Jump to content

వాసిరెడ్డి శ్రీకృష్ణ

వికీపీడియా నుండి
వాసిరెడ్డి శ్రీకృష్ణ
దస్త్రం:Dr. Vasireddi Srikrishna.jpg
డాక్టర్ వి.ఎస్.కృష్ణ
జననం1902 అక్టోబరు 8
గుంటూరు జిల్లా, పెదపాలెం గ్రామం
మరణం1961 ఫిబ్రవరి 16
వృత్తిఆంధ్ర విశ్వ విద్యాలయ ఉపాధ్యక్షులు
క్రియాశీలక సంవత్సరాలు1949 - 1961
తల్లిదండ్రులువాసిరెడ్డి శ్రీరాములు, వీరమ్మ

డాక్టర్ వి.ఎస్.కృష్ణ గా పేరుపొందిన వాసిరెడ్డి శ్రీకృష్ణ (అక్టోబరు 8, 1902 - ఫిబ్రవరి 16, 1961) ఆర్థిక శాస్త్రవేత్త, విద్యావేత్త ఆంధ్రా విశ్వవిద్యాలయ సంచాలకులు.

జననం, విద్య

[మార్చు]

వాసిరెడ్డి శ్రీకృష్ణ గుంటూరు జిల్లా, తెనాలి తాలూకా పెదపాలెం గ్రామంలో శ్రీరాములు, వీరమ్మ దంపతులకు 1902 అక్టోబరు 8

తేదీన జన్మించారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం లండన్ వెళ్ళి, ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్రం ప్రత్యేక విషయంగా బి.ఎ. పట్టభద్రులయ్యారు. అక్కడ సర్వేపల్లి రాధాకృష్ణ, ఆచార్య ఎన్.జి,రంగా గారు వీరి సహధ్యాయులు.

విద్యారంగ సేవ

[మార్చు]

1927 భారతదేశం తిరిగివచ్చి ఇంపీరియల్ బ్యాంకులో కొంతకాలం పనిచేశారు. అప్పటి మద్రాసు ముఖ్యమంత్రి కుమారస్వామిరాజా కు కార్యదర్శిగా పనిచేశారు. 1932లో తనకు ఇష్టమైన విద్యారంగంలో పనిచేయాలని సంకల్పించి, ఆంధ్ర విశ్వకళాపరిషత్ లో అర్థశాస్త్ర ఉపన్యాసకులుగా ప్రవేశించారు. బంగారం ప్రమాణాన్ని గురించి పరిశోధనలు చేసి, వియన్నా వెళ్ళి, అక్కడ రెండేళ్ళు పరిశోధన విద్యార్థిగా పనిచేసి, వియన్నా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. తిరిగి వచ్చి, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వార్డెనుగా, రిజిస్ట్రారుగా పనిచేసి, 1942లో కొత్తగా ఏర్పాటుచేసిన అర్థశాస్త్ర పీఠానికి అధ్యక్షులుగా నియమితులై, విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపల్ అయ్యారు.

దస్త్రం:Acharya Ranga-and his Friends-1926.jpg
ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో తెలుగువారు - 1926, కూర్చ్చున్నవారు ఎడమ నుండి: సర్వేపల్లి రాధాకృష్ణ,కె,వి గోపాలస్వామి, శ్రీమతి భారతీదేవి రంగా, లింగం వీరభద్రయ్య చౌదరి, మురారి నిలుచున్నవారు ఎడమనుండి: ఒ.పుల్లారెడ్డి, వాసిరెడ్డి శ్రీకృష్ణ, ఎన్. జి.రంగా, వి.వి.చౌదరి

ఆంధ్ర విశ్వ విద్యాలయ ఉపాధ్యక్షులు

[మార్చు]

1949లో ఆంధ్ర విశ్వ కళాపరిషత్ సెనేట్ కృష్ణను విశ్వవిద్యాలయ మూడోవ ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నారు. వీరు ఆ పదవిలో 11 సంవత్సరాలు ఉండి విశ్వవిద్యాలయ అభివృద్ధికి నిర్విరామ కృషి చేశారు. ఇంజనీరింగు, సముద్రశాస్త్ర, గనుల, ధాతు విజ్ఞాన శాస్త్రాలలో నూతన కోర్సులు ప్రవేశపెట్టారు. పరమాణు విజ్ఞాన శాఖకు రూపురేఖలు దిద్దారు.

వీరు 1957లో ఇంటర్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షులయ్యారు. అర్థ శాస్త్రవేత్తగా వీరు అంతర్జాతీయ వాణిజ్యం, బ్రిటన్ ఉడ్స్ ఒడంబడిక, ఆ తర్వాత ఏర్పాటు చేయబడిన ద్రవ్యనిధి మొదలగు విషయాలలో ప్రామాణికులు.

వీరు రచించిన "బ్రిటన్ ఉడ్స్ అండ్ ఆఫ్టర్" అనే గ్రంథం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ ఎఫైర్స్ సంస్థచే ప్రకటించబడింది.

మరణం

[మార్చు]

వాసిరెడ్డి శ్రీకృష్ణ గారు1961లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యు.జి.సి.) ఛైర్మన్ గా నియమితులై అనతికాలంలోనే ఆ పదవి నిర్వహిస్తూ 1961 సంవత్సరం ఫిబ్రవరి 16 తేదీన పరమపదించారు.

విశ్వవిద్యాలయ గ్రంథాలయానికి తన గ్రంథసంచయాన్ని బహూకరించి పెంపొందించారు. ఆ గ్రంథాలయాన్ని ఇతని స్మారకంగా "వి.ఎస్.కృష్ణ గ్రంథాలయము"గా చేయడం జరిగింది.[1]

1968 లో వీరి సేవలకు గుర్తింపుగా ' డాక్టర్ వి.యస్. కృష్ణ ప్రభుత్వ డిగ్రి కళాశాల ' విశాఖపట్నంలో స్థాపించారు.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-07-28. Retrieved 2008-07-30.


బయటి లింకులు

[మార్చు]