వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2010 36వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారత ప్రణాళిక వ్యవస్థకు పితామహుడు జవహర్ లాల్ నెహ్రూ అయితే, భారత ప్రణాళిక పథానికి నిర్దేశకుడిగా పి.సి.మహలనోబిస్ ప్రసిద్దిచెందినాడు. 1893 లో కోల్‌కత లో జన్మించిన మహలనోబిస్ భౌతిక శాస్త్రం లో శిక్షణ పొంది, అధ్యాపకుడిగా, ప్రిన్సిపాల్ గా పనిచేసి రిటైరైనాడు. అతనికి గణాంక శాస్త్రంలో కల ఆసక్తి కారణంగా ఆ రంగంలో నైపుణ్యం సాధించి చివరికి ఆ రంగంలోనే జగత్ప్రసిద్ది చెందినాడు. గణాంక శాస్త్ర రంగంలో అతని సేవలకు గుర్తింపుగా లండన్ లోని రాయల్ సొసైటీ పెల్లోగా ఎన్నికయ్యాడు. 1946 లో ఐక్యరాజ్యసమితి గణాంక శాస్త్ర కమీషన్ సభ్యుడిగా, 1949 లో కేంద్ర మంత్రివర్గపు గణాంక శాస్త్ర గౌరవ సలహా దారుడిగా నియమించబడ్డాడు. 1950 లో నేషనల్ శాంపిల్ సర్వే స్థాపనలో మహలనోబిస్ కీలకపాత్ర వహించాడు. 1949 జాతీయాదాయ కమిటీ చైర్మెన్ గా మహలనోబిస్ జాతీయాదాయ గణాంకాలకు ప్రాతిపదిక స్వరూపాన్ని ఇచ్చాడు. 1955 నుండి 1967 వరకు ప్రణాళిక సంఘం సభ్యుడిగా తన సేవలందించాడు. రెండో పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో అతని కృషి అనిర్వచనీయం. భారీ పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఆ ప్రణాళిక నమూనా మహలనోబిస్ నమూనా గా ప్రసిద్ధిగాంచింది. భారత ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసిన మహలనోబిస్ 1972 జూన్ 28 న మరణించాడు.


1893 జూన్ 29కోల్‌కత లో జన్మించిన మహలనోబిస్ పూర్తి పేరు ప్రశాంత్ చంద్ర మహలనోబిస్. అతని పూర్వీకుల స్వస్థలం నేటి బంగ్లాదేశ్ ప్రాంతం. జీవనోపాధి కోసం మహలనోబిస్ తాత కోల్‌కత ప్రాంతానికి చేరి స్థిరపడ్డాడు. మహలనోబిస్ బాల్యం, విద్యాభ్యాసం కూడా కోల్‌కత లోనే కొనసాగింది. 1912 లో భౌతిక శాస్త్రం (ఆనర్స్)లో పట్టభద్రుడయ్యాడు. తర్వాత కేంబ్రిడ్జి, కింగ్స్ కళాశాలలలో గణిత శాస్త్రం, భౌతిక శాస్త్రం అభ్యసించాడు. అభ్యసనం పూర్తి కాగానే మహలనోబిస్ కోల్ కత లోని ప్రెసిడెన్సీ కళాశాల లో భౌతిక శాస్త్ర అద్యాపకుడిగా ప్రవేశించాడు. 30 సంవత్సరాల పాటు సేవలందించి చివరగా ప్రిన్సిపాల్ గా రిటైరయ్యాడు.

సోవియట్ యూనియన్ ప్రణాళిక విధానానికి ప్రభావితుడైన జవహర్ లాల్ నెహ్రూ దేశంలో కూడా ఒక ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టు దశలో పి.సి.మహలనోబిస్ ప్రణాళిక విధాన రంగంలో ప్రవేశించాడు. 1950 లో ప్రణాళిక సంఘం స్థాపితమైనప్పటి నుంచి గణాంక శాస్త్ర సలహాదారుడిగా సేవలందించాడు. 1955 నుండి 1967 ప్రణాళిక సంఘం సభ్యుడిగా నియమించబడ్డాడు. ముఖ్యంగా భారీ పరిశ్రమలకు ప్రాముఖ్యం ఇచ్చిన రెండో పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో పి.సి.మహలనోబిస్ పాత్ర అనిర్వచనీయం. ఇది మహలనోబిస్ నమూనా గా ప్రసిద్ధి చెందినది. వర్తమాన ఆర్థిక వ్యవస్థకు ఉపయోగకరమైన ప్రమాణాలను మహలనోబిస్ రెండో పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టినాడు. ప్రణాళిక ఆలోచనలకు నిర్దిష్ట రూపం కల్పించడంలో మహలనోబిస్ ఎంతో సహకరించాడు.

పూర్తి వ్యాసము, పాతవి