సత్యేంద్రనాథ్ బోస్
సత్యేంద్రనాథ్ బోస్ Satyendra Nath Bose সত্যেন্দ্র নাথ বসু | |
---|---|
జననం | కోల్‌కతా, బ్రిటిష్ ఇండియా | 1894 జనవరి 1
మరణం | 1974 ఫిబ్రవరి 4 కలకత్తా, భారతదేశం | (వయసు 80)
నివాసం | ఇండియా |
జాతీయత | భారతీయుడు |
రంగములు | భౌతిక శాస్త్రము, గణిత శాస్త్రము |
వృత్తిసంస్థలు | కలకత్తా విశ్వవిద్యాలయం, ఢాకా విశ్వవిద్యాలయం |
చదువుకున్న సంస్థలు | కలకత్తా విశ్వవిద్యాలయం |
ప్రసిద్ధి | Bose–Einstein condensate Bose–Einstein statistics Bose gas |
ముఖ్యమైన పురస్కారాలు | పద్మ విభూషణ్ Fellow of the Royal Society |
సత్యేంద్రనాథ్ బోస్ (FRS) [1] (Bengali: সত্যেন্দ্র নাথ বসু) (జనవరి 1, 1894 - ఫిబ్రవరి 4,1974) భారత దేశ భౌతిక శాస్త్రవేత్త. ఈయన గణిత భౌతిక శాస్త్రంలో విశేష గుర్తింపు పొందాడు. అతను 1920 లలో క్వాంటం మెకానిక్స్‌లో బోస్-ఐన్‌స్టీన్ స్టాటిస్టిక్స్, బోస్-ఐన్‌స్టీన్ కండెన్‌సేట్ సిద్ధాంతం నిర్మాణానికి గాను చేసిన కృషికి గుర్తింపు పొందాడు.అతనికి భారత ప్రభుత్వం దేశంలో రెండవ అత్యున్నత పురస్కారం అయిన పద్మ విభూషణను 1954 లో ప్రదానం చేసింది. ప్రస్తుతం విశ్వంలో వ్యాపించిఉన్నాయని భావిస్తున్న దైవకణాలకు అతని పేరుతో హిగ్స్-బోసన్ కణాలని పాల్ డిరాక్[2] నామకరణం చేశాడు.[3][4][5]
అతను స్వయం బోధకుడు, బహుభాషా కోవిదుడు. అతను భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, గణిత శాస్త్రం, జీవ శాస్త్రం, లోహ సంగ్రహణ శాస్త్రం, తత్వ శాస్త్రం, కళలు, సాహిత్యం, సంగీతం వంటి అనేక రంగాలలో కృషిచేశాడు. అతను స్వతంత్ర భారత దేశంలో అనేక పరిశోధనా కమిటీలలో పనిచేసి విశేష సేవలనందించాడు.
బాల్య జీవితం
[మార్చు]బోస్ భారత దేశం లోని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్య పట్టణమైన కలకత్తాలో జన్మించాడు. అతని తండ్రి సురేంధ్రనాథ్ బోస్ ఒక రైల్వే ఉద్యోగి. సురేంద్రనాథ్ బోస్ కు మొదటి సంతానంగా సతేంద్రనాథ్ బోస్ జన్మించాడు. అతని పూర్వీకులు కలకత్తాకు 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న నదియా జిల్లాలోని బారా జగులియాలో ఉండేవారు. అతను తన ఐదవ యేట విద్యాభ్యాసం ప్రారంభించాడు. అతను చదివే పాఠశాల తన యింటికి దగ్గరలో ఉండేది. తర్వాత అతని కుటుంబం గోవాబహన్ కు మారినది. అచ్చట న్యూ ఇండియన్ పాఠశాలలో చేరాడు. తన పాఠశాల చివరి సంవత్సరంలో అతను "హిందూ పాఠశాల" కు మారాడు. 1909 లో జరిగిన మెట్రిక్యులేషన్ ప్రవేశ పరీక్షలో అత్యధిక మార్కులు పొంది ఉత్తీర్ణుడయ్యాడు. తర్వాత విజ్ఞాన శాస్త్రంలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించడానికి కలకత్తాలో గల ప్రెసిడెన్సీ కళాశాలలో చేరాడు. అచట కీర్తి ప్రతిష్ఠలు పొందిన ఉపాధ్యాయులైన జగదీశ్ చంద్రబోస్, ప్రఫుల్ల చంద్రరాయ్ లు అతని గురువులు. రెండు సంవత్సరాల తర్వాత ఢాకా నుండి మేఘనాథ్ సాహ కూడా ఇదే కళాశాలలో చేరాడు. పి.సి.మహలానోబిస్, సిసిర్ కుమార్ మిత్రాలు ఇతని కంటే కొన్ని సంవత్సరములు సీనియర్లు. సత్యేంద్రనాథ్ బోస్ బి.యస్సీలో "అనువర్తిత గణిత శాస్త్రం "ను ప్రధాన విషయంగా తీసుకొని 1913 లో మొదటి స్థానంలో ఉత్తీర్ణుడయ్యాడు. 1915 లో అనువర్తిత గణిత శాస్త్రంలో ఎం.యస్సీ ప్రథమ స్థానంలో ఉత్తీర్ణుడై కలకత్తా విశ్వవిద్యాలయంలో కొత్త రికార్డును స్వంతం చేసుకున్నాడు. అది ఇంతవరకు ఎవరూ అధికమించకపోవడం విశెషం.[6]
ఎం.యస్సీ పూర్తి చేసిన తర్వాత 1916 లో కలకత్తా విశ్వవిద్యాలయంలో పరిశోధకునిగా చేరాడు. అచట అతను సాపేక్ష సిద్ధాంతం పై తన పరిశోధనలు ప్రారంభించాడు. ఇది విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి చరిత్రలో ఒక విశేషమైన యుగంగా చెప్పుకోవచ్చు.ఆదే సమయంలో ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతం వెలువడింది. దాని ముఖ్య ఫలితాలు వెలువడినవి.[6]
సత్యేంద్రనాథ్ బోస్ తన 20 వ సంవత్సరంలో "ఉషావతి"ని వివాహం చేసుకున్నాడు.[7] వారికి తొమ్మిది మంది పిల్లలు జన్మించారు. వారిలో ఇద్దరు బాల్య దశలోనే మరణించారు. అతను1974లో మరణించే నాటికి తన వద్ద భార్య, ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.[6]
అతను బహుభాషా కోవిదుడు. అతను బెంగాలీ, ఆంగ్లం, ప్రెంచ్, జర్మన్, సంస్కృతం భాషలందు, టెన్నిసన్, రవీంద్రనాధ టాగూరు, కాళిదాసు కవిత్వాల యందు నిష్ణాతుడు. అతను వయొలిన్ వంటి వాద్య పరికరం అయిన ఎస్రాజ్ కూడా వాయించేవాడు.
పరిశోధనా జీవితం
[మార్చు]బోస్ కలకత్తాలోని హిందూ పాఠశాలలో చదివాడు. తరువాత కలకత్తాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో చదివాడు. ప్రతి సంస్థలో అత్యధిక మార్కులు సాధించాడు. తన తోటి విద్యార్థి మేఘనాడ్ సాహా రెండవ స్థానంలో నిలిచేవాడు.[8] అతనికి తన జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని సాధించడానికి ప్రేరణనిచ్చిన జగదీష్ చంద్రబోస్, ప్రఫుల్ల చంద్ర రే వంటి ఉపాధ్యాయులతో పరిచయం ఏర్పడింది. 1916 నుండి 1921 వరకు కలకత్తా విశ్వవిద్యాలయంలో భౌతిక విభాగంలో అధ్యాపకునిగా పనిచేశాడు. మేఘనాథ్ సాహాతో పాటు, బోస్ 1919 లో ఐన్‌స్టీన్ ప్రత్యేక, సాధారణ సాపేక్షతపై రాసిన పత్రాల జర్మన్, ఫ్రెంచ్ భాషా అనువాదాల ఆధారంగా ఆంగ్లంలో మొదటి పుస్తకాన్ని సిద్ధం చేశాడు.
1921 లో గణిత శాస్త్రవేత్త, హైకోర్టు న్యాయమూర్తి, భౌతికశాస్త్రంలో బలమైన ఆసక్తి గల కలకత్తా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ సర్ అశుతోష్ ముఖర్జీ చేత స్థాపించబడిన ఢాకా విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్ర విభాగానికి రీడర్‌గా చేరాడు.ఎం.యస్సీ, బి.యస్సీ (ఆనర్స్) వంటి అధునాతన కోర్సులు నేర్పడానికి బోస్ ప్రయోగశాలలతో సహా సరికొత్త విభాగాలను ఏర్పాటు చేశాడు. అతను థర్మోడైనమిక్స్ (ఉష్ణగతికశాస్త్రం), జేమ్స్ క్లర్క్ మాక్స్‌వెల్ విద్యుదయస్కాంత సిద్ధాంతాన్ని బోధించేవాడు.[9] సత్యేంద్ర నాథ్ బోస్, సాహాతో కలిసి, 1918 నుండి సైద్ధాంతిక భౌతిక శాస్త్రం, ప్యూర్ మాథమెటిక్స్ లలో అనేక పరిశోధనా పత్రాలను సమర్పించారు.
1924 లో ఢాకా విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్ర విభాగంలో రీడర్‌గా పనిచేస్తున్నప్పుడు, బోస్ క్లాసికల్ భౌతికశాస్త్రం గురించి ప్రస్తావించకుండా, ఒకేలా ఉండే కణాలతో గణన స్థితుల అధ్బుతమైన మార్గం ద్వారా ప్లాంక్ యొక్క క్వాంటం వికిరణాల నియమాన్ని ఉత్పాదించిన ఒక పరిశోధనా పత్రాన్ని వ్రాసాడు. ఈ పత్రం క్వాంటం గణాంకాల ముఖ్యమైన రంగంలో సృష్టించడంలో ప్రభావశీలమైనది. దీనిని ప్రచురణ కోసం ఒకేసారి అంగీకరించనప్పటికీ, అతను ఆ కథనాన్ని నేరుగా జర్మనీలోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌కు పంపాడు. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆ పరిశోధనా పత్రం ప్రాముఖ్యతను గుర్తించి, దానిని జర్మన్ భాషలోకి అనువదించాడు. దానిని బోస్ తరపున ప్రతిష్టాత్మక జీట్స్‌క్రిఫ్ట్ ఫర్ ఫిజిక్‌కు సమర్పించాడు. ఈ గుర్తింపు ఫలితంగా, బోస్ యూరోపియన్ ఎక్స్-రే, క్రిస్టల్లాగ్రఫీ ప్రయోగశాలలలో రెండు సంవత్సరాలు పని చేయగలిగాడు. ఈ సమయంలో అతను లూయిస్ డి బ్రోగ్లీ, మేరీ క్యూరీ , ఐన్‌స్టీన్‌లతో కలిసి పనిచేశాడు. [8][10][11][12] ఐరోపాలో ఉన్న తరువాత, బోస్ 1926 లో ఢాకాకు తిరిగి వచ్చాడు. అతన్ని భౌతిక శాస్త్ర విభాగాధిపతిగా చేశారు. అతను ఢాకా విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు మార్గదర్శకత్వం, బోధన కొనసాగించాడు. బోస్ ఒక ఎక్స్-రే క్రిస్టల్లాగ్రఫీ ప్రయోగశాల కోసం ఉపకరణములను రూపొందించాడు.
ఎక్స్‌రే వర్ణపటశాస్త్రం, ఎక్స్‌రే వివర్తనం, పదార్థ అయస్కాంత లక్షణాలు, దృశా వర్ణపటశాస్త్రం, నిస్తంత్రీ విధానం, ఏకీకృత క్షేత్ర సిద్ధాంతాలలో పరిశోధనా కేంద్రంగా మార్చడానికి అతను ప్రయోగశాలలు, గ్రంథాలయాలను ఏర్పాటు చేశాడు. అతను మేఘనాథ్ సాహాతో కలసి ఆదర్శ వాయువులకు సమీకరణాన్ని ప్రచురించాడు. అతను 1945 వరకు ఢాకా విశ్వవిద్యాలయంలో సైన్స్ ఫ్యాకల్టీ డీన్ గా కూడా తన సేవలనందించాడు. భారతదేశ విభజన ఆసన్నమైనప్పుడు, అతను ప్రతిష్టాత్మక ఖైరా చైర్ చేపట్టడానికి కలకత్తాకు తిరిగి వచ్చి కలకత్తా విశ్వవిద్యాలయంలో 1956 వరకు బోధించాడు. ప్రతి విద్యార్థి స్థానిక సామగ్రిని, స్థానిక సాంకేతిక నిపుణులను ఉపయోగించి తన సొంత పరికరాలను రూపొందించాలని పట్టుబట్టాడు. తన పదవీవిరమణ నాటికి గౌరవాచార్యుడయ్యాడు.[13][14][15] శాంతినికేతన్ లోని విశ్వ-భారతి విశ్వవిద్యాలయానికి ఉప కులపతిగా తన సేవలనందించాడు. అణు భౌతిక శాస్త్రంలో పరిశోధనలు కొనసాగించడానికి, సేంద్రీయ రసాయనశాస్త్రంలో మునుపటి పనులను పూర్తి చేయడానికి కలకత్తా విశ్వవిద్యాలయానికి తిరిగి వచ్చాడు. తరువాతి సంవత్సరాల్లో, అతను బక్రేశ్వర్ వద్ద వేడి నీటి బుగ్గలలో హీలియం వెలికితీత వంటి అనువర్తిత పరిశోధనలలో పనిచేశాడు.[16]
భౌతికశాస్త్రంతో పాటు, బయోటెక్నాలజీ, సాహిత్యంలో (బెంగాలీ, ఇంగ్లీష్) కొంత పరిశోధన చేశాడు. అతను రసాయనశాస్త్రం, భూగర్భశాస్త్రం, జంతుశాస్త్రం, మానవ పరిమాణ శాస్త్రం, ఇంజనీరింగ్, ఇతర శాస్త్రాలలో లోతైన అధ్యయనాలు చేశాడు. బెంగాలీ కావడంతో, బెంగాలీని బోధనా భాషగా ప్రోత్సహించడానికి, శాస్త్రీయ పత్రాలను దానిలోకి అనువదించడానికి, ఈ ప్రాంత అభివృద్ధిని ప్రోత్సహించడానికి చాలా సమయాన్ని కేటాయించారు.[11][17][18]
దైవ కణాల పరిశోధన
[మార్చు]విశ్వ సృష్టికి సంబంధించిన దైవ కణాల పరిశోధన వెనక సత్యేంద్ర నాథ్ బోస్ కృషి చాలా ఉంది. కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో చదివిన బోస్ అణు భౌతిక శాస్త్రంలో అనేక పరిశోధనలు జరిపాడు. క్వాంటమ్ ఫిజిక్స్‌పై అధ్యయనం చేశాడు. విశ్వంలోని ప్రాథమిక కణాలపై పరిశోధనలో భాగంగా 1920లలో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌తో కలిసి పనిచేశాడు. అతని అధ్యయనం వల్లే అణు భౌతికశాస్త్రంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రాథమిక కణాలపై వీరు సమర్పించిన అధ్యయన ఫలితాలను ప్రస్తుతం బోస్-ఐన్‌స్టీన్ స్టాటిస్టిక్స్‌గా పరిగణిస్తున్నారు. వీరు ప్రతిపాదించిన కణాల ఆధారంగానే తర్వాతి కాలంలో దైవకణానికి సంబంధించిన సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. విశ్వంలోని ఒక ప్రాథమిక కణానికి ఆతని పేరు పెట్టి అరుదైన గౌరవాన్ని అందించారు. భారతీయ శాస్త్రవేత్తలు సీవీరామన్, మేఘనాథ్ సాహా, సత్యేంద్రనాథ్ బోస్‌లను ఫిజిక్స్‌లో చెరగని ముద్రవేసిన త్రిమూర్తులుగా చెబుతారు. దైవకణం ప్రకటన వెలువడగానే జెనీవాలో శాస్త్రవేత్తలు ఆనందోత్సాహాల్లో తేలిపోతుండగా కోలత్‌కతాలోని సాహా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్(ఎస్ఐఎన్‌పీ) పరిశోధకులు కూడా సంబరాలు జరుపుకున్నారు. దైవకణం ఉనికిని గుర్తించడంలో భారతీయులూ కీలకపాత్ర పోషించారు. యూరోపియన్ పరిశోధన సంస్థ 'సెర్న్' శాస్త్రవేత్తలు 'ఈ చరిత్రాత్మక ప్రాజెక్టుకు భారత్ తండ్రి వంటిది' అని వ్యాఖ్యానించారు. సాహా ఇన్‌స్టిట్యూట్‌తోపాటు ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, అలహాబాద్‌లోని హరిశ్చంద్ర ప్రసాద్ ఇన్‌స్టిట్యూట్, భువనేశ్వర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్, బోస్ ఇన్‌స్టిట్యూట్, పంజాబ్, జమ్మూ, గౌహతి, రాజస్థాన్ యూనివర్సిటీకి చెందిన అనేక మంది ఈ పరిశోధనల్లో పాలు పంచుకుంటున్నారు. మొత్తానికి వందమంది భారత శాస్త్రవేత్తలు సెర్న్ పరిశోధనల్లో తమ వంతు సహకారం అందిస్తున్నారు. అసలు హిగ్స్ బోసాన్ పేరులోనే భారతీయ మూలాలున్నాయి. విశ్వ విఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌తో కలిసి పనిచేసిన సత్యేంద్రనాథ్ బోస్ పేరుమీదనే 'బోసాన్' అన్న పదం పుట్టుకొచ్చింది. సెర్న్ ప్రతిష్ఠాత్మక భూగర్భ పరిశోధన కేంద్రం లార్జ్ హాడ్రన్ కొలైడర్(ఎల్‌హెచ్‌సీ) నిర్మాణంలోనూ భారతీయులే కీలక పాత్ర పోషించారు.[19]
బోస్-ఐన్‌స్టీన్ స్టాటిస్టిక్స్
[మార్చు]రేడియేషన్ సిద్ధాంతం, అతినీలలోహిత విపత్తుపై ఢాకా విశ్వవిద్యాలయంలో ఉపన్యాసం చేస్తున్నప్పుడు,[21] బోస్ తన విద్యార్థులకు సమకాలీన సిద్ధాంతం సరిపోదని చూపించడానికి ఉద్దేశించాడు. ఎందుకంటే ఇది ప్రయోగాత్మక ఫలితాలకు అనుగుణంగా ఫలితాలను అంచనా వేయలేకపోయింది. ఈ వ్యత్యాసాన్ని వివరించే ప్రక్రియలో, బోస్ మొదటిసారి "మాక్స్‌వెల్-బోల్డ్‌జ్‌మన్ పంపిణీ" సూక్ష్మ కణాల విషయంలో నిజం కాదని, హైసెన్‌బర్గ్ అనిశ్చితత్వ సూత్రం కారణంగా హెచ్చుతగ్గులు గణనీయంగా ఉంటాయని తెలిపాడు. ప్రతి స్థితి h3 ఘనపరిమాణాన్ని కలిగి ఉండి, కణాల ప్రత్యేకమైన స్థానం, వేగాన్ని విస్మరిస్తుంది. అందువల్ల అతను దశాంతరాళంలో కణాలను కనుగొనే సంభావ్యతను నొక్కిచెప్పాడు,<div
బోస్ ఈ ఉపన్యాసాన్ని "ప్లాంక్స్ లా అండ్ హైపోథెసిస్ ఆఫ్ లైట్ క్వాంటా" అనే చిన్న వ్యాసంలో స్వీకరించాడు. దానిని కింది లేఖతో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌కు పంపాడు.[22]
“డియర్ సర్, మీ పరిశీలన, అభిప్రాయం కోసం నేను మీకు ఈ కథనాన్ని పంపించాను. మీరు దాని గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవటానికి నేను ఆత్రుతగా ఉన్నాను. క్లాసికల్ ఎలెక్ట్రోడైనమిక్స్ నుండి స్వతంత్రంగా ప్లాంక్ నియమం లోని గుణకం 8π ν2/c3 ను తగ్గించడానికి నేను ప్రయత్నించానని మీరు ఈ పత్రంలో చూస్తారు. దశ-అంతరాళంలో అంతిమ ప్రాథమిక ప్రాంతంలో కంటెంట్ h3 ఉందని మాత్రమే ఊహిస్తారి. ఈ పరిశోధనా పత్రాన్ని అనువదించడానికి నాకు తగినంత జర్మన్ భాష తెలియదు. ఈ పత్రం ప్రచురణ విలువైనదని మీరు అనుకుంటే, మీరు దాని ప్రచురణను "జైట్స్‌క్రిఫ్ట్ ఫర్ ఫిజిక్" లో వచ్చేటట్లు చేస్తే నేను కృతజ్ఞుడను. మీకు నాకు పూర్తి అపరిచితులు అయినప్పటికీ, అలాంటి అభ్యర్థన చేయడంలో నాకు ఏమాత్రం సంకోచం లేదు. ఎందుకంటే మీ రచనల ద్వారా మీ బోధనల ద్వారా లాభం పొందిన మేమంతా మీ విద్యార్థులం. సాపేక్షతపై మీ పత్రాలను ఆంగ్లంలో అనువదించడానికి కలకత్తాకు చెందిన ఎవరైనా మీ అనుమతి కోరినట్లు మీకు ఇంకా గుర్తుందో,లేదో నాకు తెలియదు. మీరు ఆ అభ్యర్థనను అంగీకరించారు. అప్పటి నుండి ఆ పుస్తకం ప్రచురించబడింది. సాధారణీకరించిన సాపేక్షతపై మీ పరిశోధనా పత్రాలను నేనే అనువదించాను.”
ఐన్‌స్టీన్ అతనితో ఏకీభవించాడు. బోస్ యొక్క పరిశోధనా వ్యాసం "ప్లాంక్‌స్ లా అండ్ హైపోథెసిస్ ఆఫ్ లైట్ క్వాంటా" ను జర్మన్ భాషలోకి అనువదించాడు. 1934లో బోస్ పేరుమీద "జెట్‌స్క్రిఫ్ ఫర్ ఫిజిక్" ప్రచురించాడు.[23]
బోస్ యొక్క వ్యాఖ్యానం ఖచ్చితమైన ఫలితాలను ఇవ్వడానికి కారణం, ఫోటాన్లు ఒకదానికొకటి వేరు చేయలేనివి కాబట్టి, సమాన శక్తిని కలిగి ఉన్న రెండు ఫోటాన్‌లను రెండు విభిన్నమైన గుర్తించదగిన ఫోటాన్‌లుగా పరిగణించలేము. సారూప్యత ప్రకారం, ప్రత్యామ్నాయ విశ్వంలో నాణేలు ఫోటాన్లు, ఇతర బోసాన్‌ల వలె ప్రవర్తిస్తే, రెండు బొమ్మలను చూపే సంభావ్యత వాస్తవానికి మూడింట ఒక వంతు ఉంటుంది. (బొరుసు-బొమ్మ=బొమ్మ-బొరుసు)
బోస్ యొక్క వ్యాఖ్యానాన్ని ఇప్పుడు బోస్-ఐన్‌స్టీన్ గణాంకాలు అంటారు. బోస్ పొందిన ఈ ఫలితం క్వాంటం గణాంకాలకు పునాది వేసింది, ముఖ్యంగా ఐన్‌స్టీన్, డిరాక్ గుర్తించినట్లుగా, కణాలను విడదీయరాని విప్లవాత్మక కొత్త తాత్విక భావనలను కలుగజేసింది.[23]
ఐన్‌స్టీన్ బోస్‌ను ముఖాముఖిగా కలిసినప్పుడు, బోస్‌తో "నీవు ఒక కొత్త రకం గణాంకాలను కనుగొన్నట్లు నీకు తెలుసా?" అని అడిగాడు, అతను చాలా నిజాయితీగా "లేదు" అని చెప్పాడు. అతనికి బోల్ట్జ్‌మాన్ గణాంకాల గురించి అంతగా తెలియదు, గ్రహించలేదు. అతను గణనలను భిన్నంగా చేస్తున్నాడని అతను గ్రహించలేదు. అతను అడిగిన వారితో సమానంగా దాపరికం కలిగి ఉన్నాడు.
గుర్తింపు
[మార్చు]1937 లో, రవీంద్రనాథ్ ఠాగూర్ తన ఏకైక విజ్ఞాన శాస్త్రం, "విశ్వ-పరిచయ్" ను సత్యేంద్ర నాథ్ బోస్ కు అంకితం చేశాడు. బోస్‌ను 1954 లో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ టైటిల్‌తో సత్కరించింది. 1959 లో, అతను నేషనల్ ప్రొఫెసర్‌గా నియమితుడయ్యాడు. ఇది ఒక పండితుడికి దేశంలో ఇచ్చిన అత్యున్నత గౌరవం, ఈ పదవిని 15 సంవత్సరాలు కొనసాగించాడు. 1986 లో "ఎస్.ఎన్. బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్" కలకత్తాలోని సాల్ట్ లేక్‌లో భారత ప్రభుత్వ పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించబడింది.[24][25] బోస్ కొత్తగా ఏర్పడిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్‌కు సలహాదారు అయ్యాడు. అతను ఇండియన్ ఫిజికల్ సొసైటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అధ్యక్షుడిగా పనిచేశాడు.
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జనరల్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యాడు. అతను భారత గణాంక సంస్థలి ఉపాధ్యక్షునిగా, అధ్యక్షునిగా కూడా పనిచేసాడు. 1958 లో, అతను రాయల్ సొసైటీ లో ఫెలోషిప్ పొందాడు.అతను రాజ్యసభ సభ్యునిగా నామినేట్ అయ్యాడు.
నోబెల్ బహుమతి నామినేషన్
[మార్చు]ఎస్.ఎన్.బోస్ తాను కనుగొన్న బోస్-ఐన్‌స్టీన్ స్టాటిక్స్, ఏకీకృత క్షేత్ర సిద్ధాంతం లకు గుర్తింపుగా కె.బెనర్జీ (1956), డి.ఎస్.కొఠారీ (1959), ఎస్.ఎన్.బగ్చి (1962), ఎ.కె.దత్తా (1962) లు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి కొరకు నామినేట్ చేసారు. ఉదాహరణకు, అలహాబాద్ విశ్వవిద్యాలయంలోని భౌతిక విభాగం అధిపతి కేదరేశ్వర్ బెనర్జీ 12 జనవరి 1956 నాటి లేఖలో నోబెల్ కమిటీకి ఈ క్రింది విధంగా రాశారు:
- అతను (బోస్) తన పేరు మీద తెలిపిన గణాంకాలను "బోస్ గణాంకాలు"గా అభివృద్ధి చేయడం ద్వారా భౌతిక శాస్త్రంలో గొప్ప కృషి చేశాడు. ఇటీవలి సంవత్సరాలలో, ఈ గణాంకాలు ప్రాథమిక కణాల వర్గీకరణలో తీవ్ర ప్రాముఖ్యత ఉన్నట్లు గుర్తించబడ్డాయి. అణు భౌతిక శాస్త్ర అభివృద్ధిలో ఎంతో దోహదపడ్డాయి.
- 1953 నుండి ఇప్పటి వరకు ఐన్‌స్టీన్ "యూనిటరీ ఫీల్డ్ థియరీ" అనే అంశంపై చాలా దూరపు పరిణామాలకు అతను చాలా ఆసక్తికరమైన రచనలు చేశారు.
బోస్ చేసిన కృషిని నోబెల్ కమిటీ నిపుణుడు ఓస్కర్ క్లీన్ పరిశీలించాడు, అతను దానిని ని నోబెల్ బహుమతికి అర్హమైనదిగా పరిగణించలేదు.[26][27][28]
ఉత్తర దాయిత్వం
[మార్చు]విజ్ఞాన శాస్త్రానికి అతను చేసిన సేవల జ్ఞాపకార్థం, కణ భౌతిక శాస్త్రంలో ప్రాథమిక ఉప పరమాణు కణాలలోని ఒక తరగతికి "బోసాన్స్" అని సత్యేంద్ర నాథ్ బోస్ పేరు పెట్టారు.[4][5] బోస్ ప్రతిపాదించిన బోసన్, బోస్-ఐన్‌స్టీన్ గణాంకాలు,బోస్-ఐన్‌స్టీన్ కండెన్సేట్ భావనలకు సంబంధించిన పరిశోధనల కోసం ఏడు నోబెల్ బహుమతులు లభించినప్పటికీ, బోస్‌కు స్వయంగా నోబెల్ బహుమతి లభించలేదు.
రచనలు (ఎంపిక చేసినవి)
[మార్చు]- Bose (1924), "Plancks Gesetz und Lichtquantenhypothese", Zeitschrift für Physik (in German), 26 (1): 178–181, Bibcode:1924ZPhy...26..178B, doi:10.1007/BF01327326
{{citation}}
: CS1 maint: unrecognized language (link).
మూలాలు
[మార్చు]- ↑ Notes on Dirac's lecture Developments in Atomic Theory at Le Palais de la Découverte, 6 December 1945, UKNATARCHI Dirac Papers BW83/2/257889. See note 64 to p. 331 in The Strangest Man by Graham Farmelo.
- ↑ Subramanian, Samanth (6 July 2012). "For the Indian Father of the 'God Particle,' a Long Journey from Dhaka". [New York Times. Retrieved 7 July 2012.
- ↑ 4.0 4.1 Daigle, Katy (10 July 2012). "India: Enough about Higgs, let's discuss the boson". AP News. Retrieved 10 July 2012. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "AP-20120710" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ 5.0 5.1 Bal, Hartosh Singh (19 September 2012). "The Bose in the Boson". New York Times. Archived from the original on 22 సెప్టెంబరు 2012. Retrieved 21 September 2012. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "NYT-20120919" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ 6.0 6.1 6.2 Dr. V. B. Kamble (January 2002). "Vigyan Prasar". Archived from the original on 2016-03-04. Retrieved 2013-04-19.
- ↑ Wali 2009, p. xvii (Foreword).
- ↑ 8.0 8.1 Dr Subodh Mahanti. "Satyendra Nath Bose, The Creator of Quantum Statistics". Vigyan Prasar.
- ↑ Wali 2009, p. xvii, xviii, xx (Foreword).
- ↑ M.R.Shanbhag. "Personalities :: Scientist". Calcuttaweb. Archived from the original on 2002-08-02.
- ↑ 11.0 11.1 J J O'Connor and E F Robertson (October 2003). "Satyendranath Bose". The MacTutor History of Mathematics archive.
- ↑ Wali 2009, p. xx-xxiii (Foreword).
- ↑ M.R.Shanbhag. "Personalities :: Scientist". Calcuttaweb. Archived from the original on 2002-08-02.
- ↑ Dr Subodh Mahanti. "Satyendra Nath Bose, The Creator of Quantum Statistics". Vigyan Prasar.
- ↑ Wali 2009, p. xxx, xxiv (Foreword).
- ↑ Wali 2009, p. xxxvi, xxxviii (Foreword).
- ↑ Wali 2009, p. xxiv, xxxix (Foreword).
- ↑ Bose, Satyendranath (1894-1974), Michel Barran, wolfram.com
- ↑ Pratap (2012-07-05). "దైవ కణాల పరిశోధన వెనక భారత్ బోస్". telugu.oneindia.com. Archived from the original on 2020-02-29. Retrieved 2020-02-29.
- ↑ "Quantum Physics; Bose Einstein condensate", Image Gallery, NIST, 11 March 2006.
- ↑ MR, Shanbhag. "Satyendra Nath Bose (January 1, 1894 February 4, 1974)". Indian Statistical Institute.
- ↑ G. Venkataraman (1992). Bose And His Statistics. Universities Press. p. 14. ISBN 978-81-7371-036-0.
- ↑ 23.0 23.1 Wali 2009, p. 414.
- ↑ Wali 2009, pp. xxxiv, xxxviii.
- ↑ Ghose, Partha (3 January 2012), "Original vision", The Telegraph (Opinion), IN.
- ↑ Singh, Rajinder (2016) India's Nobel Prize Nominators and Nominees – The Praxis of Nomination and Geographical Distribution, Shaker Publisher, Aachen, pp. 26–27. ISBN 978-3-8440-4315-0
- ↑ Singh, Rajinder (2016) Die Nobelpreise und die indische Elite, Shaker Verlag, Aachen, pp. 24–25. ISBN 978-3-8440-4429-4
- ↑ Singh, Rajinder (2016) Chemistry and Physics Nobel Prizes – India's Contribution, Shaker Verlag, Aachen. ISBN 978-3-8440-4669-4
బాహ్య లంకెలు
[మార్చు]- Pais, Abraham (1982), Subtle is the Lord...: The Science and Life of Albert Einstein, Oxford and New York: Oxford University Press, pp. 423–34, ISBN 978-0-19-853907-0.
- Saha; Srivasthava, Heat and thermodynamics.
- Pitaevskii, Lev; Stringari, Sandro (2003), Bose–Einstein Condensation, Oxford: Clarendon Press.
- Wali, Kameshwar C (2009), Satyendra Nath Bose: his life and times (selected works with commentary), Singapore: World Scientific, ISBN 978-981-279-070-5
- O'Connor, John J.; Robertson, Edmund F., "Satyendra Nath Bose", MacTutor History of Mathematics archive, University of St Andrews.
- "Bosons – The Birds That Flock and Sing Together", Vigyan Prasar, India, January 2002, archived from the original on 2016-03-04, retrieved 2013-04-19 (biography of Bose and Bose–Einstein Condensation).
- S.N. Bose Scholars Program, Wisc, archived from the original on 2016-08-13, retrieved 2013-04-19.
- The Quantum Indians: film on Bose, Raman and Saha యూట్యూబ్‌లో by Raja Choudhury and produced by PSBT and Indian Public Diplomacy.
- మూలాల లోపాలున్న పేజీలు
- Articles containing Bengali-language text
- CS1 maint: unrecognized language
- Commons category link is on Wikidata
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with SNAC-ID identifiers
- 1894 జననాలు
- 1974 మరణాలు
- బెంగాలీ వ్యక్తులు
- భారతీయ గణిత శాస్త్రవేత్తలు
- భారతీయ భౌతిక శాస్త్రవేత్తలు
- భారతీయ రసాయన శాస్త్రవేత్తలు
- కలకత్తా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులు