కంపెనీ శైలి చిత్రకళ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కంపెనీ శైలిలో చిత్రీకరించబడ్డ ఐదవ కింగ్ జార్జి చిత్రపటం

కంపెనీ శైలి చిత్రకళ (ఆంగ్లం: Company Style, హిందీ: कंपनी कलम्) భారతీయ చిత్రకారుచే చిత్రించబడ్డ భారతీయ-ఐరోపా శైలులు సమ్మిళితమై ఉన్న చిత్రపటాలు. 18, 19వ శతాబ్దాలలో వీటి చిత్రకారులు బ్రిటీషు ఈస్ట్ ఇండియా కంపెనీ లోని ఐరోపాకు చెందిన కళాపోషకుల కొరకు వీటిని చిత్రీకరించేవారు. సాంప్రదాయిక రాజపుట్ శైలి చిత్రకళ, ముఘల్ శైలి చిత్రకళలకు పాశ్చాత్య అంశాలైన దృష్టికోణం, పరిమాణము, మాంద్యములను మేళవించటంతో ఈ శైలి ఉద్భవించింది. వీటిలో చాలావరకు సూక్ష్మ చిత్రకళలే అయిననూ చారిత్రక చిత్రాలు, మొక్కలు, పక్షులు మాత్రం వాస్తవిక పరిమాణాలలో చిత్రీకరించబడేవి.

అభివృద్ధి కేంద్రాలు[మార్చు]

బ్రిటీషు వారి ముఖ్య నివాస స్థానాలైన కలకత్తా, మద్రాసు, ఢిల్లీ, లక్నో, పాట్నా, తంజావూరు లోని మరాఠా సభలు ఈ శైలి చిత్రకళకు అభివృద్ధి కేంద్రాలయ్యాయి. రూపచిత్రాలు, ప్రకృతి దృశ్యాలు, స్థానిక ప్రజల/నృత్యకారుల/పండుగల సన్నివేశాలు చిత్రించే అంశాలుగా ఎంచుకొనబడేవి. వివిధ కులాల ప్రజలు, ప్రత్యేకించి వారి వస్త్రధారణలో సున్నిత భేదాలు చిత్రీకరించబడ్డాయి. ఇవే ఇప్పటి చరిత్రకారులకు సామ్రాజ్యవాద మనస్తత్త్వాన్ని విశ్లేషించటానికి ఉపయోగపడుతున్నాయి. జంతు/వృక్షశాస్త్రపు అంశాలు, శృంగార భంగిమలు తెల్లదొరల ఆదేశానుసారం చిత్రించబడేవి. ముందువైపు నుండి చిత్రీకరించబడే నిర్మాణ అంశాలకు జనాదరణ ఉండేది. భారతదేశాన్ని సందర్శించటానికి వచ్చే ఐరోపా కళాకారులు (రొమాంటిక్ శైలి లో) చిత్రీకరించినట్లు కాక వీటిని నిర్మాణ కోణం నుండి చిత్రీకరించటం జరిగేది. సాంకేతికతలలో భేదాలున్ననూ చాలా మటుకు చిత్రాలు ఆకృతి యొక్క పారదర్శకత, మృదుత్వ లక్షణాలు, వెడల్పాటి హస్తఘతాలకు అనువుగా ఉండే నీటి వర్ణ చిత్రాలే ఉండేవి.

ముడి పదార్థాలు[మార్చు]

సాధారణంగా చిత్రపటాలు కాగితం పైనున్ననూ, అరుదుగా (ప్రత్యేకించి ఢిల్లీలో) ఏనుగుదంతాలపై కూడా చిత్రపటాలు వేసేవారు.

క్షీణత[మార్చు]

ఛాయాచిత్రకళ ఈ శైలికి చావుదెబ్బ కొట్టినది. 19వ శతాబ్దపు ద్వితీయార్థంలో ఇతర శైలులకు పోటిగా నిలిచేందుకు పాశ్చాత్య శైలులు ప్రస్ఫుటంగా కనబడేలా ఆధునిక శైలులు అభివృద్ధి చేయబడ్డాయి.