వ్యాకరణం అచ్యుత రామారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణం అచ్యుత రామారావు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైద్యుడు, రచయిత. అతను ఆర్మీ మెడికల్ కార్ప్స్ లో వైద్యునిగా తన సేవలనందించాడు. అతను ప్రస్తుతం యు.కె లో నివసిస్తున్నాడు. 2018 లో TAL వారి జీవితకాల సాఫల్యం అవార్దును పొందాడు.[1][2]

జీవిత విశేషాలు[మార్చు]

వ్యాకరణం అచ్యుత రామారావు తెలంగాణ రాష్ట్రం లోని ఖమ్మం జిల్లాలోని భద్రాచలం లో 1942 లో జన్మించాడు. 1965 లో విశాఖపట్నంలోని ఆంధ్రవైద్య కళాశాలలో వైద్య విద్యనభ్యసించాడు. భారత సైనిక దళం వారి ఆర్మీ మెడికల్ కార్ప్స్ లో 17 సంవత్సరాల పాటు దేశ సేవ చేసాడు.

పరిశోధనలు[మార్చు]

మానసిక వైద్యరంగంలో ఉన్నత విద్య కోసం 1974లో యు.కె. చేరుకున్నాడు. బ్రిటిష్ రీసెర్చి కౌన్సిల్ వారి సీనియర్ రీసెర్చ్ ఫెలోగా, మానసిక వ్యాధుల చికిత్సలో వాడే మందులపై పరిశోధనలు చేస్తూ, సైక్ ఫార్మకాలజీ రంగంలో గుర్తింపు పొందాడు. స్విట్జర్లాండు దేశంలోని ఔషధ తయారీసంస్థ అయిన సిబా గైరీ వారి మెడికల్ రీసెర్చ్ విభాగం లో 18 నెలలు ఔషధ పరిశోధనలు కొనసాగించాడు.

వృత్తి జీవితం[మార్చు]

1980లో యు.కె. కి తిరిగి వచ్చి మిడ్వే హాస్పిలాక్ లో కన్సల్టెంటు సైకియాట్రిస్టు పదవిని చేబట్టాడు. ఆ పదవికి అనుబంధంగా గేస్ హాస్పిటల్ మెడికల్ స్కూల్ (లండన్) వారిచే సీనియర్ అధ్యాపకునిగా నియమింపబడ్డాడు. మెడికల్ మేనేజిమెంటు మీద ఆసక్తి పెంచుకున్న అతను క్లినికల్ డైరక్టరుగా, ఆ తరువాత మెడికల్ డైరక్టరుగా పదవులని చేబట్టి సేవలనందించాడు.

బ్రిటన్లో పేరెన్నికగన్న సైకియాట్రిస్టుగా, మెడికల్ డైరెక్టరుగా , లండన్ గైస్ హాస్పిటల్ వైద్య కళాశాలలో అధ్యాపకుడిగా, విశిష్టమైన సేవలు చేసి ఉన్నత స్థానం చేరుకున్న అతను 1989లో రాయల్ కాలేజీ ఆఫ్ సైక్రియాట్రిస్ట్స్ వారి ఫెలోషిప్ ను అందుకొన్న ప్రప్రథమ తెలుగు వైద్యునిగా గుర్తింపు పొందాడు.

యుకెలో తెలుగు డాక్టర్ల సేవలో సాంస్కృతిక సామాజిక వేదికగా, 1986 నుండి ఇప్పటివరకూ విజయవంతంగా నడుస్తున్న ఆంధ్ర మెడికల్ గ్రాడ్యుయేట్స్ రీయూనియన్ ను అతను రూపకల్పన చేసాడు[2]. యూరోపియన్ తెలుగు అసోసియేషన్ వారి ఉపాధ్యక్షుడిగా, బర్మింగ్ హాం లో శ్రీ వెంకటేశ్వర ఆలయ ప్రధమ కార్యనిర్వాహక కమిటీలో సభ్యునిగా, తెలుగువారికి సేవలు అందజేస్తూ వచ్చాడు. స్వస్థలమైన భద్రాచలంలో 'పద్మారామం' అనే అతిధి గృహాన్ని నిర్మించి, తన ఇష్ట దైవమైన శ్రీ సీతారామచంద్రస్వామి వారికి సభక్తితో వితరణగా సమర్పించుకున్నారు.

సాహితీ ప్రస్థానం[మార్చు]

రామారావుగారికి కవితారచనల పై మంచి అభిమానం, రచనా సౌలభ్యం వున్నాయి. అతను రచించిన 'తోటమాలి కవితాసుమాల సమాహారం' 2015లో ప్రచురించబడి ఎందరో విశ్లేషకుల, పాఠకుల మెప్పులనందుకుంది. ఈ పుస్తకాన్ని అప్పటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపాధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ హైదరాబాద్ లో ఆవిష్కరించాడు.

నవలారచనలో తొలి ప్రయత్నంగా, వినూత్నమైన పద్ధతిలో చరిత్రకు అనుగుణమైన నవలగా మలిచిన 'చీకటిలో నీడలు', ఎమెస్కో బుక్స్ వారిచే 2016లో ప్రచురించబడి ఎందరో పాఠకుల అభిమానాన్ని పొందింది. ఎ.ఎం.జి.ఆర్ 2016 (బ్రాడ్ ఫోర్డ్) లోనూ, తరువాత సింగపూర్ లో జరిగిన 5వ ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ ఆవిష్కరించబడింది.[3]

'చక్రవాళం' అనే మకుటంతో రామారావుగారు వ్రాసిన నవల 'ఆంధ్రభూమి' సచిత్ర వారపత్రికలో 16 వారాల ధారావాహిక నవలగా ప్రచురించబడి, తెలుగు పాఠకుల మెప్పులనందుకుంది[4]. ఉత్కంఠ భరితంగా తీర్చిదిద్దిన 'చక్రవాళం' నవలను ఎమెస్కో బుక్స్ వారు పుస్తకరూపంలో ప్రచురించారు[5]. 2017 డిసెంబరు 18 న ఈ పుస్తకం పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అధ్యక్షతలో, తెలంగాణ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి చే హైదరాబాద్ లో ఆవిష్కరించబడింది.

హైదరాబాద్ లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవం నాడు "వలసపోయిన తెలుగుబిడ్డలం వచ్చాము. మీకోసం" అనే శీర్షితో రచించిన అతని కవిత 'ఆంధ్రప్రభ' దినపత్రికలో ప్రచురింపబడి, ప్రవాసిత కవిగా తెలుగు రాష్ట్రాలలో వారికి గుర్తింపు తెచ్చింది.

అతని భార్య పద్మావతీరావు కూడా వైద్యురాలే. ఆమె కూడా అతనితో పాటు ఇండియన్ ఆర్మీ మెడికల్ కార్పస్ లో 7 సంవత్సరాలు సేవచేసి, యు.కె.లో 30 సంవత్సరాలు జి.పి.గా పనిచేసింది. వారి ఏకైక కుమార్తె డాక్టర్ అనుపమారావు, ఆమె భర్త డాక్టర్ నీల్పోటర్ కెంట్ లోనే వైద్య సేవలందిస్తున్నారు.

విశ్రాంత జీవనంలోకి ప్రవేశించిన అతను సంవత్సరంలో 3 నెలలు హైదరాబాద్ లో గడుపుతూ, వీలైనన్ని తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతూ, కవితా రచనావ్యాసంగాలతో కాలక్షేపం చేస్తున్నాడు.

మూలాలు[మార్చు]

  1. వ్యాకరణం, అచ్యుత రామారావు. https://taluk.org/assets/talawardees/LTA/LTA_awardee_2018.pdf. {{cite web}}: Missing or empty |title= (help)CS1 maint: url-status (link)
  2. 2.0 2.1 "AV 7th June 2014 by Asian Business Publications Ltd - Issuu". issuu.com (in ఇంగ్లీష్). 2014-06-04. Retrieved 2023-10-02.
  3. "'చీకటిలో నీడలు' పుస్తకావిష్కరణ". Sakshi. 2016-05-12. Retrieved 2023-10-02.
  4. "Chakravakam (Telugu)". Chirukaanuka. Retrieved 2023-10-02.
  5. "Chakravalam". www.logili.com (in ఇంగ్లీష్). Retrieved 2023-10-02.

బాహ్య లంకెలు[మార్చు]