పిక్టోరియలిజం
పిక్టోరియలిజం (ఆంగ్లం: Pictorialism) అనునది 19 ద్వితీయార్థంలో, 20వ శతాబ్దంలో ఫోటోగ్రఫిని అంతర్జాతీయ స్థాయిలో నడిపించిన ఒక కళా ఉద్యమం. ఈ పదానికి ప్రామాణిక నిర్వచనం లేకున్ననూ ఇది సాధారణంగా యథాతథంగా ఏర్పడే ఛాయాచిత్రాన్ని కేవలం నమోదు చేయటానికి మాత్రమే పరిమితం కాకుండా, ఛాయాగ్రహకుడు ఏదో ఒక విధంగా దానిని మార్చి ఒక భావాత్మకమైన ఛాయాచిత్రాన్ని సృష్టించే శైలిని సూచిస్తుంది. సాధారణంగా ఒక పిక్టోరియల్ ఛాయాచిత్రం స్పష్టత (sharp focus) లోపించినదై బ్లాక్-అండ్-వైట్ కే పరిమితం కాకుండా warm brown లేదా ఊదా రంగులలో ముద్రితమై కుంచెతో అక్కడక్కడా మెరుగులు అద్దబడి, ఏర్పడిన ఛాయాచిత్రం యొక్క అందాన్ని పెంపొందించేవిధంగా ఉంటుంది. ఒక పిక్టోరియలిస్ట్ కళాకారుడి యొక్క ఛాయాచిత్రం ఒక చిత్రపటం వలె భావోద్రేక ఉద్దేశ్యాన్ని కలిగించి వీక్షకుని యొక్క ఊహాలోకాన్ని ప్రభావితం చేసేదిగా ఉంటుంది.
పిక్టోరియలిజం 1885 నుండి 1915 వరకు ఉద్యమంగా వర్థిల్లిననూ 1940 వరకూ ఈ కళని ప్రచారం చేసినవారూ లేకపోలేదు. ఒక ఛాయాచిత్రం కేవలం వాస్తవాన్ని నమోదు చేయుటకు మాత్రమే ఉపయోగపడుతుంది అనే విమర్శనాత్మక ప్రస్తావనను వ్యతిరేకిస్తూ ఉద్భవించిన పిక్టోరియలిజం ఫోటోగ్రఫిని ఒక కళగా గుర్తించి అంతర్జాతీయ ఉద్యమంగా రూపుదిద్దుకొన్నది. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా చిత్రకారులు, ఛాయాచిత్రకారులు, కళావిమర్శకులు వ్యతిరేక అభిప్రాయాలతో చర్చించిన తర్వాత పిక్టోరియల్ ఛాయాచిత్రాలను పలు కళా ప్రదర్శనశాలలు కైవసం చేసుకొన్నాయి (అనగా పిక్టోరియలిజం కళగానే గుర్తించబడినది).
1920 తర్వాత పిక్టోరియలిజం యొక్క ఆదరణ క్రమంగా తగ్గిపోయింది. పూర్తిగా కనుమరగవకున్ననూ రెండవ ప్రపంచ యుద్ధం పిక్టోరియలిజానికి చరమగీతం పాడినది. యుద్ధం తర్వాతి కాలంలో మరింత స్పష్టత కలిగిన (sharp focus) మాడర్నిజం అనే శైలి జనాదరణకి నోచుకొన్నది. 20వ శతాబ్దానికి చెందిన పలు ఛాయాగ్రహకులు మొదట పిక్టోరియలిస్టులుగా వారి ఉద్యోగాలని ప్రారంభించిననూ, కాలానుగుణంగా స్పష్టత గల ఛాయాచిత్రాల వైపు మళ్ళారు
అవలోకనం
[మార్చు]ఫిలింని డార్క్ రూం లలో అభివృద్ధి చేయటం, ఫోటోలని ముద్రించటం వంటి ప్రక్రియలతో 19వ శతాబ్దానికి ఫోటోగ్రఫి ఒక సాంకేతిక ప్రక్రియగా అవతరించింది. ఈ నూతన మాధ్యమం అవతరించిన ప్రారంభంలోనే ఛాయాచిత్రకారులు, చిత్రకారులు, ఇతర కళాకారులు ఈ మాధ్యమంతో విజ్ఞాన శాస్త్రానికి, కళకి ఉన్న అవినాభావ సంబంధాన్ని చర్చించసాగారు. 1853వ సంవత్సరంలోనే విలియం జాన్ న్యూటన్ అనే చిత్రకారుడు కెమెరా యొక్క ఫోకస్ ని కొద్దిగా తప్పిస్తే కళాత్మక ఫలితాలు సాధించవచ్చని ప్రతిపాదించారు. ఇతరులు ఛాయాచిత్రం అనునది కేవలం దృశ్యాన్ని భద్రపరచే ఒక రసాయనిక చర్య అని కఠినమైన అభిప్రాయానికి వచ్చారు.
ఈ చర్చలు 19వ శతాబ్దపు అంతంలో, 20వ శతాబ్దపు ప్రారంభంలో అత్యధికంగా జరిగి ఫోటోగ్రఫీ రంగంలో పిక్టోరియలిజం అనే ఒక ప్రత్యేకమైన శైలికి దారి తీశాయి. ఈ శైలి ప్రాథమికంగా వ్యక్తిగత అభిప్రాయాన్ని వెలిబుచ్చటానికి, ఛాయాచిత్రకళ యొక్క సామర్థ్యం కేవలం వాస్తవాలని నమోదు చేయటానికే పరిమితం కాకుండా దృశ్యానికి మరింత అందం కూడా చేకూర్చవచ్చని నిర్వచించబడింది. అయితే చరిత్రకారులు ఇటీవలె పిక్టోరియలిజం కేవలం దృశ్యాన్ని అందంగా చిత్రించటం కోసమే పుట్టలేదని గుర్తించారు. సంఘసంస్కృతులలో వచ్చిన మార్పుల ప్రత్యక్ష సందర్భంలో ఉద్భవించినది కావున పిక్టోరియలిజం అనునది కేవలం ఒక దృశ్య శైలిగా పరిగణించరాదని వీరి వాదన. ఒక రచయిత ప్రకారం పిక్టోరియలిజం అనునది "ఒక ఉద్యమం, ఒక తత్త్వం, సౌందర్యం పట్ల ఒక ఆరాధనా భావం, ఒక శైలి, ఇవన్నీ కలగలసినది".
ఫోటోగ్రఫీ చరిత్ర ఇచ్చే వివరణకి వ్యతిరేకంగా పిక్టోరియలిజం అనునది కళాత్మక స్పందనల పరిణామక్రమంలో ఉద్భవించినది కాదు; కానీ, "దగ్గరగా అల్లుకుపోయిన, విపరిణామ, విరుద్ధమైన ఉద్రేకాలకు ఆనకట్టలుగా, వ్యూహాలతో ఏర్పడినది." కళామేధావులు ఫోటోగ్రఫీ కళనేనా కాదా అన్నదాని పై చర్చిస్తున్న కాలంలోనే ఫోటోగ్రఫీ రంగప్రవేశం పలువురు సాంప్రదాయిక కళాకారుల పాత్రలను వారి జీవితాలను నేరుగా ప్రభావితం చేసినది. ఫోటోగ్రఫీ రాక మునుపు ఒక వ్యక్తి యొక్క చిత్రపటాన్ని చిత్రకళలో మాత్రమే చిత్రీకరించగలిగేవారు. కొన్ని వేల మంది చిత్రకారులు ఈ కళారూపానికే అంకితమయి ఉండేవారు. ఛాయాచిత్రకళ చిత్రకళ యొక్క ప్రాముఖ్యతని తగ్గించింది. లండన్ లోని రాయల్ అకాడమీలో 1830 లో 300 చిత్రపటాలు ప్రదర్శితమవగా 1870 లో కేవలం 33 మాత్రమే ప్రదర్శితమవడం దీనికి నిదర్శనం. ఫోటోగ్రఫీ చిత్రకళని అయితే అధిగమించినది కానీ, ఫోటోగ్రఫీ అనునది కళనేనా అనే ప్రశ్నకి సమాధానం మాత్రం దొరకలేదు.
కొందరు చిత్రకారులు మాడళ్ళ భంగిమలని, ఒక ప్రకృతి దృశ్యాన్ని, ఇతర అంశాలని చిత్రీకరించటానికి ఫోటోగ్రఫిని ఒక పనిముట్టుగా వాడుకొన్నారు. 19వ శతాబ్దానికి చెందిన పాశ్చాత్య చిత్రకారులు చాలా మంది వారంతట వారే తీసిన ఛాయాచిత్రాలని గానీ, ఇతరులు తీసిన ఛాయాచిత్రాలని గానీ వినియోగించి చాలా చిత్రపటాలు గీశారు. చిత్రకళకీ, ఛాయాచిత్రకళకీ ఉన్న అవినాభావ సంబంధం పై చర్చలు ఒక ప్రక్క జరుగుతుండగనే ఈ రెండు కళల మధ్య భేదం కనుమరుగవటం మొదలైనది. ఫోటోగ్రఫీ ముందడుగు వేసే కొద్దీ చిత్రకళతో పరస్పర అన్యోన్యత పెరిగింది. పిక్టోరియల్ ఫోటోగ్రఫర్ లు అదనంగా చిత్రకళలో కూడా నైపుణ్యం సంపాదించవలసిన అవసరం ఏర్పడినది.
ఈ కాలంలోనే ప్రపంచంలో ఉన్న వివిధ సంస్కృతులు, సంఘాల పై వాణిజ్య ప్రయోజనార్థం విపరీతంగా పెరిగిపోయిన ఖండాంతర ప్రయాణాలు ప్రభావం చూపటం మొదలు పెట్టాయి. ఒక ఖండంలో అచ్చయిన పుస్తకాలు పత్రికలు మరో ఖండానికి ఎగుమతి చేయటం సులభతరం అయిపోవటం, తపాలా అభివృద్ధి వలన వ్యక్తిగత ఆలోచనలను, సాంకేతిక అంశాలను ముఖ్యంగా అసలైన ఫోటోగ్రఫిక్ ప్రింట్ లను పరస్పరం తెలుసుకొనగలగటం సులభతరమైనది. ఫలితంగా "ఛాయాచిత్రకళలోని శైలులన్నింటి కెల్లా పిక్టోరియలిజమే అత్యంత అంతర్జాతీయ కళా ఉద్యమం"గా గుర్తించబడింది. అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రియా, జపాన్, ఇతర దేశాల ఛాయాచిత్రకారుల సంఘాలు ఒకరి కళాఖండాలు మరొకరికి ప్రదర్శిస్తూ, వాటిలోని సాంకేతికాంశాలని చర్చిస్తూ, వాటిపై వ్యాసాలను, విమర్శలను ప్రచురిస్తూ పరస్పర ఆసక్తులని తెలుసుకుంటూ ఈ ఉద్యమానికి అంతర్జాతీయ హోదా కల్పించారు.
కొడాక్ కెమెరాల ప్రభావం
[మార్చు]ప్రతిబింబాలను ఒక ఆచరణాత్మక పద్ధతి ద్వారా బంధించటం, పునరుత్పత్తి చేయటం ప్రారంభమైన నలభై సంవత్సరాల తర్వాత ఫోటోగ్రఫీ అనునది కేవలం ఒక అంకితమైన, విజ్ఞాన శాస్త్రంలో, యంత్రగతి శాస్త్రంలో, కళలో నైపుణ్యం కలిగిన వర్గానికి మాత్రమే పరిమితమైనది. ఒక ఛాయాచిత్రమును రూపొందించటానికి ఒక వ్యక్తి రసాయన శాస్త్రాన్ని, కటక శాస్త్రాన్ని, కెమెరా యొక్క యంత్రగతులని, వీటి కలయికల వల్ల ఏర్పడే దృశ్యాన్ని అవపోసన పట్టవలసిన అవసరం ఉండేది. సులభంగా, సరదాగా నేర్చుకొనే వ్యాపకంగా కాకుండా, విద్యావంతులకు, శాస్త్రవేత్తలకు, నిపుణులైన ఛాయాచిత్రకారులకి మాత్రమే పరిమితమైనది.
కొన్ని సంవత్సరములలోనే చాలా మార్పు వచ్చింది. 1888లో జార్జ్ ఈస్ట్మన్ ఈ జ్ఞానం అవసరంలేని ఔత్సాహికులు కూడా ఫోటోలు తీయగల కొడాక్ కెమెరాని రూపొందించాడు. "You press the button, we do the rest." (మీరు కేవలం మీట నొక్కండి, తక్కినది మేం చూసుకొంటాం) అనే ఉపశీర్షికని చేర్చారు. వినియోగంలో సౌలభ్యం, ఎక్కడికైననూ తీసుకెళ్ళగలిగే సౌకర్యం గల ఈ కెమెరాలో 2.5 ఇంచిల వృత్తాకారపు ఛాయాచిత్రాలు వంద ఉండే ఫిలిం చుట్ట ముందే లోడ్ చేసి ఉండబడేది. వంద షాట్లు అయిపోగనే మొత్తం కెమెరాని కొడాక్ సంస్థ వారికి ఇచ్చినచో వారు ఆ ఫిలింని అభివృద్ధి చేసి, అచ్చు వేసి, కెమెరాలో మరొక ఫిలిం చుట్టని ఇమిడ్చి ఇచ్చేవారు.
ఈ మార్పు ఛాయాచిత్రకళపై చాలా కీలకమైన ప్రభావం చూపినది. అకస్మాత్తుగా ఎవరైననూ ఛాయాచిత్రాలు తీయగల పరిస్థితి ఏర్పడటమే కాక, అత్యల్ప సమయంలోనే ఫోటోగ్రఫీపై ప్రపంచంలోనే అత్యధికులు వ్యామోహాన్ని పెంచుకొన్నారు. మైఖేల్ విల్సన్ అనే ఛాయాచిత్ర సేకరి, "వేల సంఖ్యలో వాణిజ్య ఛాయాచిత్రకారులు, వీరికన్నా వందల రెట్ల లో ఔత్సాహిక ఛాయాచిత్రకారులు ఏటా కొన్ని మిలియన్ల ఛాయాచిత్రాలని ఉత్పత్తి చేస్తున్నారు. నైపుణ్యంలో నాణ్యత తగ్గి తక్షణమే ఛాయాచిత్రం తీయాలన్న కోరిక వలన ప్రపంచాన్ని ఫోటోలు ముంచెత్తుతున్ననూ వాటిలో సౌందర్యం కొరవడినది." అని అభిప్రాయపడ్డారు.
ఈ మార్పుతో బాటు కొత్తగా వివిధ రకాలైన కెమెరాలకి, ఫిలిం లకి, ప్రింట్ లకి ఏర్పడిన గిరాకీని తీర్చటానికి అనేక జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు పుట్టుకొచ్చాయి. 1893లో చికాగోలో జరిగిన వరల్డ్ కొలంబియన్ ఎక్స్పొజిషన్లో 27 మిలియన్ల జనం పాల్గొనగా ఇందులో ప్రధానాంశమైన ఔత్సాహిక ఫోటోగ్రఫీకి అంచనాలకి మించిన స్పందన వచ్చింది. ఈ ఎక్స్పొజిషన్ లో వివిధ దేశాలలో తీసిన ఛాయాచిత్రాలు, కెమెరాలు, డార్క్ రూం పరికరాలు రూపొందించే సంస్థలు రూపొందించిన కొత్త సరుకులు వంటివి ప్రదర్శింపబడ్డాయి. హఠాత్తుగా ఛాయాచిత్రకళ, ఛాయాచిత్రకారులు ప్రతి ఇంటిలో వెలిశాయి (రు).
ఈ పరిణామంతో చాలా మంది నైపుణ్య ఛాయాచిత్రకారులు ఖంగుతిన్నారు. వారి నైపుణ్యంలో, వారిలోని కళాతృష్ణలో, కొత్తగా పుట్టుకొచ్చిన, నియంత్రించలేని, ప్రతిభావంతులు కాని వారు భాగస్థులైనారు. ఛాయాచిత్రాలు ఎవరిచేనైనా తీయబడినచో బహుశ: ఛాయాచిత్రకళని కళగా పరిగణించరాదనే వాదం మొదలైనది. ఛాయాచిత్రకళని కళగానే పరిగణించు కొందరు ఛాయాచిత్రకారులు కొన్ని ఛాయాచిత్రాలు కేవలం వాస్తవాలు నమోదు చేయటానికి ఉపయోగించిననూ, కొన్ని ప్రత్యేక అంశాలతో ఛాయాచిత్రాలని కళాఖండాలుగా తీర్చిదిద్దవచ్చునని వాదించారు. బోస్టన్ ఈవెనింగ్ ట్రాన్స్క్రిప్ట్ అనే పత్రికకి కళావిమర్శకుడైన విలియం హోవ్ డౌన్స్ అనే వ్యక్తి 1900 లో "కళ అన్నది కేవలం పద్ధతులు, ప్రక్రియలకే పరిమితం కాక స్వభావం, కళాభిరుచి, భావోద్రేకం తో పెనవేయబడి ఉన్నది...కళాకారుని చేతుల్లో ఛాయాచిత్రం కళాఖండం అవుతుంది...ఒక్క ముక్కలో చెప్పాలంటే ఛాయాచిత్రకళని కళగా మార్చాలన్నా వర్తకంగా మార్చాలన్నా అది కేవలం ఛాయాచిత్రకారుడి చేతుల్లోనే ఉన్నది..." అని ప్రస్తావించాడు.
పైన పేర్కొన్న అన్ని అంశాలు అనగా ఫోటోగ్రఫి, కళల పై చర్చోపచర్చలు, కొడాక్ కెమెరాల ప్రభావం, సంఘసంస్కృతులలో వీటివలన కలిగిన మార్పులు, ఇవన్నీ; కళ, ఛాయాచిత్రకళ స్వతంత్రంగా, ఒకదానికొకటి ముడిపడి ఈ కీలక మలుపులో ఎలా ఆవిర్భవిస్తాయి అనే ప్రశ్నకి వేదిక వేశాయి. ఫోటోగ్రఫిక్ ప్రక్రియలు తెలిసేనాటికే పిక్టోరియలిజం ఆవిర్భవించిననూ, 19వ శతాబ్దపు ఆఖరి దశకంలో కానీ పిక్టోరియలిజం ఒక అంతర్జాతీయ ఉద్యమంగా ఎదగలేదు.
పిక్టోరియలిజం నిర్వచనం
[మార్చు]1869 లో హెన్రీ పీచ్ రాబిన్సన్ అనే ఛాయాగ్రహకుడు Pictorial Effect in Photography: Being Hints On Composition And Chiaroscuro For Photographers అనే ఒక పుస్తకాన్ని ప్రచురించాడు. ఫోటోగ్రఫీని ఉద్దేశించి పిక్టోరియల్ అని వ్యవహరించటం ఇదే ప్రప్రథమం. కయరాస్క్యూరో అనే ఇటాలియన్ పదానికి అర్థం కాంతిలో వస్తువుల వలన ఏర్పడే నీడలతో మనోభావాలని వ్యక్తపరచటం. ఈ పుస్తకంలో రాబిన్సన్ 20 ఏళ్ళ క్రితమే తాను కనుగొన్న కాంబినేషన్ ప్రింటింగ్ గురించి ప్రస్తావించాడు. కాంబినేషన్ ప్రింటింగ్ అనగా వేరు వేరు నెగిటివ్ ల నుండి గానీ, ఫోటోగ్రఫిక్ ప్రింట్ ల నుండి గానీ వివిధ అంశాలని గ్రహించి వాటన్నింటినీ కలిపి ఒక చిత్రంగా మలచటం. ఫోటోగ్రఫిని ఉపయోగించి కళని సృష్టించానని తద్వారా రాబిన్సన్ అనుకొన్నాడు. దీని పై రాబిన్సన్ తన జీవితంలో పరిశోధనలు కొనసాగించాడు.
ఇతర ఛాయాచిత్రకారులు, కళా విమర్శకులు ఈ ఉద్దేశ్యాలని పునరుద్ఘటించారు. పిక్టోరియలిజం అనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతూ ఉండటం వెనుక అసలు ఉద్దేశం స్ట్రెయిట్ ఫోటోగ్రఫి వాస్తవానికి అద్దం పట్టేదే కానీ కళని అర్థం చేసుకొనేందుకు దోహదపడదన్న వాదం. ఇది నిర్దేశిత లక్ష్యాలకై, ప్రయోజనాలకై, దృశ్య వాస్తవాలని నమోదు చేయటానికై కళాసంబంధ ఉద్దేశాలు లేనిదై కళా విలువలు లేనిదై ఉంటుంది. రాబిన్సన్, ఇతరులు, "ఛాయాచిత్రకళకి గల పరిమితులని అతిక్రమించాలి" అని అభిప్రాయపడ్డారు.
"కళ ఎలా ఉండాలి?" అనే ప్రశ్న ఫోటోగ్రఫీ కళ అని ఋజువు చేయటానికి పెను సవాలుగా మారినది. చిత్రకళలో వలె ఉన్న ప్రతిబింబాలని ఛాయాచిత్రాలలో బంధించటంలో కొందరు చిత్రకారులు నిమగ్నమై ఉండగా 1880లలో చిత్రకళలో టోనలిజం అనే మరో నూతన శైలి ఆవిర్భవించింది. కొన్ని సంవత్సరాలలోనే పిక్టోరియలిజం అభివృద్ధిలో టోనలిజం కీలకమైన పాత్రని పోషించింది. కేవలం ప్రతిబింబాన్ని నమోదు చేయటమే కాక, వాతావరణం యొక్క అనుభూతిని వీక్షకునికి కలిగేలా చేయటమే కళాకారుని అతి పెద్ద బాధ్యత. వాతావరణ అంశాలకి ప్రాధాన్యతనిస్తూ అస్పష్ట ఆకారాలతో, లక్షణాల తీవ్రతని తగ్గించి, వీక్షకునిలో విచారపూరితమైన స్మృతులని భావాత్మక స్పందనలని రేకెత్తించటమే టోనలిజం.
అమెరికాకి చెందిన ఆల్ఫ్రెడ్ స్టీగ్లిట్జ్ అనే ఛాయాగ్రహకుడు, "వాతావరణం అనేది మనం చూచేవాటికి మాధ్యమం. ఛాయాచిత్రంలో వాతావరణం యొక్క అంశాలని యథాతథంగా చూడగలగాలంటే ఆ ఛాయాచిత్రంలో వాతావరణం కూడా ఉండాలి. వాతావరణం రేఖలలో మృదుత్వాన్ని తీసుకువస్తుంది, వెలుగు-నీడల నడుమ వైరుధ్యాన్ని తగ్గిస్తుంది, దూరాల భావనని ఛాయాచిత్రంలో పునరుత్పత్తి చేయటంలో ప్రముఖ పాత్రని పోషిస్తుంది. దూరపు వస్తువులకి ఉండే చుట్టుగీతలో స్పష్టతని తగ్గిస్తుంది. వాతావరణం ప్రకృతిలో ఎలా భాగమో, లక్షణం అలానే చిత్రంలో భాగం." అని నిర్వచించాడు.
చిత్రమాలిక
[మార్చు]-
Alice Boughton, చే చిత్రీకరించబడ్డ Dawn, 1909
-
Annie Brigman, Soul of the Blasted Pine, 1908
-
Clarence H. White, Morning, 1908
-
Paul Haviland, Doris Keane, 1912
-
Robert Demachy, Struggle, 1904
-
Alfred Stieglitz, The Hand of Man, 1902
-
Edward Steichen, Flatiron Building, 1904
-
Constant Puyo, Sommeil, 1897
-
Alvin Langdon Coburn, Spiderwebs, 1908
-
F. Holland Day, Ebony and Ivory, ca.1897
-
Mary Devens, "The Ferry", c1904
-
Adolph de Meyer, "Marchesa Casati", 1912
-
Joseph Keiley, Lenore, 1907
-
Clarence H. White, Nude, 1908
-
Constant Puyo, Montmartre, 1906
-
Clarence H. White and Alfred Stieglitz, Torso, 1907