Jump to content

ఇక్ష్వాకు వంశం

వికీపీడియా నుండి
(ఇక్ష్వాకు వంశము నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం రామాయణం లో చెప్పబడిన శ్రీరాముని వంశాన్ని గురించినది.
పట్టాభిషిక్తులైన సీతారాములు - ఇతర దేవతలు, పరివారం సమేతంగా
పట్టాభిషిక్తులైన సీతారాములు - ఇతర దేవతలు, పరివారం సమేతంగా

ఇక్ష్వాకు వంశం లేదా సూర్య వంశం, ఈ వంశీకులు భారతదేశాన్ని ఏలిన పౌరాణిక రాజవంశం. సూర్య వంశం గురించి పురాణాల లో అనేక మార్లు చెప్పబడింది. సూర్యవంశీయుల కులగురువు వశిష్ట మహర్షి. వీరివంశ క్రమములో హరిశ్చంద్రుడు, దిలీపుడు, రఘువు, దశరథుడు, శ్రీరాముడు ఇతర చెప్పుకోదగిన చక్రవర్తులు. వీరి రాజధాని అయోధ్య.

ఈ వంశానికి ఆదిపురుషుడు వివస్వంతుడు. రెండవ వాడు వైవస్వత మనువు, మూడవ వాడు ఇక్ష్వాకుడు. ఈయన పేరు మీదుగానే వంశానికి ఇక్ష్వాకు వంశమని పేరు వచ్చింది. వైవస్వత మనువుకి ఇక్ష్వాకుడు కాకుండా నాభాగుడు, దృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, ప్రాంశుడు, నృగుడు, దిష్టుడు, కరూషుడు, వృషధ్రుడు అనే తొమ్మిది మంది కుమారులు ఉన్నారు.

ఇక్ష్వాకుడికి నూరుగురు కుమారులు. వారిలో ఒకడు వికుక్షి. నాభాగుని కుమారుడు అంబరీషుడు. శర్యాతి కూతురు సుకన్య చ్యవన మహర్షి భార్య.

వికుక్షికి వశిష్ట మహర్షి అనుగ్రహముచే రాజ్యాధికారము లభించింది. అతని కుమారుడైన అయోధునకు కకుస్థుడు జన్మించాడు. ఈతడు తన కుమారులలో జ్యేష్ఠుడైన కువలాశ్వునికి రాజ్యాభిషేకము చేస్తాడు. కువలాశ్వుని పుత్రులలో దృడాశ్వునికి హర్యశ్వుడు, ఇతని మనుమడు సంహతాశ్వునికి ఇరువురు పుత్రులునూ మరియొక పుత్రిక హైమవతి జన్మించారు. హైమవతికి ప్రసేనజిత్తుడను కుమారుడు కలిగెను. ఇతని మనుమడే మాంధాత. ఈతనికి పురుకుత్సుడు, ముచికుందుడను పుత్రులు జన్మించారు.

పురుకుత్సునికి త్రయ్యారుణి యను పుత్రుడును, ఈతనికి సత్యవ్రతుడను పుత్రుడును కలిగారు. వీరిలో సత్యవ్రతుడు పరాక్రమవంతుడై రాజ్యాధికారము చేపట్టెను. ఈ సత్యవ్రతుడే తండ్రిమాట పాటించక జీవులను హింసించడం, గోవధజేయుట, గోమాంసమును భక్షించుట యను మూడు పాపములు సలిపి త్రిశంకుడు అని నామధేయము గలిగి, వశిష్ట మహర్షిచేత శాపగ్రస్తుడౌతాడు. విశ్వామిత్రుడు తన తపోబలము చేత త్రిశంకునికోసం స్వర్గమును సృష్టిస్తాడు. ఇదియే త్రిశంకు స్వర్గం.

త్రిశంకుడనే సత్యవ్రతుని పుత్రుడే హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు జీవిత పర్యంతము సత్యవ్రత దీక్షను పాటించి, శివానుగ్రహ భాగ్యము పొంది 'సత్య హరిశ్చంద్రుడ'ని కీర్తి పొందినాడు. ఈతని కుమారుడు లోహితుడు. ఈతని మనుమడు బాహువు.

బాహువు కుమారుడు సగరుడు. ఇతడు సామ్రాజ్యాధికారియై లోకమున మరల ధర్మమును నెలకొల్పి సగర చక్రవర్తియని కీర్తిగాంచాడు. సగరునికి ఇద్దరు భార్యలున్నారు. వీరిలో పెద్దభార్య అరువది ఆరు వేలమంది కుమారులను పొందగా, చిన్నభార్య వంశోధ్ధారకుడగు నొక పుత్రుని ప్రసాదించమని ఔర్య మహామునిని కోరుకున్నది. సగరుడు అశ్వమేధ యాగం సంకల్పించి, యాగాశ్వము వెంట అరువదియారు వేలమంది కుమారులను పంపినాడు. వారు యాగాశ్వమును వెదుకుతూ పాతాళ లోకము చేరి కపిలముని కోపాగ్నికి భస్మమైనారు. వీరు పాతాళమునకు చేరుటకు భూమిని తవ్వినందున సముద్రము యేర్పడి సగరుని పేరిట 'సాగరము'గా ప్రసిద్ధి చెందినది. వీరి తరువాత పంచజనుడు చక్రవర్తి అవుతాడు. ఈతని కుమారుడు దిలీపుడు.

దిలీపునికి జన్మించినవాడు భగీరధుడు. భగీరధుడు పితృదేవతలకు సద్గతులను ప్రసాదించుటకు ఘోర తపస్సు ఆచరించి, గంగాభవాని ని, శివుని సహాయంతో భువికి తెప్పించెను. భగీరధుని ముని మనుమడు అంబరీషుడు.

అంబరీషుని ముని మనుమడే రఘువు. ఈతని పేరిటనే 'రఘు వంశము' యేర్పడినది. రఘువు కుమారుడు అజుడు. అజమహారాజు కుమారులు సురభుడు, దశరథుడు. ఈతడు అయోధ్య రాజధానిగా చేసుకొని చిరకాలము పాలించెను. ఈతడు పుత్రకామేష్టి యాగము జరుపగా శ్రీవిష్ణువు శ్రీరాముడుగా అవతరించి, రావణ కుంభకర్ణులను సంహరించాడు. శ్రీరాముని కుమారులు కుశుడు , లవుడు . కుశుడు ద్వారా రఘువంశము అంతరించింది

మూలాలు

[మార్చు]