ఉరుము నృత్యము

వికీపీడియా నుండి
(ఉరముల నృత్యం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఒక కళారూపం

అనంతపురం జిల్లా జానపద కళారూపం - ఉరుము నృత్యం. చితికి జీర్ణమైపోయిన అనేక జానపద కళారూపాలు ఈనాడు మనకు కనబడకుండా కనుమరుగై పోయాయి. అలా కనుమరుగైన కళారూపాలలో ఉరుముల నృత్యం ముఖ్యమైనది. తలకు అందంగా రుమాళ్ళు చుట్టుకుని మెడలో కాసుల దండలు ధరించి ఎఱ్ఱని, పచ్చనివీ శాలువలు కప్పుకుని, నిలువు అంగీలు ధరించి, పల్ల వేరు చెట్టు కర్రతో తయారు చేసిన ఉరుములకు చర్మపు మూతలు మూసి, కదర పుల్లలతో వాయించు కుంటూ దేవాలయ ప్రాంగణాల్లో, ఉరుముల నృత్యం చేస్తూ వుంటారు. ఉరుము అనే పేరును బట్టి వాయిద్య ధ్వని ఉరుమును పోలి వుండ వచ్చును. అందు వల్ల వాటికి ఉరుములు అనే నామకరణం చేసి వుండవచ్చు.

ఉరుము నృత్యం

[మార్చు]

అనంతపురం జిల్లాకే ప్రత్యేకమైన జానపద కళారూపం ఉరుము నృత్యం. అనంతపురం జిల్లాలో దాదాపుగా రెండు వందల కుటుంబాలు ఈ వృత్తితో జీవనం సాగిస్తున్నారు. బృంద నృత్యానికి చెందిన ఈ కళారూపం కులపరమైనది కూడా. మాల తెగకు చెందిన వారి జీవన వృత్తి ఉరుము నృత్యం. జానపద కళారూపాలలో చాలా కళలు దైవారాధనలో భాగంగా వృత్తివిద్యలయ్యాయి. ఉరుము నృత్యం కూడా దైవారాధనలో వృత్తి విద్యగా మారిందే. మాల తెగలో ఉరుము వాయించే వీళ్ళను ఉరుములోళ్ళు అంటారు. ఉరుములోళ్ళు చెన్నకేశవుని వారసులమని మాచెర్ల గోత్రీకులమని చెప్పుకుంటారు.

ప్రకృతితో జానపదుడికి ప్రత్యక్ష సంభంధం ఉంది అనడానికి, జానపదుడు ప్రకృతిని దగ్గరనుండి పరీక్షించాడనడానికి ఉరుము వాద్య నిర్మాణమే నిదర్శనం. మేఘ గర్జన ఉరుము నిర్మాణానికి దారితీసింది. మేఘ గర్జనను ఉరుము అంటారు. ఈ ఉరుము శబ్దం భయంకరంగా ఉంటుంది. జానపదుడు కూడా ఉరుము శబ్దాన్ని సృష్టించడానికి ఒక వాద్యాన్ని తయారుచేసుకున్నాడు. అదే ఉరుము వాద్యం. ఈ వాద్యాన్ని వాయించేటప్పుడు వచ్చే శబ్దం భయంకరంగా ఉంటుంది. ఉరుము వాద్యాన్ని వాయిస్తున్నపుడు ఒళ్ళు గగురుపొడుస్తుంది. మేఘ గర్జన ఎంత భయం కలిగిస్తుందో ఉరుము వాద్యాన్ని వాయిస్తున్నపుడు పుట్టే శబ్దం అంతే భయాన్ని కలిగిస్తుంది. మేఘ గర్జననే ఉరుము అంటారు. ఉరుము వచ్చినపుడు జనపదులు భయపడిపోతారు. ఆ సమయంలో ప్రతి జానపదుని నోటా..

  • అర్జున అర్జున ఫల్గుణా
  • అర్జున మొండిగోడ కింద
  • ముండమోపులున్నారు బద్రం అర్జున... అనే మాటలు వినిపిస్తాయి. అర్జునుడు ఇంద్రుని కుమారుడు. ఇంద్రుడు మేఘాలకు అధిపతి. వర్షం వచ్చే సమయంలో అర్జునుడి రథం వస్తుందని అ రథ చక్రాల అదురులు ఉరుములుగా వస్తాయని గ్రామీణుడి నమ్మకం. ఇప్పటికి ఈ నమ్మకం కొనసాగుతూనే ఉంది. ఈ శబ్దం భయంకరమైనది అయినా దీనిని అనుసరించి చేసే నృత్యం ఆకర్షణీయంగా, హృద్యంగా ఉంటుంది. (డా. చిగిచర్ల కృష్ణా రెడ్డి; జానపద నృత్య కళ) మతపరమైన కర్మ కాండతో ముడిపడి ఉన్న సాంప్రదాయ కళలు ఏదో ఒక మతానికి కట్టుబడి ఉంటాయి. ఉదాహరణకు గొరవయ్యల నృత్యం శైవ మతారాధనలో భాగమైంది. కానీ ఉరుములోల్లూ మాత్రం అన్ని మతాల దేవతలను ఆరాధిస్తారు.


ఉరుముల వారిని అక్కమ్మ దేవతల ప్రతిరూపంగా భావిస్తారు. దైవ సమానంగా భావించి ఆ దేవతలను పూజించే సమయంలో వారి కాళ్ళు కడిగి పాదాభివందనం చేస్తారు. నిండు కుండలోని అన్నం ఇంటి ముందుకొచ్చిన ఉరుములోల్లకు భోజనం పెడ్తారు. ఉరుములోల్లు బీజాక్షరాలతో వారిని దీవించడం కనిపిస్తుంది. ఈ బీజాక్షరాల వాక్కులు మూడు. 1. అమృత వాక్కు 2. విషవాక్కు 3. వేదవాక్కు.

రాయల కాలంలో

[మార్చు]

విజయనగర సామ్రాజ్య కాలంలో వీరికి మాన్యాలు ఇచ్చినా కాలక్రమేణా అంతరించి పోయి, ప్రస్తుతం కుల వృత్తిని నమ్ముకుంటూ పొట్ట గడవని స్థితిలో డెబ్బై కుటుంబాల దాకా ఉరుములవారు అనంతపురం జిల్లాలో ఉన్నారు. వీరిని ఉరుములోళ్ళు అని కూడా పిలుస్తారు. వీరు మాల తెగలో ఎక్కువగా ఉన్నారు. ఉరుము అనబడే చర్మ వాయిద్యం ప్రాచీనమైంది. ఆదిమ జాతుల నర్తన రూపంలో వలయాకార విన్యాసాలు చేస్తూ ఉరుములతో భయంకర మైన శబ్దాలు సృష్టిస్తూ, వీరు చేసే నాట్య అతి గంభీరంగా వుంటుంది.ఉరుముల వాయిద్యం ఒకే సారి ఏక ధాటిగా వాయిస్తే కారు మొయిళ్ళు ఉరుములతో పయనిస్తున్నట్లు భ్రమ వ్వక్త మౌతుంది. అందుకే ఆ వాయిద్యానికి ఉరుము అని పేరు పెట్టారేమో ననిపిస్తుంది. ఒక చేత అరీరణం యొక్క చర్మాన్ని ప్రేము పుల్లలతో రాస్తూ ఈ శబ్దాలు సృష్టిస్తారు. మరో చేతితో పుల్లతో లయ విన్యాసాలు తాళ యుక్తంగా సాగుతాయి. వీరి ఆరాధ్య దైవం శ్రీశైల మల్లన్న. ఆయన మహాత్య్వ గాథలు ఉరుముపై దరువులు వేస్తూ గాన చేస్తారు. చరణానికి చరణానికీ మధ్య ముక్తాయింపుల్తో గంభీరమైన శబ్దాలు సృష్టించి వలయాకార విన్యాసాలు చేస్తారు:

ఉరుము వాద్య నిర్మాణం

[మార్చు]

ఈ ఉరుము వాద్యానికే వీరణం అని పేరు. చిత్తూరు జిల్లాలో వీరణం అనే వాద్యం ఉంది. కానీ వీరణానికి ఉరుముకు తేడా ఉంది. ఉరుము మద్దెల ఆకారంలో ఉంటుంది. ఒకటిన్నర అడుగుల వ్యాసార్ధం, రెండున్నర అడుగుల పొడవు ఉంటుంది. ఇత్తడి లేదా కంచు చేత తయారు చేస్తారు. మద్దెల లాంటి ఈ గొట్టానికి ఇరువైపులా మేక చర్మం బాగా శుద్ధి చేసి అమర్చబడి ఉంటుంది. రెండువైపులా చర్మాలను బిగించేందుకు రెండు కడియాలు వేస్తారు. చర్మాలకు తాళ్ళ బిగింపు వల్ల మంచి బిగింపు వస్తుంది. ఖాదర కాయ చెట్టు పుల్లలను ఈ వాద్యాన్ని వాయించడానికి ఉపయోగిస్తారు. ఎడమచేతిలోని పుల్లతో రాపాడిస్తారు. ఎడమచేతి లోని పుల్లను జిగుపుపుల్ల అంటారు. కుడి చెతిలోని పుల్లతో వాయిస్తారు. దీనిని కొట్టుడు పుల్ల అంటారు. ఎడమవైపు పుల్లతో రాపాడిస్తే బూర్ బూర్ బూర్ బూర్ అనే శభ్దం వస్తుంది. కుడివైపు పుల్లతో కొడితే డబు, డబు, డబు, డబు అనే శబ్దం వస్తుంది.

ఉరుములోల్లు నిష్టాగరిష్ఠులు. వీరిలో నియమాలు ఎక్కువ. ఇంట్లో ఈత పరకలు వాడరు. ఈత చెట్టు క్రింద కూర్చోరు. కాళ్ళకు చెప్పులు ధరించరు. వీరు అక్కమ్మ దేవతను కొలుస్తారు. ఈమె గ్రామదేవత. ఉరుముల వాళ్ళను అక్కమ్మ దేవతకు ప్రతిరూపంగా భావిస్తారు. వీరు అక్కమ్మ దేవత సృష్టి అని చెప్పడానికి ఒక కథ ఉంది.

శివుడు తన తలలోని నాలుగు జడపాయలను నాలుగు లోకాలకు విస్తరిస్తాడు. నాగలోకంలోని అక్కమ్మ శివుని జడను చూసి ఈ జడయే ఇంత సుందరంగా ఉంటే కైలాస సౌందర్యం ఎలా ఉంటుందోనని ఆ జడ ద్వారా కైలాసం చేరుకుంటుంది. పార్వతి పరమేశ్వరులు అక్కమ్మను భూలోకం ఏలుకోవడానికి అనుమతి ఇస్తారు. అక్కమ్మ పంచాంగం అడగడానికి పాల కొండమల దగ్గర ఉన్న బ్రహ్మ ముని దగ్గరకు పోతుంది. బ్రహ్మ ముని భయపడి గుహలో దాక్కుంటాడు. అక్కమ్మ పిలిచినా బ్రంహముని పలకడు. అక్కమ్మ మట్టితో రెండు బొమ్మలను చేసి వాటికి ప్రాణం పోసి సింగరయ్య, సోమన్న అని పేర్లు పెట్టి వేపమాను తొలిపించి మేకచర్మంతో రెండువైపుల మూయించి కుదురు పుల్లలతో వాద్యాన్ని వాయించమని పురమాయించిందని, ఆ వాద్యాల ద్వనులు ఓంకారంలా ద్వనించి ఉరుములా వినిపిస్తే బ్రహ్మ ముని బయటకు వచ్చాడని సింగరయ్య, సోమన్నలకు అక్కమ్మ బీజాక్షరాలను ప్రసాదించిందని కథ.

వాయిద్యపు తీరు

[మార్చు]

వాయిద్యాన్ని ఈ విధంగా ప్రారంభిస్తారు:

బూర్ బూర్ బూర్ బూర్
డబు డబు డబు డబు
యరడడ్డ బూర్ బరడ్డ
డబు డబు డబు డబు

అని వాయిస్తూ పుల్లలతోనే చేతులెత్తి ప్రేక్షకులకు నమస్కారం చేసి పరాకు పరాకూ అనే వచనాన్ని వల్లిస్తారు. తరువాత డప్ డప్ డప్; డప్ డప్ డప్; డప్ డప్ డప్ అంటూ వాయిస్తూ అందరూ వలయాకారంగా వుంటూ రెండు కాళ్ళను పెనవేసుకుంటూ శరీర్ఫాన్నంతా వూపుతూ ఎగురుతూ నృత్యం చేస్తారు. ఒక్కొక్క ధ్వనికి ఒక్కొక్క ఎగురు ఎగురుతూ మధ్య మధ్య, ఆహా, ఓహో అంటూ ఉరుములను ఉదృతంగా వాయిస్తారు.

కుంకాలాట

[మార్చు]

ఉరుములు వాయిస్తూనే కుంచెల నృత్యం చేస్తారు. దీనిని కుంకాలాట అంటారు. నెమలి ఈకలతో కుంచెల్ని తయారు చేసుకుంటారు. ఈ కుంచెల్ని రెండు చేత్గులతో తల మీద వుంచుకుని వరుసగా నిలబడతారు. వీరు బావిలో మునిగి స్నానం చేసి వస్తారు. ఉరుము వాయిద్య సాగుతుండగా కళ్ళు మూసుకుని వుంటారు. ఉరుములోళ్ళు వారికి పూనకం తెప్పించటానికి ఉరుముల వాయిద్యాన్ని దద్దరిలచేస్తూ ఇలా మేలు కొలుపు పాడుతారు.

మేలుకొనవే వో మేలుకొనవే
అమ్మ నీవు పుట్టక ముందేనాడు
యిగము లేడూ జగము లేడూ......................:మే:

అమ్మ మచ్చు మాయల వో గంగి నీవూ
పీనిగెలు తినే పిశాచివో
సామి గంగ లేని వో తానమే లేదు....................:మే:

గంగ లేని వో జలకమ్మే లేదు
సామీ నీవు పుట్టక ముందేనాడూ
నరుడు లేడు నారాయనుడే లేడు.....................:మే:

పాట అవగానే కుంచెలు పట్టుకున్న వారంతా వూగటం ఒక్కొక్క అడుగు వెనక్కి, ముందుకు వేయటం చేస్తుండగా చుట్టూ చేరిన జనం బండారు కుంకాన్ని చల్లుతారు. పూనకంలో వున్న వారు వాయిద్యానికి తగినట్లు అడుగులు వేస్తారు. అలా అడుగులు వేసి వేసి అలసి పోయిన వారి నోటిలో ఒక నిమ్మ పండు నోట్లో పెడతారు. కుంచెలు పట్టుకున్న వారి మీద బండారు కుంకాన్ని చల్లుతారు. గుడ్డలన్నీ రక్తసిక్తమై, వారంతా యుద్ధవీరుల్లాగా కనిపిస్తారు. ఈ భంగిమల్లో నొక్కి అద్భుతంగా రౌద్రంగా అనిపిస్తాయి. కంటి గృడ్లను పెద్దవి చేస్తూ, భ్రమ అభినయిస్తారు. ఉరుములోళ్ళు గాట్టిగా, ఏయ్, జోహో ఓహో అంటూ లయాత్మకంగా అరుస్తారు. అదొక వీర నృత్యమనీ ఆ నృత్యానికీ, పేరణికీ చాల పోలికలున్నాయనీ డా: చిగిచర్ల కృష్ణారెడ్డి గారు వారి జానపద నృత్య కళలో ఉదహరించారు.

ఇలా వారు గంగ కథను ఎక్కువ చెపుతారు:

పరాకు పారాకు యచ్చిరక పరాకు
మనవాలకించు మందన పుడితివమ్మ
మాయారి గంగ
దొడ్డన పుడితవమ్మ...... దొన కొండ గంగ
గంగలేని తానంబు లేదు
గంగ లేని జలకమ్ము లేదు

గంగ లేని వుతకమ్ము లేదు
గంగ లేని నంది లేదు
నీవు లేని తలము లేదమ్మ
పన్నెండు అత్తాలు గలవు
బాగిరతి నలవీర గంగవో హ హో

ఇలా పాడుతూ చివరికి:

పెద్దల కిచ్చిన వరము చిన్నలకి తప్పునంటివి
చిన్నల కిచ్చిన మాత శిశుబాలలకు తప్పనంటివి
శిశుబాల కిచ్చిన మాట కసి కందులకు తప్పనంటివి
మనవాలకించు మాయ దండ మొప్పో

పై పాట పాడుతున్న సమయంలో అప్పుడప్పుడు అడుగులు ముందుకు వేయటం, వెనక్కి వేయటం చేస్తూ వారి అంగికానికి అనుగుణంగా ఉరుమును మలుచుకుని వాయిస్తూ వుంటారు. మరో పాటలో...........

నేనే వస్తారా బీరన్నా, నేనే వస్తారా, కన్న తండ్రి
నల్లగొర్ల నేను మందాయిలోన నమ్మకాలు నేనే చెబుతాను
నేనే వస్తారా బీరన్నా నీకు నేనే వస్తారా....................:నేనే:

ఇలా కథను నడుపుతూ దరువులు వేస్తూ నృత్యం చేస్తూ కథను సాగిస్తారు.

మేలూకొనవే వో మేలూకొనవే
అమ్మ నీవు పుట్టకముందే నాడూ
ఇగమూ లేదు జగమూ లేదు మేలూకొనవే
అమ్మ మచ్చుల మాయల వో గంగి నీవు
పీనిగీలు తినేవు పిశాచివో మేలూకొనవే
సామి గంగ లేని వో తానమే లేదు
గంగ లేని వో జలకమ్మే లేదు మేలూకొనవే
సామీ నీవు పుట్టకముందేనాడూ
నరుడూ లేడూ వో నారాయణుడూ లేడూ మేలూకొనవే
ఇష్ణు లేడు వో యీసరుడు లేడూ
ముప్పది కోత ల వో మునులే లేరూ మేలూకొనవే

ఈ గేయంలోని వో అనే పదం ఒక గతిలో రాగాలాపన చేస్తారు. గుక్క తిరిగే వరకు రాగాలాపన చేయ్యడం ఇందులోని ప్రత్యేకత.
</powem>
==మంగళం పాట==
ప్రదర్శన చివరలో మంగళం పాట పాడతారు. మంగళం పాటతోనే నృత్యం ఆగిపోతుంది.

<poem>
జయ జయ మంగలం నిత్య శివ మంగళం
బోలు బోలు మట్టెలు బోలు బోలు మట్టేలు
బొమ్మంచు సీరలు బొగ్గు వరమగర నీకారతి జయ జయ మంగలం
తనుకు తనుకున మెరిసేటి తనుకు పాపిటి బొట్టు
తగునమ్మ సుబ్బరావుపేట గంగమ్మకూ జయ జయ మంగలం
ఆరుగురు రాజులు ఆరుగురు రాణులు
ఆకసిన్న రాములమ్మ నీకారతీ జయ జయ మంగలం
తనుకు తనుకున మెరిసేటి తనుకు పాపిటి బొట్టూ
తగునమ్మ పెదకోట్ల చౌడమ్మకూ జయ జయ మంగలం
వక్కొక్క జల్లోన వజ్రకాంతి లింగాలు
వక్కొక్క జల్లోన బద్రకాంతి లింగాలు
వక్కొక్క జల్లోన సూర్యకాంతి లింగాలు
జడజడా సూస్తేను నవకోటి లింగాలు
తగునమ్మ ముస్టురి నలకాటిమయ్యకు జయ జయ మంగలం

ఉరుము వాద్యం అనంతపురం జిల్లాలో మాత్రమే కనిపిస్తుంది. ధర్మవరం, కళ్యాణదుర్గం, కుందుర్పి, రొద్దం, గూగూడు, ముదిగుబ్బ, కమ్మవారిపల్లె, గుంజేపల్లె వంటి ప్రాంతాల్లో ఉరుములోల్లున్నారు. ఉరుము నృత్యాన్ని గురించి పరిశోధన చేసిన వారిలో డా. ఛిగిచెర్ల కృష్ణారెడ్డి ప్రముఖులు. వీరు హైదరాబాదు లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో రీడర్ గా పనిచేస్తున్నారు.

పతాక సన్నివేశం

[మార్చు]

ఉరుములు వాయిద్యం భీకరంగా సాగే సమయంలో చుట్టూ మూగిన ప్రేక్షకులు తెల్లపోయి చూస్తూ వుంటారు. ఉరుముల వాయిద్యాల హోరును తట్టుకోలేని వారు దూరంగా నుంచుంటారు. పూనకం వచ్చి వూగిపోయే వారిని చూసి ప్రేక్షకులు అరుపులతో, కేకలతో అట్టహాసం చేస్తారు. నిజంగా దేవతే పూనిందన్నంత భ్రమలో మునిగి పోతారు ప్రేక్షకులు. ఈ సమయంలో వురుములోళ్ళు చేసే హావ భావాలు ఛూడ వలసిందే కాని వ్రాయ నలవి కాదు. చివరగా వురుములోళ్ళు కథను పూర్తి చేసి మంఘళం పాటలో ఒక్కొక్క దేవత పేరు చెపుతూ, రెండు చేతులెత్తి మొక్కుతారు. మంగళం పాట పాడి గంగమ్మ తల్లికి భక్తితో నమస్కారం చేసి నృత్యాన్ని పూర్తి చేస్తారు. ప్రతిసారీ మంగళం పాడుతూనే తమ నృత్యం ఆపుతారు. గేయంలో అనేక మంది దేవతల్ని వేదు కొంటారు. చరణాలన్నీ పాడే సమయంలో, పల్లవి ఎత్తుకునే సమయంలో ఒక రకమైన లయలో పాడటం వుంటుంది. ఈ పల్లవిని ఎత్తుకునే సమయానికి ముందుగా ఒక్కొక్క దేవత పేరు చెప్పటం, రెండు చేతులెత్తి మొక్కటం చేస్తూ వుంటారు. కథా కార్యక్రమం అంతా పూర్తి కాగానే బండారు బొట్టును నుదుట పెట్టుకుని దండం పెట్టుకుని వెళ్ళి పోతారు.

కళాకారులు

[మార్చు]

ఈ నాడు అనంత పురం జిల్లాలో వురుముల కథల్లో పాల్గొనే కళాకారులు ఉరుముల నారాయణ, ఉరుముల నారాయణ స్వామి, వురుముల నాగన్న, ఉరుముల చంద్రప్ప, ఉరుముల ఆంజనేయులు మొదలైన వారు కళను ప్రచారం చేస్తూ, దేవతల కొలువులు చేయిస్తూ జీవితాలను సాగిస్తున్నారు. ఇలా ఉరుములోళ్ళు ధర్మవరం, సుబ్బారావు పేట, ముస్టూరు, గూగూరు, మేడాపురం, రేగాటి పల్లె మొదలైన చోట్ల ఉన్నారు. ఈ మాదిరి ఉరుముల బృందాలు ఆంధ్ర దేశంలో మరెక్కడా లేవు.

సూచికలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]