Jump to content

అసుర సంధ్య - మాల్కం ఎక్స్ ఆత్మకథ

వికీపీడియా నుండి
"అసుర సంధ్య" పుస్తకం ముఖచిత్రం

అసుర సంధ్య - మాల్కం ఎక్స్‌ ఆత్మకథ అనే పుస్తకం తెలుగులో ప్రచురింపబడిన ఒక అనువాద రచన. దీనికి ఆంగ్ల మూలం ప్రఖ్యాత రచయిత ఎలెక్స్ హేలీ వ్రాసిన "ఆటోబయోగ్రఫీ ఆఫ్ మాల్కమ్ ఎక్స్". ఆఫ్రికన్ సంతతికి చెందిన అమెరికా ముస్లిం మత ప్రచారకుడు, మానవహక్కుల పోరాట కార్యకర్త మాల్కం ఎక్స్ జీవితచరిత్ర ఈ రచనలోని ఇతివృత్తం. తెలుగు అనువాదం చేసినవారు యాజ్ఞి

అలెక్స్ హేలీ వ్రాసిన మరొక చరత్రాత్మక నవల రూట్స్ మరింత ప్రసిద్ధమైనది. ఆ రచనను కూడా ఏడు తరాలు అనే పేరుతో తెలుగులోనికి అనువదించారు.

పరిచయం

[మార్చు]

అసుర సంధ్య : ఆర్థిక స్వావలంబనే అసలు పరిష్కారం అనే శీర్షికతో దుప్పల రవి కుమార్ వ్రాసిన పరిచయం ఇలా ఉంది.

కొన్ని పుస్తకాలకు నిజానికి విపులమైన పరిచయం అవసరం లేదు. మరెవ్వరూ చెప్పలేన్ని విషయాలు మనకు స్వయంగా ఆ పుస్తకాలే తెలియజెప్తాయి. అలాంటి అరుదైన పుస్తకాలలో ఒకటి “అసుర సంధ్య“. అలెక్స్ హేలీ రచించిన ఈ పుస్తకానికి తెలుగు అనువాదం ఇంత ఆలస్యంగా వెలువడడం అంతు చిక్కని విషయం. తెలుగు సాహితీ ప్రపంచంలోకి ఇప్పటికైనా వచ్చినందుకు ఆనందంగా ఉన్నప్పటికి ఆలస్యానికి కారణాలు మాత్రం నిజంగా ఆలోచించాలి. అలెక్స్ హేలీ పేరు వినగానే తెలుగు పాఠకులకు సహవాసి పుణ్యమా అని వెంటనే గుర్తుకొచ్చేది ఏడు తరాలు నవల. అనితర సాధ్యమైన ఆ నవలను రచించిన హేలీ ఇతర రచనల గురించి మనకు మరేమీ తెలియనప్పుడు అత్యంత సాహసంగా "యాజ్ఞీ" అనే అనువాదకుడు హేలీ మరో రచనను "అసుర సంధ్య" పేరుతో మన ముందుకు తీసుకొచ్చారు. ఈ పుస్తకానికి "నల్లజాతి వైతాలికుడు మాల్కం ఎక్శ్" పేరుతో జిలుకర శ్రీనివాస్ రాసిన పదిహేను పేజీల సవివరమైన ముందుమాట పుస్తకంలోని అసలు విషయానికి అవసరమైన బ్యాక్ డ్రాప్ను అందివ్వడమే కాకుండా అనేక ఆలోచనలు రేకెత్తించి, కొన్ని విలువైన ప్రశ్నలను మన ముందు చర్చకు పెడుతుంది.

మన దేశంలో కొంతమంది ప్రజలను అంటరానితనం పేరుతో అంటరానివారుగా కొన్ని వేల సంవత్సరాల పాటు అత్యంత హీన స్థితిలో ఉంచాం. అంటరానితనమనేది కింది కులాల వారనబడే ప్రజల శరీరాల్లోనో, మనసుల్లోనో, వారు బతుకులీడుస్తున్న పరిస్థితుల్లోనో ఉండదు. అదంతా పై కులస్తులలో ఉండే "అంటలేనితనం" అని గుర్తించగలిగిన తరువాత మన మానసిక పరిస్తుతుల్లో ఇప్పుడిప్పుడే కొంత మార్పు కనిపిస్తోంది. పిలిచే పిలుపులో కూడా దళితులని వ్యవహరించడం వెనుక కొన్ని శతాబ్దాల ఆత్మ గౌరవ పోరాటాల చరిత్ర ఉందని మర్చిపోకూడదు. ఇంత భయంకరమైనది కాకపోయినా మనిషిని నిలువునా నీరు చేసే యిలాంటి వ్యవహారమే పాశ్చాత్య దేశల్లో నీగ్రోల వ్యవస్థలోనూ ఉంది. కాని అక్కడ కూడా ఈ పిలుపుపట్ల వ్యతిరేకత స్ప్షష్టంగా వ్యక్తీకరిస్తున్న ఫలితమే వారిని యిప్పుడు బ్లాక్స్ లేదా ఆఫ్రికన్ అమెరికన్స్ అని పిలవడం నెమ్మదిగా మొదలైంది. రావలసిన పెను మార్పునకు ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని గుర్తించాలి. వేల సంవత్సరాల తరబడి రక్తంలో పాతుకుపోయిన జాడ్యం పోవడానికి కొన్ని వందల ఏళ్ళ పోరాటం సరిపోదు. ఈ పోరాటం ఇంకా ఉధృతంగా జరగాలి. మనందరి మనస్సులను ప్రక్షాళన చేయాలి. అప్పుడే ఒక మనిషి తన తోటి మనిషిని కులం, రంగు, చదువు, సంపదల ఆధారంగా హీనంగా చూసే అవకాశం ఉండదు. ముడ్డికి తాటికమ్మ కట్టుకుని, చేతిలో ముంత పట్టుకుని కొందరు మనుషులు మన సమాజంలోనే తిరిగేవారంటే మన గుండె తరుక్కుపోతుంది. నడుస్తున్న అడుగులను చెరిపి ఇంకొకరికి ఆ పాదాల ఛాయకూడా కనిపించకుండా ఉండడానికి వెనక తాటికమ్మ పట్టుకోవడం, ఎక్కడపడితే అక్కడ ఉమ్మకునండా చేతిలోనే ముంత పట్టుకోవడ అనేవి సాటి మనుషులను హీనంగా ఉంచే సామాజిక వ్యవస్థ దుర్మార్గానికి అద్దం పడతాయి.

అమెరికాలో నల్లవారి పట్ల ప్రజాస్వామిక సభ్య సమాజం అత్యంత నీచంగా జరుపుతున్న ఆత్మగౌరవ హననానికి వ్యతిరేకంగా పెల్లుబుకిన ధిక్కర స్వరం మాల్కం ఎక్స్ ది. ఈ మాల్కం కథ చదువుతున్నకొద్దీ మనదేశం మనకు పదేపదే గుర్తుకు రావదం యాదృఛ్చికమేమీ కాదు. మాల్కం ఎక్స్ ను మన అంబేద్కర్తోనూ, మార్టిన్ లూథర్ కింగ్ ను మన గాంధీతోనూ పోల్చడానికి మొగ్గు చూపిస్తాం. కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే జ్యొతీరావ్ ఫూలేకానీ, అంబేద్కర్ కానీ, పెరియార్ కానీ జరిపిన సామాజిక సంస్కరణలను వేటినీ మాల్కం ఎక్స్ చర్యలతో పోల్చి చూడలేం. ఎందుకంటే అతడి జీవిత గమనమే చిత్రాతిచిత్రంగా నడిచింది. తన బతుకుబాటలో నడిచివచ్చిన తన దారిలో తనకు ఎదురైన అనుభవాలు నేర్పిన సారం మాల్కం ఎక్స్ వంట పట్టించుకోవడం వల్లనే కాబోలు తన తరువాతి తరాలను ప్రభావితం చేయగల ఉపన్యాసాలతో రెచ్చగొట్టిన ఎక్స్ ఆర్థిక స్వయం ప్రతిపత్తి గురించి తన వాళ్లకు ఉగ్గుపాలతో రంగరించి పోశాడు. దానివల్ల నిర్మితమైన ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థ బ్లాక్ రెస్టరెంట్లు, బ్లాక్ పరిశ్రమలు, బ్లాక్ పఠశాలలు….. ఒకటేమిటి అవన్నీ అగ్ర దురహంకారులకు ఒక సవాలును విసరగలిగాయి.


అమెరికాలో నల్లజాతి విముక్తి పోరాట చరిత్రలో ప్రధాన స్రవంతిలో కనిపించే పేర్లు మూడు మాత్రమే. వారు అబ్రహాం లింకన్, బుకర్ టి. వాషింగ్టన్, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ లు మాత్రమే. కానీ చరిత్రలో అంతగా నమోదుకాని, మనకు (ముఖ్యంగా తెలుగువారికి) అంతగా తెలియని మరో పోరాటపాయ ఎలైజా ముహమ్మద్‌ది. తాను స్థాపించిన నేషన్ ఆఫ్ ఇస్లాం సంస్థలో చేరి దాని దిశానిర్దేశాన్ని మార్చి తన జాతి తరాల తలరాతలను కూడా మార్చగలిగిన మాల్కం ఎక్స్ కథ అంతగా పత్రికల్లోకి ఎక్కలేదు. జనం నోళ్లలో నానలేదు. దానికి కారణం తర్వాత తర్వాత ఇతడి మాటలు, ఉపన్యాసాలు, రాతలవల్లే అక్కడ చెలరేగిన విప్లవాత్మక, సాయుధ బ్లాక్ పాంథర్స్ ఉద్యమం బహుశా ఒక కారణం కావచ్చు. కాని అమెరికాలోనే కాక దేశవిదేశాల్లో ముహమ్మద్ గురించి, నేషన్ ఆఫ్ ఇస్లాం గురించి, నల్ల జాతి విముక్తి ఉద్యమం గురించి అత్యంత ప్రభావశీలంగా ప్రచారం చెయ్యగలిగింది మాల్కం ఎక్స్ మాత్రమే.

రచనా సారాంశం

[మార్చు]
ఆంగ్లమూలం పుస్తకం ముఖచిత్రం

తన గురువు, దైవం అయిన ముహమ్మద్ కూడా అనైతికతకు లొంగిపోయాడని తెలిసిన తర్వాత తన ప్రాణ త్యాగానికి సైతం సిద్ధపడి తన సొంత మార్గంలో ప్రయాణించిన అసమాన ధైర్య సాహసాలున్న యోధుడు మాల్కం ఎక్స్. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్తో సహా గాంధేయవాదులంతా ‘కలసి ఉంటే కలదు సుఖం‘ సూత్రాన్ని ప్రభోదిస్తూ ‘కొంచెం మర్యాదివ్వండి బాబోయ్‘ అంటూ బతిమాలుకుంటూ పోరాదుతున్న రోజుల్లో నల్లవారి రాజ్యం స్థాపించుకున్న నాడే తమ కష్టాలు ఈడేరుతాయని కలలుగన్న మాల్కం ఎక్స్ ఆర్థిక స్వాతంత్ర్యమే అన్ని సమస్యలకు పరిష్కారమని ప్రబోధించాడు. అయితే నల్లజాతి ప్రజలంతా ఇస్లాం మతం స్వీకరించాలని, అలా కలసికట్టుగా ఉండాలని ప్రబోధించడం వెనుక ముహమ్మద్ ప్రభావం ఎంతైనా ఉందనే సంగతి గుర్తుంచుకోవాలి.

ముహమ్మద్ ను విడిచిపెట్టిన తరువాత మాల్కం విదేశీ పర్యటనకు బయలుదేరుతాడు. మతం అసలు రంగు తెలుసుకుంటాడు. మత గ్రంథాలను సరైన రీతిలో అర్థం చేసుకుంటాడు. అనంతరం ‘నిజమైన ఇస్లాం‘ను అమెరికాలో తన సహచరులతో ప్రభోదిస్తాడు. ఆఫ్రికన్ అమెరికన్ యూనిటీ ఆర్గనైజేషన్ ను స్థాపిస్తాడు. కానీ మృత్యువు తనవద్ద పొంచివుందని గమనించిన మాల్కం ఆ సంగతి తన మిత్రులందరికీ తెలియపరుస్తాడు. దారుణంగా హతమయ్యేలోపు విస్తృతంగా పర్యటనలు, ఉపన్యాసాలు పూర్తిచేసుకుని ఆర్థిక అజెండాను సంపూర్ణంగా తన ప్రజల ముందుంచాడు. కానీ పరిస్థితులు ఇప్పుడు qన్నీ తారుమారయ్యే సూచనలు పొడసూపుతున్నాయి. అమెరికాపై ఉగ్రవాదులు జరిపిన భీతవహ దాడుల తరువాత ఇస్లాం మతస్తులు కొత్త సమస్యలను ఎదుర్కొంటున్నారు. బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించుకుంటున్న నల్లజాతి ప్రజలకు ఉగ్రవాద దుశ్చర్య పెద్ద చెంపపెట్టు. ఇలాంటి అవకాశాల కోసమే కాచుక్కూచున్న అమెరికా ఉగ్రవాద దురహంకారానికి ఇదొక పెద్ద అలుసు. సామ్రాజ్యవాద స్వభావం దీనిని సాకుగా తీసుకొని నల్లజాతి మీద మళ్ళీ పడగ విసిరేలోగా ఈ దెబ్బను తమాయించుకొని నిలబదిథే ఆత్మగౌరవ పోరాటానికి పునరుజ్జీవనం లభించినట్టు. లేదంటే ఈ త్యాగాలన్నీ, పోరాటాలన్నీ నిష్ఫలమవుతాయి.

జీవితంలో ఎత్తుపల్లలన్నీ చూసాడని కొందరిని వర్ణిస్తుంటారు. నిజానికి అక్షరాలా ఈ మాట మాల్కం ఎక్స్ కు వర్తిస్తుంది. భద్ర జీవనం గడుపుతున్న చిన్నారి మాల్కం తండ్రి మరణించాక, తల్లి ఆత్మగౌరవంతో పెనంచడానికి ప్రయత్నించి విఫలమవుతుంది. ఆమెను సమాజం దాదాపు పిచ్చిదాన్ని చేస్తుంది. వివక్ష విశ్వరూపాన్ని లేతప్రాయంలోనే అనుభవిస్తాడు. అయితే దానిపై పోరాటం ప్రకటించిన మాల్కం జీవిత ప్రవాహంలోపడి కొట్టుకుపోతాడు. చిల్లర దొంగతనాలనుండి క్రమంగా పెద్ద దొంగతనాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వ్యభిచారం, ఒకటేమిటి అన్ని రకాల దుర్వ్యసనాలకు బానిసవుతాడు. చివరకు జైలు పాలవుతాడు. మతాన్ని, దేవున్ని నమ్మని మాల్కం జైలులో క్రమంగా ఎలైజా ముహమ్మద్ గురించి తెలుసుకొని ఇస్లాం గురించి అధ్యయనం ప్రారంభిస్తాడు. ఒక జాతిపట్ల ఇతర జాతులన్నీ చూపిస్తున్న వైమనస్యానికీ, వివక్షకూ, సమస్యలకు మూలాలను అన్వేషించడం ప్రరంభిస్తాడు. ఆ అన్వేషణలో తనకు లభించిన సమాధానాలకు అనుగుణంగానే తన ఉపన్యాసాలను తయారుచేసుకున్నాడు. ఇంక అమెరికాలోని అన్ని రాష్ట్రాలలో నేషన్ ఆఫ్ ఇస్లాం శాఖలు ఏర్పాటుచేసి, మసీదులు నిర్మించడం ప్రారంభిస్తాడు. ముమ్మరంగా తన కృషి సాగుతున్న దశలో ఎలైజా అనైతిక వ్యవహారం బయటపడుతుంది. దానిని మన్నిస్తాడు కూడా. అయినా అనవసర అహంకారాలతో ఎలైజా దూరాన్ని పెంచుకుంటాడు. దానితో విభేదాలు ఏర్పడి అతడి నుండి విడివడి స్వతంత్రుడవుతాడు. మరణించేవరకు తాను నమ్మిన సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూనే గడిపాడు.

"ఏడు తరాలు" నవల రాయడం కోసం అలెక్స్ హేలీ చాలా ఏళ్ళపాటు అవిశ్రాంతమైన పరిశోధన సాగించాడు. నిజానికి తన పూర్వీకుల గురించి కథనం రాసే ప్రయత్నంలో ఆ ఆఫ్రికా అడవుల్లో సంచరిస్తూ, ఒక పడవలో డెక్ మీద అదే తరహాలో ప్రయాణిస్తూ, కేవలం అప్పటి మూడ్ లోకి వెళ్లడానికి అలెక్స్ హేలీ ప్రయత్నించాడని చెప్తుంటారు. అదేవిధమైన కష్టం మళ్లీ ఈ రచన కోసం పడినట్టు ఈ గ్రంథంలో హేలీ స్వయంగా చెప్పుకుంటాడు. అనేక దఫాలుగా మాల్కంతో ఇంటర్వ్యూలు తీసుకొని, అన్ని విషయాలమీద కూలంకషంగా చర్చించి ఒక్కో వాక్యమూ రాసుకుంటూ వచ్చాడట. మాల్కం గురించి చెప్తూ రచయిత ఇంతటి విద్వత్తేజం కలిగిన వ్యక్తిత్వాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు అని ప్రశంసిస్తాడు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన ఈ “అసుర సంధ్య - మాల్కం ఎక్స్ ఆత్మ కథ” యువతరం తప్పక చదవాల్సిన ఒక మంచి పుస్తకం.

మూలాలు, వనరులు, బయటి లింకులు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]