లక్ష్మీభూపాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లక్ష్మీభూపాల్
జననంయతిరాజు భూపాల్
15 సెప్టెంబర్ 1975
ఏలూరు
నివాస ప్రాంతంహైదరాబాద్
ఇతర పేర్లుయతిరాజ్ లక్కీ భూపాల్, యతిరాజు
వృత్తితెలుగు సినిమా సంభాషణ రచయిత
తండ్రిపెద్దిరాజు
తల్లికనకలక్ష్మి

లక్ష్మీభూపాల్ (యతిరాజు భూపాల్) తెలుగు సినిమా సంభాషణ రచయిత, గీత రచయిత. చందమామ, అలా మొదలైంది, నేనే రాజు నేనే మంత్రి సినిమాలు సహా 50కి పైగా సినిమాలకు సంభాషణల రచయితగా, అనేక పాటలకు గీతకర్తగా పనిచేశాడు.
2005లో సంభవామి యుగే యుగే సినిమా సంభాషణల రచయితగా తన కెరీర్ ప్రారంభించిన లక్ష్మీభూపాల్, చందమామ (2007), అలా మొదలైంది (2011), కళ్యాణ వైభోగమే (2016), నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాలకు సంభాషణల రచన చేసి పేరొందారు. 50కి పైగా సినిమాలకు సంభాషణల రచయితగా పేరొందారు.

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

లక్ష్మీభూపాల్ అసలు పేరు యతిరాజ్, ఆయన ఇంటిపేరు భూపాల్. ఆయన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందినవాడు. ఆయన తల్లిదండ్రులు పెద్దిరాజు, కనకలక్ష్మి. తండ్రి ఆర్టీసీ ఉద్యోగిగా పనిచేసేవారు. లక్ష్మీభూపాల్ తండ్రి ఆయన ఇంటరులో ఉండగా తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు మీదపడ్డాయి.[1]

తొలినాళ్ళు[మార్చు]

చిరుద్యోగాలు[మార్చు]

చిన్నప్పటి నుంచీ బొమ్మలు వేయడం ఆసక్తి ఉండడంతో ఏదోక పనిచేసి సంపాదించాల్సిన ఆ దశలో హోర్డింగులు, బ్యానర్లు, సైన్ బోర్డులకు పెయింటింగులు వేసే పనిచేపట్టాడు. ఆ తర్వాత ఏ.పి.యస్.ఆర్.టి.సిలో తండ్రి మరణించే సమయానికి ఉద్యోగంలో ఉండడంతో ఆర్టీసీలో లక్ష్మీభూపాల్ కి మెకానిక్ గా ఉద్యోగం దొరికింది. కానీ ఆ ఉద్యోగం తనకి సరిపడదని, అందులో సంతృప్తి లభించదని అర్థం చేసుకుని చేరిన మూడు సంవత్సరాలకే ఉద్యోగాన్ని వదిలేశాడు. [1]

క్రియేటివ్ రంగంలోకి[మార్చు]

సిటీకేబుల్లో ఉద్యోగంలో చేరాడు. జెమినీ, ఈటీవీల్లో ప్రోగ్రాములు డిజైన్ చేసే జీకే అనే మిత్రునికి సహాయకునిగా హైదరాబాద్ వచ్చేశాడు. అదే కాలంలో కె. రాఘవేంద్రరరావు విజన్ 2020 కోసం నిర్మించిన ప్రకటనల టీంలలో ఒకదానిలో పనిచేశాడు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కోసం కూడా ప్రకటన రూపొందించారు. ఇలా నిలదొక్కుకున్న దశలోనే ఏలూరు వెళ్ళి నాలుగు సంవత్సరాల పాటు అక్కడే ఉండాల్సివచ్చింది.[1]

సినీ రంగం[మార్చు]

నాలుగేళ్ళ తర్వాత హైదరాబాద్ వచ్చాకా కూడా జీకే తన వద్ద ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇవ్వడంతో తిరిగి క్రియేటివ్ రంగంలోకి అడుగుపెట్టాడు. ఈ దశలో నటుడు లక్ష్మీపతి సినిమాలకు రచయితగా ప్రయత్నించమని సూచిస్తూ దర్శకుడు రవిబాబుకు పరిచయం చేశాడు. రవిబాబు అప్పుడు తను తీస్తున్న సోగ్గాడు సినిమాకు రచనా బృందంలోకి లక్ష్మీభూపాల్ ను తీసుకున్నాడు. సంభవామి యుగే యుగే సినిమాకు రచయితగా పనిచేయగా, తొలిసారి క్రెడిట్స్ ఇచ్చారు. ఈ దశలో సినిమాలతో పాటుగా ఎఫ్.ఎం.రేడియోలో స్క్రిప్టులకు రచయితగా పనిచేశారు. ఎఫ్.ఎం.లో ‘మేనేజర్‌ మాణిక్యం’, ‘బేబీ మమ్మీ’, ‘చంటీ బంటీ’ వంటి కార్యక్రమాలకు ఆయన రాసిన స్క్రిప్టులు బాగా పేరుతీసుకువచ్చాయి.
ఎఫ్.ఎం. కార్యక్రమాల రచయితగా అతని ప్రతిభను గుర్తించిన ఉత్తేజ్ లక్ష్మీభూపాల్ ను కృష్ణవంశీకి పరిచయం చేశారు. లక్ష్మీభూపాల్ ప్రతిభ, శైలి నచ్చి ఆయనను చందమామ సినిమాకి రచయితగా తీసుకున్నారు. తొలినాళ్ళలో ఆయన తన స్వంతపేరైన యతిరాజు, ఇంటిపేరైన భూపాల్, అమ్మ పేరును స్ఫురిస్తూ లక్కీతో కలిపి యతిరాజ్ లక్కీ భూపాల్ అన్న స్క్రీన్ నేమ్ ఉపయోగించేవారు. ఈ సినిమాకే ఆయన పేరును కృష్ణవంశీ లక్ష్మీభూపాల్ గా మార్చారు. ఆ సినిమాలు లక్ష్మీభూపాల్ మాటలు చాలా పేరుతీసుకువచ్చాయి. అలా మొదలైంది, కళ్యాణ వైభోగమే వంటి సినిమాలకు చేసిన రచన కూడా ప్రశంసలు, గుర్తింపు తీసుకువచ్చింది. తేజ దర్శకత్వంలో, రానా కథానాయకుడిగా నిర్మితమైన నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రాసిన రాజకీయ వ్యంగ్యాస్త్రాల సంభాషణలు ఆయనను సినిమా పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ సుప్రఖ్యాతుణ్ణి చేశాయి.[2] సినీ గీత రచయితగా ‘జజ్జనక జజ్జనక’ (మహాత్మ), ఏదో అనుకుంటే (అలా మొదలైంది), ‘నువ్‌నా తెల్ల పిల్ల బుజ్జిపిల్లా’ (పోటుగాడు), ఏజన్మ బంధమో (కళ్యాణ వైభోగమే) మొదలైన పాటలు రాశారు. మా ముగ్గురి లవ్ స్టోరీ (2017-) అనే వెబ్ సీరీస్ కి సంభాషణలు అందిస్తున్నారు.[1]

సినిమాల జాబితా[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 "రవిబాబుని తిట్టేద్దామనుకున్నా!". Archived from the original on 2018-02-01. Retrieved 2018-02-01.
  2. "నేనే రాజు నేనే మంత్రి మూవీ రివ్యూ". 2017-08-11. Archived from the original on 2017-10-13. Retrieved 2018-02-01.
  3. ఈనాడు, సినిమా (6 March 2020). "రివ్యూ: ప‌లాస 1978". Archived from the original on 6 మార్చి 2020. Retrieved 6 March 2020.
  4. టివి9, రివ్యూ (6 March 2020). "పలాస 1978 మూవీ రివ్యూ". డా. చల్లా భాగ్యలక్ష్మి. Archived from the original on 6 మార్చి 2020. Retrieved 6 March 2020.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)