Jump to content

సౌందర నందము

వికీపీడియా నుండి
(సౌందరనందము నుండి దారిమార్పు చెందింది)

పింగళి కాటూరి కవులు అనబడే జంటకవులుగా ప్రసిద్ధులైన పింగళి లక్ష్మీకాంతం, కాటూరి వేంకటేశ్వరరావులు తెలుగులో వ్రాసిన అత్యుత్తమ పద్యకావ్యము - సౌందర నందము. దీనికి ఆధారం అశ్వఘోషుడి సంస్కృత సౌందరనందం. "ఇరవయ్యోశతాబ్దపు ఆంధ్ర మహాకావ్యాలలో సౌందర నందనము ఒకటి. ఆంధ్ర ప్రబంధ సరస్వతికి మకుటము" అని ముట్నూరి కృష్ణారావు ప్రశంసించాడు.[1] నవీన ఆంధ్ర పంచకావ్యాలలో ఇది ఒకటిగా గుర్తించబడింది. రాణా ప్రతాపసింహ చరిత్ర, శివభారతము, ఆంధ్రపురాణము, బాపూజీ ఆత్మకథ అనేవి తక్కిన కావ్యాలు.

గౌతమ బుద్ధుడు


సంస్కృత పాలీ భాషలలో బహుళ ప్రచారం పొందిన ఈ సుందరీనందుల కథ బౌద్ధశిల్పంలో కూడా సముచిత స్థానాన్ని సంపాదించుకొంది.

సా.శ. 2వ శతాబ్దినాటి అమరావతీ శిల్పంలోనూ, సా.శ.3వ శతాబ్దినాటి నాగార్జున శిల్పంలోనూ సౌందరనందంలోని వివిధ సన్నివేశాలను ఆకర్షణీయంగా మలిచారు. ఇట్లా దాదాపు రెండువేల సంవత్సరాల నుంచీ సాహిత్యంలోనూ, బౌద్ధశిల్పంలోనూ విశేష జనాదరణ పొందిన ఈ కథను పింగళి, కాటూరివారు గ్రహించి మనోజ్ఞమైన కావ్యంగా తెలుగు సాహిత్యంలో ప్రవేశపెట్టారు.

రచయితలు

[మార్చు]
పింగళి లక్ష్మీకాంతం

పింగళి లక్ష్మీకాంతం' (1894 - 1972) అష్టదిగ్గజాలలో ఒకడైన పింగళి సూరన వంశానికి చెందినవాడు. అధ్యాపకుడిగా, నటుడిగా, కవిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించాడు. తిరుపతి వేంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రికి శుశ్రూష చేసి, సంస్కృతాంధ్రాలలో బాగా పఠించి వారి శిష్యులలో అగ్రగణ్యుడయ్యాడు. కాటూరి వెంకటేశ్వరరావుతో కలసి జంటకవులుగా ముదునురు, తోట్లవల్లూరు, నెల్లూరు మొదలగు చోట్ల శతావధానాలు చేశాడు.


కాటూరి వెంకటేశ్వరరావు

కావ్య విభాగాలు, కథా క్రమం

[మార్చు]

కపిలవస్తు నగరంలో నందుడు గౌతమబుద్ధుని సవతి తమ్ముడు, భోగలాలసుడు, భార్యానురక్తుడు. బుద్ధ భగవానుడు కపిలవస్తు నగరానికి తిరిగివచ్చిన తరువాత నందుడికి జ్ఞానాన్ని బోధించి భిక్షువుగా మార్చాడు. భర్త విరహాన్ని సహింపలేని నందుని భార్య సుందరి తనలోతాను విపరీతంగా క్షోభకు గురయ్యింది. అంతర్మధనానంతరం ఆమె బుద్ధ భగవానుని బోధనలలోని పరమార్దాన్ని, విశ్వ కళ్యాణాన్ని అవగతం చేసుకొంది. తాను కూడా ధర్మదీక్ష తీసుకొంది. భిక్షుకి, భక్షుకుడు అయిన భార్యాభర్తలిద్దదరూ మానవసేవ చేసుకొంటూ ఒకమారు ఒకవెలివాడలో కలుసుకొంటారు. అక్కడికి వచ్చిన బుద్ధ భగవానుని ఆదేశం ప్రకారం మరణించిన పేదరాలి బిడ్డలకు సంరక్షకులౌతారు. వ్యక్తినిష్ఠమైన ప్రేమ విశ్వవ్యాప్తమై కళ్యాణకారి అవుతుంది. ఇది ఆంధ్ర సౌందరనందం కథ. సంస్కృత సౌందరనందం కథకంటె తెలుగు కథ వేరుగా ఉంటుంది.మొదటి నాలుగు సర్గలలోని కథా సన్నివేశాలకు మాత్రమే సంస్కృత కావ్యం కథకు సంబంధం ఉంది. మిగిలిన ఐదు సర్గలు లక్ష్మీకాంత వెంకటేశ్వర కవుల కావ్యకళావైదుష్యమునకు, ప్రతిభకు ప్రబలోదాహరణంగా నిలిచాయి.[1]


ఈ కావ్యంలో పునరాగమనం, భిక్షాగమనం, పరివ్రాజం, నిరీక్షణం, అనుతాపం, ఉపదేశం, ధర్మసంవాదం, అనుజ్ఞ, సహధర్మచర్యం అని తొమ్మిది సర్గలున్నాయి.

  1. పునరాగమనంలో గౌతముడు కపిలవస్తు పురానికి విచ్చేయడం, సమస్త ప్రజలకూ ధర్మబోధ చేయడం, అనే అంశాలూ
  2. భిక్షాగమనం అనే సర్గలో గౌతముని సవతి తమ్ముడైన నందుడు, అతడి భార్య సుందరీ, వాళ్ళిద్దరి పరస్పరానురాగం, వారు సరససల్లాపాలతో మునిగితేలుతున్న తరుణంలో బుద్ధుడు భిక్షకు రావడం, "భిక్షాం దేహి" అనడం, బదులులేక పోవడంవల్ల ఉత్తచేతుల్తో తిరిగివెళ్ళిపోవడం, ఈ విషయం వృద్ధపరిచారిక నందుడికి చెప్పడం, నందుడు అన్నను తీసుకొని రావడానికి సుందరి అనుమతితో వెళ్ళడం అనే అంశాలూ ఉన్నాయి.
  3. పరివ్రాజం అనే సర్గలో నందుడు భిక్షార్థం రమ్మని బుద్ధుడిని ప్రార్థిస్తాడు. కాని నాటికి భిక్షాన్నము నొల్లనని బుద్ధుడు తెలుపుతాడు. గృహోన్ముఖుడు కాదలచిన నందున్ని బుద్ధుడు చూపుతో నిలిపి, అతడి చేతికి భిక్షపాత్ర నందించి వెంట విహారానికి తీసుకొనిపోయి, ధర్మబోధ చేసి దీక్ష ఇప్పిస్తాడు.
  4. నిరీక్షణంలో నందుడి కోసం సుందరి ఎంతగానో ఎదురుచూస్తుంది. చివరికి నిజం తెలుసుకుంటుంది.
  5. దీక్ష పొందిన నందుడి అనుతాపం ఐదో సర్గ.
  6. నందుడికి జీవకారుణ్యం, విశ్వప్రేమను తెలియజెప్పేది ఉపదేశం.
  7. బుద్ధనందుల లౌకికాలౌకిక చర్చ ధర్మసంవాదం.
  8. అనుజ్ఞలో సుందరి క్రమక్రమంగా ధర్మదీక్ష వైపు మొగ్గుచూపడం, బుద్ధుడి అనుజ్ఞతో భిక్షుకుడు సుందరికి ధర్మదీక్ష ఇవ్వడమనే సన్నివేశాలున్నాయి.
  9. వెలివాడ గుడిసెలో మృత్యుశయ్యపై ఉన్నఒక మాతృమూర్తి దగ్గర సుందరీనందులు కలవడం, అక్కడికే తథాగతుడు రావడం, ఆ పేదస్త్రీ పిల్లలిద్దరినీ సుందరీ నందుల కిచ్చి, సేవాప్రబోధం చేయడం, సహధర్మచర్యం.


బుద్ధుడు నందుడి జీవితంలో ప్రవేశించేవరకూ నందుడు కేవలం తన సుఖసౌఖ్యాలను మాత్రమే చూసుకొన్న వ్యక్తి. బుద్ధుడొచ్చి విశ్వదైన్యాన్ని అతడి కళ్ళ ముందుంచుతాడు. ఈ విశ్వదైన్యాన్నిచూసిన రాతికైనా గుండెలవిసిపోతాయనీ, కళ్ళనీళ్ళు పెట్టడానికి వెయ్యి కళ్ళయినా చాలవంటాడు. పాపకూప విపన్నాత్ములను ఉద్ధరించడానికీ, లక్షల భుజాలవసరమనీ, సజ్జనుడవై విశ్వదైన్యాన్నితీర్చడానికి సన్నద్ధుడవు కమ్మనీ బోధిస్తాడు. ప్రాపంచిక సుఖాలపై మక్కువ తీరక, చెలి బాహు పరిష్వంగ మాధుర్యాన్నితలచుకొంటూ, బౌద్ధ విహారంలో చిక్కుకున్నందుకు విచారిస్తున్న నందుడితో స్వసుఖం సుఖం కాదంటాడు. సర్వజన సుఖాపేక్ష కావాలంటాడు. ప్రాపంచిక సుఖాలు శాశ్వతాలు కావంటాడు. సత్యమొక్కటే నిలిచి వెలుగుతుందంటాడు. భార్యపట్ల ప్రేమ నిజమైన ప్రేమ కాదంటాడు. విశ్వప్రేమను నెలకొల్పమంటాడు. ఈ విధంగా పింగళి, కాటూరి కవులు తమ కావ్యంలో బుద్ధుడి ఉపదేశాల రూపంలో విశ్వప్రేమను చాటారని చెప్పవచ్చు. ఈ విధంగా సౌందరనందం బౌద్ధ జాతి పరమార్థమే ప్రధానాశయంగా, సత్యం, ధర్మం, అహింస, విశ్వశ్రేయస్సు ప్రచారమే పరమలక్ష్యంగా తెలుగు సాహిత్యంలో అమూల్యమైన స్థానం సంపాదించుకొంది.


సౌందర నందములో ప్రధాన పాత్రలు మూడే - బుద్ధ భగవానుడు, నందుడు, సుందరి. జ్ఞానబోధ చేసిన బుద్ధుని ప్రశంసతో కావ్యం మొదలవుతుంది. బుద్ధుని జయకారంతో ముగుస్తుంది. ఇందులో బుద్ధభగవానుని మూడు బోధనలి నిక్షిప్తం చేయబడ్డాయి - ఒకటి కపిలవస్తు పురంలో సామాన్య ప్రజానీకాన్ని ఉద్దేశించి చేసిన బోధలో సత్యం, దయ, శీలం, సమత్వం, అస్తేయం, అహింస, బ్రహ్మచర్యం వంటి విషయాలున్నాయి. తక్కిన రెండు బోధనలూ నందుని ఉద్దేశించినవి. ఒక బోధలో నియతమైన మృత్యువును గూర్చీ, అశాశ్వతమైన సౌందర్యాన్ని గూర్చీ నందునికి తెలియజేస్తాడు. మరొక బోధలో బౌద్ధ మతానికి, సమాజానికీ ఉన్న గాఢమైన సంబంధం కనిపిస్తుంది.

సాహితీ విశేషాలు, ప్రశంసలు

[మార్చు]

"బంధువు లేక మానసులు బాల్య సఖుల్ సహపాఠులున్ సమస్కంధులు పింగళాన్వయుడు కాంతుడు, కాటూరి వెంకటేశుడున్ సుందర నందరాగ పరిశోభిత వృత్తము రమ్య తత్వమీ సౌందరనంద సత్కృతిని సల్పిరి దేశికుడిచ్చమెచ్చగన్" - అని కావ్యం చివర శిల్పాక్షరం మాదిరిగా పద్యం ఉంది. ప్రాచీనాంధ్ర కవిత్వానికి భరత వాక్యమూ, నవీనాంధ్ర కవిత్వానికి నాందీవాక్యమూ పలికిన తిరుపతి వెంకటకవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి షష్టిపూర్తి సందర్భంగా ఆయనకు ఈ జంటకవులు (పింగళి కాటూరి కవులు) గురుదక్షిణగా ఈ సౌందరనందనాన్ని సమర్పించారు.


ఉన్నవ లక్ష్మీనారాయణ ఇలా అన్నాడు - "యన్మహా త్యాగ మహిమమ్మునాలకించి మూడు కాలముల్ రోమాంచమును వహించు" అంటూ ప్రారంభమైన సౌందరనందనం వంటి కావ్యం వేయి సంవత్సరాలకు వెనుక పుట్టలేదు. ఇక వేయి సంవత్సరాలకు ముందు పుట్టబోదు.


సంస్కృత మూలానికి, తెలుగు కావ్యానికి ఉన్న భేదాల గురించి రచయితలు "విజ్ఞప్తి"లో ఇలా వ్రాశారు - "సంస్కృతమున అశ్వఘోషుని కావ్యమునకు, మా గ్రంధమునకు ఈషత్తు పోలిక గలదు. కాని ఇంకెందును సాదృశ్యము లేదు. ఇది దానికి అనువాదము కాని, అనుసరణ కాని కాదు. అశ్వఘోషుని పద్యములకు ఛాయలని చెప్పు 5, 6 పద్యములు మాత్రము మొదటి రెండు సర్గలలోనున్నవి. గ్రంధనామము ఇంపుగ ఉండుటచే అదియే గైకొంటిమి"

సంస్కృత సౌందరనందనం 18 సర్గల మహాకావ్యం. మోక్షార్ధగర్భమయిన కృతి అని అశ్వఘోషుడే అన్నాడు. అది ప్రధానంగా ఉపదేశప్రధానమైన, బౌద్ధమత ప్రచార గాథ. అందులో సుందరి పాత్ర మసక మసకగా కనుపిస్తుంది. కాని తెలుగులో దీనిని పింగళి కాటూరి కవులు కళాప్రధానమైన రసత్కావ్యంగా రూపొందించారు. ఆంధ్ర సౌందరనందనంలో సుందరి సజీవపాత్రగా తళతళలాడుతూ దర్శనమిస్తుంది. ఆధునిక కాలంలో వచ్చిన సౌందరనందనంలో బౌద్ధమతోపదేశాలతోపాటు గాంధేయవాద ముద్ర పడింది. .. ఆంధ్ర సౌందరనందనంలో నాటక లక్షణం ఎక్కువ. దీనిలోని తొమ్మిది సర్గలూ తొమ్మిది రంగాలు. ఈ రంగాల్లోని ప్రధాన పాత్రల మనస్తత్వాలకు అనుగుణమయిన వాచికాభినయం, దానికి తగిన ఆంగికాభినయం, దానికి వన్నె పెట్టే సాత్వికాభినయం పాఠకుల మనశ్చక్షువులకు గోచరమై రసానుభూతిని కలిగిస్తాయి.[1]

ఉదాహరణ పద్యాలు

[మార్చు]

తామిద్దరూ కలిసి కావ్యాన్ని ఎలా రూపొందించారో రచయితలు ఇలా చెప్పుకొన్నారు

భావమొక్కఁడు గాఁగ భావన యొక్కఁడై
రసభావ పరిణతి యొసగఁ జేసి
సరసార్ధమొక్కఁడుగా శబ్దమింకొక్కఁడయి
శబ్దార్ధ సామరస్యము ఘటించి
సూత్రమొక్కఁడు గాఁగ చిత్రణమొక్కఁడు
ప్రాణవత్పాత్రముల్ పాదుకొల్పి
తెరయెత్తు టొక్కఁడుగా తెరదించు టొఁక్కడై
రంగనిర్వహణమ్ము రక్తినిల్పి

సుందరీనంద జీవితానందమట్లు
పరమమగు కోటి కెక్కిన బంధుభావ
మిత్ర భావము లిమ్మెయి మేళగించి
సృష్టి చేసితిమీ కావ్య శిల్పమూర్తి

బుద్ధుని బోధ

తానొక గడ్డ కట్టుకొని, తత్పరతన్ శిలలై నశించు
జ్ఞానుల కేడనోయి సుఖసంతతి, తాఁదనయాలు నాత్మ సం
తానము తోడబుట్టువులు, తల్లియుఁదండ్రి కులమ్ము దేశమున్
మానవులెల్ల ప్రాజులు కుమార! సమస్తము తాను గానలెన్

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "నాగళ్ళ గురుప్రసాదరావు" రేడియో ఉపన్యాసం - "శత వసంత సాహితీ మంజీరాలు" అనే పుస్తకంలో ఇవ్వబడింది - ప్రచురణ : ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ సంఘం, సర్వోత్తమ భవనం, విజయవాడ (2002) .

వనరులు

[మార్చు]
  • "తెలుగు" వైజ్ఞానిక త్రైమాసిక పత్రిక, ఏప్రిల్-2006 జూన్, తెలుగు అకాడమి, హైదరాబాదు; పింగళి, కాటూరి సౌందరనందం-పరామర్శ; రచయిత-డా.ఎ.వి.పద్మాకరరెడ్డి.