తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల లోగో
ప్రక్రియతెలంగాణ జాతీయ సమైక్యతా దినం
తేదీ(లు)2022 సెప్టెంబరు 17
ప్రారంభం2022 సెప్టెంబరు 16, 17, 18
ముగింపు2023 సెప్టెంబరు 16, 17, 18
ప్రదేశంతెలంగాణ
దేశంభారతదేశం
పాల్గొనువారుతెలంగాణ ప్రజలు
నిర్వహణతెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు, అనేది రాచరిక వ్యవస్థ నుండి తెలంగాణ సమాజం ప్రజాస్వామిక వ్యవస్థలోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన అధికారిక కార్యక్రమం.[1] సెప్టెంబరు 17ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’గా పాటిస్తూ 2022 సెప్టెంబరు 16, 17, 18 తేదీలలో మూడురోజులపాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభ వేడుకలనూ, 2023 సెప్టెంబరు 16, 17, 18 తేదీలలో ముగింపు వేడుకలనూ ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.[2]

నేపథ్యం

[మార్చు]

హైదరాబాదు సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు 1946 నుంచి 1948 మధ్య వీరోచిత పోరాటం చేశారు. దాన్నే తెలంగాణ విమోచనోద్యమంగా పిలుస్తారు. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, నిజాం సంస్థానంలోని ప్రజలకు మాత్రం స్వాతంత్ర్యం లేకపోవడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. దాంతో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాయుధ పోరాటాలు, ప్రజా పోరాటాలు జరిగాయి. 1948లో ఉద్యమం ఉధృత రూపం దాల్చి చివరికి నిజాం సంస్థానంపై భారత ప్రభుత్వం జరిపిన సైనిక చర్య (ఆపరేషన్ పోలో)తో నిజాం నవాబు దిక్కుతోచని స్థితిలో 1948 సెప్టెంబరు 17న లేక్‌వ్యూ అతిథి గృహంలో బంధించిన భారత ఏజెంట్ మున్షీని కలిసి లొంగిపోతున్నట్లు ప్రకటించాడు.

రూపకల్పన

[మార్చు]

2022 సెప్టెంబరు 3న హైదరాబాదులోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. సెప్టెంబరు 17న తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని 2022 సెప్టెంబరు 16, 17, 18 తేదీలలో మూడురోజులపాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ కార్యక్రమాలను నిర్వహించాలని కేసీఆర్‌ ప్రతిపాదించగా, మంత్రివర్గం ఆమోదం తెలిపింది.[3]

కార్యక్రమాలు

[మార్చు]

ఇందులో భాగంగా తెలంగాణ స్ఫూర్తిని చాటేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. తెలంగాణ సచివాలయం, అసెంబ్లీతో సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను, ప్రధాన కూడళ్లను విద్యుత్తు దీపాలతో అలంకరించారు.[4]

  • తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా , కళాయాత్రలో పాల్గొన్న మామిడి హరికృష్ణ తదితరులు
    సెప్టెంబరు 16: రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గకేంద్రాల్లో తెలంగాణ సమైక్యతను చాటిచెప్పేలా 15,000 మంది విద్యార్థులు, యువతీ, యువకులు, మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించబడింది. ప్రతి జిల్లాకు 10,000 జాతీయ జెండాలు, 50 పెద్ద జెండాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం నిర్వహణ, పర్యవేక్షణకు నియోజవర్గానికి ఒక నోడల్‌ అధికారిని నియమించారు. ఆయా నియోజకవర్గాల్లో సంబంధిత జిల్లాల నుండి ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్ లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలలో పాల్గొన్నారు. ఆయా ప్రాంతాలలో నిర్వహించిన బహిరంగ సభలలో భారత యూనియన్ లో హైదరాబాద్ సంస్థానం కలయికకు దారితీసిన పరిస్థితులు, అనంతర కాలంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సంబంధిత ప్రజాప్రతినిధులు వివరించారు. అనందరం అధికారాలు ఏర్పాటుచేసిన సామూహిక భోజనాలలో ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.[5][6]
  • సెప్టెంబరు 17: భారత్‌ యూనియన్‌లో తెలంగాణ కలిసిన రోజైన సెప్టెంబరు 17న ఉదయం 10 గంటలకు ప్రగతిభవన్‌ నుంచి భయలుదేరిన ముఖ్యమంత్రి కేసీఆర్, గన్‌పార్క్‌ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించాడు. పబ్లిక్ గార్డెన్ లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం, జాతీయ జండాను ఎగరవేసి, వజ్రోత్సవ దినోత్సవ సందేశాన్ని అందించాడు.[7] జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో అధికారులు, కమిషనర్లు, చైర్మన్లు, సర్పంచ్‌లు జాతీయ జెండా ఎగురవేశారు.[8] బంజారాహిల్స్‌లో నూతనంగా నిర్మించిన కుమ్రంభీం ఆదివాసీ భవన్‌, సంత్‌ సేవాలాల్‌ బంజారా భవన్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించాడు.[9][10] మధ్యాహ్నం 1.00 గంటకు నక్లెస్ రోడ్డు నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు 5000 మంది కళాకారులచే 30 తెలంగాణ కళారూపాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో భారీ ఊరేగింపు జరిగింది. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన తెలంగాణ ఆదివాసి-బంజారాల ఆత్మీయ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించాడు. అనంతరం ఉట్నూరు ఐటీడీఏలో రాజ్‌ గోండు గుస్సాడీ నృత్య శిక్షకుడు పద్మశ్రీ కనకరాజు, భద్రాచలం ఐటీడీఏలో మ్యుజిక్‌ చీఫ్‌ రాం చంద్రు, ఆదివాసీ గోండు వీరుడు కుమ్రం భీం మనుమడు సోనెరావు, ఎవరెస్ట్‌ను అధిరోహించిన మాలవత్‌ పూర్ణ, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి మాడవి కరీనా, గిరిజన గురుకులాల్లో చదివి ప్రస్తుతం ఎంబీబీఎస్‌ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు గిరిజ, తరుణ్‌, ఎన్‌ఐటీల్లో ఇంజినీరింగ్‌ చేస్తున్న విశ్వనాథ్‌, హర్షద్‌, అంకూస్‌, భానుప్రకాశ్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాలువాలతో సత్కరించాడు.[11]
  • సెప్టెంబరు 18: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వజ్రోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా స్వాతంత్ర్య సమరయోధులు, కవులు, కళాకారులను సన్మానించారు.[12]

మూలాలు

[మార్చు]
  1. "Telangana News: సెప్టెంబరు 17 జాతీయ సమైక్యతా దినంగా పాటిస్తాం: కేబినెట్‌". EENADU. 2022-09-03. Archived from the original on 2022-09-03. Retrieved 2022-09-03.
  2. telugu, NT News (2022-09-03). "కేబినెట్ కీల‌క నిర్ణ‌యం.. సెప్టెంబ‌ర్ 17న‌ తెలంగాణ జాతీయ స‌మైక్య‌తా దినం." Namasthe Telangana. Archived from the original on 2022-09-03. Retrieved 2022-09-03.
  3. "TS News: ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు: క్యాబినెట్ నిర్ణయం". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-09-03. Archived from the original on 2022-09-03. Retrieved 2022-09-03.
  4. telugu, NT News (2022-09-16). "నేటి నుంచి తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాలు". Namasthe Telangana. Archived from the original on 2022-09-16. Retrieved 2022-09-16.
  5. "Telangana News: ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు". EENADU. 2022-09-16. Archived from the original on 2022-09-16. Retrieved 2022-09-16.
  6. telugu, NT News (2022-09-16). "Telangana | ఊరూరా ఎగిరిన జాతీయ జెండా..వెల్లివిరిసిన సమైక్యత స్ఫూర్తి". Namasthe Telangana. Archived from the original on 2022-09-16. Retrieved 2022-09-16.
  7. telugu, NT News (2022-09-17). "ఆనాటి వీర‌యోధులంద‌రికీ శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నా : సీఎం కేసీఆర్". Namasthe Telangana. Archived from the original on 2022-09-17. Retrieved 2022-09-17.
  8. "Telangana: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు". EENADU. Archived from the original on 2022-09-17. Retrieved 2022-09-17.
  9. telugu, NT News (2022-09-17). "ఆదివాసీ, బంజారా భవనాలు ప్రారంభించిన సీఎం కేసీఆర్‌". Namasthe Telangana. Archived from the original on 2022-09-17. Retrieved 2022-09-17.
  10. "ఆత్మగౌరవ భవనాలు అభివృద్ధికి వేదికలు". EENADU. 2022-09-18. Archived from the original on 2022-09-18. Retrieved 2022-09-18.
  11. telugu, NT News (2022-09-18). "సాంస్కృతిక జైత్రయాత్ర". Namasthe Telangana. Archived from the original on 2022-09-18. Retrieved 2022-09-18.
  12. "మూడోరోజు ఘనంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు". EENADU. 2022-09-19. Archived from the original on 2022-09-19. Retrieved 2022-09-19.