ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్
ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | ఈశ్వర్ చంద్ర బంధోపాధ్యాయ 1820 సెప్టెంబరు 26 బిర్సింఘ గ్రామం, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం పశ్చిమ మేదినాపూర్ జిల్లా, పశ్చిమ బెంగాల్, ఇండియా) |
మరణం | 1891 జూలై 29 కలకత్తా, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం కలకత్తా, పశ్చిమ బెంగాల్, ఇండియా) | (వయసు 70)
వృత్తి | రచయిత, సంఘసంస్కర్త, ఉపాధ్యాయుడు |
భాష | బెంగాలీ |
జాతీయత | భారతీయుడు |
పౌరసత్వం | బ్రిటిష్ ఇండియా |
సాహిత్య ఉద్యమం | బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనము |
ఈశ్వర చంద్ర విద్యాసాగర్ (సెప్టెంబరు 26, 1820 - జూలై 29, 1891) బెంగాలీ కవి, విద్యావేత్త, తత్త్వవేత్త, పారిశ్రామిక వేత్త, రచయిత, అనువాదకుడు, సమాజ సేవకుడు. బెంగాలీ లిపిని 1780 తరువాత మొదటి సారి క్రమబద్ధీకరించాడు.
ఙివితం చరిత్ర
[మార్చు]ఈశ్వర్ చంద్ర వీర షింగ గ్రామం (నేటి పశ్చిమ బెంగాల్) లో ఒక పేద బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. బాల్యమంతా పేదరికముతో గడుపుతూ ఎంతో పుస్తకజ్ఞానము సంపాదించెను. తండ్రి సంస్కృత ఉపాధ్యాయుడు కావడము చేత కొడుకు కూడా ఆదే వృత్తిని అవలంబించాడు. మొదట గ్రామంలో పాఠశాలలో చదివిన ఈశ్వర్ ఆ తరువాత తండ్రికి కలకత్తాలో 1828 లో ఉద్యోగము దొరకడముతో కలకత్తాకు మారెను. ఒక చుట్టము మధుసూదన్ వాచస్పతి, ఈశ్వర్ ను సంస్కృత కళాశాలకు పంపమని కోరగా అక్కడికి పంపబడెను.
1839 లో హిందూ న్యాయశాస్త్రములో ఉత్తీర్ణుడై విద్యాసాగర్ బిరుదును పొందెను. రెండు సంవత్సరముల తరువాత ఫోర్ట్ విలియమ్ కాలేజిలో ప్రధాన సంస్కృత పండిత్ పదవిని పొందెను. అక్కడ ఆయన సంస్కృత కళాశాలలో అన్ని కులముల బాలకులకు విద్య నేర్పించాలని, మహిళలను కూడా విద్యాభ్యాసానికి ప్రోత్సహించాలని పోరాటము మొదలు పెట్టెను. ఈశ్వర్ చంద్రకు భయము లేకపోవడము చేత, ఆతను తమ వాడు (బ్రాహ్మణుడు) కావడము చేత సంస్కృత కాలేజీ యాజమాన్యమునకు ఇబ్బంది పెరిగెను.
1849 లో కాలేజీ నుండి రాజీనామా చేసి, అభిమానుల ప్రోద్బలముతో ఒక సంవత్సరము తరువాత విద్యా విభాగములో అతని కోసము ఏర్పరిచిన సాహిత్య టీచర్ పదవిని వరించెను. ఆతను కాలేజీలో పైన చెప్పిన మార్పులు జరుగ వలెనని కోరెను. పాఠశాల ఇన్స్‌పెక్టర్ పదవిలో 20 స్కూళ్ళను స్థాపించెను. ఆ తరువాత ఫోర్ట్ విలియమ్స్ కాలేజీ మూతబడి కలకత్తా విశ్వవిద్యాలయము ప్రారంభము కాగా విద్యాసాగర్ స్థాపక సభ్యుడయ్యెను. ఆ తరువాత సంస్కృత ప్రెస్ అత్యంత సాఫల్యము చెంది అతని శక్తులన్నిటినీ వాడుకొనెను. ఆప్పటికే ఈశ్వర్ చంద్ర మహిళల హక్కుల కొరకు పోరాటము ప్రారంభించెను.
విద్యాసాగర్ ఔన్నత్యము విశాల హృదయము కలవాడని అతనిని ఎరిగిన వారు ఒప్పుకుందురు. ఆ రోజుల్లో చాలామంది సంస్కర్తల లాగే విద్యాసాగర్ ధనవంతుడు కాదు. ఆనాటి ధనికులకున్న అహంకారము లేకపోవడము వలన సమాజములో అదృష్టము లేనివారి పై కనికరము చూపడానికి వీలైనది. చిన్న, పెద్ద ఆందరికీ సహనము, వినయము లను నేర్పించెను. స్వామి వివేకానంద మాట్లాడుతూ "ఉత్తర భారత దేశములో విద్యాసాగర్ నీడ సోకని నా వయస్సు కలవాడు ఎవ్వడూ లేడు" అన్నాడు.
విద్యా సాగర్ అతని వితంతు వివాహాలు
[మార్చు]మహిళల జీవనగతిని మెరుగు పరచడానికి విద్యాసాగర్ అలుపెరగని ఉద్యమము యొక్క ఫలితాలు, చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతాయి. విద్యా సాగర్ కాలములో బ్రహ్మ సమాజం నాయకులైన రాజా రామ్మోహన్ రాయ్, కేశవ చంద్ర సేన్, దేవేంద్రనాథ్ టాగోర్, క్రైస్తవ మతముకు చెందిన అలెక్సాండర్ డఫ్, కృష్ణ మోహన్ బెనర్జీ, లాల్ బెహారీ డేలు కుడా సమాజ సంస్కరణలకు ప్రయత్నిస్తూ ఉండేవారు. వారిలా క్రొత్త, ఇతర సమాజములు సంస్కరణ పద్ధతులు ప్రవేశపెట్టకుండా, విద్యాసాగర్ హిందూసమాజము లోలోపల నుండి మార్పు తెచ్చుటకు ప్రయత్నించెను. ప్రఖ్యాత సంస్కృత కాలేజీ ప్రిన్సిపాల్‌గా పండితులను శాస్త్రములు చదివి వాటి అర్థములను సామాన్య మానవులకు అర్థమయ్యేలా చెప్పుటకు ఉత్సాహపరిచెను. శాస్త్రములు చదువుట వలన, పందొమ్మిదవ శతాబ్దములో అణగదొక్కబడిన మహిళల స్థితిని హిందూ ధర్మ శాస్త్రములు ఒప్పుకోవని, అధికారములో ఉన్నవారి మూర్ఖత్వమే దీనికి కారణమని తెలుసుకొనెను. న్యాయశాస్త్రములో మహిళలకు ధనము సంపాదనలో వారసత్వము, మహిళల స్వతంత్రత విద్యలలో సమాజమునకు ఉన్న అయిష్టతను కనిపెట్టెను.
అప్పటివరకూ బ్రహ్మసామాజములో అక్కడక్కడా జరుగే వితంతు వివాహములను ప్రధాన హిందూ సమాజములోకి విద్యాసాగర్ ఒంటిచేత్తో తీసుకొని వచ్చెను. బెంగాలీ కులీన బ్రాహ్మణులలో బహుభార్యత్వము విస్తృతంగా ఉండేది. కాటికి కాలుజాపి ఉన్న ముసలివారైన మగవారు యువతులను (ఒకోమారు చిన్నపిల్లలను, పసి పిల్లలను కూడా) పెళ్ళిచేసుకోవడానికి తయారుగా ఉండేవారు. ఆడపిల్ల పుట్టింట పెద్దమనిషవ్వడం అనేది ఒక సిగ్గుపడవలసిన విషయంగా భావించే ఆచారం ఈ విధమైన వివాహాలకు ఒకసాకుగా పరిణమించేది. పెళ్ళయిన కొద్దికాలంలోనే ఆ పిల్లను కన్నవారింట వదలివేసేవారు. ఆడపిల్లను కన్నవారు పెళ్ళి ఖర్చులు, కట్నాలు భరించడమే కాకుండా జీవితాంతం ఆ పిల్ల బాగోగులు చూడవలసివచ్చేది.
ఇక ఆ పిల్లలు కొద్దికాలానికే భర్తను కోల్పోయి జీవితాంతం దుర్భరమైన వైధవ్యాన్ని అనుభవించవలసి వచ్చేది. వేదన, కట్టుబాట్లు, పేదరికము, వివక్షత వారి నిత్యజీవితంలో భాగంగా ఉండేవి. వారు మాంసం, చేపలు, ఉల్లి, వెల్లుల్లి (ఇంకా పెక్కు కుటుంబాలలో చక్కెర కూడా) తినడం నిషిద్ధం. ఉదయాన్నే అందరికంటే ముందు లేచి చన్నీటి స్నానం చేసి, తడి చీర కట్టుకొని మంచు ఆరని పూలను కోయాలి. ఇంట్లో అందరికంటే వారిది ఆఖరి భోజనం, లేదా పస్తు. మగవారిని ఆకర్షించకుండా ఉండడానికి జీవితాంతం బోడితల, తెల్లచీర, ఇంకెవరికీలేనన్ని ఆంక్షలు, పూజానియమాలు వారికి అంటగట్టబడేవి. ఎందరో వితంతువులు ఇంటినుండి తరిమివేయబడి వారాణసి లేదా బృందావనం చేరి, ప్రార్థనతో పరిశుద్ధులవ్వాలనే తలంపుతో తలదాచుకొనేవారు. కాని వారిలో చాలామంది పడుపువృత్తికి, లేదా మగవారి అత్యాచారాలకు బలయ్యేవారు. ఆధారంలేని తల్లులుగా దుర్భరమైన జీవితాన్ని వెళ్ళబుచ్చేవారు.
విద్యాసాగర్ 1856లో వితంతుపునర్వివాహ చట్టం (15వ నెంబరు చట్టం) ప్రతిపాదించి దాని అమలుకు అన్నివిధాలుగా కృషిచేశాడు. అదే సంవత్సరం డిసెంబరులో సంస్కృత కళాశాలలో విద్యాసాగర్ సహోద్యోగి అయిన శ్రీష్‌చంద్ర విద్యారత్న ఈ చట్టం క్రింద మొదటిసారి ఒక వితంతువును పరిణయమాడాడు. ఈ పెళ్ళిని కుదిర్చిన విద్యాసాగర్ ఈ చట్టం అమలుకు నిర్విరామంగా శ్రమించాడు. సంప్రదాయ పురోహితులు వెలివేసిన అలాంటి పెళ్ళిళ్ళకు స్వయంగా ఆయనే పురోహితునిగా వ్యవహరించేవాడు. తన కొడుకు ఒక వితంతువును పెళ్ళాడడానికి ప్రోత్సహించాడు. పెళ్ళి చేసుకొనలేని వితంతువుల సహాయార్ధం ఒక నిధిని ఏర్పాటు చేశాడు. చాలా వితంతు వివాహాలకు ఆయన స్వయంగా ధనసహాయం చేసి ఆర్థికమైన ఇబ్బందులలో పడ్డాడు.
గౌతంఘోష్ సినిమా అంతర్జలి యాత్ర 19వ శతాబ్దంలో బెంగాలీ కులీనబ్రాహ్మణ కుటుంబంలో బహుభార్యాత్వం ఇతివృత్తంగా నిర్మింపబడింది. అ సినిమాలో ఒక పడుచు తన ముసలిభర్త మరణంకోసం గంగానది తీరాన వేచి ఉంటుంది (అప్పుడు రోగగ్రస్తులను తరచు అలా వదిలివేసే వారు) .
సంస్కృత ముద్రణాలయం
[మార్చు]1847 లో విద్యాసాగర్ సంస్కృత ముద్రణాలయము, తాళ పత్ర గ్రంథములను భద్రపరచు కేంద్రము (Depository) ను అమ్హెర్స్ట్ వీధి, కలకత్తాలో 600 రూపాయల అప్పుతో ప్రారంభించెను.[1] కృష్ణసాగర్ జమిందారుల వద్ద ఉన్న ఆనందమంగళ కావ్యము, ఆ తరువాత భేతాళ పంచవింశతి (ప్రముఖ విక్రమభేతాళ కథలు) ని సంస్కృత కథాచరితసాగర్ నుండి అనువదించెను. 1849 లో మిత్రుడు మదన్ మోహన్ తర్కాలంకార్ తో కలిసి పిల్లల బొమ్మల కథలు శిశు శిక్షను ప్రారంభించెను. భొధోధోయ్ (జ్ఞానము యొక్క సూర్యోదయము, 1850) ను రచించెను. ఐదు సంవత్సరముల తరువాత వర్ణ పరిచయము (బెంగాలీ అక్షర సంగ్రహము) ను రచించెను. ఆ పాఠ్యపుస్తకమును ఈనాడు కూడా బెంగాలీ బాలురు ఎలిమెంటరీ పాఠశాలలో వాడుతున్నారు.
విద్యాసాగర్, తర్కాలంకార్ సర్వ వ్యాప్తమైన శిశు భోదకము, బాల బోధము, వర్ణ బోధము, ఇతర పాఠ్య పుస్తకములను జానపదములు, సామెతలు, అర్థశాస్త్ర శ్లోకములు, శాప విమోచన మార్గములు, మహా పురాణాల నుండి కథలు గల ఇంటిపుస్తకములుగా మార్చడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. విద్యాసాగర్ బెంగాలీలో టైపు చేయు విధానమును 12 అచ్చులు, 40 హల్లులలో సర్దెను. ప్రింటర్లు టైపు చెయ్యలేని ఆసాధారణ, ఖర్చుతో కూడిన సంయుక్త అక్షరము లను సులభము చెయ్యడానికి ప్రయత్నించెను. దానికి బదులు చూపించలేక పోవడము వలన ఇందులో సాఫల్యము పొందలేక పోయెను.[2] 1857 లో సంస్కృత ప్రెస్ లో 84, 200 పుస్తకముల కాపీలను ప్రచురించి అమ్మెను.
వారసత్వముగా గాని, సొంతముగా గాని ఆస్తి లేకపోవడము వలన విద్యాసాగర్ కు, సంస్కృత ముద్రణాలయం (ప్రెస్) విజయము చాలా అవసరమయ్యెను. అంతే కాకుండా బెంగాలీ ప్రజలతో మాట్లాడుటకు ఒక సాధనమును కూడా సమకూర్చెను. విద్యాసాగర్ పదములను ఆ నేల మీద ప్రతీ వారికి అందచేసెను. దుకాణములో గిరాకీ పెరగడము వలన విద్యాసాగర్ కు వ్రాయడానికి ఉత్సాహము కలిగెను. సందేశములను పుస్తకముల ద్వారా అందించుట, పాఠాలు నేర్పడమే కాకుండా మానవతా వాద కార్యములకు కూడా పనికి వచ్చెను. విద్యాభ్యాసము ద్వారా సంఘ సంస్కరణ ఆలోచనలను వేరే వారి నెత్తి మీద రుద్దకుండా వాటిని ఆచరణలో పెట్టి ఉదాహరణ ద్వారా జనులకు చూపించడానికి వీలు కలిగెను.
విద్యాసాగర్ మేళా, విద్యను సమాజమును గురించి జ్ఞానము పంచే పండుగ, ఆతని జ్ఞాపకార్థము 1994 నుండి ప్రతీ సంవత్సరము జరుగుతున్నది. 2001 నుండి కలకత్తా, బీర్సింఘా లలో జరుగుతున్నది.
మూలములు
[మార్చు]- ↑ Nikhil Sarkar, ‘Adijuger Patthopustak’ (Early Textbooks) in Chittaranjan Bandyopadhyay, Dui Shotoker Bangla Mudron o Prokashon (Two Centuries of Bengali Printing and Publishing), (Calcutta: Ananda, 1981) pp. 172-74 (Bengali language source).
- ↑ Barun Kumar Mukhōpadhyay, ‘Bangla Mudroner Char Jug’ (The Four Ages of Bengali Printing), in Chittaranjan Bandyōpadhyay, Dui Shotoker Bangla Modron o Prokashon, p. 89.
- భారతదేశం
- సంఘసంస్కర్తలు
- భారతీయ సంఘ సంస్కర్తలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with NLA identifiers
- బెంగాల్ చరిత్ర
- బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం
- 1820 జననాలు
- 1891 మరణాలు
- తత్వవేత్తలు
- భారతీయ రచయితలు
- పశ్చిమ బెంగాల్ వ్యక్తులు