కథానిలయం
స్థాపితము | 1997-02-22 |
---|---|
ప్రదేశము | శ్రీకాకుళం |
గ్రంధ సంగ్రహం / సేకరణ | |
సేకరించిన అంశాలు | కథలు, పత్రికలు |
గ్రంధాల సంఖ్య | కథల సంపుటాలు:2000 కథా రచన గురించిన ఇతరపుస్తకాలు : 2000 |
వెబ్‌సైటు | http://kathanilayam.com |
కథా నిలయం, తెలుగు కథల సేకరణకు అంకితమైన ఒక గ్రంథాలయం.[1] ప్రఖ్యాత కథకుడు కాళీపట్నం రామారావు తనకి పురస్కారాల ద్వారా వచ్చిన మొత్తాన్ని అంతటినీ శ్రీకాకుళంలో 1997 ఫిబ్రవరి 22 న ఈ గ్రంథాలయాన్ని స్థాపించేరు. తరువాత స్నేహితులు, దాతలు విరాళాలు ఇచ్చేరు. తెలుగులో రాయబడ్డ ప్రతి కథనీ ఈ గ్రంథాలయంలో భద్రపరచాలని స్థాపకుల ఆకాంక్ష.
తెలుగు సాహిత్యంలో ప్రచురించబడిన కథలను భావి తరాలవారికి పొందుపరచాలన్న బృహత్తర ఆశయంతో కాళీపట్నం రామారావు కథానిలయాన్ని స్థాపించాడు. తెలుగు కథకు ఇటువంటి సంప్రదింపు గ్రంథాలయం (reference library) ఏర్పరచడం కోసం కృషి జరగడం ఇదే ప్రథమమని గూటాల కృష్ణమూర్తి అన్నాడు
1997లో ఆరంభమైన ఈ "కథా నిలయం"లో (2000నాటికి) 4,000 పైగా వారపత్రికలు, మాస పత్రికలు, విశేష పత్రికలు ఉన్నాయి. యువ, జ్యోతి, జాగృతి, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర పత్రిక, భారతి, జయంతి, సంవేదన, అభ్యుదయ వంటి అనేక పత్రికల అమూల్యమైన సేకరణ ఇది. 1944 నుండి భారతి పత్రిక ప్రతులు ఇక్కడ సేకరించారు. అంతకు పూర్వపు ప్రతులను కూడా సేకరించే ప్రయత్నం జరుగుతుంది.
ఇంకా కథానిలయంలో 2,000 పైగా కథల సంపుటాలు, కథా రచనల గురించిన మరో రెండు వేల పుస్తకాలు ఉన్నాయి. 1910లో ప్రచురించిన అక్కిరాజు ఉమాకాంతం రచన త్రిలింగ కథలు ఇక్కడి సేకరణలలో అన్నింటికంటే పాతది. తెలుగు రచనలలో క్రొత్త పుంతలకు దారి తీసినవని భావించే యద్దనపూడి సులోచనారాణి, యండమూరి వీరేంద్రనాధ్ వంటి రచయితల నవలలు కూడా కొన్ని ఈ సేకరణలో ఉన్నాయి.
తెలుగులో షుమారు 3,000 మంది కథా రచయితలు ఉండవచ్చునని, కాని వారిలో 600 మంది రచనలే తమ సేకరణలోకి తేగలిగామని కా.రా. అన్నాడు. కొద్దిపాటి కథలు వ్రాసిన రచయితలు తమ రచనలు అంత ప్రముఖమైనవి కాకపోవచ్చునని భావించి, తమ రచనలు పంపరు. అయితే ప్రతి కథా ఏదో ఒక దృక్పథాన్ని లేదా సమాజ స్థితిని లేదా ఘటనలను వెలికి తీస్తుందని "కారా" భావన.2014లో కథానిలయం.కాం వెబ్ సైటుని సృష్టించి, వారు సేకరించిన కథలను స్కాన్ చేసి పాఠకులకు అందిస్తున్నారు.
మూలాలు
[మార్చు]- ↑ K. V., Kurmanath (15 April 2016). "Touchstone to Telugu Tales". thehindubusinessline.com. The Hindu. Retrieved 21 June 2018.