వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2011 49వ వారం
1973, డిసెంబర్ 2న పూర్వపు యుగస్లోవియా దేశంలో జన్మించిన మోనికా సెలెస్ (Monica Seles) ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి. 1994లో అమెరికా పౌరసత్వం పొందినది. మోనికా సెలెస్ తన క్రీడాజీవితంలో మొత్తం 9 గ్రాండ్‌స్లాం టెన్నిస్ టైటిళ్ళను సాధించింది. 1990లో 16 ఏళ్ల వయస్సులో ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్‌ను గెలిచి ఈ ఘనత సాధించిన పిన్నవయస్కురాలిగా రికార్డు సృష్టించింది. 1991 మరియు 1992లలో ఈమె అగ్రశ్రేణి క్రీడాకారిణిగా చెలామణి అయింది. 1991 మార్చిలో ప్రపంచ నెంబర్ వన్ హోదా కూడా పొందినది. ఆ స్థానంలో 178 వారాలపాటు కొనసాగింది. కాని 1993లో హాంబర్గ్ లో ఒక ఆగంతకుడు వీపుపై కత్తితో దాడిచేయడంతో ఆ తరువాత రెండేళ్ళు టెన్నిస్‌కు దూరం ఉండాల్సివచ్చింది. రెండేళ్ళ పునరాగమనం అనంతరం కూడా సెలెస్ చెప్పుకోదగ్గ విజయాలను నమోదుచేసింది. 1996లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ సింగిల్స్‌లో విజయం సాధించింది. 2008 ఫిబ్రవరి 14న మోనికా సెలెస్ టెన్నిస్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించింది.
మోనికా సెలెస్ ఆరేళ్ళ ప్రాయంలోనే టెన్నిస్ నేర్వడం ప్రారంభించింది. అప్పుడు తండ్రే ఆమె శిక్షకుడు. తొమ్మిదేళ్ళ ప్రాయంలోనే ఆమె తన మొదటి టోర్నమెంటులో విజయం సాధించింది. 1985లో 11 సంవత్సరాల ప్రాయంలో ఫ్లోరిడా లోని మియామిలో జరిగిన ఆరెంజ్ బౌల్ టోర్నమెంటులో విజయం పొందినది. 1986లో మోనికా సెలెస్ కుటుంబం యుగస్లోవియా నుంచి అమెరికాకు వెళ్ళడం జరిగింది. ఆమె అక్కడే టెన్నిస్ శిక్షణ పొందడం ప్రారభించింది.
మోనికా సెలెస్ తన మొట్టమొదటి ప్రొఫెషనల్ టెన్నిస్‌ను 1988లో 14 యేళ్ల వయస్సులో ఆడింది. ఆ మరుసటి యేడాది పూర్తికాలపు ప్రొఫెషనల్ పర్యటనలో చేరి అదే ఏడాది ఫైనల్లో క్రిస్ ఎవర్ట్ ను పరాజయం చేసి తొలి విజయాన్ని కూడా నమోదుచేయగలిగింది. 1989 జూన్ ఫ్రెంచ్ ఒపెన్ ఆడి తన మొదటి గ్రాండ్‌స్లాం టొర్నమెంటులోనే సెమీఫైనల్స్ వరకు దూసుకెళ్ళింది. సెమీస్‌లో అప్పటి ప్రపంచ నెంబర్ వన్ స్టెఫీ గ్రాఫ్ చేతిలో 6-3, 3-6, 6-3 తేడాతో ఓడిపోయింది. పర్యటనకు వెళ్ళిన తొలి ఏడాదే ప్రపంచ ర్యాంకింగ్‌లో 6 వ స్థానం పొందగలిగింది.
ఇంకా... పూర్తివ్యాసం పాతవి