Jump to content

విజాగపటం యుద్ధం

అక్షాంశ రేఖాంశాలు: 17°41′N 83°19′E / 17.683°N 83.317°E / 17.683; 83.317
వికీపీడియా నుండి
విజాగపటం యుద్ధం
నెపోలియన్ యుద్ధాలులో భాగము

విజాగపటం రోడ్డులో సెంచూరియన్ రక్షణ 1804 సెప్టెంబరు 15, థామస్ సదర్‌లాండ్
తేదీ1804 సెప్టెంబరు 15
ప్రదేశంబంగాళాఖాతంలో విశాఖపట్నం తీరం నుండి
17°41′N 83°19′E / 17.683°N 83.317°E / 17.683; 83.317
ఫలితంఫ్రెంచి విజయం
ప్రత్యర్థులు
 France United Kingdom
సేనాపతులు, నాయకులు
చార్లెస్ లినోయిస్ జేమ్స్ లిండ్
బలం
1 యుద్ధ నౌక
2 ఫ్రిగేట్లు
1 యుద్ధ నౌక
2 వాణిజ్య నౌకలు
ప్రాణ నష్టం, నష్టాలు
11 మంది మరణాలు/గాయాలు10 మంది మరణాలు/గాయాలు
1 వాణిజ్య నౌక ధ్వంసం
1 వాణిజ్య నౌకను పట్టుకున్నారు

విజాగపటం యుద్ధం అనేది నెపోలియన్ యుద్ధాల సమయంలో 1804 సెప్టెంబరు 15 న బంగాళాఖాతంలో బ్రిటిషు భారతదేశంలో, కోస్తా ఆంధ్ర ప్రాంతంలోని విజాగపటం నౌకాశ్రయానికి దగ్గరలో జరిగిన చిన్న నౌకాదళ యుద్ధం. మారెంగో నౌకలో కాంట్రే-అడ్మిరల్ చార్లెస్-అలెగ్జాండ్రే లియోన్ డ్యురాండ్ లినోయిస్ ఆధ్వర్యంలోని ఫ్రెంచ్ స్క్వాడ్రన్ బ్రిటిష్ రాయల్ నేవీకి చెందిన ఫోర్త్ రేట్ షిప్ HMS సెంచూరియన్, హార్బర్ రోడ్‌లలో లంగరు వేసిన రెండు ఈస్ట్ ఇండియామాన్ వాణిజ్య నౌకలపై దాడి చేసింది. ముందు నుండి లినోయిస్, వాణిజ్య నౌకలపై దాడులు చెయ్యడంలో నిమగ్నమై ఉంది. అప్పటికే అది దక్షిణ చైనా సముద్రంలో, మొజాంబిక్ ఛానెల్‌లో, సిలోన్‌కు వెలుపల, బంగాళాఖాతంలోని భారత తీరం వెంబడి కార్యకలాపాలను చేస్తూ ఉంది. 1804 ఫిబ్రవరి 15న పులో ఆరా యుద్ధంలో ఫ్రెంచ్ స్క్వాడ్రన్ ఒక ముఖ్యమైన యుద్ధంలో పోరాడింది. దీనిలో లినోయిస్ ఈస్ట్ ఇండియా కంపెనీ (HEIC) వారి చైనా ఫ్లీట్‌పై దాడి చేసింది. ఇది £8 మిలియన్ల విలువైన సరుకును మోసుకెళ్ళే సాయుధ వ్యాపార నౌకలతో కూడిన పెద్ద కాన్వాయ్. ఆ కాన్వాయ్‌పై దాడి చేయలేక లినోయిస్, తన స్క్వాడ్రన్‌తో సహా పారిపోయాడు.

పులో ఆరాలో విఫలమైన తరువాత లినోయిస్, హిందూ మహాసముద్రంలో ప్రయాణించాడు. 1804 ఆగస్టు సెప్టెంబరుల్లో అతని స్క్వాడ్రన్, బంగాళాఖాతంలో భారత తీరం వెంబడి సిలోన్ నుండి ఉత్తరం వైపు ప్రయాణిస్తూ అనేక విలువైన వాణిజ్య నౌకలను స్వాధీనం చేసుకుంది. మసూలిపటం నుండి స్వాధీనం చేసుకున్న ఓడ నుండి లినోయిస్, విశాఖపట్నంలో, ఈస్ట్ ఇండియామెన్ వాణిజ్యనౌకలు ఉన్నట్లు తెలుసుకున్నాడు. బ్రిటిషు రియర్-అడ్మిరల్ పీటర్ రైనియర్, ఆ వాణిజ్య నౌకల కాన్వాయ్‌కు రక్షణగా గతంలో ఉండే చిన్న యుద్ధనౌక HMS విల్హెల్మినా స్థానంలో పెద్దదైన సెంచూరియన్‌ను పెట్టాడు. ఆ సంగతి తెలియని లినోయిస్, ఆ కాన్వాయ్‌పై దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు.

నేపథ్యం

[మార్చు]

నెపోలియన్ యుద్ధాల సమయంలో, బ్రిటిషు ఆర్థిక వ్యవస్థ బ్రిటిషు సామ్రాజ్యంలో వాణిజ్య కదలికపై ఆధారపడింది. ప్రత్యేకించి బ్రిటిష్ ఇండియాలోని వాణిజ్య పోస్టులు, కాలనీలను ఈస్ట్ ఇండియా కంపెనీ (HEIC) నిర్వహించేది. ఈ సంస్థ ఈస్ట్ ఇండియామెన్ అనే పెద్ద, సాయుధ వాణిజ్య నౌకల సముదాయాన్ని ఉపయోగించి భారతదేశం నుండి ఐరోపాకు వస్తువులను రవాణా చేసేది. రక్షణ కోసం ఇవి ఒకదాని వెంట ఒకటిగా కాన్వాయ్‌లలో ప్రయాణించేవి. యుద్ధ సమయాల్లో రాయల్ నేవీ వారి యుద్ధ నౌకలు ఈ కాన్వాయ్‌లకు రక్షణగా వెళ్ళేవి. బంగాళాఖాతంలో రాయల్ నేవీ వారి ప్రధాన స్థావరం మద్రాసు నగరంలో ఉండేది. అయితే ఈస్టిండియామెన్ మాత్రం బంగాళాఖాతంలో ఉన్న అన్ని రేవులకూ వెళ్తూండేవి. అంచేత, మద్రాసు కలకత్తాలకు వెళ్ళే చిన్న కాన్వాయ్‌లకు ఎస్కార్ట్‌లను అందించడానికి మద్రాస్‌లోని బలగం, పెద్ద సముద్రపు కాన్వాయ్‌లను ఏర్పరచడానికి ఇతర నౌకలతో కలిపేవారు. నెపోలియన్ యుద్ధాలు ప్రారంభమైనప్పుడు, హిందూ మహాసముద్రంలో బ్రిటిష్ దళాల కమాండరుగా రియర్-అడ్మిరల్ పీటర్ రైనర్ ఉండేవాడు. యుద్ధం జరగడానికి కొంతకాలం ముందు, ఫ్రాన్స్ నుండి పంపబడిన స్క్వాడ్రన్, కాంట్రే-అడ్మిరల్ చార్లెస్-అలెగ్జాండర్ లియోన్ డ్యూరాండ్ లినోయిస్ నేతృత్వంలో ఈ ప్రాంతంపై బ్రిటిషు నియంత్రణకు ప్రధాన ముప్పు ఇది.[1]

యుద్ధం

[మార్చు]

ఉదయం 6:00 గంటలకు ఓడరేవుకు దగ్గరగా చేరుకున్న లినోయిస్, కాన్వాయ్‌గా ముందుకు సాగాడు. ఈస్ట్ ఇండియామెన్‌లలో ఒకటి భయంతో ఒడ్డుకు వెళ్ళిపోయింది. రెండో వాణిజ్య నౌక, సెంచూరియన్‌కు మద్దతు ఇవ్వలేకపోయింది. దాన్ని ఫ్రెంచి వాళ్ళు బంధించారు. సెంచూరియన్ మాత్రం ఒంటరిగానే పోరాటాన్ని కొనసాగించింది. మొదట్లో ఒడ్డునుండి తుపాకీ బ్యాటరీలు, ఫ్రెంచివారిపై కాల్పులు జరిపి దానికి మద్దతు నిచ్చాయి. ఆ తరువాత సెంచూరియన్, ఫ్రెంచ్ ఫ్లాగ్‌షిప్ మారెంగోతో పోరాటంలో సముద్రంలో లోపలికి, తుపాకీ బ్యాటరీల పరిధిని దాటి బయటికి వెళ్లింది. నాలుగు గంటల పాటు జరిగిన పోరాటం తర్వాత మారెంగో వెనక్కి తగ్గింది. తీవ్రంగా దెబ్బతిన్న సెంచూరియన్, దాన్ని వెంటాడేందుకు ప్రయత్నించింది గానీ పోలేకపోయింది. ఆ యుద్ధం తరువాత, లినోయిస్ తన స్క్వాడ్రన్‌తో ఐలే డి ఫ్రాన్స్‌కు పారిపోయాడు. అక్కడే మారెంగోకు ఆరు నెలల పాటు మరమ్మతులు చేసారు.

అనంతర పరిణామాలు

[మార్చు]

బార్నబీని నాశనం కావడం, ప్రిన్సెస్ షార్లెట్ స్వాధీనమవడం, సెంచూరియన్‌లో ఒకరు మరణించడం, తొమ్మిది మంది గాయపడ్డం జరిగినప్పటికీ, బ్రిటిషు వారి నష్టాలు స్వల్పంగానే ఉన్నాయి. ఓడ చాలా ఘోరంగా దెబ్బతింది. దానికి అనేక చిల్లులు పడ్డాయి. ఒడ్డున ఉన్న సైనికులకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.[2]

ఫ్రెంచి వారు కొంచెం ఎక్కువ నష్టాలను చవిచూశారు, మారెంగో నౌకలో ఇద్దరు వ్యక్తులు మరణించారు, ఒక అధికారి గాయపడ్డాడు. అట్లాంటేలో ముగ్గురు మరణించారు, ఐదుగురు గాయపడ్డారు. సెమిల్లాంటేలో, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఫ్రెంచ్ వారి నౌకలకు కలిగిన మాత్రం నష్టం తీవ్రంగానే ఉంది. లినోయిస్ తన తదుపరి కార్యకలాపాలను విడిచిపెట్టవలసి వచ్చింది. నవంబరులో ఐల్ డి ఫ్రాన్స్‌కు తిరిగి చేరుకున్నాడు. అక్కడే ఆరు నెలల పాటు మారెంగో నౌకను పూర్తిగా బాగు చేయించుకున్నాడు.[3]

రెండు దేశాలూ తాము విజయం సాధించినట్లుగా చెప్పుకున్నాయి. ప్రిన్సెస్ షార్లెట్‌ను స్వాధీనం చేసుకున్నందుకు ఫ్రెంచివారు, ఫ్రెంచివారికి సంఖ్యాపరమైన ఆధిక్యత ఉన్నప్పటికీ సెంచూరియన్ మనుగడ సాధించినందుకు బ్రిటిష్ వారూ ఇలా చెప్పుకున్నారు.[4] ఒక లేఖలో లినోయిస్, యుద్ధం నుండి తప్పుకోవడాన్ని ఇలా సమర్థించుకున్నాడు.. సెంచూరియన్‌పై దాడిని కొనసాగిస్తే తన స్క్వాడ్రన్‌కు కోలుకోలేని నష్టం కలిగి తన దాడి కార్యకలాపాలు చెయ్యలేకపోయేదని వివరించాడు.[5] అయితే ప్రైవేట్‌గా, సెంచూరియన్‌ను ధ్వంసం చెయ్యలేకపోవడంపై నెపోలియన్ ఆగ్రహం వెలిబుచ్చాడు "ఫ్రాన్స్ కావాల్సింది గౌరవం, ఏవో నాలుగు చెక్క ముక్కలు కాదు" అని రాశాడు.[6] బ్రిటిషు చరిత్రకారులు కూడా నెపోలియన్ చేసిన విమర్శలనే చేసారు. సెంచూరియన్ నౌక, లినోయిస్‌కు చేతికి అందేంత దూరంలో ఉంది. అయినప్పటికీ, అతను దాన్ని నాశనం చేయడంలో విఫలమయ్యాడని చెబుతూ విలియం లైర్డ్ క్లోవ్స్, అతని "అర్ధ హృదయం, పిరికితనం దానికి కారణాలు. . . [అది] నిందార్హమే." [6]

మూలాలు

[మార్చు]
  1. Woodman, p. 172
  2. James, Vol. 3, p. 279
  3. James, Vol. 4, p. 150
  4. James, Vol. 3, p. 280
  5. The Campaign of Trafalgar, Gardiner, p. 28
  6. 6.0 6.1 Clowes, p. 350