Jump to content

కుల్చారం

వికీపీడియా నుండి

కుల్చారం, తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా, కుల్చారం మండలానికి చెందిన గ్రామం.[1]

కుల్చారం
—  రెవెన్యూ గ్రామం  —
కుల్చారం is located in తెలంగాణ
కుల్చారం
కుల్చారం
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
రాష్ట్రం తెలంగాణ
జిల్లా   మెదక్
మండలం కుల్చారం
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,717
 - పురుషుల సంఖ్య 2,297
 -   స్త్రీల సంఖ్య 2,420
 - గృహాల సంఖ్య 1,106
పిన్ కోడ్ 502381
ఎస్.టి.డి కోడ్

ఇది సమీప పట్టణమైన మెదక్ నుండి 14 కి. మీ. దూరంలో ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మెదక్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[2]

గ్రామ జనాభా

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1106 ఇళ్లతో, 4717 జనాభాతో 1811 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2297, ఆడవారి సంఖ్య 2420. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 543 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 127. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 573188[3].పిన్ కోడ్: 502381.

గ్రామ చరిత్ర

[మార్చు]

కుల్చారం:కొల్చారం ‘కొలచెల/కోలాచల మల్లినాథసూరి’ జన్మస్థలం. మల్లినాథుడు సంస్కృత పంచకావ్యాలకు (రఘువంశం, కుమారసంభవం, మేఘసందేశం-కాళిదాసురచనలు, కిరాతార్జునీయం-భారవిరచన, శిశుపాలవధ-మాఘునిరచన) సంజీవనీ, ఘంటాపథ, సర్వంకష వ్యాఖ్యలు రాసిన మహాపండితుడు. భారతదేశంలోనే మల్లినాథుని వంటి ప్రజ్ఞావంతుడు మరొకరు లేరని చెప్పవచ్చు.మొత్తం 15 సంస్కృత గ్రంథాలకు వ్యాఖ్యలు రాసినవాడు,19 శాస్త్ర్రాల పరిణత కలవాడు,5 స్వీయరచనలు చేసినవాడు, పండితవంశంలో పుట్టినవాడు, తెలంగాణాలో ఇంతటి సంస్కృతభాషాకోవిదుడు మరొకరు మనకు కనిపించడు.

వారిల్లే తరతరాలుగా గొప్ప సంస్కృత విద్యాకేంద్రం. మల్లినాథుడు చిన్నపుడు విద్యాగంధం అబ్బక వూరికి దక్షిణాన వున్న తిరుమలకుచ్చకు పసులను తోలుకుని పోయి కాసేవాడట.ఆ గుట్టగుహలో తపస్సు చేసుకుంటున్న ఒక సిద్ధయోగికి ఆవుపాలు పోసి, ఆహారమిచ్చి సేవలు చేసాడట.దానికి మెచ్చి ఆ యోగి మల్లినాథునికి సారస్వత మంత్రోపదేశం చేసినందువల్లనే మల్లినాథుడు విద్యావంతుడై కాశీలో చదివి యోగ్యుడై తిరిగి గ్రామం చేరి, అప్పటిదాకా ఎవరికి అర్థం కాని కాళిదాసు కావ్యాలకు వ్యాఖ్యలు రాసినాడట.పితామహుడు మల్లినాథుడు శతావధాని.కాకతీయ ప్రతాపరుద్ర చక్రవర్తిచే కనకాభిషేక గౌరవం పొందినాడట. తండ్రి కపర్థిస్వామి ‘ఆపస్తంబ శ్రౌతకల్ప గృహ్యసూత్రాల’కు భాష్యం రాసినవాడు.తాను సంస్కృతం నేర్పే విద్యార్థుల కోసం సంస్కృత పంచకావ్యాలకు వ్యాఖ్యలు రాసినవాడు మల్లినాథ‘సూరి’. ఇతనికి 3 కుమారులు.మొదటివాడు పెద్దయార్యుడు (పెద్దిభట్టు), రెండవ కుమారుడు కుమారస్వామి (సోమపీథి) ప్రతాపరుద్రీయానికి రత్నాపణ వ్యాఖ్య రాసి సర్వజ్ఞసింగభూపాలుని చేత సత్కార మందిన వాడు.మూడవ కుమారుడు గిరినాథుడు నృసింహ విరచిత స్వరమనోజ్ఞమంజరికి వ్యాఖ్య రచించిన వాడు ఈ సంస్కృతపండితుల చేత వాసికెక్కిన గ్రామం కొల్చారం.ఈ వూరిచావడి పక్కన లభించిన శాసనం వల్ల జయంతిపురం రాజధానిగా ఏలుతున్న త్రిభువనమల్లదేవుని కాలంలో (సా.శ.1116 జూలై 24న) అతని దండనాథుడైన గుండనాయకుడు బ్రాహ్మణులైన మాధవ భట్టోపాధ్యాయునికి, కుమారస్వామిభట్టునికి మెదకులో కొంతభూమిని దానమిచ్చినట్లు తెలుస్తున్నది. (Inscriptions of A.P. Medak District-No.74, pg.no.159) ఇది నిస్సందేహంగా మల్లినాథసూరి వంశీయులకిచ్చినదే కావచ్చునని మా అభిప్రాయం. గ్రామంలో మల్లినాథుని వంశీయులు ఉన్నారు. కోలాచల కాశీనాథశర్మ గారింటిని చూసాం. ఆ ఇంటికెదురుగా మల్లినాథసూరి నివసించిన ఇంటిజాగ ఉంది.

కొల్చారంలో జైనపార్శ్వనాథుని విగ్రహం లభించిన ప్రదేశం పక్కన సుందరమైన వీరభద్రుని ఆలయం ఉంది. శిల్పం మనోజ్ఞంగా ఉంది.ఆలయద్వారానికి లలాటబింబంగా గజలక్ష్మి ఉంది. ఇది చాళుక్యుల సంప్రదాయమే. ప్రధానాలయానికి ఇరువైపుల ఉపాలయాలున్నాయి.అందులో విగ్రహాలు మారినట్లున్నాయి.ఎన్నో వీరగల్లులు వీరభద్రుని గుడి చుట్టుముట్టే బయట పారేసివున్నాయి. దేవాలయ ద్వారబంధం, మూలవిరాట్టుపై నుండే మకరతోరణం, నాగ, నాగినీ శిల్పాలు, 4 అడుగుల ఎత్తున్న వినాయకుడు దేవాలయ ప్రాంగణం అవతల పడి ఉన్నాయి.జైన విగ్రహం దొరికిన చోట మట్టిలో విరిగిపడి వున్న ఆలయద్వారం లలాటబింబంగా గజలక్ష్మే వుండడం విశేషం. గజలక్ష్మిని జైనదేవతగానే చెపుతుంటారు జైనులు.దొరికిన (విఘ్ననాశక) పార్శ్వనాథుని విగ్రహం వూరిబయట రోడ్డుపక్కన కొత్తగా నిర్మించిన జైనాలయంలో ప్రతిష్ఠించారు.ఈ ప్రదేశాన్ని ‘యాపపురం’ అంటారు.ఈ గుడి దిగంబరజైనశాఖకు చెందిన యాపనీయులది.ఈ విగ్రహం తొమ్మిదిన్నర అడుగుల ఎత్తుంటుంది. నల్ల (సాన) రాతి శిల్పం. కాయోత్సర్గ భంగిమలో ఉంది.విగ్రహపాదపీఠంపై ‘శ్రీ చాళుక్యకులతిలకం తైలపరసర్’ అని ఉంది. కళ్యాణీ చాళుక్యుల మూలపురుషుడైన రెండవ తైలపుడు (సా.శ.973) నిలిపిన జైనదేవాయలయంలోనిదే పార్శ్వనాథుని విగ్రహం. (Inscriptions of A.P. Medak District-No.10, pg.no.17) ఆ ఆలయప్రాంగణంతలోనే గ్రామస్థులు చెక్కించి సిద్ధపరిచిన ‘మల్లినాథసూరి’ విగ్రహం ప్రతిష్ఠకై నిరీక్షిస్తున్నది. కొల్చారం గ్రామం చుట్టు ఒకప్పుడుండిన మట్టికోటగోడల దిబ్బలిప్పటికి అగుపిస్తున్నాయి.నాలుగు దిక్కుల్లో నాలుగు గైన్లు (గవనులు, కోటద్వారాలు), కోటచుట్టు కందకం వున్న ఆనవాళ్ళున్నాయి.కోట బయటపెరిగిన ఇప్పటి గ్రామాన్ని ప్రజలు అవతలికోట అని పిలుస్తున్నారు.అవతలికోట ద్వారానికి ఇరువైపుల రెండు అమ్మదేవతల గుళ్ళున్నాయి.ఉత్తరదిశలో వున్న గుడిలోని అమ్మదేవత గుహ్య యోగాసనముద్రలో ఉంది.కిరీటధారి, చతుర్భుజియైన దేవత నాలుగుచేతుల్లో ముందరి కుడిచేతిలో ఖడ్గం, వెనకచేతిలో.......ముందరి ఎడమచేతిలో గిన్నె, వెనక చేతిలో త్రిశూలంవున్నాయి. నడుముకు వడ్డాణం, మోకాళ్ళ వరకు అంగవస్త్రం, వక్షం అనాచ్ఛాదితంగా ఉంది.రాక్షసుని శిరస్సుపై మడిచిన ఎడమకాలివేళ్ళను మోపి నిలిచి, ఎడమకాలి మడిమపై కుడికాలివేళ్ళను మడిచి నిలిపి కుడికాలి మడిమను గుహ్యస్థానాన్ని తాకించి వుంచిన ఆసనస్థితిలో ఉంది.కాలికింద శిరస్సుకలిగిన ఈ దేవత కామాక్షి (కామాఖ్య) అవుతుందని కపిలవాయి లింగమూర్తిగారు చెప్పారు.అరుదైన శిల్పం.మరొక పక్క దక్షిణాన మరో అమ్మదేవతగుడి.అందులో పై అమ్మవారిలాంటి రూపమే. ఆసనస్థితిలో మార్పు.రెండుపాదాల వేళ్ళను మడిచి కూర్చున్న భంగిమ. కొల్చారానికి దక్షిణదిశలో తిరుమలాయకుచ్చ మీద వెంకటేశ్వరుని గుహాలయం ఉంది.గుడిలోని విగ్రహాలను దొంగలు దోచుకుపోతే కొత్త విగ్రహాలను ఆ స్థానంలో ప్రతిష్ఠించినారట.ఈ గుహాలయం సిద్దిపేట బయట చిన్నగుట్టపై వున్న రంగనాయకుని గుహాలయం వలెనె ఉంది. గుడి దిగువన కొలిచెలిమె అని పిలిచే కొలను అవశేషం ఉంది.మల్లినాథునికి మంత్రోపదేశం చేసిన ముని తపస్సుచేసిన చోటును గ్రామస్థులు చూపించారు. మల్లినాథుడు తపస్సు చేసిన చోట మరోచోట వుందట.

విద్యా సౌకర్యాలు

[మార్చు]
కుల్చారం మండలం కుల్చారం గ్రామంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల కళాశాల

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల మెదక్లో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల హైదరాబాదులోను, పాలీటెక్నిక్‌ మెదక్లోను, మేనేజిమెంటు కళాశాల నర్సాపూర్లోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల మెదక్లోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు హైదరాబాదులోనూ ఉన్నాయి.

తెలంగాణ బాలికల సోషల్ వెల్ఫేర్ పాఠశాల, కళాశాల, డిగ్రీ కళాశాల ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

కుల్చారంలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

కుల్చారంలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. రోజువారీ మార్కెట్ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది.

ఏటీఎమ్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో సినిమా హాలు ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

కుల్చారంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • అడవి: 812 హెక్టార్లు
  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 320 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 26 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 58 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 154 హెక్టార్లు
  • బంజరు భూమి: 296 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 143 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 233 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 360 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

కుల్చారంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 115 హెక్టార్లు* చెరువులు: 245 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

కుల్చారంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

మొక్కజొన్న, వరి, చెరకు

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 238  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మెదక్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కుల్చారం&oldid=4330193" నుండి వెలికితీశారు