నాథ్ పాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాథ్ పాయ్
పార్లమెంట్ సభ్యుడు , లోక్ సభ
In office
1957–1971
నియోజకవర్గంrajapur
వ్యక్తిగత వివరాలు
జననం(1922-09-25)1922 సెప్టెంబరు 25
వెంగుర్ల,బొంబాయి రాష్ట్రం, భారత దేశం
మరణం1971 జనవరి 18(1971-01-18) (వయసు 48)
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీప్రజా సోషలిస్ట్ పార్టీ
జీవిత భాగస్వామిక్రిస్టి నాథ్ పాయ్
సంతానం2
తల్లితాపీ బాయ్
తండ్రిబాపు అనంత్ పాయ్
బంధువులు
వృత్తిన్యాయవాది
రాజకీయ నాయకుడు

బారిస్టర్ నాథ్ బాపు పాయ్ (1922 సెప్టంబరు 25 - 1971 జనవరి 18) ప్రముఖ పార్లిమెంటేరియన్, స్వాతంత్ర్య సమర యోధుడు, భారత దేశ సోషలిస్టు అగ్ర నాయకుడు, న్యాయవాది. కొంకణ ప్రాంత అభివృద్ధికి కీలకంగా కృషి చేశారు . గోవా విముక్తి ఉద్యమంలో కీలకమైన నాయకుడు.[3] మరాఠీ,ఉర్దూ, ఫ్రెంచ్, హిందీ, సంస్కృతం, ఇంగ్లీష్, జర్మనీ భాషలలో ప్రావీణ్యుడు,మంచి వక్త .[4]

ప్రారంభ జీవితం, విద్య[మార్చు]

నాథ్ పాయ్ పూర్వ బొంబాయి రాష్ట్రం (ప్రస్తుతం మహారాష్ట్ర) లోని కొంకణి ప్రాంతంలో ఉన్న రత్నగిరి జిల్లా లోని వెంగుర్ల అనే చిన్న గ్రామంలో 1922, సెప్టెంబరు 25న ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి ఉపాధ్యాయుడు, పోస్ట్ మాస్టరు, తల్లి గృహిణి. తన స్వగ్రామంలోనే ఉన్న తండ్రి చేత నడపబడుతున్న పాఠశాలలోనే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసి[1], బెల్గాం(ప్రస్తుతం కర్ణాటకలో ఉంది) లో హైస్కూల్, ఇంటర్ తర్వాత బెల్గాం లింగరాజ్ కళాశాలలో బి. ఏ (ఎకనామిక్స్ ) పూర్తి చేసిన వెంటనే లండన్ వెళ్ళి లింకన్స్ ఇన్ లో న్యాయ విద్య అభ్యసించి బారిస్టర్ పట్టా అందుకున్నాడు.[2]

రాజకీయ జీవితం[మార్చు]

నాథ్ పాయ్ చిన్నతనం లోనే స్వతంత్ర భావాలను కలిగి ఉండేవాడు . దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న మహాత్మా గాంధీ అంటే ఎంతో అభిమానం. చిన్నతనంలోనే గాంధీజీ సిద్దాంతల పట్ల ఆకర్షితుడైయ్యారు. 1942 వ సంవత్సరం గాంధీజీ నాయకత్వంలో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో బెల్గాంలో చదువుతున్న పాయ్ తన స్నేహితులతో కలిసి ఆ ఉద్యమంలో పాల్గొని 19 నెలలు జైలు శిక్షాను అనుభవించారు.[1]

1947 ఆగస్టు 15 వ తేదీన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నాథ్ పాయ్ ఉన్నత విద్యాభ్యాసం కోసం లండన్ వెళ్ళిన తర్వాత అక్కడి రాజకీయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ వచ్చారు .సామ్యవాద భావజాలం గల అధికార లాబర్ పార్టీ కార్యక్రమాలకు ఆకర్షితుడై పార్టీ లోని దిగ్గజ నాయకులైన అట్లీ, సోరెన్ సన్, ఫెన్నర్ వంటి వారితో పరిచయాలు ఏర్పడ్డాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై ఆయనకున్న పూర్తి విశ్వాసం కూడా ఈ సమయంలోనే బలపడింది.[4] అట్లీ నేతృత్వంలోని భారత్ ఆసియా సామ్యవాద యువజన సంస్థలో చేరి 1951 లో ఆ సంస్థ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్య సుదీర్ఘ కాలం పనిచేశారు. బ్రిటిష్ వలసవాదనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆఫ్ పీపుల్స్ ఫర్ కలోనియల్ ఫ్రీడం (లండన్) సంస్థలో కీలకమైన పాత్ర పోషించారు. [1]

లండన్ లోని భారతీయ విద్యార్థుల సంస్థ ఇండియా మజిలీస్ కు అధ్యక్షత వహించి పలు కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు.[1] లండన్ లో ఉన్న సమయంలోనే ప్రజా సోషలిస్టు పార్టీలో చేరారు. 1952 లో జరిగిన బొంబాయి అసెంబ్లీ ఎన్నికల కోసం లండన్ నుంచి వచ్చి బెల్గాం నగర అసెంబ్లీ నుంచి ప్రజా సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.[1] ఎన్నికల అనంతరం తిరిగి లండన్ వెళ్ళి బారిస్టర్ పట్టా అందుకున్నారు. లండన్ లో ఉన్న సమయంలోనే 1954 లో డెన్మార్క్ రాజధాని కోపెన్ హేగ్ నగరంలో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ సమావేశాల్లో వాటి అనుబంధ అంతర్జాతీయ సోషలిస్ట్ యూత్ విభాగానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.[1] ఆ సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికైన మొదటి ఆసియా సోషలిస్ట్ నాయకుడు పాయ్. రెండు సార్లు ఆ సంస్థ అధ్యక్షుడిగా పనిచేశారు. [3] ఈ సంస్థ అధ్యక్షుడిగా పలు యూరోప్ దేశాలలో పర్యటించి ఆయా దేశాలలో సామ్యవాద భావజాల బలోపేతానికి కృషి చేశారు.[1]

భారత దేశానికి తిరిగి వచ్చిన తర్వాత ప్రజా సోషలిస్ట్ పార్టీ కార్యకలపాలల్లో కీలకమైన పాత్ర పోషిస్తూ వచ్చారు. కొంకణి ప్రాంతంలో పార్టీ కార్యకలాపాలు విస్తరిస్తూ వచ్చారు. భాష, సంస్కృతుల ఆధారంగా పలు రాష్ట్రాలు ఏర్పాటు అవుతున్న సమయంలో 1956 లో మరాఠీ భాషను మాట్లాడే వారందరి కోసం ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని తీర్మానించి. రాష్ట్ర సాధన కోసం సంయుక్త మహారాష్ట్ర సమితి కింద ఉద్యమించారు. ఈ సమితి ఏర్పాటులో నాథ్ పాయ్, మహదేవ్ జోషి వంటి ప్రజా సోషలిస్ట్ నాయకులతో పాటుగా పలువురు మరాఠా ప్రముఖులు కీలకమైన పాత్ర పోషించారు.[9] 1960 లో మహారాష్ట్ర ఏర్పడిన తర్వాత కూడా కర్ణాటకలో ఉన్న బెల్గాం, కార్వార్, ధార్వాడ్ వంటి మరాఠీ జనాభా అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలను సైతం మహారాష్ట్ర కు బదిలీ చేయాలి తీవ్రంగా కృషి చేశారు. [7][8]

జాతీయ తపాలా శాఖ ఉద్యోగ సంఘానికి, ఉత్తర రైల్వే కార్మిక సంఘాలకు నాయకుడిగా వ్యవహరించిన పాయ్ వారి సంక్షేమం కోసం పాటుపడ్డారు. ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు, అప్పటి కార్మిక సంఘాల నాయకుడైన జార్జ్ ఫెర్నాండెస్తో కలిసి కార్మిక వేతనాలు, ఇతర హక్కుల కోసం1960 లో దేశవ్యాప్తంగా కార్మిక సమ్మెను ప్రారంభించి విజయవంతంగా నడిపించారు.[1][4]

గోవా విముక్తి ఉద్యమం[మార్చు]

దేశానికి స్వాతంత్ర్యం రాకముందు నుంచి డామన్ అండ్ డయ్యూ, గోవా ప్రాంతాలు పోర్చుగీసు పాలనలో ఉండేవి . ఆ సమయంలో అక్కడ నివసిస్తున్న భారతీయలు హక్కులను కాలరాస్తూన్నా పోర్చుగీసు పాలకుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రజలు 1946 లో చేపట్టిన సత్యాగ్రహ ఉద్యమంలో అందరితో పాటు విద్యార్థిగా ఉన్న నాథ్ పాయ్ సైతం పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా గోవా మీద పోర్చుగీసు పాలకులు అధికారాన్ని చెలాయిస్తూ భారత దేశంలో విలీనం చేసేందుకు నిరాకరించారు . అంతే కాకుండా గోవా లోని ప్రజల మీద తీవ్రమైన పలు రకాల ఆంక్షలు విధించడంతో పాటుగా వారి మాతృ భాష కొంకణి మీద నిషేధం విధించారు . వారి చర్యలతో విసుగెత్తిన గోవా ప్రజలు1954 లో గోవా విముక్తి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రజలు చేపట్టగా లండన్ నుంచి తిరిగి వచ్చిన పాయ్ సైతం ఉద్యమంలో భాగమై గోవా విమోచన సమితి పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రజలను నడిపించారు. ఈ ఉద్యమ సమయంలోనే అరెస్ట్ అయ్యి డిటెన్యూగా జైలుకు వెళ్లారు. ఈ సమితి ఏర్పాటులో కీలకమైన పాత్ర పోషించిన అన్నీ పార్టీల నాయకులతో పాయ్ కలిసి పనిచేశారు.[3] 1961 లో గోవా భారత దేశంలో విలీనం జరిగే వరకు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు.[5][8]

పార్లిమెంటేరియన్[మార్చు]

1957 రెండో లోక్ సభ ఎన్నికల్లో ప్రజా సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా మహారాష్ట్ర లోని రాజాపూర్ లోక్ సభ నుండి మొదటి సారి ఎన్నికయ్యారు. 1962,1967 లలో సైతం అదే నియోజకవర్గం నుంచి లోక్ సభకు ప్రాతినిథ్యం వహించారు.[4] ఆనాడు లోక్ సభలో ప్రతి పక్షం చాలా బలంగా ఉండేది .ప్రతిపక్షంలో కమ్యూనిస్టుల నుంచి ఇంద్రజిత్ గుప్తా, హీరేన్ ముఖర్జీ, జనసంఘ్ నుంచి అటల్ బిహారీ వాజపేయి, సోషలిస్టుల నుంచి నాథ్ పాయ్, ఆచార్య కృపలానీ, అశోక్ మెహతా వంటి పలువురు నాయకులు పార్లిమెంట్ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు తీవ్రంగా కృషి చేశారు.[4]

ప్రభుత్వం తీసుకున్న కొన్ని ప్రజావ్యతిరేక నిర్ణయాలను పార్లిమెంట్ సాక్షిగా తిప్పికొట్టడంలో గొప్ప వక్త అయినటువంటి పాయ్ కీలకమైన పాత్ర పోషించారు. సంస్కృతం, మరాఠీ, ఇంగ్లీష్, ఉర్దూ శ్లోకాలతో మొదలైయ్యే ఆయన ప్రసంగాలను పార్లమెంట్ సభ్యులు ఎంతో శ్రద్ధగా వినేవారు .[8] లోక్ సభలో ప్రజా సోషలిస్ట్ పార్టీ ఉప పక్ష నేతగా పాయ్ ప్రజా సమస్యల మీద రాజీ లేకుండా పోరాడారు. 1967, ఏప్రిల్ 7 వ తేదీన లోక్ సభలో పాయ్ ప్రవేశ పెట్టిన ప్రాథమిక హక్కుల రాజ్యాంగ సవరణ బిల్లు లోక్ సభలో ఆమోద ముద్ర పొందండంతో, సభలో ఆయన చేసిన అద్భుతమైన ప్రసంగం పార్లిమెంట్ చరిత్రలో నిలిచిపోయింది.[1] భాష, సంస్కృతుల ఆధారంగా రాష్ట్రాలు ఏర్పడుతున్న సమయంలో కర్ణాటకలో ఉన్న మరాఠ ప్రాంతాలను మహారాష్ట్రకు బదిలీ చేయాలని నిరంతరం పార్లమెంట్ లో ఉద్యమించేవారు.[1]

కొంకణ ప్రాంత అభివృద్ధి[మార్చు]

పశ్చిమ భారత దేశంలో అరేబియా సముద్రానికి అనుకొనే ఉన్న గోవా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో విస్తరించి ఉన్నది కొంకణి ప్రాంతం. సహజ సౌందర్యానికి ప్రతీక అయిన కొంకణ ప్రాంతంలో ఎత్తైన సహ్యాద్రి పర్వతాలు, దట్టమైన అడవులు విరివిగా ఉంటాయి . ఈ ప్రాంతంలోని ప్రజలు ఎక్కువగా వ్యవసాయం, తీర ప్రాంతానికి చెందిన ప్రజలు చేపల వేట మీదే ఆధారపడి జీవిస్తూ ఉంటారు. అభివృద్ధిలో సైతం ఈ ప్రాంతం చాలా వెనుకబడి ఉండటంతో పాటుగా రవాణా వ్యవస్థ సైతం లేదు. ఈ ప్రాంత రైతులు పండించే పంటలను వేరే ప్రాంతానికి ఎగుమతి చేసేందుకు తీవ్రమైన అవస్థలు పడేవారు.[10][11]

1957 లోక్ సభ ఎన్నికల్లో కొంకణ ప్రాంతంలో ఉన్న రాజాపూర్ లోక్ సభ నుండి పోటీ చేసిన పాయ్, గెలిచిన వెంటనే ఈ ప్రాంత అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేశారు. లోక్ సభ సమావేశాల్లో తరచూ కొంకణి ప్రాంత సమస్యల ప్రస్తావన తీసుకొని రావడమే కాకుండా అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ అంశం మీద చిత్త శుద్ధి లేదని విమర్శించేవారు. కొంకణి ప్రాంతంలో సాగు, త్రాగు నీటి అవసరాలు తీర్చడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేశారు.[8] ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలను గుర్తించడమే కాకుండా, కొంకణి భాషాభివృద్ధికి సైతం పూనుకొని కొంకణ వికాస్ పరిషత్ అనే రాజకీయేతర సంస్థను ప్రారంభించారు. [8]

కోయాన జల విద్యుత్ కేంద్రం నుంచి కొంకణ ప్రాంతానికి విద్యుత్ సౌకర్యాన్ని కల్పించేందుకు పాయ్ తీవ్రంగా కృషి చేశారు.[8] కొంకణి రైల్వే కోసం ఆయన చివరి శ్వాస వరకు లోక్ సభలో, బయట పోరాడారు. ఆయన కల 1977 లో జనతా ప్రభుత్వంలో సాకారం అయ్యింది. అప్పటి కేంద్ర రైల్వే మంత్రి మధు దండావతే గారు కొంకణి రైల్వే లైన్ మంజూరు చేయించారు.[1]

వ్యక్తిగత జీవితం[మార్చు]

నాథ్ పాయ్ లండన్ లో ఉన్న సమయంలోనే అంతర్జాతీయ సోషలిస్టు విద్యార్థి సంఘం నాయకుడిగా యూరోప్ మొత్తం పర్యటన చేశారు . ఆ పర్యటనలో భాగంగా ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఉన్న సమయంలో అక్కడి కళాశాలలో చదువుతున్న యువతి క్రిస్టితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వారి వివాహానికి దారి తీసింది.[1] . వీరికి ఇద్దరు కుమారులు. ఆనంద్ పాయ్, దిలీప్ పాయ్.పాయ్ సోదరుడు మనవరాలు అదితి పాయ్ ప్రముఖ జర్నలిస్ట్, రచయిత్రి.[4]

మరణం[మార్చు]

పాయ్ 1971లో జరగబోయే లోక్ సభ ఎన్నికల కోసం సన్నద్ధం అవుతున్న సమయంలో పలు ప్రాంతాల్లో పార్టీ తరుపున ప్రచారం చేస్తూ వచ్చారు. కొంకణ ప్రాంతంలో ప్రచారం చేస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డారు. ఆ తర్వాత బెల్గాం లోని తన నివాసం చేరుకొని చికిత్స పొందుతూ జనవరి 21 వ తేదీన మరణించారు.[5] మరణించేనాటికి ఆయన వయస్సు 48 సంవత్సరాలు.

మూలాలు[మార్చు]

  1. https://lohiatoday.files.wordpress.com/2018/09/nathpai-pearlinparliamnent.pdf
  2. https://www.mymahanagar.com/featured/constitution-expert-nath-pai/343088/
  3. http://loksabhaph.nic.in/writereaddata/biodata_1_12/1283.htm
  4. https://janataweekly.org/aditi-pai-nath-pai-patriot-visionary-man-of-the-people/
  5. https://maitri2012.wordpress.com/2014/01/18/%E0%A4%AC%E0%A5%85-%E0%A4%A8%E0%A4%BE%E0%A4%A5-%E0%A4%AA%E0%A5%88/
  6. https://indianexpress.com/article/cities/mumbai/barrister-nath-pai-marg-road-with-a-colonial-and-socialist-past-4545369/
  7. https://maharashtratimes.com/editorial/samwad/merumani-of-liberalism/articleshow/86334663.cms
  8. https://www.mid-day.com/news/opinion/article/konkans-forgotten-visionary-23200799
  9. https://www.youtube.com/watch?v=-s2-cleOzdI
  10. https://books.google.co.in/books?id=1YILeUD_oZUC&pg=PA1&dq=isbn:9788172016647&source=gbs_toc_r&cad=4#v=onepage&q&f=false
  11. http://www.swapp.co.in/site/indianstatedistrictlist.php?stateid=j1YKCtUvHkShwKBqk6iHow%3D%3D&divisionid=bRbHGKvCu7LMDJJGUsYuQA%3D%3D
  12. https://www.youtube.com/watch?v=ZCMWOC4h3DA
  13. https://maharashtratimes.com/editorial/literature/amarendra-dhaneshwar-book-review-on-nath-pai-book-by-aditi-pai/articleshow/79208974.cms
"https://te.wikipedia.org/w/index.php?title=నాథ్_పాయ్&oldid=4076257" నుండి వెలికితీశారు