Jump to content

వర్లీ చిత్రకళ

వికీపీడియా నుండి
ఒక వర్లీ చిత్రలేఖనం. సాధారణంగా ఈ చిత్రలేఖనం వర్లీ తెగలకు చెందిన స్త్రీలచే సందర్భానుసారం చేయబడుతుంది. కానీ జివ్య సోమ మాషె అనే పురుషుడు వీటిని అదే పనిగా వేస్తూ ఉండటంతో 70వ దశకంలో మొట్టమొదటి సారి వీటి గురించి బాహ్యప్రపంచానికి తెలిసి వచ్చింది. ఇక్కడ చూపబడింది అతని చే చేయబడిన చిత్రలేఖనమే. టర్పా అనే సంగీత వాయిద్యాన్ని వాయిస్తున్న ఒక మనిషి చుట్టూ సర్పిల ఆకారంలో నాట్యం చేస్తున్న ఇతరులని ఇందులో చూడవచ్చు. ఈ సర్పిలం జనన మరణ చక్రాన్ని సూచిస్తుంది. వర్లీ తెగలకు మృత్యువు అంతం కాదు, ఒక క్రొత్త ప్రారంభం

వర్లీ అనే చిత్రకళ (ఆంగ్లం:Warli painting) మహారాష్ట్ర లోని ఆదివాసీ మహిళలచే సృష్టించబడ్డ ఒక సాంప్రదాయిక చిత్రకళ.[1] ముంబై పట్టణపు ఉత్తర శివార్లలో వర్లి, మల్ఖర్ కోలీ అనే గిరిజన తెగలు ఈ చిత్రలేఖనాన్ని సృష్టించాయి. ప్రధానంగా ఇంటి లోపలి వైపు గోడల పై వర్లీ చిత్రకళ చేయబడేది.[2] అక్షరాస్యత తెలియని ఈ తెగలు, ఈ చిత్రకళ ద్వారానే భావవ్యక్తీకరణ చేసుకొంటాయి. సాంఘిక జీవనం తప్పితే పౌరాణిక పాత్రలు, దృశ్యాలు గానీ, దేవతలను గానీ వర్లీ చిత్రీకరించకపోవటం, మానవ నాగరికత తొలి దశలో చేసిన చిత్రకళకు సామ్యం కలిగి ఉండటం, వర్లీ చిత్రకళకు ఉన్న ప్రత్యేకతలు.[3] సగటు మనిషి, సాధు జంతువులు, దైనందిన జీవితం లోని దృశ్యాలను మాత్రం వర్లీ అశాస్త్రీయంగా చిత్రీకరించినను, ఈ చిత్రీకరణ ఒక లయబద్ధంగా ఉంటుంది. వేట, నాట్యము, వ్యవసాయం వంటి దృశ్యాలను గుహలపై ఆదిమానవులు చిత్రీకరించిన చారిత్రక శైలిలో చాలా అందంగా చిత్రీకరించబడతాయి. 70వ దశకపు ప్రారంభంలో కానీ ఈ చిత్రకళ గురించి బయటి ప్రపంచానికి తెలియలేదు. గోడలపై ఉండే వర్లీ చిత్రకళ వాణిజ్యపరం కావటంతో, కాగితాల పైకి సైతం పాకింది.[2] ఈ చిత్రకళ సరిహద్దులు దాటి పయనించటంతో విశ్వవ్యాప్తంగా ఉన్న కళాప్రేమికులు వీటిని సేకరించారు.[4]

చరిత్ర

[మార్చు]

ఈ కళ ఎప్పుడు పుట్టింది అనే ప్రశ్నకు సరియైన సమాధానం లేకపోయినను, సా.శ. 10వ సంవత్సరంలో దీని మూలాలు ఉన్నాయి.[5] క్రీ.పూ 3,000 నుండి క్రీ.పూ 2,500 వరకు ఉన్న సంప్రదాయాలకు ఈ తెగలు ప్రచారకులుగా వ్యవహరించారు అని పరిశోధకులు తెలుపుతున్నారు. అప్పటి ఇంటి పైకప్పు లోపలి వైపు వేసిన చిత్రలేఖనాలు (మ్యూరల్స్) మధ్య ప్రదేశ్ లోని భీంబేత్కాలో గల చిత్రలేఖనాలకు సామ్యం ఉంది. సాధారణంగా వివాహితులైన స్త్రీలు ఈ చిత్రలేఖనాన్ని సందర్భానుసారం ఇంటి గోడలపై వేస్తూ ఉంటారు. 70వ దశకం ముగిసే వరకు ఇది వివాహిత స్త్రీల వరకే పరిమితం అయ్యింది. కానీ జివ్య సోమ మాషె వీటిని సందర్భానుసారం కాకుండా తరచూ వేస్తూ ఉండటంతో ఇవి నాగరిక ప్రపంచానికి వ్యాపించాయి.[4] "మా జీవన శైలిని, మా సంస్కృతిని వర్లీ చిత్రకళ ప్రతిబింబిస్తుంది. మా తెగల హృదయాంతరాలనే పుస్తకాన్ని ఈ కళ తెరచి చూపుతుంది." అంటాడు మాషె![6]

శైలి

[మార్చు]
చిన్న పిల్లలు సైతం సులభంగా వేయగలిగే వర్లీ చిత్రలేఖనం

గోడల పై వేయబడే ఈ చిత్రలేఖనాలు చాలా సరళంగా, ప్రతీకాత్మకంగా ఉంటాయి. ఈ చిత్రలేఖనాలు వర్లీ తెగల జీవన శైలిని ప్రతిబింబిస్తూ ఉంటాయి.[7] ప్రాథమికంగా వృత్తము, త్రిభుజం, చతురస్రం లను ఉపయోగించి ఈ చిత్రలేఖనాలు చేయబడతాయి.[5] వృత్తంతో సూర్యచంద్రులను, త్రికోణంతో కొండలను, చతురస్రంతో పవిత్రమైన ఆవరణ లేదా ప్రదేశాన్ని చిత్రీకరిస్తారు. చతురస్రం లోనే మిగితా అన్ని ఆకారాలను కూర్చి చిత్రలేఖనం చేస్తారు. త్రీకోణాలతో, సరళ రేఖలతో మనుషులను చిత్రీకరిస్తారు. చుక్కలు, అడ్డగీతలతో వీటిని తీర్చిదిద్దుతారు.[7]

పండుగలకు, వివాహలకు, లేదా పంట కోతకు వచ్చినప్పుడు వర్లీలు వారి ఇంటి గోడలపై ఈ చిత్రలేఖనాలు వేస్తారు.[8] మట్టితో నిర్మించబడిన గోడలపై (ఆవు పేడ అలికి) దాని పై తెల్లని పెయింటుతో ఈ చిత్రలేఖనాన్ని వేస్తారు. ఇష్టాన్ని బట్టి నలుపు, నశ్యం రంగు, వెండి, ముదురు నీలం, బంగారు రంగులను వినియోగిస్తారు. ఇవి కేవలం సరళమైన రేఖాచిత్రాలు మాత్రమే. వీటిలో చాలా తక్కువ కళాత్మక వివరాలు (artistic details) ఉంటాయి. ఈ చిత్రలేఖనంలో ఉండే మనుషుల బొమ్మలు సరళంగా ఉన్నా, చూడ ముచ్చటగా ఉంటాయి. పైగా చిన్నపిల్లలు కూడా వేయగలిగేంత సులువుగా ఉంటాయి. వీటిలో సారళ్యత, వలన ఈ కళ ఎప్పటికీ అంతరించిపోదు అని చాలా మంది భావిస్తారు.

నాగరికతకు తెలిసిన జానపద, గిరిజన చిత్రలేఖనాలకు; వర్లీ చిత్రలేఖనానికి పలు అంశాల్లో తేడాలు ఉన్నాయి. పౌరాణిక గాథలు తెలిపే, భౌతిక సుఖాలు, శృంగారం ఉట్టిపడే తూర్పు భారత చిత్రలేఖనానికి వర్లీ చిత్రలేఖనం పూర్తిగా భిన్నం.[4]

కేవలం సంతోషకరమైన సన్నివేశాలనే కాక, వర్లీ చిత్రకళలో పేదరికం, కరువు కాటకాలలో/వరదలలో, ఇతర క్లిష్ట పరిస్థితులలో మనుషుల/పశు పక్షాదుల కష్టాలు వంటి విషాదకర సన్నివేశాలు కూడా చిత్రీకరించబడతాయి.[9]

అంశాలు

[మార్చు]

వివాహ సన్నివేశాలు, పశుపక్షాదులు, స్త్రీ పురుషులు, బాలబాలికలు, పంట కోతల దృశ్యాలు, సంగీత వాయిద్యాన్ని వాయిస్తూ ఉన్న ఒక మనిషి చుట్టూ పలువురు నాట్యం వేస్తున్నటువంటి రమణీయ సన్నివేశాలు వర్లీ చిత్రలేఖనంలో ప్రధానాంశాలు. చెట్లు, మనుషులు, పక్షులు ఒక దానితో మరొకటి స్పందిస్తూ చిత్రాలకు బిగువును చేకూరుస్తూ ఉంటాయి.[7]

తమ దైనందిన జీవితంలోని కార్యకలాపాలను, ప్రకృతి దృశ్యాలను చిత్రీకరించటం ద్వారా వీరి మధ్య అంతర్గత, బాహ్య ప్రపంచంతో భావ వ్యక్తీకరణ చేయాలి అనే వీరి ఉద్దేశం ఈ చిత్రపటాల ద్వారా బయటపడుతూ ఉంటుంది.

చిహ్నాలు

[మార్చు]

వర్లీ చిత్రకళలో ఉపయోగించే ప్రతీ ఆకారంలో అంతరార్థాలు దాగి ఉన్నాయి. సర్పిల ఆకారంలో నాట్యం చేసే స్త్రీ పురుషుల చిత్రం జీవిత చక్రాన్ని సూచిస్తుంది. అలాగే వీటిలో కనిపించే సామరస్యం, సమతుల్యం ఈ సృష్టి లోని సామరస్యం, సమతౌల్యాలకు ఆపాదించుకొనవచ్చును. మనుషుల, పశువులతో పోలిస్తే చెట్లు ఎత్తుగా ఉండటం, వాటి పవిత్రతను సూచిస్తుంది. వసంత ఋతువు, విరబూసే చెట్లు, ప్రేమికుల సంగమం, స్థిరత్వం, పరిత్యాగం వర్లీ చిత్రకళలో కనబడే ప్రధాన ప్రతీకలు.[10]

లక్షణాలు

[మార్చు]

వర్లీ చిత్రలకళలో మనుషుల, జంతువుల చిత్రాలను అతి సరళంగా చిత్రీకరించబడతాయి. ముఖాన్ని వృత్తంతో ఛాతీని, నడుము ఒకదానితో ఒకటి కలిసిపోయే త్రిభుజాలతో, చేతులు/కాళ్ళను సరళ రేఖలతో సూచించబడతాయి. స్త్రీలకైతే కొప్పును సూచించే మరొక చిన్న వృత్తాన్ని ముఖం ప్రక్కగా వేయబడుతుంది.[11] కేవలం మనుషులే కాక వర్లీ చిత్రకళలో పక్షులు, ఉడుతలు, కోతులు, పాములు కూడా చిత్రీకరించబడతాయి. ఎటువంటి ఆడంబరాలు లేకుండా వర్లీ చిత్రకళ లోతైన భావాన్ని వ్యక్తీకరిస్తుంది.[12]

విధానం

[మార్చు]

బియ్యపు పిండిలో నీరు, జిగురు కలిపి తెల్లని రంగుని తయారు చేస్తారు. ఒక వైపు పళ్ళతో నమిలిన వెదురు కర్రను కుంచెగా వాడతారు.[12]

ఆధునీకీకరణ

[మార్చు]
మైసూరులో రోడ్డు ప్రక్కన గోడల పై ఆధునిక శైలిలో వర్లీ చిత్రకళ

ప్రకృతి దృశ్యాలు, వర్లీ తెగల దైనందిన జీవితం లోని దృశ్యాలకు మాత్రమే చోటు ఉన్న వర్లీ చిత్రకళ, ఇటీవలి కాలంలో క్రొత్త పుంతలు త్రొక్కింది. కళా ప్రేమికులను ఆకర్షించటానికి, విక్రయాలను పెంచటానికి నగర నేపథ్యం, వాహనాలు, పాఠశాలలు, ఇతర సమకాలీన అంశాలు వర్లీ చిత్రకళలో చొప్పించబడ్డాయి. అయిననూ, సాంప్రదాయిక వర్లీ చిత్రకళ ఇప్పటికీ స్వదేశం లోను, అలాగే పరదేశాలలో ఏ మాత్రం విలువ తగ్గలేదు.[2] కాగితం పై, వస్త్రాలపై వర్లీ చేరినను, ఈ కళ యొక్క నిజమైన అందం ఉండేది గోడల పైనే.[9]

ఆధునీకీకరణతో శాశ్వతత్వానికై, గోడలే కాక కాగితం, కాన్వాసు వంటి పలు ఇతర మాధ్యమాల పై వర్లీ చిత్రకళ చేయవలసిన అవసరం ఏర్పడింది.[9] ప్రత్యేకించి ప్రదర్శన శాలల ద్వారా కళా ప్రేమికులను ఆకర్షించి, విక్రయాలు పెంచాలనే ఉద్దేశం వర్లీ కళాకారులకు కొత్త సవాళ్ళను తెచ్చి పెట్టింది. పలు డిజైనర్లు సలహాలు సూచనలు ఇస్తూ ఉండటంతో సంప్రదాయాలకు భిన్నంగా వర్లీ చిత్రకళ ప్రయాణించవలసి వస్తోంది.[9]

సంస్కృతి

[మార్చు]

ఆధ్యాత్మికత

[మార్చు]
ఒక ఇంటిలో చేయబడిన వర్లీ చిత్రకళ. సంప్రదాయ పద్ధతులను దాటి ఇందులో కొన్ని సొబగులు అద్దబడినవి.

ఈ తెగలు ప్రధానంగా ప్రకృతిని పూజిస్తారు. సూర్యచంద్రులు, ఉరుములు/మెరుపులు, గాలి, వర్షం వంటి ప్రాకృతిక అంశాలే వీరి ఆరాధ్య దైవాలు. ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క దైవం పూజించబడుతుంది. పంట కోతకు వచ్చినపుడు వీరి పండుగలు మొదలు అవుతాయి. అప్పుడు వరుణదేవుడిని పూజిస్తారు. వరుణిన్ని వీరు నారన దేవుడిగా పిలుచుకొంటారు. తర్వాత వచ్చే పండుగలకు వీరు సంతాన దేవి, కుటుంబ శాంతి వంటి వాటిని పూజించుకొంటారు. వీరికి జనన మరణాలు, అంతులేని, నిత్యమైన చక్రాలు. సందర్భం ఏదైనా, జననం అయినా, వివాహం అయినా, మరణం అయినా అమ్మవారిని సూచించే వృత్తాలను మాత్రం కచ్చితంగా చిత్రిస్తారు. మృత్యువును వీరు అంతంగా కాకుండా, ఒక సరిక్రొత్త ప్రారంభంగా పరిగణిస్తారు. బహుశా అందుకే ఆద్యంతాలు లేని చక్రాల చిత్రీకరణే వీరి సంస్కృతిని సూచిస్తుంది.[13]

ప్రకృతి పట్ల గౌరవం

[మార్చు]

ఈ తెగల వారు ప్రకృతి పట్ల గౌరవం కలిగి ఉంటారు. వీరి ఈ గౌరవం సూక్ష్మ జీవి నుండి విస్తారమైన సృష్టి వరకు వ్యాపించి ఉంది. ఈ గౌరవ భావం వారి చిత్రలేఖనాలలో కనిపిస్తూ ఉంటుంది. ఈ చిత్రలేఖనాలు వారిని కాపాడే దైవశక్తులను జాగృతం చేస్తాయి అని వారి నమ్మకం.[7]

ఆర్థిక స్థితిగతులు

[మార్చు]

థానే జిల్లా పరిసరాలలో ఎక్కువగా కనబడే ఈ తెగలు ప్రాథమికంగా గిరిజనులైనను కాలానుగుణంగా ఇవి పశుసంవర్థక సంఘాల వైపు నడిచాయి.[1] ఆర్థికంగా కాస్త వెనుకబడిన వర్గాలు అయిననూ వారి సంస్కృతి-సంప్రదాయాలను మాత్రం ఇప్పటికీ పాటిస్తూనే ఉంటారు. ఈ చిత్రకళకు ఇటీవలి కాలంలో ఆదరణ పెరగటంతో చాలా మంది వృద్ధిలోకి రావటంతో జనజీవన స్రవంతిలో కలవటం పెరిగింది. ప్రస్తుత కాలంలో ధనార్జకు ఈ చిత్రలేఖనాలను విక్రయిస్తున్నను, ఈ శైలి యొక్క నేపథ్యాన్ని, మూలాంశాలను మాత్రం ఈ తెగలు యథాతథంగా పాటిస్తున్నారు.[13] వీరి ఇంటి గోడల పై పగుళ్ళు వచ్చిననూ, వాటిని వీరు ఈ చిత్రకళతో నింపేస్తారు.[14]

వివాహం

[మార్చు]

వీరి వైవాహిక సంప్రదాయాలు కూడా ప్రత్యేకమైనవే! వివాహాలకు ప్రత్యేకంగా చిత్రీకరించే వర్లీ చిత్రపటాలను "లగ్నచా చౌక్" అని అంటారు. లగ్నచా చౌక్ లేనిదే వివాహం జరగదు.[7]

ఆధునిక జీవన ప్రభావం

[మార్చు]

ముంబై మహానగరానికి చేరువలో ఉన్ననూ, ఆధునిక జీవితపు సొబగుల ప్రభావం నుండి ఈ తెగల వారు దూరంగా ఉంటారు.[4][13]

వాస్తవం లో వర్లీ

[మార్చు]
వర్లీ చిత్రలేఖనంతో విడుదల చేయబడ్డ తపాలా బిళ్ళ

మహారాష్ట్రకు చెందిన పలు పర్యాటకం వెబ్ సైటులు, బస్సులు, కార్యాలయాలు వర్లీ చిత్రకళతో అలంకరించి ఉంటాయి. వర్లీ చిత్రకళ మహారాష్ట్రకు మారు పేరు అయ్యింది. వర్లీ చిత్రకళ అద్దబడిన టి-షర్టులు, ఇతర వస్త్రాలు ఎగ్జిబిషన్ ల ద్వారా, టూరిస్టు ఔట్ లెట్ ల ద్వారా చాలా వేగంగా అమ్ముడు పోతాయి. మహారాష్ట్ర లోని పలు విద్యాలయాలు విద్యార్థులకు వర్లీ చిత్రకళ పై శిక్షణా శిబిరాలను నిర్విహించటం జరుగుతూ ఉంటుంది. మహారాష్ట్రలోని పలు ఫైవ్ స్టార్ హోటళ్ళు సైతం వర్లీ చిత్రకళతో తళుకులీనుతూ ఉంటాయి.[15]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "What is Warli Art". warli.in. Retrieved 30 September 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. 2.0 2.1 2.2 "Style of Warli Art". warli.in. Retrieved 12 October 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Difference between other art". warli.in. Retrieved 9 October 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. 4.0 4.1 4.2 4.3 "How it explore to world". warli.in. Retrieved 4 October 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. 5.0 5.1 "History of Warli Art". warli.in. Retrieved 1 October 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  6. "What Warli Painting Says?". warli.in. Retrieved 12 October 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  7. 7.0 7.1 7.2 7.3 7.4 "Tradition of Warli Art". warli.in. Retrieved 9 October 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  8. "Evolution of Warli Art". warli.in. Retrieved 1 October 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  9. 9.0 9.1 9.2 9.3 "Modern Trends in Warli Art". warli.in. Retrieved 12 October 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  10. "Symbolism in Warli Art". warli.in. Retrieved 9 October 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  11. "Characteristics of Warli Art". warli.in. Retrieved 12 October 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  12. 12.0 12.1 "Color and Shades of Warli Art". warli.in. Retrieved 12 October 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  13. 13.0 13.1 13.2 "Understanding Warli Painting". warli.in. Retrieved 9 October 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  14. "Content of Warli Art". warli.in. Retrieved 12 October 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  15. "Warli Art in a Real World". warli.in. Retrieved 12 October 2021.{{cite web}}: CS1 maint: url-status (link)