వీరబొబ్బిలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వీరబొబ్బిలి
కృతికర్త: కె.ఎన్.వై.పతంజలి
అంకితం: రచయిత తమ్ముడు కాకర్లపూడి వైశేషిక కణాద సూర్య ప్రభాకర్‌కి
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: నవల/నవలిక
విభాగం (కళా ప్రక్రియ): వ్యంగ్యం, హాస్యం
ప్రచురణ:
విడుదల: 1984
పేజీలు: 30
దీనికి ముందు: రాజుగోరు
దీని తరువాత: గోపాత్రుడు

వీరబొబ్బిలి ప్రముఖ పత్రికా సంపాదకుడు, సాహిత్యకారుడు కె.ఎన్.వై.పతంజలి రచించిన వ్యంగ్య హాస్య నవల. పతంజలి స్వగ్రామమైన ఆలమండ కథాస్థలంగా రచించిన నవలికల మాలికలో ఇది రెండవది. హాస్యం, వ్యంగ్యం ప్రధానంగా రచించిన ఈ నవలికలోని పాత్రలైన వీరబొబ్బిలి, ఫకీర్రాజు, గోపాత్రుడు తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధి పొందాయి.

రచన నేపథ్యం[మార్చు]

పతంజలి రచించిన ఈ నవల 1984 ఆంధ్రజ్యోతి వారపత్రిక దీపావళి సంచికలో తొలిసారి ప్రచురించారు. రచయిత తన తమ్ముడు కాకర్లపూడి వైశేషిక కణాద సూర్య ప్రభాకర్‌కి ఈ నవలను అంకితమిచ్చారు. వీరబొబ్బిలి నవలలోని పాత్రలు, కథాస్థలం పతంజలి అంతకుముందు రాసిన రాజుగోరు, అనంతరకాలంలో రచించిన గోపాత్రుడు, పిలక తిరుగుడు పువ్వు నవలల్లో కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో ఈ నవలికలను నవలికల మాలికగా భావించవచ్చు.

ఇతివృత్తం[మార్చు]

బాగా ఎత్తుగా, బలిష్టంగా ఉండే గ్రామసింహం లేదా కుక్క వీరబొబ్బిలి. అలమండ గ్రామానికి చెందిన ఫకీర్రాజు ఇంట్లో ఉంటుంది. మాట్లాడే కుక్కైన వీరబొబ్బిలి కాట్లకుక్క కాదని ఎవరూ భయపడరు. అందుకు ఫకీర్రాజు ఇంటికి చుట్టపుచూపుగా వెళ్ళిన డెంకాడ గ్రామస్తుడైన పూసపాటి వారి ఈటె సూరిని భయపెడుతుంది. ఇవన్నీ చూసిన ఫకీర్రాజు వీరబొబ్బిలిని తిండి దండుగ అనీ, వేటకు వెళ్ళినా పందిని చూస్తే బెదిరిపోతుందనీ తక్కువచేసి మాట్లాడతాడు. దానికి మనసు గాయపడ్డ వీరబొబ్బిలి కనీసం పరాయి మనిషి దగ్గరన్నా పిసరంత మర్యాదగా చూడకూడదేటోయి ఫకీరూ! నీ కుక్క పరువుబోతే నీ పరువు పోయినట్టు గాదా? మన ఇంటిగుట్టు చాటేసినట్టు గాదా? అని బాధపడుతుంది. ఈ బాధతో ఫకీర్రాజూ, ఈటె సూరీ బయటకువెళ్తూ పిలిచినా ఖాతరుచేయదు. వాళ్లదారిన వాళ్లు వెళ్ళిపోతే పేరుకు నాలుగుసార్లు పిలిచి పట్టనట్టు వెళ్ళిపోయారనీ బాధపడతుంది. ఈ బాధతో పచ్చి గంగయినా ముట్టకుండా ఉండాలనుకుంటుంది. ఇంటి నుంచి ఘాటుగా వచ్చిన పోలుగు పిట్టల కూర వాసనకు చలించిపోతుంది. ఫకీర్రాజూ, ఆయన భార్య చిట్టెమ్మా వచ్చి బతిమాలితే గానీ తినకూడదని నిశ్చయించుకుంటుంది. పైగా నాకే భోజనం కావాలంటే అలాగ బంజరుకెళ్ళి కొండగొర్రినో, దుప్పినో, ఒంటి పందినో, సింహాన్నో పట్టి పూటకొకదాన్ని తినలేనా? అనీ అనుకుంటుంది. అరగంటయినా పిలుపు రాకపోయేసరికి భోజనాలయిపోయి గిన్నెలుగానీ కడిగీసేరంటే చాల నష్టం జరిగిపోతుందనీ, ఈ ఇల్లు నాది కాదా? నాకు హక్కు లేదా? అనీ అనుకుని తానే స్వయంగా వెళ్ళి భోజనానికి తయారైపోతుంది.
రాత్రి పేడపురుగుల్ని తినే బొటనవేలంత దెయ్యం ఒకటి బొబ్బిలికి కనిపిస్తుంది. కృష్ణాజిల్లాకు చెందిన ఆ దెయ్యానికీ, విజయనగరం ప్రాంతానికి చెందిన వీరబొబ్బిలికీ వారి వారి యాసల గురించి వాగ్వాదం జరుగుతుంది. దెయ్యం వెళ్ళిపోయాకా అర్థరాత్రి వేళ ఓ దొంగ ఆ పెరట్లోకి వస్తాడు. తాను వేటకుక్కనే తప్ప కాపలాకుక్కను కాను కనుక దొంగను చూసి మొరగకుండా నిదానంగా మంచీచెడూ కనుక్కోవడం మొదలుపెడుతుంది బొబ్బిలి. బొబ్బిలిని చూసి ఆ దొంగ భయపడగా అతని భయానికి ముచ్చటపడుతుంది. నేనే గనుక కాపలాకుక్కనైతే నిన్నీపాటికి చీల్చి చెండాడీసీదాన్ని, వేటకుక్కనైపోయాను. అదీగాక నన్ను చూసి నీ పాటి జడుసుకున్న ఉత్తముణ్ణి నేనింతవరకూ చూడలేదు. నిన్ను చూస్తే నాకు ముచ్చటేస్తున్నాది. ఏం కావాలో కోరుకో అని అభయమిస్తుంది. అతను వెండీ బంగారమూ అడిగితే ఫకీర్రాజు కుదేలైపోయి ఉన్నాడు. అతని దగ్గర కల్వాలూ, పిట్టగూళ్ళూ, ఈటెలూ ఉన్నాయి. అంతగా కావాలంటే సుష్టుగా మాంసం కూర వేసుకుని భోంచెయ్యమని వంటింటి దారి చూపించి తన వాటా తాను తీసుకుంటుంది.
ఫకీర్రాజు ఇంట్లో రెండురోజులు గడిపిన ఈటె సూరి స్వగ్రామం డెంకాడ బయల్దేరతాడు. మా ఇంటికి రావడమంటే నీ ఇష్టం తప్ప వెళ్ళడం నా అనుమతి ఐతేనే అంటూ ఫకీర్రాజు నిలువరిస్తాడు. నన్ను ఆపితే కత్తితో పొడుస్తానని ఈటె సూరి, మా గడప నన్ను కాదని దాటితే నీ శవమే డెంకాడ చేరుతుందని తుపాకీతో ఫకీర్రాజు ఎదుర్కొంటారు. ఈ తగాదా ఎలా తేలుతుందనేది మిగతా ఇతివృత్తం.[1]

ప్రాచుర్యం[మార్చు]

వీరబొబ్బిలి నవల, రాజుగోరు, వీరబొబ్బిలి, గోపాత్రుడు, పిలకతిరిగుడు పువ్వు సీరీస్ తెలుగు సాహిత్యంలో మంచి స్థానాన్ని సంపాదించాయి. సాక్షి సాహిత్యపేజీలోని విశ్లేషణలో వీరబొబ్బిలి, గోపాత్రుడు, పిలకతిరుగుడు పువ్వు- పేర్లతో పతంజలి చేసిన ఉత్కృష్టమైన ప్రపంచస్థాయి వ్యంగ్య రచన ఇది. అంటూ ఈ నవలను గురించి ప్రస్తావించారు.[2]

మూలాలు[మార్చు]

  1. పతంజలి సాహిత్యం-మొదటి సంపుటం:వీరబొబ్బిలి:పతంజలి:పేజీ.243-274
  2. మన నవలలు: మూడు పర్వాల మహాభారతం గోపాత్రుడు...:సాక్షి సాహిత్యం:నవంబరు 04, 2013