వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2008 35వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తాండూర్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక పట్టణము, మండలము. పారిశ్రామికపరంగా నాపరాళ్ళకు మరియు వ్యవసాయపరంగా కందులకు ప్రసిద్ది. 2001 జనాభా లెక్కల ప్రకారం తాంఢూరు పట్టణం జనాభా 57,943. 1961 లో పట్టణ జనాభా కేవలం 2000 ఉండగా నేడు సుమారు 50 వేలు జనాభాతో విలసిల్లుతోంది. నాపరాతి గనులు, పాలిష్ మిషన్ల వల్ల అనేక మంది జీవనోపాధి కొరకు మారుమూల పరిసర ప్రాంతాల గ్రామాల నుంచి వచ్చి నివాసం ఏర్పరచుకున్నారు. పాలిష్ మిషన్ల వల్ల మున్సీపాలిటీకి అధిక మొత్తంలో ఆదాయం కూడ వస్తుంది. తాండూరు పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో కాగ్నానది ఉంటుంది, ఇది మూసీ నదికి ఉపనది. ఈ నది నుండి మహబూబ్ నగర్లోని కోడంగల్ మున్నగు ప్రాంతాలకు నీటి సరఫరా చేస్తారు.


నల్లరేగడి భూముల్లో పెరిగే కంది పంటకు ఇక్కడి భూములు అనువుగా ఉండటంతో పంట ఉత్పత్తి బాగుగా ఉంటుంది. పూర్తిగా ఎండని, కాయ దశలోనే ఉన్న కంది కాయలను రైతులు మార్కెట్ లో తెచ్చి అమ్మడం, దాన్ని ఉప్పు వేసిన నీటిలో ఉడకబెట్టి దాని విత్తులను తినడం ఇక్కడ మాత్రమే కన్పించే అపురూప దృశ్యం. కల్తీ లేని స్వచ్ఛమైన కందులకు ఇక్కడి మార్కెట్ ప్రసిద్ధి. పరిసర ప్రాంతాలలో కూడ తాండూరు కందికి విపరీతమైన డిమాండు ఉంది.

ఇక్కడి నుండి భవనాల నిర్మాణంలో ప్లోరింగ్ కు వాడే నాపరాయి షోలాపూర్, ముంబాయి, హైదరాబాదు మున్నగు ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. గనుల నుంచి ముడి రాళ్ళను తీయడం ఒక ఎత్తయితే దానికి మెరుగులు దిద్ది భవనాల నిర్మాణంలో ప్లోరింగ్ కు అనువైన రీతిలో మలచడం మరో ఎత్తు. తాండూర్ పట్టణములోనే కాకుండా పరిసర ప్రాంతాలలో కూడా ఈ పరిశ్రమ విస్తరించి ఉన్నది. సిరిగిరిపేట్, ఓగిపూర్, మల్కాపూర్, కరణ్‌కోట్, బషీరాబాద్‌ ప్రాంతాలలో నాపరాతి గనులు విస్తారంగా వ్యాపించి ఉన్నాయి. తాండూరులో రెండు సిమెంటు కర్మాగారాలున్నాయి.

1953 కు పూర్వం ఇది నిజాం రాష్ట్రం లో భాగంగా ఉన్న గుల్బర్గా జిల్లాలో ఉండేది. 1953 లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుతో హైదరాబాదు జిల్లాలో కలిసింది. 1956 లో భాషాప్రయుక్త రాష్ట్రాల విభజన ఫలితంగా ఆంధ్ర ప్రదేశ్ లో భాగమై 1978 వరకు హైదరాబాదు జిల్లాలోనే కొనసాగింది. 1978 లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేయడంతో ఇది ఈ జిల్లాలో భాగమై కొనసాగుతోంది.

......పూర్తివ్యాసం: పాతవి