సురగొండయ్య గుట్ట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


సూరుగుండయ్య గుట్ట (సూరుగుండయ్య గుట్ట) తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, తాడ్వాయి మండలం దామెరవాయి గ్రామంలోవున్న గుట్ట. ఆదిమ చరిత్ర ఆనవాళ్లతో ఆధ్యాత్మిక, పర్యాటక, పరిశోధనా కేంద్రంగా విరాజిల్లుతూ ఒకనాటి ఆదిమానవుడి నివాస స్థావరంగా ఈ గుట్ట నిలించింది. మానవ జాతుల పరిణామ క్రమాన్ని తెలియజేసే చారిత్రక సాక్ష్యాలుగా ఈ గుట్టపై 145కు పైగా ఆదిమానవుని సమాధులు ఉన్నాయి.[1]

చరిత్ర[మార్చు]

1877వ సంవత్సరంలో డాక్టర్ విలియంకింగ్, మూలహారన్ అనే జియాలజిస్టులు వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతాలలోని అటవీప్రాంతంలో ఈ సమాధులను కనుగొన్నారు. 1918వ సంవత్సరంలో వేక్ ఫీల్ అనే బ్రిటిషు శాస్త్రవేత్త ఈ ప్రాంతాన్ని సందర్శించి, ఈ సమాధులు బృహత్ శిలాయుగం నాటి నిర్మాణాలని, వీటి నిర్మాణంలో రాతి శిలలకు సంబంధించిన పనిముట్లను ఉపయోగించారని, అందువల్ల వీటి నిర్మాణం కేవలం మూడు నుంచి ఐదు వేల సంవత్సరాల మధ్యకాలంలో జరిగి ఉంటుందని ఆయన అంచనా వేశాడు.

నిర్మాణశైలి[మార్చు]

సుమారు నాలుగు మీటర్ల పొడవు, మూడు మీటర్ల వెడల్పు విస్తీర్ణంలో కరకుగా చెక్కిన ఇసుక రాళ్లతో ఈ సమాధులు నిర్మించబడ్డాయి. సమాధి చుట్టూ నాలుగు పెద్ద బండలను పెట్టి, వాటికి పైకప్పుగా మరో అతి పెద్ద రాయిని పెట్టి, ప్రతి సమాధిలో ఒక చిన్న నీటి తొట్టిలాంటి రాతి కట్టడాన్ని నిర్మించారు. సమాధి యొక్క చివరమూలలో నాలుగు అడుగుల ఖాళీ ప్రదేశాన్ని వదిలారు.

సమాధుల మధ్య సుమారు 100 అడుగుల దూరం ఉంది. వీటిని ప్రణాళిక బద్ధంగా, నైపుణ్యంతో నిర్మించడం వల్లనే ఎన్ని భూకంపాలు వచ్చినా చెక్కుచెదరలేదని తెలుస్తుంది. సమాధులకు పైన కప్పుగా వాడిన ఒక్కో రాయి బరువు 10 నుంచి 20 టన్నులు ఉంటుంది. సమాధుల ముఖద్వారాలు ఉత్తర, దక్షిణ దిక్కులకు ఉండడం చూస్తే వాళ్లు వాస్తు సంప్రదాయాన్ని పాటించి ఉంటారని చరిత్రకారుల అభిప్రాయం.

రాక్షసిగూళ్లు[మార్చు]

ఇవి మానవ నిర్మిత సమాధులు. గోదావరి నది పరీవాహక ప్రాంతానికి చెందిన పాతరాతి యుగంనాటి మానవ జాతులకు చెందినవై ఉంటాయని పలువురి అభిప్రాయం. పూర్వకాలంలో రాక్షసుల శవాలను ఇక్కడ పాతిపెట్టడంతో వీటిని రాకాసి బండలు, రాక్షస గూళ్లు, రాకాసి గుహలు అని పిలుస్తున్నారు. చనిపోయిన రాక్షసులు ఎప్పటికైనా మళ్లీ బతికి బయటకు వస్తారనే భయంతో సమాధి లోపల నీటి తొట్టిని, బయటకు రావడానికి చిన్న దారిని వదిలి వేశారని స్థానికులు చెప్తున్నారు.

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ, బతుకమ్మ, ఆదివారం సంచిక (22 April 2018). "ఆదిమానవుడి ఆనవాళ్ల పుట్ట సురగొండయ్య గుట్ట!". అరవింద్ ఆర్య పకిడే. Archived from the original on 22 ఏప్రిల్ 2018. Retrieved 24 April 2018.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)