అగ్నిధార
అగ్నిధార | |
కృతికర్త: | దాశరథి కృష్ణమాచార్య |
---|---|
అంకితం: | వట్టికోట ఆళ్వారుస్వామి |
దేశం: | భారత దేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | ఖండ కావ్యం |
ప్రచురణ: | సాహితీ మేఖల(తొలి ముద్రణ), విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్(తాజా ముద్రణ) |
విడుదల: | 1949 |
పేజీలు: | 81 |
అగ్నిధార పుస్తకం ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్య రచించిన ఖండకావ్యం.
రచన నేపథ్యం
[మార్చు]అగ్నిధార ఖండకావ్యం 1949లో ముద్రితమైంది. సాహిత్యమేఖల సంస్థ ఈ పుస్తకాన్ని అచ్చువేసింది. దేవులపల్లి రామానుజరావు, పులిజాల హనుమంతరావులు ఈ పుస్తకం తొలిముద్రణకు ప్రోత్సాహం, సహకారం అందజేశారు. దాశరథి కృష్ణమాచార్య నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా చేసిన సాయుధపోరాటంలో పాల్గొన్న సమరయోధుడు. ఆ కారణంగా దాశరథి నిజాం ప్రభుత్వ పరిపాలనలో జైలు జీవితాన్ని అనుభవించారు. అగ్నిధారలోని ఖండికల్లో చాలావరకూ ఆ జైలు జీవితంలోనూ, జైలులో నుంచి బయటపడ్డ కొత్తల్లోనూ రాసినవి. నిజాం రాష్ట్రంలో ప్రభుత్వ నిరంకుశత్వం, ప్రజల అగచాట్లు, భారత స్వాతంత్ర్యం, భారత సైన్యాల ప్రవేశం, నైజాం ప్రభుత్వ పతనం - ఈ ఘటనలు తన ఈ రచనకు పునాదులుగా కృష్ణమాచార్య పేర్కొన్నారు. యువకునిగా ఉండగా తాను రచించిన కవిత్వం కావడంతో ఈ కవితా ఖండికల్లో శృంగారం కూడా చోటుచేసుకున్నట్టు, యుద్ధారావాలతోపాటుగా శృంగార రచనలు చేయడం తన రచనకున్న రెండు లక్షణాలు అంటూ దాశరథి కృష్ణమాచార్య అన్నారు.[1]
గ్రంథకర్త గురించి
[మార్చు]ప్రధానవ్యాసం: దాశరథి కృష్ణమాచార్య
దాశరథి కృష్ణమాచార్యులు ప్రముఖ కవి, నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు, సినీ గేయకర్త. యువకునిగా ఉన్నప్పుడే దాశరథి ఆంధ్రమహాసభలో చైతన్యవంతమైన పాత్ర నిర్వహించి నిజాం ప్రభుత్వం విధించిన జైలు శిక్ష అనుభవించాడు. నిజామాబాదు లోని ఇందూరు కోటలో ఆయన్ని మరో 150 మందితో ఖైదు చేసి ఉంచింది, నిజాము ప్రభుత్వం. ఆయనతోపాటు ఖైదులో వట్టికోట ఆళ్వారుస్వామి కూడా ఉన్నాడు. పళ్ళు తోముకోవడానికిచ్చే బొగ్గుతో జైలు గోడల మీద పద్యాలు రాసి దెబ్బలు తిన్నాడు. మంచి ఉపన్యాసకుడు. భావప్రేరిత ప్రసంగాలతో ఊరూరా సాంస్కృతిక చైతన్యం రగిలించాడు. ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాతల్లో ఒకడు. 1953లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి అధ్యక్షుడుగా జిల్లాల్లో సాహితీ చైతన్యాన్ని నిర్మించాడు. ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా 1977 ఆగష్టు 15 నుండి 1983 వరకు పనిచేసాడు. రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు గెల్చుకున్నాడు. అనేక సినిమాలకు గీతాలు రచించి అభిమానుల్ని సంపాదించుకున్నాడు. మీర్జాగాలిబ్ ఉర్దూ గజళ్ళను తెలుగులోకి గాలిబ్ గీతాలు పేర అనువదించారు.తల్లి మీద, తల్లి తెలంగాణ మీద ఆయన రచించిన పద్యాలు ఇప్పటికీ ఎందరికో ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి.
కవితా వస్తువులు
[మార్చు]నిజాం రాజ్యంలోని ప్రజల అగచాట్లు, నిజాం నిరంకుశత్వం, ప్రజల పోరాటాలు, భారత స్వాతంత్ర్యం, నైజాం విమోచన వంటివి ఈ ఖండకావ్యంలోని కవితలకు వస్తువులుగా కవి స్వీకరించారు. ఈ కావ్యంలోనే శృంగార, ప్రేమమయ కవితలు కూడా ఉన్నాయి. కొందరు ఉర్దూకవుల కవిత్వానువాదాలు, నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ కవిత్వానువాదాలు, అనుసృజనలు కూడా ఇందులో చోటుచేసుకున్నాయి.
కవితల జాబితా
[మార్చు]అగ్నిధార ఖండకావ్యంలో 48 కవితలు ఉన్నాయి. అవి:[2]
|
|
అంకితము
[మార్చు]అగ్నిధార ఖండ కావ్యాన్ని దాశరథి కృష్ణమాచార్యులు నిజాం వ్యతిరేక పోరాటకారుడు, నవలాకారుడు వట్టికోట ఆళ్వారుస్వామికి అంకితం చేశారు. ఆళ్వారుకు అన్న అంకితం కవితలో అసలు ఆళ్వార్లు పన్నెండు మందే;/పదమూడో ఆళ్వార్ మా/వట్టికోట ఆళ్వార్ స్వామి!/నిర్మల హృదయానికి/నిజంగా అతడు ఆళ్వార్; అని ప్రారంభించి కొనసాగిస్తూ తుదకు మిత్రుని కోసం కంఠం ఇవ్వగలవాడు/మంచికి పర్యాయ పదం ఆళ్వార్/అతనిదే సార్థకమైన జీవితం/అతని కీ అగ్నిధార అంకితం అంటూ ముగించారు దాశరథి.[3]
ప్రాచుర్యం
[మార్చు]గొప్ప ప్రాచుర్యం పొందిన నా తెలంగాణా కోటి రత్నాల వీణ అన్న వాక్యం అగ్నిధార కావ్యంలోనిదే. రైతుదే శీర్షికన రచించిన ప్రాణములొడ్డి ఘోర గహనాటవులన్... నా తెలంగాణ, కోటి రత్నాలవీణ అన్న పద్యం ఎంతో ప్రఖ్యాతిని పొందింది. ఓ నిజాము పిశాచమా అంటూ సాగే ఆ సీసపద్యంలోని గీతపద్యాన్ని నిజామాబాదు జైలు గోడలపై బొగ్గుతో దాశరథి రచించారు.