ఎమ్మెస్ రామారావు
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
| ఎమ్మెస్ రామారావు M.S.RAMARAO |
|
| జననం | మార్చి 7,1921 గుంటూరు జిల్లా అమృతలూరు మండలానికి చెందిన మోపర్రు |
|---|---|
| మరణం | ఏప్రిల్ 20, 1992 (వయసు 71) |
| ఇతర పేర్లు | సుందరదాసు |
| వృత్తి | నేపథ్య గాయకుడు |
| మతం | హిందూ |
| భార్య/భర్త | లక్ష్మీ సామ్రాజ్యం |
| సంతానం | ఒక కుమార్తె (వెంకట సరోజిని) ఇద్దరు కుమారులు (బాబూరావు, నాగేశ్వరరావు) |
| తండ్రి | మోపర్తి రంగయ్య |
| తల్లి | మంగమ్మ |
"సుందరదాసు" బిరుదాంకితుడు ఎమ్మెస్ రామారావు (మార్చి 7, 1921 - ఏప్రిల్ 20, 1992), తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు (1944 లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత వై.వి.రావు తన తాహసీల్దార్ చిత్రంలో ఎమ్మెస్ చేత మొదటి సారిగా "ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా" అనే ఎంకి పాట పాడించినాడు). గేయ రూపంలో ఈయన రచించి గానం చేసిన 'సుందరకాండము'(రామాయణం లోని ఒక భాగం) ఎమ్మెస్ రామారావు సుందరకాండ గా సుప్రసిద్ధం. తులసీ దాసు రచించిన హనుమాన్ చాలీసా ను తెలుగులోకి అనువదించి ఆకాశవాణిలో పాడారు.ఈ రెండూ వీరికి మంచి గుర్తింపును, ఖ్యాతిని తెచ్చిపెట్టాయి.
తొలినాళ్లు [మార్చు]
ఎమ్మెస్ రామారావు 1921 మార్చి 7 న గుంటూరు జిల్లా అమృతలూరు మండలానికి చెందిన మోపర్రు గ్రామంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు మోపర్తి రంగయ్య మరియు మంగమ్మ గార్లు సీతారామ భక్తులు. చిన్నతనం నుండే రామారావు గారు పాటలు పాడుతుండేవారు. ఈయన విద్యాభ్యాసము నిడుబ్రోలు ఉన్నత పాఠశాలలో మరియు గుంటూరు హిందూ కళాశాలలో జరిగింది. రామారావు గారికి 1942 లో లక్ష్మీ సామ్రాజ్యంతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె (వెంకట సరోజిని) మరియు ఇద్దరు కుమారులు (బాబూరావు, నాగేశ్వరరావు)
సినీరంగంలో [మార్చు]
ఇంటర్మీడియేట్ రెండవ సంవత్సరం చదువుతున్న రోజుల్లో (1941 లో) అంతర్ కళాశాలల లలిత సంగీత పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్నారు. జడ్జిలలో ఒకరైన అడివి బాపిరాజు చలన చిత్ర రంగంలో ప్రవేశించమని ఆయనను చాలా ప్రోత్సహించారు. 1944 లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత వై.వి.రావు తన తహసీల్దార్ చిత్రంలో ఎమ్మెస్ చేత మొదటి సారిగా "ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా" అనే ఎంకి పాట పాడించినారు. ఆ చిత్రంలో నాయక పాత్ర ధరించిన సి.హెచ్. నారాయణరావుకు ఇది గాత్రదానం. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఇది మొట్ట మొదటి నేపథ్య గానం. 1944 నుంచి 64 వరకు తెలుగు చలన చిత్రాలలో నేపథ్య గాయకునిగా మద్రాసు లో నివసించిన ఆయన 5 సంవత్సరాల పాటు కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు.కొన్ని పాటలు వ్రాసి గ్రామ్ ఫోన్ రికార్డులు ఇచ్చారు: నల్లపిల్ల, తాజ్ మహల్, హంపి, కనీసం, హిమాలయాలకు రాలేనయ్యా, మొదలైనవి.నీరాజనం చిత్రంలో "ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధములో నిదురించు జహాపనా" పాట లో ఎమ్మెస్ గొంతు వినిపించింది.
1963 సంవత్సరాంతంలో కొన్ని కారణాల వల్ల మద్రాసు వదిలి రాజమండ్రి చేరుకుని 1974వరకు అక్కడే నివసించారు. అక్కడ నవభారతి గురుకులంలో పది సంవత్సరాలు ఉద్యోగం చేసారు. 1970 లో పెద్ద కుమారుడు బాబూరావు భారతీయ వాయుసేనఇండియన్ ఏర్ ఫోర్స్(IAF) లో పైలట్ ఆఫీసరు గా నియమితుడైనారు. 1971లో పాకిస్థాను తో జరిగిన యుద్ధ కాలంలో అతని ఆచూకీ తెలియ లేదు. తల్లి తండ్రులిద్దరూ భయం చెంది కుమారుని క్షేమం కోసం వాయు కుమారుడైన హనుమంతుని ఆరాధించడం మొదలు పెట్టారు.తర్వాత కొంత కాలానికి అబ్బాయి క్షేమంగా ఇల్లు చేరడంతో శ్రీ హనుమానుడే వారి ఇష్ట దైవమైనాడు. ఆయన హనుమాన్ చాలీసా, సుందరకాండ వ్రాయడానికి అదే ప్రేరణ. 1972 నుండి 74 వరకు తులసీదాసు హనుమాన్ చాలీసాను హిందీ నుంచి తెలుగులోనికి అనువదించారు మరియు తన పేరుతో అవినాభావ సంబంధమేర్పడ్డ 'సుందరకాండ' గేయరచన చేశారు. 1975 నుంచి హైదరాబాదులోని చిక్కడపల్లిలో నివసించారు. రామారావుకు 1977 సంవత్సరసంలో సుందరదాసు అనే బిరుదాన్ని ఇచ్చారు. ఈయన ఏప్రిల్ 20, 1992న హైదరాబాదులో సహజ కారణాల వల్ల మరణించారు.