కాలిఘాట్ చిత్రకళ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1880 లో కాలిఘాట్ శైలిలో చిత్రీకరించబడ్డ మహిషాసుర మర్ధిని

'కాలిఘాట్ చిత్రకళ' భారతదేశంలో ఉద్భవించిన ఒక చిత్రకళా ఉద్యమం. ఇది 19వ శతాబ్దంలో కలకత్తా లోని కాళికాదేవి మందిర ప్రాంగణాలలో ఉద్భవించింది. ఈ శైలిలో చిత్రీకరించిన చిత్రపటాలను భక్తులు వారికి ఆప్తులకు బహుమతులుగా తీసుకెళ్ళటంతో వీటి ప్రత్యేకత సర్వత్రా వ్యాపించింది. కేవలం దేవతలే కాక ఈ శైలిలో అనేక ఇతర నేపథ్యాలు కూడా చిత్రీకరించబడినవి.

చరిత్ర[మార్చు]

19వ శతాబ్దంలో బెంగాల్లో ఒకే ఒక శైలిలో చిత్రకళ సాగేది. సాంప్రదాయిక పద్ధతులలో వస్త్రపు చుట్టలపై చిత్రీకరించబడే ఈ చిత్రపటాలకు గ్రామాలలో మంచి ప్రజాదరణ ఉండేది. వీటిపై దేవతల చిత్రపటాలను చిత్రీకరించేవారు. ఈ చిత్రాలను పట అని, వీటిని చిత్రీకరించే గ్రామస్తులను పటువ లని వ్యవహరించేవారు. పండగలకు, ఇతర ముఖ్య ఉత్సవాలకు పటువలు ఈ చిత్రాలను ప్రదర్శిస్తూ, వాటిని వివరించే గీతాలను ఆలపించేవారు. హైందవ దేవతల కథలను చిత్రపటాలు, గేయాలల రూపంలో తెలుపుతున్ననూ, వీరు ఇస్లాం మతాన్ని పాటించేవారు.

కళాపోషకులుగా బ్రిటీషు వారు[మార్చు]

అప్పటికే రాజకీయంగా బలపడిన బ్రిటీషువారు ఇక్కడి కళ, సాహిత్యం, సంగీతాలపై ఆసక్తి కనబర్చటం మొదలుపెట్టారు. ఐరోపా శైలి కళలను నేర్పటానికి ఇక్కడ కళాశాలలను నెలకొల్పారు. కలకత్తాలో 'The Calcutta School of Art' నెలకొల్పి పటువలను ఆకర్షించారు. హైందవ దేవతల చిత్రపటాలకు కాలిఘాట్ గుడి వద్ద ఎక్కువ గిరాకీ ఉండటంతో పటువలు ఆ చుట్టుప్రక్కలలోనే నివసించేవారు. మెల్లగా సరిక్రొత్త సాంకేతిక విధానాలను తెలుసుకొని ఇవి వారి ఆదాయాన్ని పెంచగలవని కనుగొన్నారు. అలా వారి కళ రూపాంతరం చెంది కాలిఘాట్ శైలి చిత్రకళ ఉద్భవించింది.

తూర్పు-పడమరల సంగమంగా కాలిఘాట్ శైలి[మార్చు]

కాలిఘాట్ శైలి బెంగాలీ మూలాలకు బ్రిటీషు సాంకేతిక విలువలు అద్దిన సొబగులతో తూర్పు-పడమరల సంగమంగా విలసిల్లుతూ సర్వత్రా ప్రశంసలకు నోచుకొన్నది. కాలిఘాట్ కళాకారులు కాళిని చిత్రీకరించటానికే ఎక్కువ మక్కువ చూపిననూ దుర్గా దేవి, లక్ష్మీ దేవి, అన్నపూర్ణలను కూడా దుర్గాదేవి పూజకై చిత్రీకరించేవారు. సీత-రాములు, రాధ-కృష్ణులు, హనుమంతుడు వంటి దేవతలను కూడా చిత్రీకరించేవారు. కాలిఘాట్ చిత్రకారులకు అత్యంత ప్రీతిపాత్రమైన నేపథ్యం, చైతన్య మహాప్రభు, అతని శిష్యుల చిత్రపటం. వీరు చిత్రీకరించిన కులవృత్తులు, వివిధ రకాల దుస్తులలో కనబడే మనుషులు భక్తులను అమితంగా ఆకర్షించేవి. సమకాలీన సందర్భాలను కూడా కాలిఘాట్ చిత్రకారులు నేపథ్యంగా ఎంచుకొనబడినవి. టిప్పు సుల్తాన్, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి స్వాతంత్ర్య సమర యోధుల చిత్రపటాలను చిత్రీకరించి స్వాతంత్ర్యోద్యమానికి తమ వంతు కృషి చేశారు.

దైనందిన దృశ్యాలు[మార్చు]

కాలిఘాట్ శైలి చిత్రకళ చాలా సులభతరం. దైనందిన జీవితంలోని కార్యకలాపాలను ఆవిష్కరించటంలో ఈ శైలికి సాటి లేదు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

1. http://chitrolekha.com/kalighat-paintings-review/