అబు అబ్రహాం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అబు అబ్రహాం
అబు అబ్రహాం స్వీయ కేరికేచర్
జననంఅత్తుపురథు మాథ్యూ అబ్రహాం
(1924-06-11)1924 జూన్ 11
మవేలికర, కేరళ
మరణం2002 డిసెంబరు 1(2002-12-01) (వయసు 78)
Pseudonym(s)అబూ

అత్తుపురథు మాథ్యూ అబ్రహామ్ (మలయాళం: ആറ്റുപുറത്ത്മാത്യു ഏബ്രഹാം; 11 జూన్ 19241 డిసెంబర్ 2002), ఒక భారతీయ వ్యంగ్య చిత్రకారుడు, పాత్రికేయుడు, రచయిత. ఇతని కలం పేరు అబూ. ఇతడు హేతువాది, నాస్తికుడు.[1]

ఇతడు తన 40 యేళ్ల సుదీర్ఘ వృత్తి జీవితంలో అనేక జాతీయ, అంతర్జాతీయ వార్తాపత్రికలలో పనిచేశాడు. "బాంబే క్రానికల్", "శంకర్స్ వీక్లీ", "బ్లిట్జ్", "ట్రిబ్యూన్", "ది అబ్జర్వర్", "ది గార్డియన్", "ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్" ఇతడు పనిచేసిన పత్రికలలో కొన్ని.

తొలినాళ్లు[మార్చు]

అబు కేరళ రాష్ట్రంలోని మవేలికర గ్రామంలో ఎ.ఎం.మాథ్యూ, కాంతమ్మ దంపతులకు జన్మించాడు.[2] ఇతడు తన మూడవ యేటి నుండే బొమ్మలు గీయడం మొదలుపెట్టాడు. తిరువనంతపురం యూనివర్సిటీ కాలేజీలో ఫ్రెంచి, గణితం, ఇంగ్లీషు ఐచ్చికాంశాలుగా 1945లో డిగ్రీ పూర్తి చేశాడు. ఇతడు విద్యార్థి దశలో టెన్నీస్ ఛాంపియన్‌గా ఉండేవాడు[2] చదువు ముగిసిన వెంటనే ఇతడు బొంబాయి వెళ్లి "బాంబే క్రానికల్" పత్రికలోను, దాని సోదర పత్రిక "ది బాంబే సెంటినెల్"లోను జర్నలిస్ట్‌గా చేరాడు. "బ్లిట్జ్", "భారత్" పత్రికలలో కార్టూన్లు గీయడం మొదలుపెట్టాడు. 1951లో ప్రముఖ కార్టూనిస్ట్ కె.శంకర్ పిళ్ళై ఇతడిని తన "శంకర్స్ వీక్లీ"లో పనిచేయవలసిందిగా ఢిల్లీకి ఆహ్వానించాడు.

లండన్‌లో పని[మార్చు]

1953లో లండన్‌లోని "ది స్టార్" పత్రిక సంపాదకుడు ఫ్రెడ్ జోస్ ఇతడిని లండన్‌కు రావలసినదిగా ప్రోత్సహించాడు. ఇతడు తన 32వ యేట లండన్‌లో అడుగుపెట్టాడు.[2] లండన్ చేరిన వెంటనే ఇతడు పంచ్, డైలీ స్కెచ్, ఎవెరీబడీస్ లండన్ ఒపినియన్, ఈస్టర్న్ వరల్డ్ మొదలైన పత్రికలకు అబ్రహాం అనే కలం పేరుతో కార్టూన్లు వేయడం ఆరంభించాడు.[2] 1956లో ట్రిబ్యూన్ పత్రికలో ప్రచురింపబడ్డ ఇతని రెండు కార్టూన్లను చూసి ప్రపంచంలో అతి పురాతనమైన ఆదివారం వార్తాపత్రిక "ది అబ్జర్వర్" సంపాదకుడు డేవిడ్ ఏస్టర్ ఇతడికి తన పత్రికలో రాజకీయ కార్టూనిస్టుగా స్థిరమైన ఉద్యోగాన్ని ఇచ్చాడు. అతని సలహాపై అబ్రహాం అనే కలం పేరును తన చిన్ననాటి ముద్దుపేరు "అబూ"గా మార్చుకున్నాడు.[2]

అబూ బ్రిటిష్ సంస్కృతిలో మునిగిపోయి వాడి, వేడి రాజకీయ కార్టూన్లను గీశాడు. ది గార్డియన్ పత్రిక ఇతడిని "త్రికరణశుద్ధిగా వామపక్ష భావజాలాన్ని నమ్మి ప్రభుత్వానికి పక్కలో బల్లెంలా తయారైనాడని" అభివర్ణించింది.[2] 1962లో ఇతడు క్యూబాలో చే గువేరా చిత్రాన్ని గీశాడు. ఫిడెల్ కాస్ట్రోతో సుమారు మూడు గంటలు ఒక నైట్‌క్లబ్బులో కలుసుకున్నాడు[2]

1966 సెప్టెంబరులో ఇతడు ది గార్డియన్ పత్రికలో చేరాడు. ట్రిబ్యూన్ పత్రికకు వారం వారం కార్టూన్లను వేశాడు. 1968లో వియత్నాం యుద్ధంపై వెలువడిన "వర్డిక్ట్స్ ఆఫ్ వియత్నాం" అనే కార్టూన్ల సంకలనానికి సంపాదకత్వం వహించాడు.I

స్వదేశానికి తిరిగి రాక[మార్చు]

అబూ 1969లో తన మొదటి భార్య సరోజిని (తరువాతి కాలంలో విడాకులు ఇచ్చాడు), ఇద్దరు కూతుళ్ళు ఐషా, జానకిలతో భారతదేశానికి తిరిగి వచ్చాడు. ఇక్కడ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో 1981 వరకు రాజకీయ కార్టూనిస్టుగా పనిచేశాడు. 1970లో ఇతడు తీసిన షార్ట్ ఫిలిం నో ఆర్క్స్ కు బ్రిటిష్ ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రత్యేక అవార్డును ఇచ్చింది.[2] 1972-78ల మధ్య ఇతడు రాజ్యసభలో నామినేట్ సభ్యుడిగా ఉన్నాడు.[2]

1975లో భారత అత్యవసర స్థితి విధించినపుడు పత్రికా స్వేచ్ఛను రద్దు చేశారు. అబూ ఈ చర్యతో ఇందిరా గాంధీ పై ఉన్న అభిమానాన్ని కోల్పోయాడు. ఫలితంగా 1977లో ఎమర్జెన్సీ సమయంలో ప్రచురించలేకపోయిన రాజకీయ కార్టూన్లు, వ్యాసాలతో "గేమ్స్ ఆఫ్ ఎమర్జెన్సీ" అనే పుస్తకాన్ని విడుదల చేశాడు. ఇంకా ఇతడు "అబు ఆన్ బాంగ్లాదేశ్", "ప్రైవేట్ వ్యూ", "అరైవల్స్ అండ్ డిపార్చర్స్" అనే కార్టున్ పుస్తకాలను ప్రకటించాడు. 1988లో వెలువడిన పెంగ్విన్ బుక్ ఆఫ్ ఇండియన్ కార్టూన్స్‌కు సంపాదకుడిగా ఉన్నాడు.[2]

1981 నుండి ఇతడు ఫ్రీలాన్సర్‌గా వివిధ వార్తాపత్రికలకు కార్టూన్లు గీయడం ప్రారంభించాడు. "సాల్ట్ అండ్ పెప్పర్" అనే స్ట్రిప్ కార్టూన్ వేయనారంభించాడు.[3]

ఇతడు 2002 డిసెంబరు 1లో మరణించాడు. ఇతని మరణానికి సంతాప సూచకంగా రాజ్యసభ రెండు నిమిషాల మౌనం పాటించింది. ఇతని అంత్యక్రియలను ప్రభుత్వలాంచనాలతో ఘనంగా నిర్వహించారు.[2]

మూలాలు[మార్చు]

  1. "His strongest theme, as India sank faster into factional and religious politics, had remained adherence to the original vision of Mahatma Gandhi and Nehru for a wholly secular state: Abu was a rationalist and atheist." Michael McNay, 'Obituary: Abu Abraham', The Guardian, 7 December 2002, Pg. 26.
  2. 2.00 2.01 2.02 2.03 2.04 2.05 2.06 2.07 2.08 2.09 2.10 Mark Bryant, Fleet Street's Star of India, History Today, 57(6) pp. 58–59 (June 2007)
  3. Qureishi, Humra (2 November 2003). "Cartoonist who provokes you to think". The Sunday Tribune.

బయటి లింకులు[మార్చు]

లువా తప్పిదం: bad argument #2 to 'title.new' (unrecognized namespace name 'Portal')