ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ 2021-2023 రెండవ ఎడిషన్, 2023 జూన్ 7 నుండి 11 వరకు ఆస్ట్రేలియా & భారత్ మధ్య ది ఓవల్, లండన్, ఇంగ్లాండ్ లో జరిగింది.[1][2][3]
మొదటి రోజు : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (43; 8 ఫోర్లు), మార్నస్ లబుషేన్ (26), ఉస్మాన్ ఖవాజా (0) డకౌటయ్యాడు. భారత బౌలర్లలో షమీ, సిరాజ్, శార్దూల్ తలా ఒక వికెట్ పడగొట్టారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ట్రావిస్ హెడ్ (156 బంతుల్లో 146 బ్యాటింగ్; 22 ఫోర్లు, ఒక సిక్సర్), స్టీవ్ స్మిత్ (227 బంతుల్లో 95 బ్యాటింగ్; 14 ఫోర్లు) క్రీజ్ లో ఉన్నారు. టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో మొదటి సెంచరీ నమోదు చేసిన తొలి ఆటగాడిగా ట్రావిస్ హెడ్ రికార్డు సృష్టించాడు.[7][8]
రెండో రోజు: ఆస్ట్రేలియా 469 పరుగుల స్కోరుకు ఆలౌటయ్యింది. మహ్మద్ సిరాజ్ 4 వికెట్లు, మహ్మద్ షమీ, థాకూర్ చెరో 2 వికెట్లు, రవీంద్ర జడేజా 1 తీయగా, మరో వికెట్ రనౌట్ రూపంలో ఔటయ్యారు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సరికి తొలి ఇన్నింగ్స్‌లో 38 ఓవర్లలో 151/5 స్కోరుతో నిలిచింది. రోహిత్ (15), గిల్ (13), పుజార (14), కోహ్లీ (14), జడేజా (48) ఔటవ్వగా, క్రీజులో రహానె (29 బ్యాటింగ్), భరత్ (5 బ్యాటింగ్) ఉన్నారు.[9]
మూడో రోజు : భారత తొలి ఇన్నింగ్స్ 69.4 ఓవర్లలో 296 పరుగులకు ఆలౌట్ అయింది. రహానే 129 బంతుల్లో 89 పరుగులు, శార్దూల్ ఠాకూర్ (51) చేయడంతో భారత జట్టు స్కోర్ 270 పరుగులు దాటడంతో ఫాలోఆన్ గండం తప్పించారు. అనంతరం భారత జట్టు తొలి ఇన్నింగ్స్ 69.4 ఓవర్ల వద్ద 296 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా హెడ్ 18, స్మిత్ 34, డేవిడ్ వార్నర్ 1, ఉస్మాన్ ఖవాజా 13 పరుగులు ఔటవ్వగా, లబుషేన్ 41, కామెరూన్ గ్రీన్ 7 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగుల ఆధిక్యంతో కలిపి 296 పరుగుల ఆధిక్యంలో ఉంది.[10]
నాల్గొవ రోజు : ఆస్ట్రేలియా 123/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టి 270/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. దీనితో ఆస్ట్రేలియా భారత్ ముందు 444 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత్ ఆట ముగిసే సమయానికి రెండో 40 ఓవర్లలో 164/3 పరుగులు చేసింది. గిల్ (18), పుజార (27), రోహిత్ (43) ఔటవ్వగా విరాట్ కోహ్లీ (44 బ్యాటింగ్), రహానె (20 బ్యాటింగ్) చేస్తూ క్రీజులో ఉన్నారు.[11][12]
ఐదో రోజు: చివరి రోజు తొలి సెషన్‌లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు వరుస వికెట్లను కోల్పోయి 234పరుగులకు ఆలౌటయ్యింది. దీనితో 209 పరుగుల తేడాతో భారత్ పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించి 2023 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ గెలిచింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్లలో లియాన్ 4, బోలాండ్ 3, స్టార్క్ 2, కమిన్స్ ఒక వికెట్ తీశారు.[13]