లేడీస్ టైలర్
లేడీస్ టైలర్ | |
---|---|
దర్శకత్వం | వంశీ |
రచన | సిరివెన్నెల సీతారామశాస్త్రి (పాటలు) |
తారాగణం | రాజేంద్ర ప్రసాద్, అర్చన , వై.విజయ, మల్లికార్జునరావు, శుభలేఖ సుధాకర్, రాళ్ళపల్లి |
కూర్పు | అనిల్ మల్నాడ్ |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | |
భాష | తెలుగు |
లేడీస్ టైలర్, 1985లో వంశీ దర్శకత్వంలో విడుదలైన ఒక చిత్రం. రాజేంద్ర ప్రసాద్, వంశీల నటజీవితంలో ముఖ్యమైన చిత్రాలలో ఇది ఒకటి.
ఇతివృత్తం
[మార్చు]కాకినాడ దగ్గరలోని పల్లెటూళ్ళో సుందరం(రాజేంద్రప్రసాద్) ఒక నిపుణుడైన, బద్ధకస్తుడైన దర్జీ. బద్ధకంతో పాటు జాతకాలు, యోగాలపై మూఢనమ్మకం కూడా ఉంటుంది అతనికి. అదృష్టం కలిసొస్తే కష్టపడకుండా ధనవంతుడవ్వచ్చునని అతని కోరిక. ఆ ఊరిలో అతనొకడే దర్జీ, పైగా చాలా బాగా కుట్టగలిగిన సమర్థత ఉన్నవాడు. బట్టల సత్యం (మల్లికార్జునరావు) బట్టలమూటతో ఇంటింటికీ తిరుగుతూ జాకెట్టు, షర్టు, చీరలు వంటి బట్టలు అమ్ముకునే వ్యాపారి. ఐతే ఊళ్ళో సరైన దర్జీ లేకపోవడం, ఉన్న సమర్థుడైన సుందరానికి బట్టలు ఇస్తే బద్ధకంతో వారాలూ, నెలలూ కుట్టకుండా తిప్పించడంతో ఊళ్ళోని ఆడవాళ్ళంతా కాకినాడ వెళ్ళి అక్కడే కొని, కుట్టించుకుంటూంటారు. ఈ పరిణామం వల్ల నష్టపోతున్న బట్టల సత్యం ఎలాగైనా సుందరం బద్ధకం వదిలించి తాను బట్టలు అమ్మేట్టూ, వాటిని చకచకా అతను కుట్టేట్టూ ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తూంటాడు. కానీ సుందరం బద్ధకంతో దానికి సహకరించడు.
తొడమీద పుట్టుమచ్చ ఉన్న పద్మినీ జాతి అమ్మాయిని పెళ్ళి చేసుకొంటే అదృష్టం కలిసొస్తుందని సుందరానికి కోయ దొర (రాళ్ళపల్లి) జోస్యం చెబుతాడు. దాన్ని నమ్మిన సుందరం అలాంటి అమ్మాయిని వెతికే పనిలో పడతాడు. కానీ ఆడపిల్లల్ని అన్యాయం చేసేవాళ్ళని నరికి జైలుకువెళ్ళి తిరిగిరానున్న వెంకటరత్నం ఇలా ఆడపిల్లల్ని అల్లరిపెడితే చంపేస్తాడని భయపడతారు. కానీ వెంకటరత్నం దగ్గర జట్కా తోలే శీనూ, తానూ చిన్నప్పుడు రెండో క్లాసు నాలుగు సంవత్సరాలు కలిసిచదువుకున్నామని, అతన్ని తాను మేనేజ్ చేసి వెంకటరత్నానికి తెలియకుండా చేస్తానని మాటిస్తాడు బట్టల సత్యం. అయితే అందుకుగాను సుందరం ఊళ్ళో ఆడవాళ్ళకి తానమ్మే బట్టలు కుట్టాలని ఒప్పందం చేసుకుంటాడు.
ఊళ్ళో ఆడవాళ్లంతా తన దగ్గర కుట్టించుంకుందుకి వచ్చేలా వెంకటరత్నం చెల్లెలు పిచ్చి సుందరికి మంచి కొత్తరకం జాకెట్ కుట్టి ప్రచారంగా పంపుతాడు. అప్పటినుంచీ ఒకపక్క బట్టలు కుట్టడం, మరోపక్క ఎవరికి మచ్చ ఉందో వెతుక్కోవడం చేస్తూంటాడు. ఆ క్రమంలో కొబ్బరితోట ఉన్న నాగమణి, నర్సుగా పనిచేసే దయ, పెళ్ళిచూపులు తప్పిపోతూండే నీలవేణిల్లో ఎవరో ఒకరికి మచ్చ ఉండివుండొచ్చని నమ్మి, వారికి దగ్గరవుతాడు. వారికి మచ్చ ఉందో లేదో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూంటాడు, అయితే అవన్నీ శీను కంటపడుతూండడంతో ప్రమాదకరమైన స్థితికి చేరుకుంటూంటాడు. చివరకు ముగ్గురికీ మచ్చ లేదని తెలుసుకుంటాడు. ఆ విషయం తెలిశాకా ఇక కొద్దిరోజుల్లోనే వెంకటరత్నం జైలు నుంచి విడుదలై వస్తాడనీ, నీ ప్రాణాలు తీస్తాడని శీను బెదిరిస్తాడు. ఆ స్థితిలో ఊరొదిలి వెళ్లిపోతూండగా ఊరికి కొత్తగా వచ్చిన టీచర్ సుజాతకు మచ్చ ఉన్నట్టు తెలుస్తుంది.
తర్వాతి రోజే వెంకటరత్నం ఊళ్ళో దిగుతాడు. ఆయనకి శీను జరిగినదంతా చెప్పే సమయానికి బట్టల సత్యం వచ్చి పక్కకి తీసుకెళ్ళి నీ గుర్రానికి గుగ్గిళ్ళు పెట్టేందుకు అంటూ లంచం ఇస్తాడు. లంచం తీసుకుని శీను వెంకటరత్నానికి ఏమీ చెప్పడు. సుజాత టీచర్ వెంకటరత్నం ఇంట్లోనే అద్దెకున్నా శీను ఏమీ చెప్పకపోవడాన్ని ఆసరాగా తీసుకుని ట్యూషన్ చెప్పించుకునే పేరుతో ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు. ఈలోగా నాగమణి, దయ, నీలవేణి పెళ్ళి చేసుకోమని వెంటపడుతూంటారు. వీళ్ళకి అసలు విషయం తెలియకుండా దాచే ప్రయత్నాలు చేస్తూంటాడు. సుందరం అమాయకత్వం నచ్చి సుజాత అతన్ని ప్రేమిస్తుంది. ఈలోపు జరిగే హఠాత్సంఘటన ముగింపు వైపుకు దారి తీస్తుంది.
తారాగణం
[మార్చు]- సుందరంగా రాజేంద్ర ప్రసాద్
- సుజాతగా అర్చన
- కోయదొరగా రాళ్ళపల్లి
- పోలీసుగా తనికెళ్ళ భరణి
- బట్టల సత్యంగా మల్లికార్జున రావు
- సీతారాముడుగా శుభలేఖ సుధాకర్
- వెంకటరత్నంగా ప్రదీప్ శక్తి
- శ్రీనివాస్ కారును
- ఫోటోగ్రాఫరు జంబులింగంగా థమ్
- దయాగా దీప
- నీలవేణి సంధ్య
- నాగమణిగా వై. విజయ
నిర్మాణం
[మార్చు]తారాగణం ఎంపిక
[మార్చు]వంశీ తొలిచిత్రం మంచుపల్లకీలో నలుగురు కథానాయకుల్లో రాజేంద్రప్రసాద్ ఒకరు. ఆపైన ఆయనను తొలిసారిగా హాస్యకథానాయకునిగా ప్రేమించు పెళ్ళాడు సినిమా తీశారు వంశీ. కానీ ఆ సినిమా అంతగా విజయం సాధించకపోవడంతో రాజేంద్రప్రసాద్ బెంబేలెత్తిపోయారు. అయితే రాజేంద్రప్రసాద్‌లోని హాస్యకథానాయకుణ్ణి గుర్తించిన వంశీ ఈ సినిమాలో కథానాయకుని పాత్ర ఆయననే దృష్టిలో పెట్టుకుని తయారుచేశారు.
కథాంశం అభివృద్ధి
[మార్చు]చిత్రీకరణ
[మార్చు]చిత్రీకరణ అనంతర పనులు
[మార్చు]సంగీతం
[మార్చు]ఇళయరాజా స్వరపరిచి, సంగీతాన్నందించిన ఈ చిత్ర పాటలు అశేషాదరణ పొందాయి. పాటలన్నిటినీ సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు. తాను అప్పటికే సిరివెన్నెల సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకున్నా, సాధారణమైన కమర్షియల్ సినిమాలకు పాటలు ఎలా రాయాలో వంశీనే లేడీస్ టైలర్ సినిమా ద్వారా కొన్ని విషయాలు తెలిపారని సీతారామశాస్త్రి పేర్కొన్నారు. కమర్షియల్ పాటలు రాయలేరన్న ముద్ర పడిన సీతారామశాస్త్రిని వంశీ ఈ సినిమాకి కమర్షియల్ హిట్ పాటలు రాయించి ఆ ముద్ర చెరిపివేశారు.[1]
- ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ దాక్కున్నావే - రచన: సీతారామశాస్త్రి; గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
- గోపీ లోలా నీ పాల పడ్డానురా - రచన: సీతారామశాస్త్రి; గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- పొరపాటిది గ్రహపాటిది - రచన: సీతారామశాస్త్రి; గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
- హాయమ్మ హాయమ్మ , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి,గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ,ఎస్ జానకి
- వేటాడందే ఒళ్లోకొచ్చి , రచన :సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.మనో కోరస్.
మూలాలు
[మార్చు]- ↑ ఎల్., వేణుగోపాల్. "సిరివెన్నెల సీతారామశాస్త్రి". తెలుగు సినిమా చరిత్ర. ఎల్.వేణుగోపాల్. Retrieved 27 May 2015.