విశిష్టాద్వైతం
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
విశిష్టాద్వైతం అనేది 11వ శతాబ్దిలో రామానుజాచార్యుడు ప్రతిపాదించిన వేదాంత దర్శనము. సాకారుడైన నారాయణుడు పరబ్రహ్మమైన భగవంతుడు అని ఈ తత్వము ప్రతిపాదించింది. నిత్యానపాయినియై, నారాయణునితో సదా కలసి ఉండే లక్ష్మీదేవికి వారిచ్చిన ప్రాధాన్యత వల్ల ఈ సిద్ధాంతమును శ్రీవైష్ణవమని అంటారు. నారాయణారాధనలో కులవివక్షతను పూర్తిగా త్రోసిపుచ్చిన మార్గమిది.
జీవుడు, ప్రకృతి, ఈశ్వరుడు - మూడూ సత్యములని విశిష్టాద్వైతము అంగీకరిస్తున్నది. 'చిత్' అనబడే జీవునితోను, 'అచిత్' అనబడే ప్రకృతితోను కూడియే ఈశ్వరుడుండును. శరీరములో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉండును. ఆజ్ఞానవశమున జీవుల సంసారబంధమున చిక్కుకొందురు. భగవదనుగ్రహమువలన, సద్గురుకృప వలన, భగవంతునకు శరణాగతులైనవారు అజ్ఞానమునుండి విముక్తులై, మరణానంతరము మోక్షము పొందుదురు. అలా నారాయణ సాన్నిధ్యము పొందినవారికి మరుజన్మలేదు.
విషయ సూచిక |
[మార్చు] త్రిమతాలు
దక్షిణ భారతదేశంలో భగవంతుని గురించి మూడు ముఖ్యమైన సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి. వాటిని త్రిమతాలు అంటారు. ఇవన్నీ హిందూమతంలోని తాత్విక భేదాలు సూచించే సిద్ధాంతాలే. ఆయా మతాలను ప్రతిపాదించిన ఆచార్యులను త్రిమతాచార్యులు అంటారు.
వేదముల ఉత్తరభాగము ఆధారముగా వెలువడినది ఉత్తర మీమాంసా దర్శనము. దీనినే వేదాంత దర్శనమనీ, బ్రహ్మసూత్రములనీ అంటారు. ఇది వేదముల చివరి భాగమైన ఉపనిషత్తుల నుండి ఉద్భవించినది. ఈ దర్శనము జీవాత్మకు, పరమాత్మకు గల సంబంధమును ప్రతిపాదించును. వ్యాస మహర్షి రచించిన బ్రహ్మసూత్రములను వేర్వేరు భాష్యకారులు వ్యాఖ్యానించిన విధముపై వేర్వేరు శాఖాభేదములు ఏర్పడినవి. ఆ విధంగా అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము - అనే మూడు ప్రముఖమైన సిద్ధాంతములు ఏర్పడినవి. మూడు సిద్ధాంతాలూ వేదాలనూ, ఉపనిషత్తులనూ, బ్రహ్మసూత్రాలనూ ప్రమాణంగా అంగీకరిస్తాయి. మూడు తత్వములకూ ఉన్నతమైన గురు పరంపర, సుసంపన్నమైన సాహితీసంప్రదాయము, దృఢమైన ఆచారములు ఉన్నాయి. పెక్కు అనుయాయులు ఉన్నారు.
[మార్చు] రామానుజాచార్యుడు
- ప్రధాన వ్యాసం: రామానుజాచార్యుడు
విశిష్టాద్వైత ప్రవర్తకుడైన రామానుజాచార్యుడు క్రీ.శ. 1017లో జన్మించాడు. 1049లో సన్యాసం స్వీకరించాడు. కర్తవ్యదీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యానికి, దేవునిపై చూపవలసిన అనన్య సామాన్యమైన నమ్మకానికీ, సాటిరాని భక్తికీ, రామానుజాచార్యుని జీవితం ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఆచార్యుడు తన జీవితంలో సాధించిదలచిన(సాధించిన) ముఖ్య ఉద్దేశ్యాలు రెండు:
- మొదటిది, ప్రబలంగా కొనాసాగుతున్న, బౌధ్ధ, జైన, శైవ, వైష్ణవ సాంప్రదాయాలన్నీ అనాదిగా వస్తున్న వైదిక మతాన్ని అనుసరించి వచ్చినవేననీ, ఈ మతాలు దేవుడిని కొలవటానికి వచ్చిన వేర్వేరు మార్గాలే కానీ, వైదిక మతానికి బదులుగా పాటించవలసినవి కాదని నిరూపించటం.
- రెండవది, ఆదిశంకరుని అద్వైత సిద్ధాంతంలోని లొసుగులను సరిదిద్ది, విశిష్టాద్వైత సిధ్ధాంతాన్ని ప్రతిపాదించటం.
తన జీవితం ద్వారా ఈ ఆచార్యుడు మానవాళికి ఇచ్చిన సందేశాలు:
- సాంప్రదాయంగా కొనసాగుతున్న ఆచార వ్యవహారాలు ఛాందసంగా మారి పురోగతికి అడ్డురాక మునుపే వాటిని గుర్తించి వాటిని మానటమో మార్చటమో చేయటం ఆచార్యుని ప్రధమ కర్తవ్యం.
- దేవుడిని పూజించటం, మోక్షాన్ని సాధించటం, మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరి హక్కు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. కుల మత తారతమ్యాలను పరిశీలించి అర్థం చేసుకోవటం మహత్వం. వైషమ్యాలను పెంచుకోవటం మూర్ఖత్వం.
- మునుపు గురువులు చెప్పినదంతా నిజమేనని గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు. వారు చెప్పినదాన్ని తర్కానికి గురిచేసి అది సరో తప్పో నిర్ణయించుకోవటం పాపం కాదు. ఈ విషయంలో అధైర్యం చేయవలసిన పనిలేదు.
- ఒక పని వల్ల పదిమందికి మేలు జరుగుతున్నప్పుడు, తమకు కీడు జరిగినా, పదిమందికి జరిగా మేలుకై, తమ కీడును లెక్కచేయవలసిన అవసరం లేదు.
రామానుజాచార్యుడు 1137వ సంవత్సరంలో విష్ణుసాయుజ్యం పొందాడని కధనం. అనగా 120 సంవత్సరాల జీన కాలం. ఈ సంవత్సరంపై కొన్ని సందేహాలున్నాయి.
[మార్చు] ప్రధాన సిద్ధాంతం
విశిష్టాద్వైతం లేదా శ్రీవైష్ణవం ప్రకారం భగవంతుడు ఒక్కడే. అతడు సాకారుడు. అతడే నారాయణుడు. నిత్యానపాయిని అయిన లక్ష్మీదేవి నారాయణునినుండి వేరు కాదు. నిర్మలజ్ఞానానంద స్వరూపుడు. ఆ దేవదేవుడొక్కడే స్వతంత్రుడు. జీవి, ప్రకృతి పరతంత్రులు. పరమాత్మ నుండి ఆత్మ జన్మిస్తుంది. జీవాత్మ పరమాత్మ సన్నిధి చేరడమే మోక్షం. మోక్షానికి సాధనం అచంచలమైన విష్ణుభక్తి. భక్తితో పాటు ప్రపత్తి, అనగా మనసా వాచా కర్మణా భగవంతుని శరణాగతి పొందడం కూడా అత్యవసరం. మానవులందరూ సమానులు. మోక్షానికి అందరూ అర్హులు. కుల లింగ విచక్షణ లేకుండా లక్ష్మీనారాయణులను పూజించి చక్రాంకితాలు చేయించుకొని, మంత్రోపదేశం పొంది ఊర్ధ్వపుండ్ర ధారణ చేసినవారందరూ శ్రీవైష్ణవులే.[1].
నారాయణుడే సృష్టి స్థితి లయాలకు మూలము. చిత్తు జీవుడు. అచిత్తు ప్రకృతి. ఇవి రెండూ ఆయన శరీరము. సూక్ష్మ చిదచిద్విశిష్టుడుగా ఉన్న పరమేశ్వరుడు స్థూల చిదచిద్విశిష్టుడు కావడమే సృష్టి. ప్రకృతి మూలంగానే ఈ జగత్తు అంతా సృజింపబడుతున్నది. శ్రీ మహావిష్ణువు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనే చతుర్వ్యూహాలు దాల్చుతాడు. వాసుదేవుడు తన భక్తులపట్ల వాత్సల్యంతో ఐదు మూర్తులుగా గోచరిస్తాడు. అవి
- అర్చావతారము - దేవాలయాలలోని ప్రతిమలు
- విభవావతారములు - రాముడు, కృష్ణుడు వంటి అవతారాలు.
- వ్యూహావతారములు - వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహాలు.
- సూక్ష్మావతారము - సంపూర్ణ షడ్గుణ సంపన్న పరబ్రహ్మము.
- అంతర్యామి - సకల జీవనాయకుడు.
భగవంతుని అనుగ్రహానికి భక్తి ప్రపత్తులు ముఖ్యం. అందుకు ఉపాసనా విధానాలు.
- అభిగమనము
- ఉపాదానము
- ఇజ్యము
- స్వాధ్యాయము
- యోగము
[మార్చు] చరిత్ర
[మార్చు] ఆచారాలు
[మార్చు] గురు పరంపర
[మార్చు] రూపాంతరాలు
[మార్చు] విమర్శలు
[మార్చు] ఇవి కూడా చూడండి
[మార్చు] మూలాలు, వనరులు
- ↑ శ్రీ కైవల్య సారథి విష్ణు సహస్రనామ భాష్యము - రచన: డా. క్రోవి పార్ధసారథి - ప్రచురణ:శివకామేశ్వరి గ్రంధమాల, విజయవాడ (2003)