్టర్ సినిమా బి.గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన 1992 నాటి తెలుగు యాక్షన్ కథా చిత్రం. సినిమాలో కథ, స్క్రీన్ ప్లే ఆంజనేయ పుష్పానంద్ రాయగా, చిత్ర సంభాషణలు పరుచూరి బ్రదర్స్ రాశారు.

నిర్మాణం

[మార్చు]

అభివృద్ధి

[మార్చు]

బొబ్బిలి సింహం అన్న పేరును ముందుగా నిర్ణయించి టైటిల్ రిజిస్టర్ చేసుకుని, దానికి అనుగుణమైన కథ రాసుకుంటున్న సమయంలో దర్శకుడు బి.గోపాల్ చిన్నతంబి అన్న తమిళ సినిమా చూసి అది తీద్దామనుకున్నారు. సినిమాను పరుచూరి బ్రదర్స్ కి కూడా చూపించగా బాలకృష్ణతో ఈ సినిమా తీస్తే సిల్వర్ జూబ్లీ ఆడుతుందని, హక్కులు కొనమని ప్రోత్సహించారు. కానీ అప్పటికే కె.ఎస్.రామారావు ఆ సినిమా హక్కులు కొని, వెంకటేష్ హీరోగా చంటి పేరిట తీస్తున్నారని తెలిసింది. ఇలా బి.గోపాల్-బాలకృష్ణ కాంబినేషన్లో చేసే సినిమాకు పలు లైన్లు అనుకుంటూ ఏదీ ఫైనలైజ్ కాని సమయంలో రచయిత పుష్పానంద్ ఓ కథతో వచ్చారు. రౌడీ ఇన్స్పెక్టర్ అన్న టైటిల్ తో రాసుకున్న ఆ కథకు అప్పటికే స్క్రీన్ ప్లే సహా పుష్పానంద్ అభివృద్ధి చేశారు. ఆ కథ విన్నప్పుడు సినిమాలో హీరో ఇంటర్వెల్ తర్వాత ఓ తప్పుడు మర్డర్ కేసు వల్ల సస్పెండ్ అవుతాడు. ఇలా ఫేక్ కేసుతో చేస్తే ప్రేక్షకుల్ని మోసం చేసినట్టయి సినిమా దెబ్బతింటుందేమోనని పరుచూరి బ్రదర్స్ ఆలోచించారు. అయితే వాళ్ళు హైదరాబాద్ వచ్చి ఈ చిత్రం గురించి చర్చించుకున్నప్పుడు ఇలాగే గ్యాంగ్ లీడర్ లోనూ హీరో మీద తప్పుడు కేసు పడుతుంది కదా ఫేక్ చేసింది విలన్ అదీ హీరోని, అంతేకాని డైరెక్టర్ ప్రేక్షకులను ఏమీ పేక్ చేయట్లేదని ఆలోచించి ఆ విషయాన్ని బి.గోపాల్ కి చెప్పి ఒప్పించారు. తర్వాత చర్చల్లో అంకుశం, కర్తవ్యం లాంటి సినిమాల్లో చివరిదాకా ప్రధానపాత్రధారి ఖాకీ యూనిఫాంలో ఉండి పోరాడినట్టు చూపడంతో విజయం సాధించాయి కనుక ఇక్కడ కూడా హీరోని యూనిఫాంకు దూరం చేయొద్దని భావించారు. అందుకు అనుగుణంగా సీన్లలో మార్పులు చేసుకుని డైలాగులు రాసుకున్నారు. సినిమాలో విలన్ మోహన్ రాజ్ పాత్ర బాలకృష్ణ పాత్రతో పోలీస్ స్టేషన్లోనే గొడవపెట్టుకునే సన్నివేశాన్ని పుష్పానంద్ రాసినప్పుడు విలన్ ఎంత మాట్లాడుతున్నా హీరో పట్టించుకోకుండా టీ తాగుతూ, స్టైల్ గా సిగరెట్ వెలిగించేలా రాశారు. అయితే విలన్ చెలరేగిపోతూండగా హీరో మౌనంగా వింటూండడం ప్రేక్షకులకు నచ్చకపోవచ్చని పరుచూరి సోదరులు భావించారు. దర్శకునికి పరుచూరి బ్రదర్స్ చెప్పిందే సమ్మతించడంతో అక్కడ బాలకృష్ణ పాత్రకు పవర్ ఫుల్ డైలాగులు రాశారు. అయితే అక్కడ బాలకృష్ణ పాత్ర చెప్పే "యూనిఫాం తీసేస్తే నీకన్నా పెద్ద రౌడీనిరా", "ఏ సెంటర్లో కొట్టుకుందాం? శరత్, సంగం" వంటి డైలాగులు మంచి ప్రేక్షకాదరణ పొంది, సినిమా విజయంలో కీలకపాత్ర పోషించాయి.[1]

నటీనటుల ఎంపిక

[మార్చు]

బాలకృష్ణ-బి.గోపాల్ కాంబినేషన్లో సినిమా తీసేందుకు కథ కోసం వెతుకుతూండగా ఈ కథ చెప్పారు. దాని ప్రకారం సినిమా కథని చిత్రబృందం వినే సమయంలోనే సినిమాలోని కథానాయక పాత్ర బాలకృష్ణ చేసేందుకు నిర్ణయం జరిగింది.[1]

చిత్రీకరణ

[మార్చు]

సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తయ్యాకా ఫస్టాఫ్ లోని ఓ సన్నివేశాన్ని కొత్తగా చిత్రీకరించి చేర్చారు. మూడవ సన్నివేశంలో హేమని కాలేజీలో హద్దుమీరి అవమానించడంతో విలన్ తమ్ముడు సాయికుమార్ పాత్రని సస్పెండ్ చేస్తారు. తర్వాతి సన్నివేశాల్లో హీరో మనిషైన నిర్మలమ్మను విలన్ అవమానిస్తాడు. అయితే నిర్మలమ్మను అవమానించినందుకు కనీసం హీరో ప్రతిస్పందన అయినా లేకపోవడం, సాయికుమార్ ని హేమ్ డిబార్ చేయించిన విషయం విలన్ కు తెలియజెప్పిన సీన్ లేకుండానే విలన్ గ్యాంగ్ ఆమె వెంటపడడం లాంటివి లింకులు కలపడంలో లోపంగా ఎడిటింగ్ సమయంలో కనిపించడంతో ఆ రెంటికీ లింక్ సీన్లు మరో రెండు రాసుకుని తీయాలనుకున్నారు. ఆ చిత్రీకరణ చేయాలని అనుకున్న సమయానికి బి.గోపాల్ బ్రహ్మ సినిమా షూటింగ్ కోసం ఊటీలో ఉన్నారు. ఆయన కోరికమేరకు చిత్ర రచయితలు పరుచూరి సోదరులు ఆ సన్నివేశాలకు దర్శకత్వం వహించారు. అయితే ఆ సీన్లను షూటింగ్ చేయడానికి వెళ్తూండగా కార్లో నిర్మాత త్రివిక్రమరావు "ఆ రెండు సీన్లు ఒకటిగా చేసేయలేమా" అని అడగడంతో నిర్మలమ్మను అవమానించినందుకు విలన్ ఇంటికి వెళ్ళి "ముసలిదాని మీద కాదురా నీ ప్రతాపం, దమ్ముంటే నామీద చూపించు" అనడంతో పాటుగా "నీ తమ్ముణ్ణి కాలేజీ నుంచి డిబార్ చేయించా, నిన్ను సొసైటీ నుంచే డిబార్ చేయిస్తా" అంటాడు, డిబారేంది అని విలన్ అడగడం, కాలేజీ నుంచి ఓ అమ్మాయి వల్ల డిబార్ అయ్యాను అని అతని తమ్ముడు చెప్పడం.. ఆ అమ్మాయెవరు అని విలన్ ప్రశ్నించడంతో సీన్ పూర్తిచేసి.. అదంతా చిత్రీకరించి కలిపారు.[1]

విడుదల, ఫలితం

[మార్చు]

సినిమా మంచి ప్రేక్షకాదరణ పొంది ఘన విజయం సాధించింది. సినిమా తమిళంలో ఆటోరాణి పేరిట డబ్బింగ్ చేసుకుని అక్కడా విజయవంతంగా ప్రదర్శితమైంది.[1]

పాటల జాబితా

[మార్చు]

పాటల రచయిత: భువన చంద్ర

  • డిక్కీ డిక్కీ , గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • అరే వో సాంబ , గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • టక్కుటమార బండి , గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • నీలాల నింగి , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • చిట పట చినుకులు , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,చిత్ర
  • ఓ పాపాయో , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర .

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 పరుచూరి, గోపాలకృష్ణ. "11th అవర్-రౌడీ ఇన్స్ పెక్టర్". నందమూరి ఫ్యాన్స్.కాం. Retrieved 17 August 2015. లెవెంత్ అవర్ పేరిట ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసాల్లో ఒకటి