సిస్టర్ నివేదిత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మార్గరెట్‌ ఎలిజబెత్‌ నోబెల్‌
సిస్టర్ నివేదిత
జననంమార్గరెట్‌ ఎలిజబెత్‌ నోబెల్‌
అక్టోబర్ 28, 1867
ఐర్లండ్
మరణంఅక్టోబర్ 13, 1911
డార్జిలింగ్
ఇతర పేర్లుసిస్టర్ నివేదిత
ప్రసిద్ధివివేకానందుని శిష్యురాలు
తండ్రిశామ్యూల్‌ రిచ్‌ముడ్‌
తల్లిమేరి ఇస‌బెల్‌,

సిస్టర్ నివేదిత (అక్టోబర్ 28, 1867 - అక్టోబర్ 13, 1911) వివేకానందుడి బోధనలకు ప్రభావితమై హిందూమతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ (ఐర్లండ్) మహిళ.

జననం, విద్య

[మార్చు]

మహిళలకు సరైన విద్యావకాశాలు కల్పించి విద్యావంతులను చేసినపుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఉద్ఘాటించిన సిస్టర్‌ నివేదిత మహిళావిద్యాభివృద్ధికోసం ఎంతో కృషి చేశారు. వివేకానందుడి బోధనలకు ప్రభావితమై హిందూ మతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళగా ఆమె చరిత్రను సృష్టించారు. ఐర్లాండులో 1867 అక్టోబర్‌ 28న జన్మించిన మార్గరెట్‌ ఎలిజబెత్‌ నోబెల్‌ తల్లిదండ్రులు మేరి ఇస‌బెల్‌, శ్యాముల్‌ రిచ్‌ముడ్‌ నోబుల్‌. నిజమైన తోటి మనుషులను కరుణతో చూడటమే భగవంతునికి నిజమైన సేవ చేయడం అని చిన్నతనంలో తండ్రి చెప్పిన మాటలు ఆమెను ఎంతో ప్రభావితం చేశాయి. తండ్రి స్ఫూర్తిదాయకమైన మాటలతో ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరారు. దాదాపు పదిసంవత్సరాలు (1884 నుంచి 1894 వరకు) ఇంగ్లాండులో ఆమె ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. 1895లో భారత మహిళా ఔన్నత్యంపై స్వామి వివేకానంద లండన్‌లో చేసిన ప్రసంగాలు మార్గరెట్‌ జీవితాన్ని మార్చాయి. భారతీయ స్త్రీ గొప్పదనం గురించి విన్న ఆమె వివేకానందను కలిసి 1898 జనవరి 28న భారత్‌ చేరింది. అలా ఆమె భారతదేశానికి వచ్చి నేటికి 123 సంవత్సరాలయింది. ఆమెకు వివేకానంద నివేదిత అని నామకరణం చేశారు. నివేదిత అంటే భగవంతునికి సమర్పణ చేయబడినది అని అర్థం. వివేకానంద బోధన గురించి, తనపై వాటి ప్రభావం గురించి తాను రాసిన 'ది మాస్టర్‌ యాజ్‌ ఐ సా హిమ్‌' పుస్తకంలో వివరించారు. ఇతరులపై దయా గుణంతో మెలిగే ఆమె, మంచి అభిరుచిగల కళాకారిణి. సంగీతంలోనూ, చిత్రకళలోనూ ఆమెకు ప్రవేశం ఉండేది.

భారతదేశంలో

[మార్చు]

ఉపాధ్యాయురాలిగా పనిచేసిన అనుభవం ఉన్న నివేదిత భారత్‌లోనూ విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేసింది. ముఖ్యంగా బాలికల విద్యకోసం ఆమె 1898 నవంబరులో కలకత్తా లోని బాగ్‌బజారులో పాఠశాలను ప్రారంభించింది. కనీస విద్యలేని బాలికలకు విద్యను అందించడం లక్ష్యంగా ఆమె పనిచేశారు. ప్రాథమికవిద్య అందించడానికి విశేష కృషి చేశారు. అన్నికులాల మహిళలకు చదువు తప్పనిసరిగా రావాలని ఆమె ఆకాంక్షించారు. బెంగాల్‌ మహిళలతో, మేధావులతో పరిచయాలను ఏర్పాటుచేసుకుని బాలికల విద్యకోసం ఎంతో శ్రమించారు. విశ్వకవి రవీంద్రనాధ టాగూరు, జగదీశ్ చంద్ర బోస్‌ తదితర ప్రముఖులతో స్నేహసంబంధాలను కొనసాగించారు. 1899 సంవత్సరం మార్చిలో కలకత్తావాసులకు ప్లేగ్‌ వ్యాధి సోకినప్పుడు తన శిష్యులతో కలిసి వైద్యసేవలు అందించారు. భారత మహిళల ఔన్నత్యం గురించి, ఆచారవ్యవహారాల గురించి న్యూయార్క్ ‌, షికాగో మొదలైన నగరాల్లో ఆమె ప్రసంగించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలోనూ ఆమె చురుకైన పాత్రపోషించారు. భారతీయతను పూర్తిగా ఆకలింపు చేసుకున్న ఆమె మహిళావిద్య కోసం ఎంతగానో పాటుపడ్డారు.

చివరి రోజుల్లో

[మార్చు]
సిస్టర్ నివేదిత.

1906లో బెంగాల్‌కు వరదలు వచ్చినప్పుడు బాధిత ప్రజలకు ఆమె చేసిన సేవ, అందించిన మానసికథైర్యం ఎంతో విలువైనవి. విదేశీయురాలు అయినప్పటికీ భారతీ యతను పుణికిపుచ్చుకుని స్వామివివేకానందతో అనేక దేశాలు పర్యటించి ప్రసంగించిన ఆమె 1911 అక్టోబర్‌ 13న డార్జిలింగ్లో మరణించారు. ఆమె పేరుతో అనేక పాఠశాలలు, కళాశాలలు స్థాపించబడ్డాయి.

ఆమెను కడుపులో మోస్తుండగా తల్లి తనకు పుట్టబోయే బిడ్డను ప్రభువు సేవకు అందిస్తానని మొక్కుకుంది. టీనేజ్ లోకి అడుగు పెడుతున్న సమయములో మార్గరెట్ కూడా క్రైస్తవ సన్యాసినిగా మారి మతసేవ చేయాలనుకుంది . అయితే ఈలోగా ఆమె ఒక యువకునితో ప్రేమలో పడింది . ఆ ప్రేమలో లభిస్తున్న ఆనందం, తృప్తితో పొంగిపోయింది. ప్రభువు సేవ చేయాలంటే సన్యాసిని కానక్కరలేదని, తన తండ్రి, తాత సంసారము చేసుకుంటూ మతబోధన చేసిన విషయము గుర్తుచేసుకుంది. ఇక పెళ్ళి చేసుకుందామనుకుంటున్న సమయంలో ఆ యువకుడు మరణించడముతో ఎలిజబెత్‌కి పెద్దషాక్ తగిలింది .

టీచర్‌గా పనిచేస్తూ తిరిగి మతపరమైన అంశాలలో మునిగిపోవాలనుకుంది. కాని క్రైస్తవ మతములో పరిచయం పెరుగుతున్నకొద్దీ ఆమెలో అసహనం పెరిగింది. అంతులేని ఆంక్షలు మతపరంగా విధించడం సహించలేకపోయింది . మనుషులకు మతం అవసరమే అయినా క్రైస్తవ మతం తనకు అవసరములేదనుకుంది. కొత్త మతం ఏదయినాకావాలి . వ్యక్తి స్వాతంత్ర్యం హరించని, ఆలోచనలను అదుపుచేయని మతం కోసము వెదకడం మొదలు పెట్టింది . ఆ సమయంలో మార్గరెట్‌కి ఎవరో బుద్ధుని జీవితానికి సంబంధించిన పుస్తకం ఇచ్చారు. అది చదివిన మార్గరెట్ ఆసియాఖండదేశాలలోని మతాలగురించిన అవగాహన ఏర్పడింది.

అమెరికాలో సర్వమత సమావేశానికి హాజరై భారతదేశము వెళుతూ లండన్‌లో ఆగిన వివేకానందుడు ఇస్తున్న ప్రసంగాలకు మార్గరెట్ ఆకర్షితురాలై భారతదేశము చేరి రామకృష్ణ మిషన్‌లో చేరి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ సిస్టర్ నివేదితగా వివేకానందుడిచేత పిలిపించుకుంది. ఆ వి్ధముగా భారతదేశములో తన జీవితం దశాబ్దము గడిచింది. కాని ఎందుకో తాను అట్టేకాలం బ్రతకనన్న భావన మొదలైనది ఆమెలో. ఆ రోజుల్లో వైద్యవిధానాలు, చికిత్సలు అంతగా అభివృద్ధి చెందని కారణముగా తన అనారోగ్యానికి కారణం తెలియ పర్చలేదు. నా జీవితం మరో రెండేళ్ళు మించి లేదేమో అంటూ 1908లో ఆమె ఒక స్నేహితురాలికి ఉత్తరం రాసింది. ఏ స్నేహితురాలకైతే ఉత్తతం రాసిందో ఆమె మరణానికి దగ్గరగా ఉందని, తనను చూడాలనుకుంటుందని తెలిసి ఆరోగ్యము అంత బాగులేదని తెలిసికూడా బోస్టన్‌ వెళ్ళింది. దురదుస్టవశాత్తూ ఆ స్నేహితురాలి కూతురు నివేదిత మీద ఫిర్యాదుచేసింది. తమ తల్లిని మభ్యపెట్టి ఆస్తిని భారతదేశము తీసుకువెళ్తుందని ఫిర్యాదు. అలాంటి అవమానము తనకు జరుగుతుందని భావించని సిస్టర్ నివేదిత స్నేహితురాలి మరణం తర్వాత ఏప్రిల్ 11, 1911 న తిరిగి భారతదేశము వచ్చింది. జీవితములో నిరాశచెందిన ఆమె మనశ్శాంతి కోసము శాంతిదేశమైన భారత్‌లోనే మనగలిగింది. దసరా సెలవులలో ఆమె మనసుకు విశ్రాంతి అవసరమని ప్రశాంతవాతావరణం కోసము మిత్రుని కుటుంబంతో కలిసి డార్జిలింగ్ వెళ్ళి రక్తవిరేచనాలు పట్టుకున్నందున వైద్యము ఇప్పించినా ఆమె శరీరము స్పందించలేదు. చివరిదశలో అనేకరకాల ఆధ్యాత్మిక వాక్యాలు సిస్టర్ నివేదిత తన పుస్తకాలలో రాసుకున్నారు. ఆరోగ్యము మరింత క్షీణించడంతో 13 అక్టోబర్ 1911 న 2.30 గంటలకు తెల్లవారు జామున భగవంతునిలో లీనమైనది.

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • స్వాతి సపరివారపత్రిక లోని వ్యాసం.

యితర లింకులు

[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.