దక్కను శైలి చిత్రకళ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దక్కను శైలి లో చిత్రీకరించబడ్డ అక్కన్న-మాదన్న లు

దక్కను శైలి చిత్రకళ (ఆంగ్లం Deccan painting) 16వ శతాబ్దంలో ద్వీపకల్ప ప్రాంతానికి చెందిన దక్కని సుల్తానుల హయాం లో ప్రాచుర్యం పొందిన ఒక సూక్ష్మ చిత్రకళ.[1] అతి సున్నితమైన ఈ చిత్రకళ స్థానిక, విదేశీ చిత్రకళల అపురూప సంగమం. 15-16వ శతాబ్దాలలో అహ్మద్‌నగర్, బీజాపూర్, గోల్కొండ, బీదరు వంటి ప్రదేశాలలో దక్కను శైలి చిత్రకళ విలసిల్లింది. 18వ శతాబ్దం నాటికి ఔరంగాబాద్, మహారాష్ట్ర, హైదరాబాదు వంటి ప్రదేశాలకు విస్తరించింది.

చరిత్ర[మార్చు]

పుట్టుక[మార్చు]

మధ్య యుగ కాలం నాటికి దక్కన్ పీఠభూమి లోని చిత్రకళ భక్తి చేత ప్రభావితం అయ్యింది.[2] అజంతా గుహలు లోని శిలాగుహ చిత్రకళ లోని పురాతన వేదాంతం వలె దక్కను శైలి చిత్రకళ కూడా ఈ లోకాన్ని దైవం యొక్క సుందర రూపానిగా పరిగణించింది. 15వ శతాబ్దం అంతానికి అహ్మద్‌నగర్, బీజాపూర్, గోల్కొండ, బీదరు, బేరర్ వంటి దక్కను రాజ్యాల స్థాపన జరిగింది. బీజాపూరు సుల్తాను ఇస్తాంబుల్ లోని ఓట్టమాన్ రాజవంశీకుడు కావటం, గోల్కొండ సుల్తాను తుర్క్‌మెనిస్తాన్ రాజవంశీకుడు కావటం వీరు షియా ఇస్లాం కు చెందినవారు కావటం ఇరాన్ కు చెందిన సఫావిద్ పాలకులతో సత్సంబంధాలు కలిగి ఉండటం, ఉత్తర భారతదేశం లో ని సున్నీ ఇస్లాం ను వీరు సమిష్ఠిగా వ్యతిరేకించటం వలన దక్కను పీఠభూమిలో ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఏర్పడింది.

దక్కను పీఠభూములు అప్పటికే సుదీర్ఘకాలంగా అరబ్ దేశాలతో వాణిజ్యసంబంధాలు కలిగి ఉన్నాయి. షియా తెగలు దక్కను లో రాజ్యాలు స్థాపించటంతో పర్షియా తో సంబంధాలు మరింత బలపడ్డాయి. దక్కను సల్తనేట్ ల వీధులు తుర్కులు, పర్షియనులు, అరబ్బులు, ఆఫ్రికన్లతో కిటకిటలాడేవి. భారత దేశం లో అరబ్బీ భాష నేర్చుకోవటానికి లోతైన ఆధ్యాత్మికత కలిగిన పర్షియా నుండి వచ్చిన సూఫీల ఆలోచనతీరును విస్తరించుకోవటానికి దక్కను పీఠభూములు వేదికలయ్యాయి.

అజంతా శిలాగుహ చిత్రలేఖనం లోని సాంస్కృతిక అంశాలు, భక్తి యొక్క పారవశ్యం, పర్షియన్ సూఫీల స్వాప్నిక దృశ్యాల సంగమం దక్కను శైలి చిత్రకళకు ప్రాణం పోశాయి.

విస్తరణ[మార్చు]

16వ శతాబ్దం లో అహ్మద్ నగర్, బీజాపూర్, గోల్కొండ లు అద్భుతమైన చిత్రలేఖనాలకు కేంద్రాలయ్యాయి.[2] శతాబ్దం పాటు ఒక వెలుగు వెలిగిన ఈ శైలి భారతీయ చిత్రకళ లో మరువలేని అధ్యాయంగా మిగిలిపోయింది. అహ్మద్ నగర్ ను పాలిస్తున్న సుల్తాన్ హసన్, అతని సతీమణి కాన్సా హుమయూన్ చిత్రకళకు విరాళాలు ఇచ్చేవారు.

శైలి[మార్చు]

దక్కని కళాకారులు పర్షియన్ సూక్ష్మచిత్రకళను అనుకరించి వాటికి బంగారు అద్దకాలు అద్దారు. ఈ శైలిలో కల్పనలకు నాణ్యమైన బంగారు అద్దకాలు మరింత వన్నె తెచ్చాయి. పర్షియన్ చిత్రకళ లోని అంశాలు, ఇక్కడి స్థానిక చిత్రకళ లోని అంశాలతో మమేకం అయ్యాయి. [2]

లక్షణాలు[మార్చు]

ఇందు లోని రంగులు ప్రకాశవంతంగా ఉంటాయి.[1] లయబద్దత, లావణ్యం, కల్పిత లోకాల వలె అగుపించటం ఈ శైలిలో ప్రధాన లక్షణాలు. దక్కను శైలి చిత్రకళ ఒక వైపు మన చుట్టూ ఉన్న అందమైన ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూనే మరో వైపు మన ఆత్మలను దైవ సాన్నిధ్యానికి చేరువ చేస్తాయి.[2] రాజులను పలు అలంకరణలతో చాలా ఆర్భాటంగా చిత్రీకరించే మొఘల్ చిత్రకళకు భిన్నంగా దక్కను శైలిలో సామాన్యులకు దగ్గరగా చిత్రీకరించబడటం జరిగింది. దక్కని రాజ్యాల విశ్వమానవ లక్షణాలు ఈ సూక్ష్మచిత్రాలపై ప్రభావాలు చూపాయి. ఆకారాలు పొడవుగా ఉన్ననూ, వాటిలో ఏ మాత్రం గర్వం కనిపించదు. సాంకేతికంగా దక్కనీ చిత్రకళ లోపం లేనిది కాకపోయిననూ, మానసికోల్లాసాన్ని పెంపొందించటం, పరిసరాలను చిత్రీకరించటం ఈ శైలి యొక్క ప్రధాన లక్షణాలు. యుద్ధ, రాజకీయ సన్నివేశాలకు ఈ శైలి దూరంగా ఉండేది. విలాసవంతమైన రాచరిక విహారయాత్రలు, సభాసన్నివేశాలు ఎక్కువగా చిత్రీకరించబడ్డాయి.

బీజాపూర్[మార్చు]

1635 లో బీజాపూరు శైలిలో చిత్రీకరించబడిన సుల్తాన్ మొహమ్మద్ ఆదిల్ షా-1

బీజాపూర్ చిత్రలేఖనాలు మనల్ని అతీంద్రియ లోకాలకు తీసుకువెళతాయి.[2] ఇవి స్వాప్నిక దృశ్యాలు. ముగ్ధమనోహరమైన నేలపై మూర్తీభవించిన అందాన్ని చిత్రీకరించటం జరిగింది. ఉత్తర బారతదేశం లో కళలకు అక్బర్ నాణ్యతాప్రమాణాలను నిర్దేశించగా దక్షిణాన బీజాపూర్ రాజు రెండవ ఇబ్రహిం ఆదిల్ షా ఇటువంటి ప్రమణాలకు దిశానిర్దేశం చేశాడు. అప్పటి ముఘల్ చిత్రలేఖనాలు రాజులు సాధించినవి చిత్రీకరించాయి కానీ రెండవ ఇబ్రహీం ఆదిల్ షా వీటికి భిన్నంగా స్వాప్నిక దృశ్యాలను చిత్రీకరించేలా చేశాడు. తన చిత్రపటాలలో రెండవ ఇబ్రహీం ఆదిల్ షా ఆధ్యాత్మిక చింతనలో కనబడేలా చిత్రీకరింపజేసాడు. వాస్తవికత కాకుండా ఆదర్శ ప్రపంచం యొక్క ఊహాచిత్రాలు వీక్షకులను మైమరిపింపజేస్తాయి.

గోల్కొండ[మార్చు]

పరిచారికలతో మేడ పై సేద తీరుతోన్న అబ్దుల్లా కుతుబ్ షా (గోల్కొండ శైలి)

15వ శతాబ్దంలో గోల్కొండ ను పాలించిన కుతుబ్ షాహీలు తమ పర్షియను మూలాలను కొనసాగించారు. కళలో అక్కడి సంస్కృతి-సాంప్రదాయలు ఉట్టిపడేలా చూశారు.[2] మొఘల్ చిత్రకారులకు పర్షియను చిత్రకారులు శిక్షణ ఇచ్చారు. అందుకే ఈ శాఇలి చిత్రకళ లో పలు ప్రభావాలు గమనించవచ్చు. సిరిసంపదల, అలంకరణల చిత్రీకరణకు గోల్కొండ శైలి చిత్రకళ పెట్టింది పేరు. పర్షియన్ సఫావిద్ క్యాలిగ్రాఫిక్ శైలి, స్థానిక శైలి తో మేళవించటం జరిగింది. గోల్కొండ శైలి లో సైతం హింస, దురాక్రమణలకు చోటు లేదు. సభలో సంగీతం, నాట్యం వంటి ఆహ్లాదకరమైన సన్నివేశాలు చిత్రీకరించబడ్డాయి.

హైదరాబాదు[మార్చు]

హైదారాబాదు నిజాం అసఫ్ జాహ్ 1

17వ శతాబ్దం ద్వితీయార్థం లో గోల్కొండ, బీజాపూర్ లు ఔరంగజేబు పాలవటంతో దక్కను శైలి చిత్రకళ కుంటుపడింది. 1724 లో హైదరాబాద్ రాష్టృం ఏర్పడింది. అది వరకటి శైలులకు భిన్నంగా హైదరాబాదు శైలి ఉద్భవించింది. స్వాప్నిక దృశ్యాల స్థానే సమరూపత (symmetry) వచ్చింది. 18వ శతాబ్దం నుండి స్త్రీ స్వభావం ప్రస్ఫుటంగా కనబడింది. రాకుమారులు, చెలికత్తెలతో ప్రతి చిత్రపటం నిండిపోయింది. పై పై అందానికి ప్రాముఖ్యత పెరిగింది.

వినియోగించబడిన వస్తువులు[మార్చు]

తెలుపు వంటి రంగులతో బాటు స్వర్ణాన్ని కూడా దక్కను శైలి చిత్రకళ లో ఉపయోగించటం జరిగేది.[1]

ప్రభావాలు[మార్చు]

దక్కను శైలి పై ఇతరుల ప్రభావాలు[మార్చు]

విజయనగర సామ్రాజ్యము నుండి పొడవాటి చిత్రలేఖనాల, పర్షియా చిత్రకళ లోని భూరేఖ, ప్రకృతి దృశ్యాలు, నేపథ్యం లో పుష్పాలు దక్కను శైలి చిత్రకళ పై ప్రభావాలను చూపించాయి.[1]

ఇతరులపై దక్కను శైలి ప్రభావాలు[మార్చు]

17వ శతాబ్దం నుండి ఉత్తర భారతదేశం లో ప్రాచుర్యం పొందిన ముఘల్ శైలి చిత్రకళ, దక్కను శైలి చిత్రకళలు ఒకదాని పై ఒకటి పరస్పర ప్రభావాలు చూపించుకొంటూ వచ్చాయి. రాజస్థానీ శైలిపై, ఇతర హైందవ చిత్రకళా శైలుల పై కూడా దక్కను శైలి ప్రభావం చూపించింది.[1]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 Britannica, Encyclopedia. "Deccani painting". britannica.com. Retrieved 14 March 2022.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 National, Doordarshan (16 July 2014). "The Paintings of India - Magic of the Deccan". youtube.com. Retrieved 17 March 2022.{{cite web}}: CS1 maint: url-status (link)