అనభేరి ప్రభాకరరావు
అనభేరి ప్రభాకరరావు | |
---|---|
జననం | |
మరణం | 1948 మార్చి 14 మహమ్మదాపూర్, కరీంనగర్ జిల్లా, తెలంగాణ | (వయసు 37)
ఇతర పేర్లు | తెలంగాణ భగత్ సింగ్ |
వృత్తి | తెలంగాణ రాష్ట్ర గెరిల్లా నాయకుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు |
జీవిత భాగస్వామి | సరళాదేవి |
పిల్లలు | ముగురు కుమార్తెలు (సులోచనదేవి, శకుంతలదేవి, విప్లవకుమారి) |
తల్లిదండ్రులు | వెంకటేశ్వరరావు - రాధాబాయి |
అనభేరి ప్రభాకరరావు ( 1910 ఆగస్టు 15 – 1948 మార్చి 14) తెలంగాణ రాష్ట్ర గెరిల్లా నాయకుడు,[1] భారత స్వాతంత్ర్య సమరయోధుడు, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రభావవంతమైన విప్లవకారులలో ఒకడిగా గుర్తింపబడ్డాడు. నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి 1948 మార్చి 14న జరిగిన దాడిలో మరణించాడు.[2]
నిజాం సామ్రాజ్యం/రజాకార్ల నుంచి తెలంగాణను విముక్తి చేయడమే జీవిత లక్ష్యంగా, తెలంగాణలో విప్లవోద్యమానికి కొత్త ఒరవడిని అందించిన ప్రభాకరరావును కరీంనగర్/తెలంగాణ భగత్ సింగ్ అని పిలిచేవారు.
తొలి జీవితం
[మార్చు]ప్రభాకరరావు 1910, ఆగస్టు 15న తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా, తిమ్మాపూర్ మండలం, పోలంపల్లి గ్రామంలోని దేశ్‌ముఖ్ కుటుంబానికి చెందిన వెంకటేశ్వరరావు - రాధాబాయి దంపతులకు జన్మించాడు. కరీంనగర్‌లో ప్రాథమిక విద్య చదివి, మచిలీపట్నంలో కొంతకాలం చదివి తరువాత, హైదరాబాదు చాదర్ ఘాట్ హైస్కూల్, బనారస్ కాశీ విద్యాపీట్‌లో ఉన్నత చదువులు చదువుకున్నాడు.[3]
నిజాంకు వ్యతిరేకంగా విప్లవ కార్యకలాపాలలో పాల్గొన్న హిందూ ఎల్లాపు కుటుంబంలో జన్మించిన అనభేరి యుక్తవయసులోనే విప్లవ ఉద్యమాలలో పాల్గొన్నాడు. కమ్యూనిజం వైపు ఆకర్షితులయ్యాడు. నిజాంకు వ్యతిరేకంగా ఏర్పడిన అనేక విప్లవ సంస్థలలో భాగస్వామ్యుడయ్యాడు. నిజాం హయాంలో తెలుగు మాట్లాడే ప్రజలకు సమాన హక్కులు కల్పించాలని పోరాటం చేశాడు. నిజాం కళాశాలలో చదువుతున్నప్పుడే మహాత్మాగాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి వారి ఆదర్శాల నుంచి స్ఫూర్తి పొందిన ప్రభాకరరావు, విద్యార్థి దశలోనే నిజాం వ్యతిరేక ఉద్యమంలోకి ప్రవేశించాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]ప్రభాకరరావుకు తన 27వ ఏట అప్పటి చెన్నూర్ తాహసీల్దార్ వెల్ముల నారాయణరావు, లక్ష్మీ నర్సుభాయి చిన్న కుమార్తె సరళాదేవితో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమార్తెలు (సులోచనదేవి, శకుంతలదేవి, విప్లవకుమారి).[3]
నిజాం వ్యతిరేక ఉద్యమం
[మార్చు]4వ ఆంధ్రమహాసభ సదస్సు నిర్వహణలో ప్రభాకరరావు ముఖ్య పాత్రను పోషించాడు. కరీంనగర్‌లోని బోయివాడలో ఆంధ్ర మహాసభ జిల్లా అధ్యక్షడిగా బద్దం ఎల్లారెడ్డి, జిల్లా కార్యదర్శిగా ప్రభాకరరావు ఎన్నికయ్యారు. 1947 సెప్టెంబరులో బద్దం ఎల్లారెడ్డి ఇచ్చిన పిలుపుతో అనేకమంది ఈ పోరాటంలో పాల్గొన్నారు. ప్రభాకరరావు నేతృత్వంలో దళం (స్క్వాడ్)ను ఏర్పాటు చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లాస్థాయితో నాయకత్వం వహించాడు. సాయుధ పోరాటంలో ఆదిలాబాద్, విజయవాడ, సిర్వంచ, చాందా, కరీంనగర్ దళాలకు సహచరుడు సింగిరెడ్డి భూపతిరెడ్డితో కలిసి శిక్షణ ఇచ్చాడు. స్క్వాడ్ సభ్యులు 1948 జనవరిలో దాదాపు నలభై గ్రామాలలో పటేళ్ళు, పట్వారీల రికార్డులను తగులబెట్టారు.[3]
సామాజిక సేవ
[మార్చు]ప్రజలను చైతన్యవంతులను చేయడానికి కరీంనగర్‌లోని కార్ఖానాగడ్డలో వయోజనుల కోసం రాత్రి బడిని ఏర్పాటుచేశాడు. రైతులకు ధాన్యం అందించడంకోసం గ్రెయిన్ బ్యాంకు నెలకొల్పాడు, రైతు మహాసభలు నిర్వహించేవాడు. చేనేత కార్మికులను ఆదుకోవడానికి గ్రామాలలో సహకార సంఘాలు స్థాపించి హైదరాబాద్ కమీషనర్ నుండి పెట్టెల్లో నూలు తెచ్చి, చేనేత కార్మికులకు రేషన్ కార్డ్స్ ఇప్పించి వాటి ద్వారా నూలు అందించేవాడు. 1942 నుంచి 1946 వరకు 5 సంవత్సరాలపాటు రాష్ట్ర చేనేత సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాడు.[3]
మరణం
[మార్చు]ప్రభాకరరావును పట్టించిన వారికి నిజాం ప్రభుత్వం 50 వేల రూపాయల బహుమానం ప్రకటించింది. నిజాం ప్రభుత్వంతో కుమ్ముక్కైన మహ్మదాపూర్ పోలిస్ పటేల్ కుట్రతో ప్రభాకరరావు దళాన్ని భోజనానికి పిలిచి రజాకార్లకు సమాచారం అందించాడు. 1948, మార్చి 14న కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ సమీపంలోని మహమ్మదాపూర్ కొండలలో[4] నిజాం సన్నిహిత సలహాదారు ఖాసిం రజ్వీ నేతృత్వంలోని పోలీసులు, రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పోలీసులకు-కమ్యూనిస్టు దళానికి మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఆ ఘటనలో తన 37వ ఏళ్ళ వయసులో ప్రభాకరరావు మరణించాడు.[5][6][7] ప్రభాకరరావుతోపాటు మరో 11మంది దళ సభ్యులు కూడా మరణించారు.
మరణం తరువాత
[మార్చు]ఆ పోరాటంలో మరణించిన 12మంది పేర్లని మహమ్మదాపూర్ కొండల దగ్గర వారి జ్ఞాపకార్థం నిర్మించిన స్థూపంపై రాయబడ్డాయి. కరీంనగర్‌లోని వెంకటేశ్వర దేవాలయం ఎదురుగా 1994 జనవరి 12న అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కరరెడ్డి చేతులమీదుగా అనభేరి ప్రభాకరావు విగ్రహం ఏర్పాటుచేయబడింది.[8][9][10] 2012, అక్టోబరు 22న కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ పట్టణంలో సిహెచ్. విద్యాసాగర్ రావు చేతులమీదుగా అనభేరి ప్రభాకరావు విగ్రహం ఆవిష్కరించబడింది.[1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Tributes paid to Telangana martyrs". The Hindu. 15 March 2008. Archived from the original on 19 March 2008. Retrieved 2021-11-01.
- ↑ "Communist leader Anabheri Prabhakar remembered on death anniversary". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-03-14. Archived from the original on 2021-03-15. Retrieved 2021-11-01.
- ↑ 3.0 3.1 3.2 3.3 "తెలంగాణ భగత్ సింగ్ పోరాట గాథ". Sakshi. ఉమా సల్వాజి. 2020-08-15. Archived from the original on 2021-01-20. Retrieved 2021-11-01.
- ↑ "నిజాం సేనలపై నిప్పుల తూటా". Sakshi. 2014-03-14. Archived from the original on 2021-11-01. Retrieved 2021-11-01.
- ↑ "Tributes paid to Telangana martyrs". The Hindu. 15 March 2008. Archived from the original on 19 March 2008. Retrieved 2021-11-01.
- ↑ Regani, Sarojini (1986). Andhralo Swatantriyodyama Charitra. Telugu Academy. p. 235.
- ↑ Indian Revolutionaries: A Comprehensive Study, 1757-1961, Volume 5
- ↑ "Tributes paid to Telangana martyrs". The Hindu. 15 March 2008. Archived from the original on 19 March 2008. Retrieved 2021-11-01.
- ↑ "Prabhakar Rao's statue unveiled in Husnabad". The Hindu Online edition. 22 October 2012.
- ↑ "Don't resort to suicide, youth told". The Hindu Online edition. 19 October 2012.