Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2011 20వ వారం

వికీపీడియా నుండి

కపిల్ దేవ్ రాంలాల్ నిఖంజ్, భారతదేశపు ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు. 1959, జనవరి 6న ఛండీగఢ్ లో జన్మించిన కపిల్ దేవ్ భారత క్రికెట్ జట్టుకు ఎనలేని సేవలందించి దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యున్నత ఆల్‌రౌండర్‌లలో ఒకడిగా పేరుసంపాదించాడు. 2002లో విజ్డెన్ పత్రికచే 20 వ శతాబ్దపు మేటి భారతీయ క్రికెటర్‌గా గుర్తింపు పొందినాడు. ప్రపంచకప్ (1983) లో భారత్‌ను విశ్వవిజేతగా తీర్చిదిద్దాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించే నాటికి అత్యధిక టెస్ట్ వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. 1999 అక్టోబర్ నుంచి 2000 ఆగష్టు వరకు 10 మాసాల పాటు భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు.

కుడిచేతి పేస్ బౌలర్ అయిన కపిల్ దేవ్ తన క్రీడాజీవితంలో అత్యధిక భాగం తనే భారత జట్టు ప్రధాన బౌలర్‌గా చలామణి అయ్యాడు. 1980లలో ఇన్‌స్వింగ్ యార్కర్ బౌలింగ్ వేసి చివరిదశ బ్యాట్స్‌మెన్‌లను హడలెత్తించాడు. బ్యాట్స్‌మెన్ గానూ పలు పర్యాయాలు జట్టుకు విజయాలు అందించాడు. జట్టు ఆపత్కాల దశలో ఉన్నప్పుడు బ్యాటింగ్‌లో విరుచుకుపడి ప్రత్యర్థులను సవాలు చేసేవాడు. దీనికి ముఖ్య ఉదాహరణ 1983 ప్రపంచ కప్ పోటీలలో జింబాబ్వేపై జరిగిన వన్డే పోటీగా చెప్పవచ్చు. దేశవాళి పోటీలలో హర్యానా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఇతడి ముద్దుపేరు హర్యానా హరికేన్.

1978, అక్టోబర్ 16న కపిల్ దేవ్ పాకిస్తాన్ పై ఫైసలాబాదులో తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడినాడు. తొలి టెస్టులో తన గణాంకాలు మ్యాచ్‌ను అంతగా ప్రభావితం చేయలేకపొయాయి. సాదిక్ మహమ్మద్ ను ఔట్ చేసి తొలి టెస్ట్ వికెట్ సాధించింది ఈ మ్యాచ్‌లోనే.కరాచిలోని నేషనల్ స్టేడియంలో జరిగిన మూడవ టెస్టులో 33 బంతుల్లోనే 2 సిక్సర్లతో అర్థసెంచరీని చేసి భారత్ తరఫున అతివేగంగా అర్థసెంచరీ పూర్తిచేసిన రికార్డు సృష్టించాడు. ఆ తరువాత భారత్ పర్యటించిన వెస్టీండీస్ జట్టుపై ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో 124 బంతుల్లో 126 పరుగులు సాధించి తన తొలి టెస్ట్ శతకాన్ని నమోదుచేశాడు.


ఇంకా... పూర్తివ్యాసం పాతవి