వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2009 38వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
KarnatakaChikmagalur.png

చిక్‌మగళూరు (కన్నడ:ಚಿಕ್ಕಮಗಳೂರು) భారతదేశం లోని కర్ణాటక) రాష్ట్రం లోని ఒక జిల్లా మరియు పట్టణం. భారతదేశం లోనే మొట్టమొదటిగా చిక్‌మగళూరులో కాఫీ తోటలు పెంచబడ్డాయి. చిక్‌మగళూరు జిల్లాలో ఉన్న పశ్చిమ కనుమల పర్వతశ్రేణులలో తుంగ మరియు భద్ర నదులు పుడుతున్నాయి. ఈ జిల్లాలోనే ఉన్న ముల్లాయనగిరి పర్వత శ్రేణులు కర్ణాటక రాష్ట్రంలో అత్యంత ఎత్తులో ఉన్న పర్వతశ్రేణులు. ప్రకృతి రమణీయ దృశ్యాలు కలిగిన కెమ్మనగుండి మరియు కుద్రేముఖ్ కొండలు, మాణిక్యధార, కల్లథిగిరి జలపాతాలు పర్యాటకుల నేత్రాలకు విందు కలిగిస్తాయి. శంకరాచార్యులు అద్వైత ప్రచారం కోసం స్థాపించిన శారదా పీఠం ఈ జిల్లాలో ఉన్న శృంగేరిలో ఉన్నది. ఆ తరువాతి కాలంలో భారతీ కృష్ణ తీర్థ స్వామిచే తన ముందు పీఠాధిపతి అయిన విద్యాశంకర స్వామి స్మారక నిమిత్తం నిర్మించబడిన విద్యాశంకర దేవాలయం కూడా శృంగేరిలో ఉన్నది. దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన పెద్ద సామ్రాజ్యాలలో ఒకటైన హొయసల రాజులు అమృతపురలో నిర్మించిన హొయసల దేవాలయం ఈ జిల్లాలోనే ఉన్నది. వన్యప్రాణి సంరక్షణ మీద ఆసక్తి ఉన్నవారు ఈ జిల్లాలో ఉన్న కుద్రేముఖ్ జాతీయ వనం, భద్ర అభయారణ్యం దర్శించి తీరవలసిందే.

జిల్లాకి చిక్‌మగళూరు పేరు జిల్లా రాజధాని చిక్‌మగళూరు పట్టణం నుండి వచ్చింది. చిక్‌మగళూరు అంటే కన్నడ భాష లో చిన్న కూతురు ఊరు అని అర్థం (చిక్క=చిన్న, మగ=కూతురు, ఊరు=ఊరు). సేక్రపట్న రాజైన రుక్మాంగద చిన్న కూతురుకు కట్నంగా ఇవ్వబడడం వల్ల ఈ పట్టణానికి చిక్‌మగళూరు అని పేరు వచ్చిందని చెబుతారు.

బాబా బుడన్ కొండల మధ్య చిక్‌మగళూరు పట్టణానికి 55 కి.మీ దూరం లో కెమ్మనగుండి పర్వత కేంద్రం ఉన్నది. ఈ పర్వత కేంద్రం సముద్ర మట్టానికి 1,434 మీటర్ల ఎత్తులో దట్టమైన అరణ్యాల మధ్య సంవత్సరం పొడవునా సెలయేళ్ళతొ హరితంగా ఉంటుంది. పూల తోటలతో, కొండలోయలతో ఉండే ఈ పర్వత కేంద్ర సౌందర్యం వర్ణణాతీతం. కుద్రేముఖ్ జిల్లా రాజధాని చిక్‌మగళూరు కి 95 km నైఋతి దిశలో ఉన్నది. కన్నడ భాషలో కుద్రే=గుర్రం ముఖ్=ముఖం. ఈ పర్వతశ్రేణులు గుర్రపుముఖం ఆకారంలో ఉండడం వల్ల కుద్రేముఖ్ అని పిలుస్తారు. ఈ కుద్రేముఖ్ పర్వతకేంద్రం లో కుద్రేముఖ్ జాతీయ ఉద్యానవనం ఉన్నది. అరేబియా సముద్రం వైపు ఉన్న ఈ పర్వత శ్రేణుల పరంపర లోతైన లోయలు, ఎత్తైన శిఖరాలతో చాలా సుందరంగా ఉంటుంది. సముద్రమట్టానికి 1,894.3 కి.మీ. ఎత్తులో ఉన్న ఈ పర్వత కేంద్రం కుద్రేముఖ్ లో అపారమైన ఇనుప గనులు ఉన్నాయి. కుద్రేముఖ్ లో ఉన్న కుద్రేముఖ్ ఉక్కు కర్మాగారం లో ఉక్కు కొద్దిగా శుద్ధి చేసి గొట్టాల ద్వారా మంగళూరు పణంబూర్ నౌకాశ్రయానికి సరఫరా చేయబడుతుంది. ఇంకా....పూర్తివ్యాసం: పాతవి