ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాస్‌

వికీపీడియా నుండి

మూస:No footnotes


అక్షాంశరేఖాంశాలు: 12°60′N 80°14′E / 12.99151, 80.23362 మూస:Infobox Indian Institute of Technology

ది ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టక్నాలజీ మద్రాస్‌ (ఐఐటీ మద్రాస్‌) దక్షిణ భారత దేశంలోని చెన్నై(గతంలో మద్రాస్‌)లో ఉన్న ఒక ఇంజినీరింగ్‌ మరియు టెక్నాలజీ పాఠశాల. భారత ప్రభుత్వం చేత, జాతీయ ప్రాముఖ్యత గల సంస్థగా గుర్తింపు పొందింది. భారతదేశంలో ఉన్న అత్యుత్తమ ఇంజినీరింగ్‌ సంస్థలలో ఒకటి.[1][2][3] పశ్చిమ జర్మనీ ప్రభుత్వం యొక్క సాంకేతిక మరియు ఆర్థిక సహకారంతో 1959లో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. భారత ప్రభుత్వం పార్లమెంట్‌లో చట్టం చేయడం ద్వారా రూపొందించిన 15 ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (2008లో కొత్త ఏర్పాటు చేసిన ఆరు, 2009లో ఏర్పాటు చేసిన రెండు కలిపి) ఐఐటీ మద్రాస్‌ మూడోది. ఇంజినీరింగ్‌ మరియు టెక్నాలజీలలో అత్యుత్తమ విద్యావకాశాలు, పరిశోధన కోసం వీటిని ఏర్పాటు చేశారు.[2][4]

ఐఐటీ మద్రాస్‌ 2.5 km²(620 ఎకరాల) విస్తీర్ణంలో క్యాంపస్‌ ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్‌ సంస్థ. ఇది గిండి జాతీయ పార్క్‌లో ఒక భాగంగా ఉంది. సంస్థలో సుమారు 360 మంది అధ్యాపకులు, 6 వేల మంది విద్యార్థులు మరియు 1250 మంది నిర్వహణ మరియు సహాయ సిబ్బంది ఉన్నారు. 1961లో భారత పార్లమెంటులో రూపుదిద్దుకొన్నప్పటి నుంచి ఈ సంస్థ ఎదుగుతూ వచ్చింది. దీని అద్భుతమైన క్యాంపస్‌లో అధిక భాగం గిండి నేషనల్‌ పార్క్‌ యొక్క రక్షిత అడవిలో భాగం. ఇది ఇప్పటికీ చితల్‌కు (మచ్చల దుప్పులు) స్వస్థలం. బ్లాక్‌బక్‌ మరియు ఇతర వన్యమృగాలకు ఇది కేంద్రం. 2003లో లోతు పెంచిన సహజసరస్సు, వర్షపు నీటిని తనలో ఇంకింపజేసుకుంటుంది.

విషయ సూచిక

[మార్చు] చరిత్ర

ప్రధాన వ్యాసం: History of Indian Institutes of Technology
దస్త్రం:Iitm maingate logo.jpg
ఆవరణ ప్రవేశద్వారంపై ఒక లోగో (అందంగా ఉన్న దీపం) ఉంటుంది. దాని పై సిద్ధిర్భవతి కర్మజా (భగవద్గీత నుంచి తీసుకున్నారు. కష్టపడటం ద్వారానే విజయం వస్తుంది అని అర్థం) అనే సూక్తి ఉంటుంది.

1956లో జర్మన్‌ ప్రభుత్వం, భారత్‌లో ఇంజినీరింగ్‌ కోసం ఒక ఉన్నత విద్యను అందించే సంస్థను ఏర్పాటు చేసేందుకు సాంకేతిక సహాయం అందిస్తామని ముందుకు వచ్చింది. మద్రాస్‌లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీని ఏర్పాటు చేసేందుకు తయారుచేసిన ఒప్పందం పై భారత్‌-జర్మనీ 1959లో బోన్‌లో సంతకాలు చేశాయి. సాంకేతికంగా, విద్యపరంగా, ఆర్థికంగా పశ్చిమ జర్మనీ ప్రభుత్వం సహకారంతో ఐఐటీ మద్రాస్‌ ప్రారంభమయింది. ఆ సమయంలో తమ దేశం బయట జర్మనీ ప్రభుత్వం స్పాన్సర్‌ చేసిన ఒకే ఒక సంస్థ ఇది. దీని వల్ల తర్వాతి కాలంలో జర్మనీలో అనేక ఏళ్ల పాటు విశ్వవిద్యాలయాలు, సంస్థలు అనేక ప్రయోగాలు చేయడం జరిగింది.[5] తర్వాతి కాలంలో జర్మనీ ప్రభుత్వం యొక్క అధికారిక మద్దతు ఆగిపోయినా, DAAD కార్యక్రమం మరియు హమ్‌బోల్డ్‌ ఫెలోషిప్‌ తదితరాలు ఉన్న ప్రయోగాత్మక ప్రయత్నాలు మాత్రం కొనసాగాయి.

1959లో కేంద్ర శాస్త్రీయ పరిశోధన మరియు సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ప్రొఫెసర్‌ హూమాయున్‌ కబిర్‌ ఈ సంస్థను ప్రారంభించారు. 1961లో ఏడు ఐఐటీలను జాతీయ ప్రాముఖ్యత ఉన్న సంస్థలుగా కేంద్రం గుర్తించింది, ఇందులో ఖరగ్‌పూర్‌ లో ఉన్న సంస్థ కూడా ఉంది. (1951లో స్థాపన), ముంబై (1958లో స్థాపన), చెన్నై (1959లో స్థాపన), కాన్పూర్‌ (1959లో స్థాపన), ఢిల్లీ (1961లో స్థాపన), గౌహతి (1994లో స్థాపన) మరియు రూర్కీ (1847లో స్థాపన, 2001లో ఐఐటీగా పెంపుదల) ఉన్నాయి. 2009లో ఐఐటీ మద్రాస్‌ స్వర్ణోత్సవాలను జరుపుకుంది.

[మార్చు] పాఠశాల ఆవరణ

దస్త్రం:Iitmgc.jpg
ప్రధాన ద్వారం తర్వాత ఉన్న ముఖ్యమైన ల్యాండ్‌మార్క్‌ గజేంద్ర సర్కిల్‌.ఇక్కడ ట్రాఫిక్‌ సర్కిల్‌లో ఉన్న ఫౌంటైన్‌కు ఇరు వైపులా రెండు రంగువేసిన ఏనుగు బమ్మలు ఒకదాని వెనక ఒకటి ఉంటాయి.

ఐఐటీ మద్రాస్‌ యొక్క ప్రధాన ప్రవేశ ద్వారం చెన్నైలోని సర్దార్‌పటేల్‌ మార్గంలో ఉంది. దీనికి రెండు వైపులా రెండు జిల్లాలు అడయార్‌ మరియు వెలాచెరి ఉన్నాయి. ఈ క్యాంపస్‌ తమిళనాడు గవర్నర్‌ అధికార నివాసం రాజ్‌భవన్‌కు చాలా సమీపంలో ఉంటుంది. ఇతర మార్గాలు వెలాచెరి (అన్నా గార్డెన్‌ ఎంటిసి బస్‌స్టాప్‌, వెలాచెరి ప్రధాన రోడ్‌), గాంధీ రోడ్‌ (కృష్ణ హాస్టల్‌ గేట్‌గా కూడా పరిచితం లేదా టోల్‌ గేట్‌) మరియు తారామణి గేట్‌ (అసెండెస్‌ టెక్‌పార్క్‌ వెనక)లలో ఉన్నాయి.

ఈ క్యాంపస్‌ చెన్నై విమానాశ్రయానికి పది కిలోమీటర్లు, చెన్నై సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌కు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్‌ సౌకర్యం బాగా ఉంటుంది.

దస్త్రం:Iitm.chemplast.pavilion.jpg
కెమ్‌ప్లాస్ట్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ పెవిలియన్‌

బోన్‌ ఎవెన్యూ, ఢిల్లీ అవెన్యూ అనే రెండు సమాంతర రోడ్లు, పచ్చదనపు ఆహ్లాదంతో, అధ్యాపకుల నివాస ప్రాంతంలోంచి సాగి, గజేంద్ర సర్కిల్‌ (GC) దగ్గర కలుస్తాయి. ఇది నిర్వహణ బ్లాక్‌కు దగ్గర్లో ఉంటుంది. గేట్‌, జిసి, అకడమిక్‌ జోన్‌ మరియు వసతి గృహాల మధ్య బస్‌లు మరియు విద్యుత్‌తో నడిచే చిన్న బస్‌లు తిరుగుతుంటాయి.

[మార్చు] సంస్థ

[మార్చు] పరిపాలన

దస్త్రం:Iitmadblock.jpg
అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ చట్టం ప్రకారం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఏడు ఐఐటీలను కలిపి ఐఐటి కౌన్సిల్‌ పర్యవేక్షిస్తుంది. ఇది భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ. భారత ప్రభుత్వం యొక్క కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి దీనికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ప్రతి సంస్థలో దాని నిర్వహణ మరియు నియంత్రణ బాధ్యత, దీని కోసం ఏర్పడిన బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌దే.

ఇన్‌స్టిట్యూట్‌ యొక్క ప్రొఫెసర్లతో ఏర్పాటైన సెనెట్‌, సంస్థ యొక్క అకడమిక్‌ సిద్ధాంతాలని నిర్ణయిస్తుంది. కరిక్యులమ్‌, కోర్సులు, పరీక్షలు, ఫలితాలు అన్నింటినీ ఈ సెనెట్‌ నియంత్రించడంతో పాటు ఆమోదించాల్సి ఉంటుంది. ప్రత్యేకించిన అకడమిక్‌ విషయాలను పరీక్షించడానికి సెనెట్‌ కమిటీలను ఏర్పాటు చేస్తుంది. బోధన, శిక్షణ, మరియు పరిశోధన అంశాలతో సహా వివిధ విభాగాల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, సౌకర్యాలు మరియు ప్రమాణాల పెరుగుదలకు కృషిచేస్తారు. సంస్థ యొక్క డైరెక్టర్‌, సెనెట్‌కు ఛైర్మన్‌కు వ్యవహరిస్తారు.

సెనెట్‌కు మూడు సబ్‌ కమిటీలు ఉంటాయి. అకడమిక్‌ పరిశోధన బోర్డు, అకడమిక్‌ కోర్సులకు సంబంధించిన బోర్డు, విద్యార్థుల యొక్క బోర్డులు- విద్యకు సంబంధించిన నిర్వహణ మరియు సంస్థ యొక్క కార్యాకలాపాలు సమర్ధంగా జరిగేలా చూడటంలో తోడ్పడతాయి. ఆర్థిక విధానాలకు సంబంధించిన విషయాల పై సలహాలు ఇచ్చేందుకు ఫైనాన్స్‌ కమిటీ ఉంటుంది. భవనాలు, మౌళిక సదుపాయాల గురించి సలహాలు ఇచ్చేందుకు బిల్డింగ్‌ మరియు వర్క్స్‌ కమిటీ ఉంటుంది. పరిశ్రమల కన్సెల్టెన్సీకి సంబంధించి, ఇండస్ట్రీయల్‌ కన్సల్టెన్సీ మరియు స్పాన్సర్డ్‌ రీసెర్చ్‌ బోర్డు సలహాలు, గ్రంథాలయానికి సంబంధించిన అంశాల గురించి గ్రంథాలయ సలహా కమిటీ ఉంటుంది.

[మార్చు] విభాగాలు

ఐఐటీ మద్రాస్‌లో 11 ఇంజినీరింగ్‌ విభాగాలు ఉన్నాయి.

  • ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌
  • అప్లైడ్ మెకానిక్స్
  • జీవ సాంకేతిక శాస్త్రం
  • కెమికల్‌ ఇంజినీరింగ్‌
  • సివిల్‌ ఇంజినీరింగ్‌
  • కంప్యూటర్‌ సైన్స్‌ మరియు ఇంజినీరింగ్‌
  • ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌
  • ఇంజినీరింగ్‌ డిజైన్‌
  • మెకానికల్‌ ఇంజినీరింగ్‌
  • మెటలర్జికల్‌ మరియు మెటీరియల్స్‌ ఇంజినీరింగ్‌
  • ఓషియన్‌ ఇంజినీరింగ్‌

మరో ఐదు ఇతర విభాగాలు కింది అంశాల్లో విద్యను అందిస్తాయి

  1. రసాయన శాస్త్రం
  2. గణితశాస్త్రం
  3. భౌతిక శాస్త్రం
  4. హ్యుమానిటీ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌
  5. మేనేజ్‌మెంట్‌ విద్య

[మార్చు] విద్యా విశేషాలు

ఐఐటీ మద్రాస్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మరియు పరిశోధన డిగ్రీలను ఇంజినీరింగ్‌, సైన్స్‌, హ్యూమానిటీస్‌ మరియు మేనేజ్‌మెంట్‌లలో 15 విభాగాలలో అందిస్తుంది. 360 మందికి పైగా అధ్యాపకులు రకరకాల సైన్స్‌ మరియు ఇంజినీరింగ్‌ విభాగం మరియు సంస్థ యొక్క సెంటర్స్‌లో బోధన మరియు పరిశోధన మరియు ఇండస్ట్రియల్‌ కన్సెల్టీకి సంబంధించిన విభాగాల్లో పని చేస్తున్నారు.ఐఐటీ మద్రాస్‌ దేశంలోనే గొప్ప బోధన, పరిశోధన మరియు పరిశ్రమల కన్సెల్టీలకు సంబంధించిన గొప్ప సంస్థగా తనకు తాను గుర్తింపు తెచ్చుకుంది.

ఈ సంస్థలో 15 అడమిక్‌ విభాగాలు మరియు ఆధునిక పరిశోధన కేంద్రాలు సుమారు వంద ల్యాబ్‌లతో ప్యూర్‌ సైన్స్‌, ఇంజినీరింగ్‌ విభాగాలతో ఉన్నాయి. ఐఐటీలు ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా కేంద్రాలుగా తమలాంటి [6]సంస్థల దగ్గర నుంచి గుర్తింపు పొందాయి. అకడమిక్‌ క్యాలెండర్‌ సెమిస్టర్‌ల చుట్టూ ఉంటుంది. ప్రతి సెమిస్టర్‌లోనూ కనీసం 70 రోజుల పాటు ఆంగ్లంలో సూచనలు ఉంటాయి. సెమిస్టర్‌ ఆసాంతం విద్యార్థులను రకరకాలుగా విలువ వేస్తారు. సంస్థకు ఉన్న స్వతంత్ర ప్రతిపత్తి దృష్ట్యా అధ్యాపకులే ఈ విలువలను తయారు చేస్తారు. పరిశోధన పనిని విద్యార్థులు సమర్పించిన థీసిస్‌ ఆధారంగా దేశంతో పాటు విదేశాలకు సంబంధించిన ఆయా అంశాల నిపుణులు లెక్కగడతారు. సంస్థ యొక్క అతిపెద్ద అకడమిక్‌ బాడీ సెనెట్‌, మొత్తం విద్యకు సంబంధించిన కార్యక్రమాన్ని ఖరారు చేస్తుంది.

[మార్చు] అండర్‌ గ్రాడ్యుయేట్‌ అకడమిక్స్‌

  • అండర్‌ గ్రాడ్యుయేట్‌ కరిక్యులమ్‌ కొరకు ప్రవేశాలు

JEE: ప్రతి ఏడాది ఐఐటీలలో ప్రవేశం కొరకు అన్ని సంస్థలు కలిసి ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తాయి. దీని ఆధారంగా ప్రవేశాలను కల్పిస్తారు. ఇది దేశంలో ఉన్న అతి కష్టమైన పరీక్షగా గుర్తింపు పొందింది.

[HSEE]: హుమానిటీస్‌ మరియు సోషల్‌ సైన్సెస్‌ వ్రవేశ పరీక్షను మద్రాస్‌ ఐఐటీ నిర్వహిస్తుంది. తనకు సంబంధించిన ఐదు సంవత్సరాల మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌కు సంబంధించి ఈ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. దీని ద్వారా కింద పేర్కొన్న ఏవైనా మూడు విభాగాల్లో M.A. డిగ్రీ పొందవచ్చు. డెవలెప్‌మెంట్‌ స్టడీస్‌ ఆర్థిక శాస్త్రం మరియు ఆంగ్ల విద్య. ఐఐటీ మద్రాస్‌ ఈ కోర్సుకు సంబంధించి కేవలం 39 మందికి ప్రవేశం కల్పిస్తుంది. ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్‌ ఈ విధంగా ఉంటుంది; ఆంగ్లం‌ మరియు కాంప్రహెన్సన్‌కు 25 శాతం, క్వాంటిటివ్‌ సామర్ధ్యం మరియు విశ్లేషణ‌ సామర్ధ్యంకు సంబంధించి 25 శాతం, జనరల్‌ స్టడీస్‌ (నాలుగు విభాగాల్లో విభజించబడి ఉంటాయి - భారత ఆర్ధిక శాస్త్రం, భారత సమాజం, ప్రస్తుత ప్రపంచ వ్యవహారాలు, పర్యావరణం మరియు ఎకాలజీ)కు సంబంధించి 50 శాతం మార్కులు ఉంటాయి.

[మార్చు] గ్రాడ్యుయేట్‌ అకడమిక్స్

  • గ్రాడ్యుయేట్‌ కరిక్యులమ్‌లోకి ప్రవేశాలు

GATE: ఇంజినీరింగ్‌ విద్యలో గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూట్ పరీక్ష ద్వారా ప్రవేశ పరీక్షను నిర్వహించి, ఐఐటీల్లో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ఇంజినిరింగ్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.

JAM: M.Sc. కొరకు జాయింట్‌ ఎడ్మిషన్‌ ద్వారా ఐఐటీల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ సైన్స్‌ కార్యక్రమానికి ప్రవేశాలు కల్పిస్తారు.

[మార్చు] మేనేజ్‌మెంట్‌ కార్యక్రమం

  • MBA కరిక్యులమ్‌కు ప్రవేశాలు

JMET: ది జాయింట్‌ మేనేజ్‌మెంట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌. ఐఐటీల యొక్క MBA కార్యక్రమానికి ప్రవేశాలు ఈ పరీక్ష ద్వారా కల్పిస్తారు. దీని తర్వాత గ్రూప్‌ టాస్క్‌ ఎక్సర్‌సైజ్‌ మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ కూడా ఉంటాయి.

[మార్చు] క్రెడిట్‌ పద్దతి

ఇతర ఐఐటీల మాదిరిగానే, మద్రాస్‌ ఐఐటీ కూడా అకడమిక్‌ ప్రదర్శనను గుర్తించడానికి క్రెడిట్‌ పద్దతిని అనుసరిస్తుంది. ఇందులో GPA రేంజ్‌ స్కేల్‌ 0 నుంచి 10 వరకూ ఉంటుంది. ప్రతి కోర్సుకు నిర్దేశిత సంఖ్యలో క్రెడిట్స్‌ ఉంటాయి. (సాధారణంగా 1 నుంచి 4). డిగ్రీ చేస్తున్న సమయలో విద్యార్థి, కనీసం కొన్ని క్రెడిట్స్‌ పొందాల్సి ఉంటుంది. ఈ క్రెడిట్స్‌ ఎంతనేది కార్యక్రమం, విభాగం మరియు ప్రత్యేకతల పై ఆధారపడి ఉంటుంది. ప్రతి కోర్సుకు కింద పేర్కొన్న అక్షరాల ద్వారా క్రెడిట్స్‌ ఇస్తారు.

లెటర్‌ గ్రేడ్‌ S A B C D E U W
గ్రేడ్‌ పాయింట్స్‌ 10 9 8 7 6 4 0 0

U గ్రేడ్‌ వస్తే కోర్సులో ఫెయిలయినట్లు. W వస్తే హాజరుకు సంబంధించిన కనీస అవసరాలను పూర్తి చేయలేదని అర్థం. ఈ రెండు సందర్భాలలోనూ విద్యార్థి ఫెయిలైనట్లే. GPAను కింద పేర్కొన్న ఫార్ములా ప్రకారం క్యుములేటివ్‌ వెయిటెడ్‌ సగటు ప్రకారం నిర్ణయిస్తారు.

 CGPA \,\! = {\sum_{i=1}^N C_i . {GP}_i \over \sum_{i=1}^N C_i}

ఇక్కడ:

  • N అంటే కోర్సుల సంఖ్య
  • C_i అంటే i^{th}కోర్సు యొక్క క్రెడిట్స్‌
  • {GP}_i అంటే i^{th}కోర్సుకు సంబంధించిన గ్రేడ్‌ పాయింట్లు
  • CGPA అంటే క్యుములేటివ్‌ గ్రేడ్‌ పాయింట్ల సగటు

ప్రస్తుతం, ఎక్కడైతే ఫెయిల్‌ గ్రేడ్‌ తర్వాత పాస్‌ గ్రేడ్‌ ఉంటుందో, అక్కడ CGPAను లెక్కించే సమయంలో ఫెయిల్‌ గ్రేడ్‌నుఏ లెక్కింపులోకి పరిగణనలో తీసుకోవడం లేదు. ప్రస్తుతం ట్రాన్‌స్క్రిప్ట్‌లో ఈ ఫెయిల్‌ గ్రేడ్‌లను తీసేసి, పాస్‌ గ్రేడ్‌ను సాధించడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారనేది, కింద ఒక నోట్‌లో పేర్కొంటున్నారు. కొన్ని కోర్సులలో పాస్‌-ఫెయిల్‌ కోర్సులుగా పరిగణిస్తున్నారు. ఇందులో విద్యార్థి పాస్‌ కావడం మినహా మరో అవకాశం విద్యార్థికి ఉండదు. ఏదేమైనా ఈ మార్కులు / గ్రేడ్‌లు CGPA లెక్కింపు సమయంలో పరిగణనలోకి తీసుకోరు.

[మార్చు] ఇతర అకడమిక్‌ కార్యక్రమాలు

[మార్చు] అకడమిక్‌ రీసెర్చ్‌ కార్యక్రమం

ఇన్‌స్టిట్యూట్‌లో అనేక ఆధునిక ప్రయోగశాలలు మరియు ఇంజినీరింగ్‌, ప్యూర్‌ సైన్స్‌ విభాగాలకు సంబంధించి సుమారు 100 ప్రయోగశాలలు ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న అధ్యాపకులతో పాటు తెలివైన విద్యార్థుల బృందం, అద్భుతమైన సాంకేతిక మరియు సహాయక సిబ్బంది ఉన్నారు. సమర్ధవంతమైన నిర్వహణ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉన్న పూర్వ విద్యార్థులు ఈ సంస్థ యొక్క ఖ్యాతి మరింత పెరగడానికి కారణం.

పరిశోధన కార్యక్రమాలు ఆయా విభాగాల్లో ఉన్న అధ్యాపకులు లేదా నిర్దేశిత పరిశోధనా సమూహాలు తీసుకుని చేస్తాయి. దీనికి గాను M.S‌ లేదా PhD డిగ్రీలు పొందుతారు. వివిధ విభాగాల్లో కార్యక్రమాల కోసం తీసుకున్న స్కాలర్స్‌, ఆయా విభాగాల అధ్యాపకుల సూచనలతో పరిశోధనలు కొనసాగిస్తుంటారు. ప్రతి విభాగం తమ ఆసక్తిని చేతి పుస్తకాలు, బ్రోచర్లు, బులెటిన్ల రూపంలో ప్రచురిస్తుంది. పరిశోధనకు తీసుకున్న ఆసక్తి అంశాలు థియరీగా లేదా ప్రాక్టికల్‌గా కూడా ఉండొచ్చు. ఐఐటీ మద్రాస్‌ గుర్తించిన ప్రత్యేక ప్రాంతాల్లో 16 వివిధ రకాల పరిశోధన ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేసింది.

ఈ విరామం లేని అకడమిక్‌ విద్య, ప్రతి స్థాయిలోనూ దీనికి సంబంధించిన ఇతర అంశాలతోనూ సమన్వయంతో సాగుతుంది. ఎక్స్‌ట్రామ్యురల్‌ ప్రసంగాల సిరీస్‌ కింద అనేక అంశాల గురించి విద్యకు సంబంధించిన ప్రత్యేక ఉపన్యాసాలు ఉంటాయి. అనేక సమావేశాలు, వర్క్‌షాప్‌లు, సింపోసియమ్స్‌ను అధ్యాపకులు ఏర్పాటు చేస్తారు. వీటికి ప్రపంచ వ్యాప్తంగా ఆయా అంశాల పై పరిశోధన చేస్తున్న వారు భారీ సంఖ్యలో హాజరవుతారు.

[మార్చు] ఇతర విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం

ఈ సంస్థ అనేక ఇతర విద్యా సంస్థలతో అకడమిక్‌ స్నేహాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక సంస్థలతో అధ్యాపకుల మార్పిడి కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ సంస్థ అనేక విదేశీ విశ్వవిద్యాలయాలతో మెమరాండమ్‌ ఆఫ్‌ అండర్‌స్టాండింగ్‌ (MOUs) చేసుకుంది. దీని వల్ల ప్రాజెక్టులలో పరస్పర సహకారంతో పాటు ఇద్దరికీ లాభాలు ఉంటాయి.

ఈ సంస్థకు చెందిన అధ్యాపకులకు అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి అనేక అకడమిక్‌ అవార్డులు లభించాయి. ఇందులో వీరికి వీరే సాటి.

[మార్చు] పారిశ్రామిక కన్సల్టెన్సీ మరియు స్పాన్సర్డ్‌ పరిశోధనలు

దస్త్రం:Iitm.icsr.jpg
ఇండస్ట్రియల్‌ కన్సల్టెన్సీ మరియు స్పాన్సర్డ్‌ రీసెర్చ్‌ బిల్డింగ్‌.

పరిశ్రమలతో భాగస్వామ్యం కావడం విషయంలో ఐఐటీ మద్రాస్‌ దేశంలోని మిగిలిన సంస్థలకు ఒక మంచి ఉదాహరణ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన కన్సల్టెన్సీ సర్వీస్‌ను చేసేది అధ్యాపకులే అయినా, భారతదేశ వ్యాప్తంగా అనేక ఇతర సంస్థలు స్పాన్సర్‌ చేసిన ప్రాజెక్టులలో వీరి యొక్క సరికొత్త ఆలోచనలను వాడుకున్నారు.

పరిశ్రమల కన్సల్టెన్సీ ద్వారా, అధ్యాపకులు మరియు సిబ్బంది పరిశ్రమకు సంబంధించిన నిర్దేశిత ఎసైన్‌మెంట్‌ను తీసుకుంటారు. ఇందులో ప్రాజెక్ట్‌ రూపకల్పన, పరీక్ష, విలువ లెక్కించడం, శిక్షణ ఇవ్వడం మరియు పరిశ్రమ అభివృద్ధికి కావలసిన సలహాలు ఇవ్వడం కూడా కలిసి ఉంటాయి. ఆసక్తి ఉన్న సంస్థలు, పరిశ్రమలు ఐఐటీ అధ్యాపకులను అడిగి, ప్రత్యేకించిన అసైన్‌మెంట్‌లను సెంటర్‌ ఫర్‌ ఇండస్ట్రియల్‌ కన్సెల్టెన్సీ మరియు స్పాన్సర్డ్‌ రీసెర్చ్‌ ప్రోగ్రామ్‌ (ICSR) ద్వారా ఇస్తాయి.

అధ్యాపకులు తీసుకున్న అనేక ప్రాజెక్టులకు, జాతీయ సంస్థలు ఆర్థిక సహకారాన్ని అందజేస్తాయి. ఇలాంటి పరిశోధనలు సమయాన్ని బట్టి ఉంటాయి. ఇందులో పాల్గన్న అభ్యర్థులు ప్రత్యేక డిగ్రీని పొందుతారు. సాధారణంగా ప్రాజెక్ట్‌ ప్రతిపాదనలను ఐఐటీ అధ్యాపకులు రూపొందిస్తారు. తర్వాత వీటిని ఆసక్తి ఉన్న సంస్థలకు పంపతారు. ఇందులో ఈ పరిశోధన ఆ సంస్థకు ఉపయోగపడటంతో పాటు దీనికి సంబంధించిన ఆర్థిక అవసరాలను సంస్థ తీరుస్తుందా లేదా అనే విషయాలను పరిగణనలో తీసుకుంటారు.

స్పాన్సర్డ్‌ ప్రాజెక్టులు తరచుగా వివిధ విభాగాల్లోకి కొత్త మానవ వనరులను తెచ్చుకోవడానికి మార్గాలుగా ఉపయోగపడతాయి. చాలా తరచుగా సంస్థలో తమ ప్రాజెక్ట్‌ సిబ్బంది డిగ్రీలను రిజిస్టర్‌ చేసుకుంటారు. అన్ని స్పాన్సర్డ్‌ పరిశోధన కార్యకలాపలాను ICSR సమన్వయపరుస్తుంది.

[మార్చు] విద్యార్థుల కార్యక్రమాలు

[మార్చు] షాస్త్రా

షాస్త్రా అనేది ప్రతి ఏడాది ఐఐటీ మద్రాస్‌లో జరిగే వార్షిక సాంకేతిక పండుగ. ఇది సాధారణంగా అక్టోబరు మొదటి వారంలో జరుగుతుంది. చెన్నైలో జరిగే విద్యార్థుల పండుగలలో తొలి ISO 9001:2000 సర్టిఫైడ్‌ కార్యక్రమం కూడా ఇదే. అత్యద్భుతమైన నిర్వహణ, కళ్లు తిరిగే స్థాయిలో కార్యక్రమాలతో, దేశంలో ఉన్న పెరుగుతున్న ఇంజినీరింగ్‌ నైపుణ్యానికి ఇది దర్పణం పడుతుంది. ఇందులో వర్క్‌షాప్‌లతో ఫోరమ్స్‌, వీడియో కాన్ఫరెన్స్‌లు, ఉపన్యాసాలు, వివరణాత్మక ప్రదర్శనలు‌ మరియు సాంకేతిక ప్రదర్శనలు ఉంటాయి. పోటీతత్వం ఉండే అంశాలను ఈవెంట్లుగా రూపొందిస్తారు. అనేక కార్యక్రమాలు, సిములేషన్స్‌, క్విజ్‌, అప్లైడ్‌ ఇంజినీరింగ్‌, రోబోటిక్స్‌, జంక్‌యార్డ్‌ వేర్స్‌ మరియు కాంట్రాప్షన్‌, ఇలా అనేక అంశాలతో ఇది ఆసక్తికరంగా సాగుతుంది.

[మార్చు] విభాగాల పండుగలు

అనేక విభాగాలు, తమ సంస్థ యొక్క విభాగాల పండుగలను నిర్వహించుకుంటాయి. ఎక్స్ బిట్‌, వేవ్స్‌, మెకానికా, CEA, కెమ్‌క్లేవ్‌, అమాల్‌గమ్‌ మరియు ఫోరేస్‌ అనేవి వరుస క్రమంలో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఓషియన్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, మెటలర్జికల్‌ మరియు మెటీరియల్స్‌ ఇంజినీరింగ్‌ మరియు మాథ్స్‌ డిపార్ట్‌మెంట్‌లు నిర్వహించుకునే పండుగలు.

పండుగ పేరు విభాగం
ఎక్స్ బిట్‌ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌
అమాలగామ్‌ మెటలర్జికల్‌ మరియు మెటీరియల్స్‌ ఇంజినీరింగ్‌
CEA సివిల్‌ ఇంజినీరింగ్‌
కెమ్‌క్లేవ్‌ కెమికల్‌ ఇంజినీరింగ్‌
ఫోరేస్ గణితశాస్త్రం
మెకానిక మేకానికల్ ఇంజినీరింగ్‌
వేవ్జ్‌ ఓషియన్‌ ఇంజినీరింగ్‌
సామాన్యాయ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌

[మార్చు] హాస్టల్స్‌ (వసతి గృహాలు)

ఐఐటీ మద్రాస్‌లో ఎక్కువ మంది విద్యార్థులు వసతి గృహాల్లోనే నివశిస్తారు. ఊపిరి సలపనివ్వని షెడ్యూల్‌తో ఉండే అకడమిక్‌ అంశాల నుంచి బయటకు వచ్చేందుకు అనేక ఎక్స్‌క్రటా కరిక్యులర్‌ అంశాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. క్యాంపస్‌లో మొత్తం 17 వసతి గృహాలు ఉన్నాయి. ఇందులో సరస్వతి మరియు సరయు అనే రెండు వసతి గృహాలు ప్రత్యేకంగా మహిళా విద్యార్ధినుల కోసం ఏర్పాటు చేశారు. మొదట్లో ప్రతి వసతి గృహానికి భోజన సౌకర్యం కూడా కలిసి ఉండేది. కానీ తర్వాతి కాలంలో వాటిని తొలగించారు. సరస్వతి మరియు నాలుగు ఏడు అంతస్తుల హాస్టల్స్‌ మెస్ హాల్స్ లేవు. ప్రస్తుతం భోజన వసతిని రెండు పెద్ద హాల్స్‌ వింధ్య మరియు హిమాలయ అనే పేరుతో నిర్వహిస్తున్నారు. ఈ వసతి గృహాల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ మరియు గ్రాడ్యుయేట్‌ విద్యార్థులు ఉంటారు. కాకపోతే ఇరువురికీ వేర్వేరు భవనాలు ఉంటాయి. ప్రవేశం కల్పించిన సమయంలోనే విద్యార్థులకు వసతిగృహాలను కూడా కేటాయిస్తారు. సాధారణంగా సంస్థలో ఉన్నంతసేపు వీరి వసతి ఇక్కడే ఉంటుంది.

హాస్టల్స్‌ను ప్రాథమికంగా ఉన్న నదుల పేర్లతో, క్యాంపస్‌లో తిరిగే బస్‌లను పర్వతాల పేర్లతో పిలుస్తారు. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా ఐఐటీ మద్రాస్‌ క్యాంపస్‌లో నదులు కదలకుండా అలాగే ఉంటాయి. పర్వతాలు కదులుతూ ఉంటాయి.

ప్రస్తుతం ఐఐటీఎమ్‌లో ఉన్న వసతిగృహాలు

  1. సరస్వతి (సరాస్‌)
  2. కృష్ణ
  3. కావేరి
  4. బ్రహ్మపుత్ర (బ్రహ్మాస్‌)
  5. తపతి
  6. గోదావరి (గొడే)
  7. అలకానంద (అలక్‌)
  8. జమున (జామ్‌)
  9. గంగ
  10. నర్మద (నర్మద్‌)
  11. మందాకిని (మందాక్‌)
  12. షరావతి (షరవ్‌)
  13. సరయు
  14. సింధు
  15. పంపా
  16. తామ్రపరణి (తంబి)
  17. మహానంది (మహాన్‌)

సింధు, పంపా, మహానంది మరియు తామ్రపరణి ఏడంతస్థుల భవనాలు. మిగిలినవి అన్నీ (పాత క్లాసిక్స్‌) వసతిగృహాలు మూడు లేదా నాలుగు అంతస్థుల నిర్మాణాలు (2000 ఆరంభం వరకూ అన్ని పాత వసతి గృహాలు మూడంతస్థులు ఉండేవి, తర్వాత అదనపు అంతస్థుతో, అదనపు గదులు నిర్మించారు. కామన్‌ రూమ్స్‌ పైన కొత్త గదులను నిర్మించారు). ఈ నాలుగు కొత్త వసతిగృహాలు 1500 మందికి పైగా విద్యార్థులకు ఆశ్రయం ఇవ్వగలుగుతాయి.

[మార్చు] పాఠ్యయేతర కార్యకలాపాలు

వార్షిక సాంస్కృతిక పండుగ సారంగ్‌ ప్రతి ఏడాది చలికాలంలో జరుగుతంది. సంస్థ యొక్క సాంకేతిక పండుగ షాస్త్రాగా పేరొందింది. ప్రతి శనివారం రాత్రి ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌లో ఒక సినిమా చూపిస్తారు. ఇందులో సాధారణంగా 7 వేల మంది పడతారు. ఇది ఎప్పుడూ నిండిపోతుంది. వార్షిక ఇంటర్‌ హాస్టల్‌ క్రీడల కార్యక్రమాన్ని షెరోటెర్‌ అని పిలుస్తారు.

ఇక్కడ అనేక హాబీ క్లబ్‌లు ఉన్నాయి. ఇందులో స్పీకింగ్‌ క్లబ్‌, ఆస్ట్రో క్లబ్‌ మరియు డ్రమెటిక్స్‌ ఉన్నాయి. ఇటీవల కాలంలో సంగీతం మరియు రోబోటిక్స్‌ బాగా ప్రాచుర్యం పొందాయి.

రెండు విద్యార్థుల సమూహాలు ద వివేకానంద స్టడీ సర్కిల్‌ (VSC) మరియు రిఫ్లెక్షన్స్‌ ఎక్కువగా ఆద్యాత్మిక చర్చల పై దృష్టి సారించాయి.

దస్త్రం:Iitm.oat.pit.jpg
ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌లో సినిమాలు చూపిస్తారు. రాక్‌షోలకు ఆతిథ్యమిస్తారు. కర్నాటిక్‌ సంగీతం యొక్క కార్యక్రమాలు జరుగుతాయి.

క్యాంపస్‌లో అందంగా ఉండే ఓ ప్రత్యేక స్లాంగ్‌ (మాట్లాడే విధానం) ఉంది. ఇది ఒక జర్మన్‌ విశ్వవిద్యాలయం మాస్టర్స్‌ థీసిస్‌ను ప్రచురించడానికి కూడా ఆకర్షించింది. ఇందులో ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు మరియు తమిళ్‌ కలిసి ఉంటాయి. ఈ భాషలన్నింటినీ కలిపి రూపొందించినీ స్లాంగ్‌ను చెన్నైలోని అనేక ఇతర కళాశాలలు కూడా అనుసరిస్తున్నాయి.

తన సోదర సంస్థల మాదిరిగా కాకుండా, ఐఐటీ మద్రాస్‌లో విద్యార్థులంతా ఒకే భాషలో మాట్లాడరు. తమిళ్‌, తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ అన్నీ వీరి భాషలను కలిపి మాట్లాడతారు. విద్యార్థులందరూ పాల్గనే కార్యక్రమాల్లో అంటే డిబేటింగ్‌, డ్రమటిక్స్‌, లఘుచిత్రాల నిర్మాణం మరియు ఇతర అంశాలన్నీ ఇంగ్లిష్‌లోనే జరుగుతాయి. ఇది వారి స్లాంగ్‌లోనూ కనిపిస్తుంది. ఉత్తర భారతదేశంలో ఉన్న ఇతర ఐఐటీల మాదిరిగా కాకుండా ఇక్కడ హిందీ కంటే ఆంగ్లం‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు.

[మార్చు] సదుపాయాలు

ఐఐటీ మద్రాస్‌లో SAC మరియు స్టేడియం మధ్య ఉన్న ఖాళీ మైదానంలో ఉన్న దుప్పి.

ఐఐటీ మద్రాస్‌ విద్యార్థులు, అధ్యాపకలు, నిర్వహణ మరియు సహాయక సిబ్బంది మరియు వారి కుటుంబాల కోసం నివాస వసతిని ఏర్పాటు చేసింది. బాగా ఎక్కువగా ఉండే విద్యార్థుల అవసరాలు తీర్చడం కోసం నివాస సముదాయాల్లోనే ప్రైవేటు క్యాటర్స్‌కు కూడా అనుమతి ఇచ్చారు. క్యాంపస్‌లో రెండు పాఠశాలలు (వాణవాణి మరియు కేంద్రీయ విద్యాలయ) ఉన్నాయి. మూడు గుళ్లు (జలకనాథేశ్వర స్వామి, దుర్గా పెలియమ్మన్‌ మరియు గణపతి దేవాలయాలు) ఉన్నాయి. మూడు బ్యాంక్‌ల శాఖలు (SBI, ICICI కెనరా బ్యాంక్‌) ఉన్నాయి. ఒక ఆసుపత్రి, షాపింగ్‌ సెంటర్స్‌, ఆహార శాలలు, వ్యాయామశాల, ఈతకొలను, క్రికెట్‌, ఫుట్‌బాల్‌, హాకీ, బ్యాడ్మింటన్‌ స్టేడియాలు ఉన్నాయి. అధిక వేగం ఉన్న ఇంటర్‌నెట్‌ అకడమిక్‌ జోన్‌తో పాటు అధ్యాపకులు, సిబ్బంది యొక్క నివాస జోన్‌లలోనూ అందుబాటులో ఉంది. వసతి గృహాలలో ఇంటర్‌నెట్‌ మధ్యాహ్నం రెండు గంటల నుంచి అర్ధరాత్రి వరకూ అందుబాటులో ఉంటుంది.

[మార్చు] ఆహారం

క్యాంపస్‌ లోపల అనేక రకాల ఆహార శాలలు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా మెస్‌లు కూడా ఉంటాయి.

ఆలివ్‌ కిచెన్‌ (మొదట్లో బసెరా) సరస్వతి వసతి గృహం ఎదురుగా ఉంది. ఇది సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకూ ఉంటుంది. ముఖ్యంగా ఉత్తరాతి వంటకాలను అందిస్తుంది.

ది గురునాథ్‌ పాటిసెరీ స్టుడెంట్స ఫెసిలిటీస్‌ సెంటర్‌ (SFC, చాలా తరచుగా గురు లేదా గురునాథ్‌ అని పిలుస్తారు) అన్ని రోజులూ అర్ధరాత్రి వరకూ తెరచి ఉంటుంది. ఇది ఒక బేకరీ. ఇందులో పళ్లరసాలతో పాటు, చాట్‌ మరియు ఇతర స్నాక్స్‌ అందుబాటులో ఉంటాయి.

టిఫనీస్‌ సెంట్రల్‌ గ్రంథాలయానికి దగ్గర్లో ఉంటుంది. ఇది సరయు మరియు సరస్వతి (రెండు అమ్మాయిల హాస్టల్స్‌)ల మధ్యలో ఉంటుంది. ఇది ఉదయం అల్పాహారం నుంచి రాత్రి ఒంటి గంట వరకూ తెరచి ఉంటుంది. ఇందులో అనేక రకాల వంటకాలు ఉంటాయి. చెన్నైలో ప్రాచుర్యం పొందిన అర్చనా స్వీట్స్‌ షాప్‌ కూడా ఇందులో ఉంటుంది.

మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ విభాగానికి ఎదురుగా 2006లో కేఫ్‌ కాఫీడే అవుట్‌లెట్‌ ప్రారంభించారు. ఇది రాత్రి ఒంటిగంట వరకూ ఉంటుంది.

ది క్యాంపస్‌ కేఫ్‌ సిబ్బంది యొక్క క్యాంటీన్‌గా పని చేస్తుంది. ఇది అకడమిక్‌ జోన్‌లోనే బస్‌స్టాప్‌కు దగ్గరగా ఉంది. ఇది శనివారంతో సహా వారంలో అన్ని రోజులూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ తెరచి ఉంటుంది.

ఒలివ్‌ కిచెన్‌ మరియు గురునాథ్‌ హాస్టల్‌ ప్రాంతంలో ఉండగా, టిఫినీస్‌, కేఫ్‌ కాఫీడే గ్రంథాలయానికి సమీపంలో ఉన్నాయి. అకడమిక్‌ జోన్‌లో దగ్గరగా ఉన్న ఆహారశాల మాత్రం ది క్యాంపస్‌ కేఫ్‌.

[మార్చు] విద్యాసంస్థలు

ఐఐటీ మద్రాస్‌ క్యాంపస్‌లో ఉన్న రెండు పాఠశాలలు కేవలం అధ్యాపకులు, సిబ్బంది యొక్క పిల్లలకే కాకుండా, సహచర ప్రాంతాలు వెలాచెరి, అడయార్‌ వాసులకు కూడా అందుబాటులో ఉంటాయి.

ది కేంద్రీయ విద్యాలయ లేదా సెంట్రల్‌ స్కూల్‌ గజేంద్ర సర్కిల్‌కు సమీపంలో ఉంది. ఇంది సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేసన్‌, న్యూఢిల్లీకి అనుబంధంగా పని చేస్తుంది. కెవికి చాలా పెద్ద ఆటస్థలం ఉంది. ప్రతి ఏడాది షాస్త్రా ఇక్కడే జరుగుతుంది.

ది వాణవాణి మెట్రిక్యులేషన్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌, బోన్‌ ఎవెన్యూకు సమీపంలో ఉంది. ఇది అధ్యాపకుల నివాస సముదాయానికి దగ్గర ఉంది. ఇది తమిళనాడు మెట్రిక్యులేషన్‌ సిలబస్‌ను అనుసరిస్తుంది.

[మార్చు] బ్యాంక్‌లు

ది స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన బ్రాంచ్‌ను గజేంద్ర సర్కిల్‌లో నడుపుతోంది. దీనికి రెండు ATM‌లు ఉన్నాయి. ఒకటి బ్రాంచ్‌లోనే ఉంది. మరొకటి హాస్టల్‌ జోన్‌లో తారామణి హౌస్‌లో ఉంది.

కెనరా బ్యాంక్‌ బ్రాంచ్‌ అధ్యాపకుల నివాస జోన్‌కు సమీపంలో షాపింగ్‌ సెంటర్‌లో ఉంది. దీనికి రెండు ATM‌లు ఉన్నాయి. ఒకటి బ్రాంచ్‌లో, మరొకటి హాస్టల్‌ జోన్‌లో గురునాథ్‌ వెనక ఉంది.

వీటికి అదనంగా, హాస్టల్‌ మేనేజ్‌మెంట్‌ భవనంలో హాస్టల్‌ జోన్‌లోనే ఐసీఐసీఐ ATM‌ ఉంది. లేడీస్‌ క్లబ్‌కు సమీపంలో ఇండియన్‌ బ్యాంక్‌ ATM‌ ఉంది.

[మార్చు] దుకాణాలు

టాటా బుక్‌ హౌస్‌ గజేంద్ర సర్కిల్‌ సమీపంలో, మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ విభాగం పక్కన కాఫీడే పైన ఉంది. ఇందులో ఎక్కువగా ఇంజినీరింగ్‌ విద్యకు సంబంధించిన పుస్తకాలు ఉంటాయి. కొన్ని ఫిక్షన్‌ మరియు ఇతర రచనలు దొరుకుతాయి.

హాస్టల్‌ జోన్‌లో ఉన్న విద్యార్ధుల సౌకర్యాల కేంద్రం‌ (SFC)లో గురునాథ్‌ నిర్వహిస్తున్న ఒక జనరల్‌ స్టోర్‌ ఉంది. సాధారణంగా ఐఐటీ విద్యార్థులకు కావలసినవి అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇందులో స్టేషనరీతో పాటు టాయిలెట్‌ సామగ్రి, దిండ్లు, మాట్రెసెస్‌, ప్లాస్టిక్‌ మగ్‌లు, బకెట్‌లు, టీ షర్ట్‌లు, కంప్యూటర్‌ పరికరాలు ఇలా అనేకం దొరుకుతాయి. ఇక్కడ ప్రత్యేకంగా గురునాథ్‌ గిఫ్ట్స్‌ అండ్‌ జెమ్స్‌ అనే దుకాణం ఉంది. ఇందులో ఐఐటి మెమరబులియా (మగ్స్‌, కీచైన్స్‌, పెన్‌స్టాండ్‌లు, టైస్‌, ఐఐటీ ట్యాగ్‌తో ఉన్న స్వెట్‌ చొక్కాలు), గ్రీటింగ్‌ కార్డులు, గిఫ్ట్‌ ఆర్టికల్స్‌, పుస్తకాలు, సిడిలు తదితర వస్తువులు దొరుకుతాయి. దీనికి అదనంగా గోదావరి హాస్టల్‌కు ఎదురుగా ఉన్న అలుమిని సంఘం ఆఫీసులోనూ ఐఐటీ మెమరబులియా అందుబాటులో ఉంటుంది.

SFCని సాధారణంగా గురునాథ్‌ అని పిలుస్తారు. ఇక్కడే ఆల్‌ఇండియా ట్రావెల్‌ ఏజంట్స్‌ కు సంబంధించిన ఒక బ్రాంచ్‌ ఉంది. ఇది ప్రయాణాలతో పాటు పాస్‌పోర్ట్‌ పొందడంలో సహకారం అందిస్తుంది.

అధ్యాపకుల జోన్‌లో ఉన్న షాపింగ్‌ సెంటర్‌ లోనూ అనేక షాప్‌లు ఉన్నాయి. నిత్యావసర వస్తువులు, కూరగాయల దుకాణం, లాండ్రీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మరొక లాండ్రీ విద్యార్థుల కోసం బ్రహ్మపుత్ర హాస్టల్‌ బేస్‌మెంట్‌లో ఉంది.

[మార్చు] దేవాలయాలు

రిజర్వ్‌ అడవిగా ఉన్న కాలం నుంచి ఉన్నవి ఇక్కడ మూడు పాత దేవాలయాలు ఉన్నాయి.

జలకనాథేశ్వర దేవాలయం (శివన్‌ దేవాలయం) ప్రధాన ద్వారానికి సమీపంలో ఢిల్లీ ఎవెన్యూ దగ్గర అధ్యాపకుల జోన్‌లో ఉంది. దుర్గా పెలియమ్మన్‌ దేవాలయం సుమారుగా ప్రధాన ద్వారం మరియు గజేంద్ర సర్కిల్‌కు మధ్యలో ఉంటుంది. ఇది కూడా ఢిల్లీ ఎవెన్యూ మీదే ఉంది. పాత వినాయకుడి దేవాలయం తారామణి హౌస్‌ వెనక భాగంలో, హాస్టల్‌ జోన్‌లో ఉంది. ప్రతి శనివారం సాయంత్రం ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి.

[మార్చు] ప్రముఖ పూర్వ విద్యార్థులు

ప్రధాన వ్యాసం: List of Indian Institute of Technology Madras alumni

[మార్చు] విద్యా విశేషాలు

  • సుబ్ర సురేశ్‌, మసాచుషెట్స్‌లో ఉన్న ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ స్కూల్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో ఇంజినీరింగ్‌ డీన్‌
  • కె.ఆర్‌. రాజగోపాల్‌, టెక్సాస్‌లోని ఎ అండ్‌ ఎమ్‌ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న ప్రొఫెసర్‌ మరియు ఇంజినీరింగ్‌లో నిపుణులు[7]
  • మార్టి జి. సుబ్రహ్మణ్యం, న్యూయార్క్ విశ్వవిద్యాలయంలోని స్టెర్న్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో చార్లెస్‌ ఇ. మెరిల్‌ ఆర్థిక శాస్త్రంలో ప్రొఫెసర్‌
  • సనత్‌ కె. కుమార్‌, కొలంబియా విశ్వవిద్యాలయంలో కెమికల్‌ ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్‌[8]
  • కె. సుధీర్‌, యేల్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో మార్కెటింగ్‌ ప్రొఫెసర్‌[9]
  • కె. రవికుమార్‌, సదరన్‌ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని మార్షల్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ఇన్పర్మేషన్‌ అండ్‌ ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌లో ప్రొఫెసర్‌.[10]
  • అనంత్‌ రామన్‌, హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో, బిజినెస్‌ లాజిస్టిక్స్‌ యొక్క UPS‌ ఫౌండేషన్‌ ప్రొఫెసర్‌.[11]
  • వి. కస్తూరి రంగన్‌, మాల్కమ్‌ పి. మెక్‌నాయర్‌, హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో మార్కెటింగ్‌ ప్రొఫెసర్‌.[12]
  • రమేశ్‌ గోవిందన్‌, సదరన్‌ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో కంప్యూటర్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌.[13]
  • జి.కె. సూర్య ప్రకాశ్‌, జార్జ్‌ ఎ. మరియు జుడిత్‌ ఎ. ఒలా నోబెల్‌, రసాయనశాస్త్రంలో సదరన్‌ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో.[14]
  • రామచంద్రన్‌ జైకుమార్‌, హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో గతంలో బిజినెస్‌ నిర్వహణ అంశంలో డేవూ ప్రొఫెసర్‌.[15]
  • సుబ్ర సురేశ్‌, ఇంజినీరింగ్‌లో ఫోర్డ్‌ ప్రొఫెసర్‌,MIT ఇంజినీరింగ్‌ [16]స్కూల్‌లో డీన్‌.
  • ఆనంద్‌ రాజారామన్‌, జంగ్లీ యొక్క వ్యవస్థాపకలు. ప్రస్తుతం వెంకి హరినారాయణ్‌తో కలిసి Kosmix.com‌ను నిర్వహిస్తున్నారు.
  • వెంకటేశన్‌ గురుస్వామి, కార్నెగి మెలన్‌ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌.
  • ఆర్‌ శంకర్‌ జె.ఆర్‌. హూఫ్‌మన్‌ యేల్‌ యూనివర్శిటీలో అప్లైడ్‌ ఫిజిక్స్‌లో ప్రొఫెసర్‌.[17]
  • నరసింహన్‌ జగదీష్‌, గోజుట బిజినెస్‌ స్కూల్‌లో ఫైనాన్స్‌ విభాగానికి డీన్‌[18]
  • శంకరన్‌ సుందరేశన్‌, ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయంలో కెమికల్‌ ఇంజినీరింగ్‌లో ప్రొఫెసర్‌.[19]
  • అరుణ్‌ సుందరరాజన్‌, న్యూయార్క్‌ విశ్వవిద్యాలయంలోని స్టెర్న్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ప్రొఫెసర్‌.[20]
  • హరి బాలకృష్ణన్‌, MITలో కంప్యూటర్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌
  • ఎల్‌. మహదేవన్‌, హార్వర్డ్‌[21] విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌, మెక్‌ఆర్థర్‌ సాధించిన వ్యక్తి 2009.[22]

[మార్చు] పరిశ్రమ

  • బి. యెన్. సురేశ్‌, (భారత స్పేస్‌ సైన్స్‌ మరియు టెక్నాలజీ, తిరువనంతపురం లో డైరెక్టర్‌) [1969 MTME]
  • అసిత్‌ కె బర్మా (సత్యం కంప్యూటర్స్‌, చెన్నైలో మార్కెటింగ్‌ మరియు స్ట్రాటజీ విభాగం వైస్‌ప్రెసిడెంట్‌)
  • గోపాలకృష్ణన్‌.ఎస్‌, (ఇన్ఫోసిస్‌కు సహ వ్యవస్థాపకులు మరియు మేనేజింగ్‌ డైరెక్టర్‌) [MS77 PH] [MT79 CS]
  • గురురాజ్‌ దేశ్‌పాండే (సికామోర్‌ నెట్‌వర్క్స్‌ వ్యవస్థాపకులు)[BT73 EE]
  • బి. ముత్తురామన్‌ (టాటా స్టీల్‌లో డైరెక్టర్‌) [BT66 MT]
  • సతీష్‌ పాయ్‌ (స్కల్మ్‌బర్జర్‌ ఆయిల్‌ఫీల్డ్‌ టెక్నాలజీస్‌లో ఉపాధ్యక్షులు)
  • డాక్టర్‌ సి. మోహన్‌ (IBM‌ ఫెలో మరియు IBM‌ ఇండియాలో ప్రధాన శాస్త్రవేత్త) [BT77 ChE]
  • డాక్టర్‌ మన్నిగి విక్రమ్‌రావు (హాలిబర్టన్‌లో చీఫ్‌ టెక్నాలజీ అధికారి)
  • జై మీనన్‌ (IBM‌ ఫెలో, IBM సిస్టమ్స్‌ అండ్‌ టెక్నాలజీ గ్రూప్‌లో CTO మరియు వైస్‌ప్రెసిడెంట్‌) - డిస్టింగ్విస్‌ అలుమునస్‌ అవార్డు గ్రహీత.
  • బి. శాంతానామ్‌ (సెయింట్‌ గోబైన్‌-భారత్‌కు సిఈఓ) [BT78 CV]
  • కాలిదాస్‌ మదయపెద్ది, ఫెల్ప్స్‌ డాడ్జ్‌ వైర్‌ అండ్‌ కేబుల్‌కు ప్రెసిడెంట్‌ మరియు ఫెల్ప్స్‌ డాడ్జ్‌ కార్పొరేషన్‌లో సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌.
  • డాక్టర్‌ కృష్ణన్‌ భరత్‌ (గూగుల్‌లో ముఖ్య సైంటిస్ట్‌, గూగుల్‌ న్యూస్‌ సృష్టికర్త)
  • ఫణీశ్‌ మూర్తి (ఐ గేట్‌కు సీఈఓ, అంతకు ముందు ఇన్పోసిస్‌లో ప్రపంచ వ్యాప్త సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌బోర్డుకు హెడ్‌గా పని చేశారు)
  • సునీల్‌ వధ్వాని (ఐ గేట్‌ వ్యవస్థాపకులు) [BT74 ME]
  • శ్రీహరి నారాసిపూర్‌ (ఐబిఎమ్‌ ఇండియాలో, రేషనల్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌) [MT83 ME]
  • డి. శివకుమార్ ‌(నోకియా ఇండియాలో, వైస్‌ప్రెసిడెంట్‌ మరియు కస్టమర్‌ అండ్‌ మార్కెట్‌ ఆపరేషన్స్‌ కంట్రీ జనరల్‌ మేనేజర్‌)[BT82 AE]
  • టి.ఎన్‌. హరి (అంబా రీసెర్చ్‌లో మేనేజింగ్‌ డైరెక్టర్‌ మరియు మానవ వనరుల విభాగానికి గ్లోబల్‌ హెడ్‌)[BT86 ME]
  • డాక్టర్‌ జలయ్య ఉన్నం (US చిన్న తరహా పరిశ్రమల నిర్వహణ సంస్థ నుంచి, నేషనల్‌ ప్రైమ్‌ కాంట్రాక్టర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు గ్రహీత) [BT70 MT]
  • కె.ఎన్‌. రాధాకృష్ణన్‌ (TVS‌ మోటార్‌ కంపెనీలో ప్రెసిడెంట్‌) [BT86 MT]
  • యోగేశ్‌ కుమార్‌ (హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌లో, లైట్‌ కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ (LCA-తేజాస్‌)కు డైరెక్టర్‌. [MT81 ME]
  • పార్థ డి సర్కార్‌ (హిందుజా TMT లిమిటెడ్‌లో సిఈఓ-ఐటి మరియు ITES‌) [BT88 MT]
  • సుందర్‌సన్‌ ఎస్‌(చెక్‌ట్రానిక్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లో ఆర్‌ అండ్‌ డి విభాగం డైరెక్టర్‌) [MT99 CS]
  • యోగేశ్‌ గుప్తా (ఫాట్‌వైర్‌ సాఫ్ట్‌వేర్‌కు ప్రెసిడెంట్‌ మరియు సీఈఓ) [BT81 EE]
  • కృష్ణ కొల్లూరి (నెవిస్‌ నెట్‌వర్క్స్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌లో ఒకరు, జునిపెర్‌ నెట్‌వర్క్స్‌లో ఎగ్జిక్యూటివర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌) [BT86 ME]
  • శ్రీనిచారి (టర్బో వర్క్స్‌లో ప్రెసిడెంట్‌ మరియు సీఈఓ) [BT81 ME]
  • బి.ఎన్‌. నరసింహ మూర్తి (హిందుజా టిఎమ్‌టిలో బిజినెస్‌ ట్రాన్సిసన్‌ మరియు డొమెస్టిక్‌ మార్కెట్స్‌కు సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌) [BT79 ME]
  • రాజ్‌ శ్రీకాంత్‌ (యూఎస్‌ఎలోని న్యూయార్క్‌లో అలెక్స్‌బ్రౌన్‌లో డ్యూష్‌ బ్యాంక్‌కు మేనేజింగ్‌ డైరెక్టర్‌)
  • కల్పతి ఎస్‌. సురేశ్‌ (SSi లిమిటెడ్‌లో చైర్మన్‌ మరియు సీఈఓ) [BT86 EE]
  • అరవింద్‌ రఘునాథన్‌ (డ్యూష్‌ బ్యాంక్‌లో మేనేజింగ్‌ డైరెక్టర్‌)
  • రామనాథన్‌ వి. గుహ (RSS‌ ఫీడ్‌ టెక్నాలజీని కనుగొన్న వ్యక్తి)
  • సి.వి. అవధాని(భారత దేశానికి డిప్యూటి కంట్రోలర్‌ మరియు ఆడిట్‌ జనరల్‌)[BT69 ME] [MS73 ME]
  • వెంకీ హరినారాయణ్‌ (కాస్మిక్‌కు సహ వ్యవస్థాపకులు) [BT88]
  • విష్‌ తాడిమెట్టి (కోర్లియంట్‌ వ్యవస్థాపకులు మరియు సైబర్‌టెక్‌కు సీఈఓ) [MT86 EE]
  • డాక్టర్‌ పి.చెల్లపాండి, భారత్‌లోని ఇందిరాగాంధీ సెంటర్‌ ఆఫ్‌ ఆటమిక్‌ రీసెర్చ్‌లో సేఫ్టీ గ్రూప్‌ డైరెక్టర్‌.
  • పి. ఆనందన్‌ (మైక్రోసాఫ్ట్‌ రీచెర్స్‌ ఇండియాకు మేనేజింగ్‌ డైరెక్టర్‌)[23]
  • డాక్టర్‌ ప్రభాకర్‌ రాఘవన్‌ (యాహు రీసెర్చ్‌కు హెడ్‌)[24]
  • వెంకట్‌ రంగన్‌ (క్లియర్‌వెల్‌ సిస్టమ్స్‌కు సహ వ్యవస్థాపకులు మరియు సీటిఓ) [BT81 ME][25]
  • రఘు రామకృష్ణన్‌ (యాహు రీసెర్చ్‌కు వైస్‌ప్రెసిడెంట్‌ మరియు, రీసెర్చ్‌ ఫెలో)

[మార్చు] ఇతరులు

  • సంత్‌ రాజిందర్‌ సింగ్‌ జి మహరాజ్‌ (ప్రముఖ అద్యాత్మిక నాయకులు మరియు కొలంబియా యొక్క అత్యుత్తమ పురస్కారం మెడల్‌ ఆఫ్‌ గోల్డెన్‌ క్రాస్‌ గ్రహీత, అనేక ఐక్యరాజ్యసమితి అవార్డులు సాధించారు. వరల్డ్‌ పార్లమెంట్‌ ఆఫ్‌ రిలీజియన్స్‌లో వక్త. 1989లో బెల్‌ ల్యాబ్స్‌ నుంచి పదవీ విరమణ చేశారు)[BT67].

[మార్చు] సూచనలు

  1. Murali, Kanta (2003-02-01). The IIT Story: Issues and Concerns. Frontline. తీసుకొన్న తేదీ: 2009-09-22.
  2. 2.0 2.1 "The Indian Institute of Technology Madras -- 50 Glorious Years", The Hindu, 2008-07-31. Retrieved on 2009-09-22.
  3. Indian Institute of Technology Madras (IIT Madras). StudyPlaces.com. తీసుకొన్న తేదీ: 2009-09-22.
  4. "At ‘Nostalgia,’ tributes to Indo-German ties", The Hindu, 2009-02-28. Retrieved on 2009-09-22.
  5. Madras, Indian Institute of Technology (2006-01-18). The Institute. తీసుకొన్న తేదీ: 2006-05-14.
  6. భారత్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాస్‌ (ఐఐటీ మద్రాస్‌) గురించి
  7. టెక్సాస్‌ ఏ అండ్‌ ఎమ్‌ విశ్వవిద్యాలయంలోకె.ఆర్‌. రాజగోపాల్‌
  8. కొలంబియా విశ్వవిద్యాలయంలో శాంత్‌ కె. కుమార్‌
  9. యేల్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో కె. సుధీర్‌
  10. సదరన్‌ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో రవి కుమార్‌
  11. హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో అనంత రామన్‌
  12. హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో వి. కస్తూరి రంగన్‌
  13. హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో రమేశ్‌ గోవిందన్‌
  14. సదరన్‌ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో జి.కె. సూర్య ప్రకాశ్‌
  15. Hansell, Saul. "Ramchandran Jaikumar, 53, Business Professor at Harvard", The New York Times, 2 March 1998. Retrieved on 26 July 2009.
  16. ఎం.ఐ.టి.లో సుబ్ర సురేశ్‌
  17. యేల్‌ విశ్వవిద్యాలయంలో ఆర్‌. శంకర్‌
  18. గోయిజుట బిజినెస్‌ స్కూల్‌లో నరసింహన్‌ జగదీశ్‌
  19. ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయంలో శంకరన్‌ సుందరేశన్‌
  20. ఒక ఇంటర్‌నెట్‌ కంపెనీ ప్రజల్లోకి వెళ్లినప్పుడు, దాని స్టాక్‌ విలువ వ్యూహాన్ని నిర్దేశిస్తుందా?
  21. హార్వర్డ్‌లో ఎల్‌. మహదేవన్‌
  22. మెక్‌ ఆర్డర్‌ ఫెలో ఎల్‌. మహదేవన్‌
  23. మైక్రోసాఫ్ట్‌ రీసెర్చ్‌లోపి. ఆనందన్‌
  24. యాహు రీసెర్చ్‌లో ప్రభాకర్‌ రాఘవన్‌
  25. క్లియర్వెల్ సిస్టమ్స్‌లో వెంకట్‌ రంగన్‌


[మార్చు] బాహ్య లింకులు

Commons-logo.svg
వికీమీడియా కామన్స్ లో కి సంభందించిన మీడియా ఉంది


మూస:Use dmy dates

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు