వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2022 14వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గూగుల్

గూగుల్ ఎల్.ఎల్.సి అనేది ఒక అమెరికన్ బహుళజాతి సాంకేతిక సంస్థ. ఆన్‌లైన్ ప్రకటన సాంకేతికతలు, సెర్చ్ ఇంజిన్, క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ మరియు తదితర అంతర్జాల సంబంధిత సేవలు, ఉత్పత్తులు వీరి ప్రత్యేకత. అమెరికన్ సమాచార సాంకేతిక పరిశ్రమలో అమెజాన్, ఫేస్‌బుక్, ఆపిల్ మరియు మైక్రోసాఫ్ట్‌తో పాటు ఇది బిగ్ ఫైవ్ కంపెనీలలో ఒకటిగా పరిగణించబడుతుంది. 1998 సెప్టెంబర్ 4 న లారీ పేజ్, సెర్గీ బ్రిన్లు స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డి విద్యార్థులుగా ఉన్నప్పుడు గూగుల్ని స్థాపించారు. వీరు ఇద్దరూ కలిసి బహిరంగంగా నమోదయిన గూగుల్ వాటాలలో 14 శాతాన్ని కలిగి ఉన్నారు. సూపర్-ఓటింగ్ వాటాల ద్వారా 56% పెట్టుబడిదారుల ఓటింగ్ శక్తిని నియంత్రిస్తారు. కంపెనీ 2004 లో IPO ద్వారా బహిరంగ సంస్థ అయ్యింది. 2015 లో, ఆల్ఫాబెట్ ఇంక్ కు పూర్తి యాజమాన్యంగల అనుబంధ సంస్థగా గూగుల్ పునర్వ్యవస్థీకరించబడింది. ఆల్ఫాబెట్ సీఈఓ అయిన లారీ పేజ్ స్థానంలో సుందర్ పిచై 2015 అక్టోబర్ 24 న గూగుల్ కు సీఈఓగా నియమితులయ్యారు. 2019 డిసెంబర్ 3 నుంచి సుందర్ పిచై ఆల్ఫాబెట్ కు కూడా సీఈఓ అయ్యారు. 2021 లో, ప్రధానంగా గూగుల్ ఉద్యోగులతో కూడిన, ఆల్ఫాబెట్ వర్కర్ల యూనియన్ స్థాపించబడింది.

విలీనం తర్వాత నుండి గూగుల్ కేంద్ర శోధన యంత్రానికి (గూగుల్ శోధన) మించిన ఉత్పత్తులు, సముపార్జనలు మరియు భాగస్వామ్యాలతో కంపెనీ వేగంగా విస్తరించింది. గూగుల్ పని మరియు ఉత్పాదకతకు (గూగుల్ డాక్స్, గూగుల్ షీట్‌లు మరియు గూగుల్ స్లయిడ్లు), ఇమెయిల్లకు (జీమెయిల్), షెడ్యూలింగ్ మరియు సమయ నిర్వహణకు (గూగుల్ క్యాలెండర్ ), క్లౌడ్ నిల్వలకు (గూగుల్ డ్రైవ్ ), తక్షణ సందేశం, వీడియో చాట్ కు (గూగుల్ డ్యుయో, గూగుల్ చాట్, మరియు గూగుల్ మీట్), భాష అనువాదానికి (గూగుల్ అనువాదం), మ్యాపింగ్ మరియు నావిగేషన్ కు (గూగుల్ మ్యాప్స్, వేజ్, గూగుల్ ఎర్త్ మరియు స్ట్రీట్ వ్యూ), పోడ్‌కాస్ట్‌లను పంచుకోడానికి (గూగుల్ పాడ్‌కాస్ట్‌లు), వీడియోలు పంచుకోడానికి (యూట్యూబ్), బ్లాగ్ ప్రచురణకు (బ్లాగర్), నోట్స్ రాసుకోడానికి (గూగుల్ కీప్, జాంబోర్డ్), చిత్రాలు ఏర్పరుచుకోడానికి మరియు ఎడిట్ చేయడానికి (గూగుల్ ఫోటోలు) అవసరమైన సేవలను అందిస్తుంది. ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం, క్రోమ్ ఓఎస్ (ఇది ఉచిత, ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమైన క్రోమియం ఓఎస్ ఆధారితమైన తేలికైన ఆపరేటింగ్ సిస్టమ్) మరియు గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్ల అభివృద్ధికి ఈ కంపెనీ నాయకత్వం వహిస్తుంది. అలాగే గూగుల్ హార్డ్‌వేర్‌లోకి కూడా ప్రవేశించింది; 2010 నుండి 2015 వరకు, గూగుల్ నెక్సస్ పరికరాల ఉత్పత్తుకై ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీదారులతో భాగస్వామ్యమైంది, 2016 లో గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్లు, గూగుల్ హోమ్ స్మార్ట్ స్పీకర్, గూగుల్ వైఫై మెష్ వైర్‌లెస్ రౌటర్‌తో సహా పలు హార్డ్‌వేర్ ఉత్పత్తులను విడుదల చేసింది. అలాగే అంతర్జాల క్యారియర్‌గా అవతరించడానికి ప్రయోగాలు (గూగుల్ ఫైబర్ మరియు గూగుల్ ఫై) చేసింది.
(ఇంకా…)