వరలక్ష్మీ వ్రతం (సినిమా)
వరలక్ష్మివ్రతం ,1961 ఆగస్టు 25 న విడుదలైన విఠల్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత, దర్శకుడు, బి.విఠలాచార్య నిర్మించిన ఈ చిత్రంలో, కాంతారావు ,రాజసులోచన ,కృష్ణకుమారి ,రాజనాల తదితరులు నటించారు.ఈ చిత్రానికి సంగీతం రాజన్- నాగేంద్ర సమకూర్చారు .
వరలక్ష్మీ వ్రతం (1961 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.విఠలాచార్య |
---|---|
తారాగణం | కాంతారావు, రాజసులోచన, జ్యోతిలక్ష్మి |
సంగీతం | రాజన్ నాగేంద్ర |
నిర్మాణ సంస్థ | విఠల్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
[మార్చు]- కాంతారావు - ఉదయసింహుడు
- రాజనాల - రుద్రభైరవుడు
- వల్లూరి బాలకృష్ణ - అవతారం
- కృష్ణకుమారి - మణిమంజరి
- స్వర్ణలత - పరిమళ
- మీనాకుమారి - వయ్యారి
- ముక్కామల - సదానందుడు
- సత్యనారాయణ - విక్రమసేనుడు
- మిక్కిలినేని- మతిమంతుడు
- ఎ.ఎల్.నారాయణ - కోటయ్య
- శ్రీకాంత్ - బ్రహ్మానందుడు
- జగ్గారావు - ఆనందపాలుడు
- ఆర్.వి.కృష్ణారావు - ధర్మపాలుడు
- రామకోటి - నిరాకారం
- వేళంగి - ఉపదేశం
- మాస్టర్ బాబు
- విశ్వనాథం
- కాకరాల
- ఆదోని లక్ష్మి - పార్వతి
- జయశ్రీ - లీలావతి
- రమాదేవి - కళావతి
- నిర్మలాదేవి - విలాసవతి
- అన్నపూర్ణమ్మ - పూర్ణమ్మ
- జయలక్ష్మి - లక్ష్మి
- మల్లీశ్వరి - సరస్వతి
సాంకేతికవర్గం
[మార్చు]- కథ, నిర్మాత, దర్శకత్వం: బి.విఠలాచార్య
- మాటలు, పాటలు: జి.కృష్ణమూర్తి
- సంగీతం: రాజన్-నాగేంద్ర
- ఛాయాగ్రహణం: జి.చంద్రు
- నృత్యం: వి.జె.శర్మ, చిన్ని-సంపత్
- కళ: బి.సి.బాబు
- కూర్పు: కె.గోవిందస్వామి
- పోరాటాలు: పులకేశి, ఎ.ఆర్.భాషా, ఆరుముగం, రామస్వామి
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటలను జి.కృష్ణమూర్తి వ్రాయగా రాజన్ - నాగేంద్ర సంగీతం సమకూర్చారు.[1]
వరుస సంఖ్య | పాట | పాడిన వారు |
---|---|---|
1 | జయజగదీశా గౌరీశా జయ కైలాసాచల వాసా | పి.బి.శ్రీనివాస్ బృందం |
2 | హాయీ విహారమే జీవనమే వినోదమే | జిక్కి బృందం |
3 | అందాలు చిందు మనప్రేమా ఆనంద మందుకుందామా | పి.బి.శ్రీనివాస్, జిక్కి |
4 | రంగేళీ వయ్యా నీకీ కంగారేలయ్యా | నాగేంద్ర, ఎస్.జానకి |
5 | పిల్ల పిల్లంటూ పళ్ళికిలించేరూ పెళ్ళాడే వారు మీలో ఎవరున్నారూ | నాగేంద్ర, ఎస్.జానకి, సౌమిత్రి, రఘురామ్ |
6 | నే నీదానరా సుందరా నను లాలించ రావేలరా | జిక్కి |
7 | చిన్న వాడా నన్ను చూడా చిన్ని చూపేల ఓ వన్నెకాడా | జిక్కి |
8 | మాం పాహి మాం పాహి మాతా నమస్తే | పి.లీల, సౌమిత్రి బృందం |
కథాసంగ్రహం
[మార్చు]ధర్మపాలుని చిన్నరాణి కళావతి సవతి మత్సరం వలన తన కుమారుడైన ఆనందపాలునికే రాజ్యం కట్టబెట్టాలని గర్భవతి ఐన పట్టపురాణిని హతమార్చడానికి తన తమ్ముడు విక్రమసేనుని పురికొలుపుతుంది.విక్రమసేనుడు రుద్రభైరవుడనే మాంత్రికుని సహాయంతో ఆ ప్రయత్నం చేస్తాడు. కానీ మంత్రి వలన పట్టపురాణి రక్షింపబడుతుంది. మాంత్రికుడు దండింపబడి అవమానాల పాలై విక్రమసేనుడు సహాయం చేయలేదన్న కోపంతో పగ సాధించడానికి ప్రతిజ్ఞ పూనుతాడు. పట్టపురాణి పుత్రుణ్ణి కంటుంది. ఆ పుత్రుని హతమార్చాలని కళావతి విక్రమునితో చెప్పడం మంత్రి విని రాజుతో చెప్పగా రాజు మంత్రినే నిందిస్తాడు. గత్యంతరం లేక మంత్రి కోటయ్య అనే సేవకుని సహాయంతో కోటయ్య కవల బిడ్డలలో ఒకడిని పట్టపురాణి పక్కన పెట్టి యువరాజును కోటయ్యకు అప్పగిస్తాడు. అక్కగారి దుర్బోధవల్ల విక్రమసేనునికి రాజ్యకాంక్ష పెరిగి పట్టపురాణి ప్రక్కలో ఉన్న బిడ్డను హతమార్చడమే కాక రాజును, మంత్రిని చంపి పట్టపురాణితో తన అక్కగారిని కూడా చెరలో వేసి మేనల్లుడైన ఆనందపాలుడు పసివాడన్న నెపంతో సింహాసనం ఆక్రమిస్తాడు. కోటయ్య తన కుటుంబంతో ఒక కుగ్రామానికి పారిపోయి, యువరాజైన ఉదయసేనుడిని, తన కుమారుడు అవతారంను పెంచుతుంటాడు.
విక్రమసేనుని కుమార్తె మణిమంజరి. అతిలోక సుందరి. ఆమె మీద మోహంతో ఆనందపాలుడు తనకు రావలసిన రాజ్యం సంగతి మరచిపోతాడు. కానీ అతని దురాగతాలవల్ల మణిమంజరికి అతనిపై అణువంతైనా అనురాగం కలగదు.ఒకనాడు అనుకోకుండా మణిమంజరిని ఉదయుడు ప్రాణాపాయం నుండి కాపాడగా మణిమంజరి అతడిని ప్రేమిస్త్తుంది. ఇద్దరూ గాంధర్వ వివాహం చేసుకుంటారు. ఆనందుని దురాగతానికి తల్లిదండ్రులను కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడుతున్న వయ్యారి అనే అమ్మాయిని అవతారం ప్రేమిస్తాడు.
ఆనాడు పగబట్టి వెళ్ళిపోయిన రుద్రభైరవుడు మహాసిద్ధిని పొంది విక్రమసేనుని మీద పగతీర్చుకుందామని వస్తూ మార్గమధ్యంలో రాజకుమారిని చూసి తన గుహలో బంధిస్తాడు. రాజకుమారిని వెదుకుతూ వచ్చిన ఆనందపాలుని, అతని భటులను చెట్లకు వేలాడ దీస్తాడు. తప్పిపోయిన వయ్యారిని వెదుకుతూ వచ్చిన అవతారం ఆ దృశ్యం చూసి పారిపోయి ఉదయునితో చెప్పి తీసుకువస్తాడు. గుహలో బందీగా ఉన్న రాకుమారిని విడిపించడానికి ప్రయత్నించి మాంత్రికుని ప్రభావం వల్ల ఇద్దరూ జ్వాలావలయంలో చిక్కుకుపోతారు.వయ్యారి ద్వారా ఆ మాంత్రికుని శిష్యులను మోసం చేసి అవతారం ఉదయుణ్ణి, రాకుమారిని విడుదల చేయించి పారిపొమ్మంటాడు.
తన ప్రయత్నం భగ్నం చేసిన శిష్యులను భస్మంచేసి, పారిపోతున్న ప్రేమికుల జంటను మాయాగోళంలో చూసి అనేక రకాలుగా ఆటంకాలు కలిగిస్తాడు మాంత్రికుడు. ఆ ఆటంకాలన్నీ అధిగమించి పోతుండగా ఒక నాటి రాత్రి ఉదయుణ్ణి ఒక యక్షిణి తీసుకుపోతుంది. కనిపించని నాథుని వెదుకుతూ రాకుమారి కొండలు, నదులు, అడవులలో పడి అల్లాడుతుంటుంది. అటు రాకుమారిని వెతకడానికి వచ్చిన విక్రమసేనుడు, అతని భార్య మాంత్రికుని ప్రయోగానికి గురై బాధపడుతూ ఉంటారు. అటు అవతారం, వయ్యారి మాంత్రికుని వద్ద శిష్యులుగా చేరి కార్యం సాధించాలని ప్రయత్నిస్తుంటారు. రాకుమారి నారీద్వేషియైన సదానందుని ఆశ్రమం చేరుతుంది. స్త్రీ పరమపాతకి అని, ఘోర కళంకిని అని నిందిస్తూఉంటే కాదని వాదించి స్త్రీ పరమపూజ్యురాలని నిరూపించి సదానందుని మనస్సును మార్చుతుంది రాకుమారి. ఆ ముని కనికరించి ఆమె మాట వింటాడు. ఆమె కుటుంబానికి కలిగిన కష్టాలన్నీ తీరాలంటే వరలక్ష్మీ వ్రతం ఒకటే మార్గమని చెప్పి వరలక్ష్మీ వ్రతాన్ని ఆమెతో చేయిస్తాడు. ఫలితంగా కథ సుఖాంతమౌతుంది[1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 జి.కె. వరలక్ష్మీవ్రతం సినిమా పాటల పుస్తకం. p. 12. Retrieved 2 September 2020.