అబ్బూరి వరదరాజేశ్వరరావు
అబ్బూరి వరదరాజేశ్వరరావు | |
---|---|
జననం | అబ్బూరి వరదరాజేశ్వరరావు 1923 |
మరణం | 1993 ఏప్రిల్ 5 హైదరాబాదు | (వయసు 70)
మరణ కారణం | శ్వాసకోశ వ్యాధి |
ఇతర పేర్లు | వరద |
వృత్తి | రచయిత, ప్రజాసంబంధాల అధికారి, ఉపసంపాదకుడు, విజిటింగ్ ప్రొఫెసర్, ఆంధ్రప్రదేశ్ అధికార భాషాసంఘం అధ్యక్షుడు |
జీవిత భాగస్వామి | అబ్బూరి ఛాయాదేవి |
తల్లిదండ్రులు | అబ్బూరి రామకృష్ణారావు, రుక్మిణమ్మ |
అబ్బూరి వరదరాజేశ్వరరావు ప్రముఖ తెలుగు రచయిత. ఇతని తండ్రి అబ్బూరి రామకృష్ణారావు భావకవిగా సుప్రసిద్ధుడు. 1953లో ఇతని వివాహం అబ్బూరి ఛాయాదేవితో జరిగింది. ఆమె కూడా పేరుప్రఖ్యాతులు గడించిన రచయిత్రి.
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]అబ్బూరి వరదరాజేశ్వరరావు 1923లో రామకృష్ణారావు, రుక్మిణమ్మ దంపతులకు మద్రాసులో జన్మించాడు.[1] ఇతని స్వగ్రామం గుంటూరు జిల్లా, కొల్లిపర మండలానికి చెందిన జెముడుపాడు గ్రామం. ఇతని బాల్యం బందరు,బెజవాడ,విశాఖపట్నంలలో గడిచింది. స్థానాపతి సత్యనారాయణ శాస్త్రి వద్ద సంస్కృతము, తెలుగు అధ్యయనం చేశాడు. విశాఖపట్నం లోని సి.బి.ఎం.హైస్కూలులో ప్రాథమిక విద్యను అభ్యసించాడు.ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి చరిత్ర, రాజనీతిశాస్త్రం, ఆర్థికశాస్త్రాలలో ఎం.ఎ. పట్టాపొందాడు.
ఉద్యోగం
[మార్చు]ఇతడు ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రికలలోను, మద్రాస్(వార్)రివ్యూ అనే పత్రికలోను సబ్ ఎడిటర్‌గా పనిచేశాడు. మద్రాసు ప్రభుత్వంలో ఆహారశాఖలో ప్రజాసంబంధాల అధికారిగా పనిచేశాడు. ఆ తర్వాత హైదరాబాదు నిజాం ప్రభుత్వంలో సమాచారశాఖలో 1946-47లో పనిచేశాడు.తరువాత హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్‌లో పబ్లిసిటీ సెక్రెటరీగా ఉన్నాడు. 1949లో భారత్(బొంబాయి) పత్రికకు హైదరాబాదు విలేఖరిగా పనిచేశాడు. 1953లో బిర్లాబ్రదర్స్‌కు హైదరాబాదులో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌గా నియమించబడ్డాడు. కవిత పేరుతో ఒక పత్రికను 1954లో ప్రారంభించాడు. 1958లో న్యూయార్క్ టైమ్స్ పత్రికకు స్థానిక విలేఖరిగా నియమించబడ్డాడు. 1959లో ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐ.సి.సి.ఆర్) న్యూఢిల్లీలో ప్రచురణల అధికారిగా ఉద్యోగాన్ని చేపట్టి Cultural News From India అనే ద్వైమాస పత్రికను ప్రారంభించి దానికి సంపాదకత్వం వహించాడు. 1961లో ఎల్లైడ్ పబ్లిషర్స్ ప్రచురణల విభాగానికి ముఖ్య సంపాదకుడిగా చేరాడు. 1963లో అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీ తెలుగు విభాగానికి విజిటింగ్ ప్రొఫెసర్‌గా వెళ్లాడు. 1993లో ఆంధ్రప్రదేశ్ అధికారభాషాసంఘం అధ్యక్షుడిగా నియమితుడైనాడు.
మరణం
[మార్చు]అబ్బూరి వరదరాజేశ్వరరావు శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ నిజాం ఆసుపత్రి హైదరాబాదులో 1993, ఏప్రిల్ 5న మరణించాడు.
రచనలు
[మార్చు]- శారదాపరిణయము(నాటకం)
- తపోభంగం (నాటకం)
- వసంతసేన (నాటకం)
- నాయకురాలు (నాటకం)
- సంపెంగతోట (నాటకం - అనువాదం మూలం: ఆంటెన్ చెహోవ్) - శ్రీశ్రీ తో కలిసి
- ప్రతిమాసుందరి (నాటకం - అనువాదం మూలం: హెరాల్డ్ బిగ్ హౌస్)
- జోలపాట (నాటిక)
- ముక్తయాత్ర (నాటకం)
- ప్రథమ యుద్ధం (కథ)
- అందాక
- చెరకాలం
- కవన కుతూహలం
- వరద కాలం
- An Introduction to Public Relations
- Dalai Lama and India (సంపాదకత్వం)
- Iswara Dutt Sixtieth Birthday (ఎం.వి.రమణారావుతో కలిసి)
- Modern Indian Poetry[2]
- కవితా సంచిక[3] (సంకలనం: ప్రభాకర్ పరకాల)
- నాట్యగోష్ఠి: నాలుగు నాటకాలు
- వరద స్మృతి[1] (సంపాదకులు: అబ్బూరి ఛాయాదేవి, శీలా వీర్రాజు, కుందుర్తి సత్యమూర్తి)
- ఫన్‌డిట్ వరదోక్తులు (సంకలనం: అబ్బూరి ఛాయాదేవి)
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 అబ్బూరి ఛాయాదేవి, శీలా వీర్రాజు, కుందుర్తి సత్యమూర్తి (1994-05-03). వరదస్మృతి. హైదరాబాదు: అబ్బూరి ట్రస్ట్.
- ↑ A. V. Rajeswara Rau (1958). Modern Indian Poetry: An Anthology (1 ed.). న్యూఢిల్లీ: కవిత.
- ↑ ప్రభాకర్ పరకాల (1993). అబ్బూరి వరదరాజేశ్వరరావు కవితా సంచిక. హైదరాబాదు: విశాలా గ్రంథశాల.