Jump to content

ఆజాద్ హింద్ ఫౌజ్‌లో ముస్లిం పోరాట యోధులు

వికీపీడియా నుండి

దేశం నుండి బ్రిటీష్‌ పాలకులను తరిమికొట్టేందుకు సాగిన సుదీర్ఘ స్వాతంత్ర్యపోరాట చరిత్ర చివరిథలో ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ (భారత జాతీయ సైన్యం) సాగించిన సాయుధ పోరాటంలో ఆది నుండి అంతం వరకు ముస్లిం పోరాట యోధులు ప్రధాన పాత్ర నిర్వహించారు.

ముస్లిం నేతల భాగస్వామ్యం

[మార్చు]

భారత జాతీయ సైన్యం తొలిసారిగా ఏర్పడినప్పటి నుండి, సుభాష్‌ చంద్రబోస్ భారత జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, భారత జాతీయ సైన్యాన్ని పునర్వవస్థీకరించి, 'చలోఢిల్లీ' నినాదంతో భారతీయ వీరయోధులను నడిపించడం, ఆ తరువాత ఎర్రకోటలో భారత జాతీయ సైన్యం యోధుల మీద ఆంగ్ల ప్రభుత్వం సైనిక విచారణ జరపడం లాంటి సంఘటనలలో, నిర్వహణా పరంగా ఏర్పడిన అన్ని విభాగాల్లో ముస్లిం పోరాట యోధులు అద్వితీయమైన పాత్రను నిర్వహించి చరితార్ధులయ్యారు. సుభాష్‌ చంద్రబోస్‌ కలకత్తాలోని తన గృహం నుండి అత్యంత పకడ్బంధీ పథకం ప్రకారంగా, బ్రిటీష్‌ గూఢచారుల కన్ను గప్పి అంతర్దానమై జర్మనీ చేరుకున్నప్పటి నుండి అయనకు అన్ని విధాలుగా బాసటగానిలచి, అంతిమంగా విమాన ప్రమాదంలో అతను కన్నుమూయడం వరకు ప్రతి చారిత్రక ప్రాధాన్యతగల సందర్భాలన్నిటిలో నేతాజీ ముస్లిం సహచరులు ప్రధాన భాగస్వామ్యం వహించారు.

నేతాజీకి సహాయం

[మార్చు]

1941 జనవరి 16,17 తేదీలలో సుభాష్‌ చంద్రబోస్‌ ఆంగ్ల ప్రభుత్వ గూఢాచారి వ్యవస్థ కళ్ళుగప్పి మహమ్మద్‌ జియావుద్దీన్‌ అను మారు పేరుతో కలకత్తా నుండి తప్పుకున్న 'గ్రేట్‌ ఎస్కేప్‌' ఏర్పాట్లను మియా అక్బర్‌ షా నిర్వహించగా, ఆ తరువాతి ప్రాణాంతక కాబూల్‌ ప్రయాణంలో అక్బర్‌షా ఏర్పాటు చేసిన సాయుధ పఠాన్‌ యువ కులు నేతాజీకి అంగరక్షకులుగా నడిచారు. ఆఫ్ఘాన్‌ గుండా పఠాన్‌ వేషంలో నేతాజీ ప్రయాణం సాగించాల్సి వచ్చిన ప్పుడు, ఆంగ్ల గూఢచారులు, వారి తొత్తులు ఏమాత్రం గుర్తు పట్టకుండా ఆబాద్‌ ఖాన్ నేతాజీకి ఆఫ్ఘాన్‌ పఠాన్‌ వ్యవహారసరళి, ఆచార సంప్రదాయాలలో వారం రోజుల పాటు తన ఇంట రహాస్యంగా ప్రత్యేక శిక్షణ గరిపి ముందుకు పంపారు. 1941 మార్చి 27న నేతాజీ బెర్లిన్‌ చేరేంతవరకు ప్రమాదకర పరిస్థితులలో అతనును కళ్ళల్లో పెట్టుకుని కాపాడి గమ్యం చేర్చడంలో ముస్లిం యోధులు తోడ్పడ్డారు. ఆ తరువాత అతను అఫ్ఘన్‌ సరిహద్దులు దాటేంత వరకు మియా అక్బర్‌ షా ఏర్పాటు చేసిన పఠాన్‌ యువకులు సుభాష్‌ చంద్రబోస్‌ అంగరక్షకులుగా కళ్ళల్లో పెట్టుకుని కాపాడుతూ ముందుకు తీసుకెళ్ళగా, అతను జర్మనీ చేరేంత వరకు మహమ్మద్‌ షరీఫ్‌, మహమ్మద్‌ లాంటి ప్రముఖులు తొడ్పాటునిచ్చారు.

సారే జహా సె అచ్చా

[మార్చు]
సారే జహాఁసె అచ్ఛా - హిందూసితాఁ హమారా హమారా గీత రచయిత

బ్రిటీష్‌ సామ్రాజ్యవాద కాంక్షకు వ్యతిరేకంగా పోరుకు సిద్దపడిన యోధుడు రాస్‌ బిహారి బోస్‌ మార్గదర్శకత్వంలో 1942 మార్చిలో సింగపూర్‌ సమావేశంలో మేజర్‌ మహమ్మద్‌ జమాన్‌ ఖైని పాల్గొన్నారు. ఆ తరువాత అతను భారత జాతీయ సైన్యం 'కమాండర్‌'గా గణనీయ సేవలు అందించారు.ఆ తరువాత 'భారత జాతీయ సైన్యం' కమాండర్‌గా నేతాజీ తరువాతి స్థాయి అధికారిగా గణనీయ సేవలు అందించారు. రాస్‌బిహారి, ప్రీతం సింగ్‌, కెప్టెన్‌ మాన్‌సింగ్‌ లాంటి నేతల నేతృత్వంలోని 'కౌన్సిల్‌ ఆఫ్‌ యాక్షన్‌', 1942 సెప్టెంబరు ఒకటిన సింగపూర్‌లో ఏర్పడిన 'భారత జాతీయ సైన్యం'లో కెప్టెన్‌ మహమ్మద్‌ అక్రం, కల్నల్‌ యం.జడ్‌. ఖైని, కల్నల్‌ జి.క్యూ.జిలాని, లెఫ్టినెన్ట్‌ కల్నల్‌ యస్‌.యన్‌.హుసైన్‌, లెఫ్టినెన్ట్‌ కల్నల్‌ షానవాజ్‌ ఖాన్‌, మేజర్‌ ఇక్బాల్‌లు బృహత్తర బాధ్యతలు నిర్వహించారు. జాతీయ భావాలు పుణికి పుచ్చుకున్న కెప్టెన్‌ మహమ్మద్‌ అక్రం తొలుత నుండి తన సహచరుడు కెప్టెన్‌ మాన్‌ సింగ్‌కు తోడుగా నిలిచారు. జనరల్‌ మాన్‌సింగ్‌ నేతృత్వంలో భారత జాతీయ సైన్యం ఏర్పడ్డాక ప్రముఖ ఉర్దూ కవి మహమ్మద్‌ ఇక్బాల్ రాసిన 'సారె జహ సేఁ అచ్ఛా హిందూస్తాన్‌ హమార్‌' గీతం, జాతీయ గీతంగా 'మార్చింగ్‌ సాంగ్‌' గా గౌరవప్రతిష్ఠలను అందుకుంది.

'భారతీయ కమాండో దళం' శిక్షకులుగా నేతాజీ

[మార్చు]

1941 మార్చి 27న జర్మనీ రాజధాని బెర్లిన్‌ చేరుకున్న నేతాజి జర్మనీలో తొలుత 'స్వేచ్ఛా భారత కేంద్రం' (ఫ్రీ ఇండియా సెంటర్‌) ప్రారంభించారు. ఆ క్రమంలో నేతాజీకి పరిచయం అయిన ఆంధ్రప్రదేశ్‌ చెందిన అబిద్‌ హసన్‌ సప్రాని 1941 నవంబరులో నేతాజీ ఏర్పాటు చేసిన 'భారతీయ కమాండో దళం' శిక్షకులుగా వ్యవహరించారు. 'ఆజాద్‌ హింద్‌ రేడియో' ద్వారా నేతాజి చేసిన ప్రసంగాల ప్రసారం విషయంలో బహు భాషాలలో ప్రవేశం ఉన్న అబిద్‌ సహకరించారు. భారత స్వాతంత్ర్యోద్యమ సాహిత్య చరిత్రలో చిరస్మణీయంగా నిలచిపోయిన 'నేతాజి', 'జైహింద్‌'లను అబిద్‌ సృజనాత్మక సామర్ధ్యం నుండి పుట్టుకొచ్చాయి. అనాడు భారత జాతీయ సైన్యం మాత్రమే కాకుండా అరవైఐదేండ్ల తరువాత కూడా భారత సైనికులు మన జాతీయ పతాకానికి వందనాలు అర్పిస్తూ 'జైహింద్‌' అని ఉత్సాహపూర్వకంగా నినదించడం అబిద్‌ హసన్‌ సృజనాత్మకతకు సజీవ తార్కాణం. సుభాష్‌ చంద్రబోస్‌ జర్మనీ నుండి తూర్పు ఆసియాకు వచ్చేంత వరకు జర్మనీలో సాగిన కార్యక్రమాలలో నేతాజీకి అబిద్‌ హసన్‌ సప్రాని, ఎం.జడ్‌ కియాని తోడ్పాటు నివ్వగా 'భారతీయ కమాండో దళం' బాధ్యతలను సైన్యాధికారిగా ఎం.జడ్‌ కియాని సమర్థవంతంగా నిర్వహించారు.

ఈ పరిస్థితులు ఇలా ఉండగా జపాన్‌ ప్రభుత్వాధినేతల పట్ల భారతీయ విప్లవోద్యమ నేతలల్లో ఏర్పడిన అభిప్రాయబేధాల కారణంగా తూర్పు ఆసియా ప్రాంతంలో ఏర్పడిన 'భారతీయ జాతీయ సైన్యం', 'కౌన్సిల్‌ ఆఫ్‌ యాక్షన్‌'లు 1942 డిసెంబరు 29న రద్దయినట్టు జనరల్‌ మాన్‌సింగ్‌ ప్రకటించారు. ఆ ప్రకటనతో ఏకీభవించని విప్లవకారులు, భారతీయ సాయుధపోరాట యోధులు విప్లవయెధుడు రాస్‌ బిహరి బోస్‌ నేతృత్వంలో సుభాష్‌ చంద్రబోస్‌ నాయకత్వాన్ని ఆహ్వానిస్తూ రద్దు చేసిన భారత జాతీయ సైన్యాన్ని 1943 ఫిబ్రవరి 15న పునర్‌వ్యవస్ధీకరించారు. భారత జాతీయ సైన్యం, దాని అనుబంధం సంస్థలను, కార్యకర్తలను, సైనికులకు మార్గదర్శకత్వం వహించేందుకు సుప్రీం మిలటరీ బ్యూరో సంచాలకులుగా లెఫ్టినెంట్‌ కల్నల్‌ జె.కె.భోన్స్‌లే బాధ్యతలు స్వీకరించగా లెఫ్టినెంట్‌ మీర్జా ఇనాయత్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఇషాన్‌ ఖాదిర్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఎం.జడ్‌ కియాని, మేజర్‌ మతా-ఉల్‌-ముల్క్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌ బుర్హానుద్దీన్‌, మేజర్‌ ఎ.డి జహంగీర్‌, మేజర్‌ హబీబుర్‌ రెహమాన్‌, లెఫ్టినెంట్‌ అల్లాయార్‌ ఖాన్‌, మేజర్‌ మహమ్మద్‌ రజాఖాన్‌, కెప్టెన్‌ ముంతాజ్‌ ఖాన్‌, ఎస్‌.ఓ ఇబ్రహీం, లెఫ్టినెంట్‌ కల్నల్‌ అజీజ్‌ అహమ్మద్‌, లెఫ్టినెంట్‌ మీర్‌ రహమాన్‌ ఖాన్‌, మేజర్‌ రషీద్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌ అర్షద్‌లు ముందుకు వచ్చి ప్రధానాధికారులుగా బాధ్యతలు చేపట్టారు. లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఎం.జడ్‌ కియాని జనరల్‌ స్టాఫ్‌ ప్రధానాధికారిగా, సైనికుల శిక్షణాధికారిగా మేజర్‌ హబీబుర్‌ రెహమాన్‌, రిఎన్‌ఫోర్స్‌మెంట్‌ కమాండెంట్‌గా మేజర్‌ ముతా-ఉల్‌-ముల్క్‌, చరిత్ర-సంస్కృతి-పౌర సంబంధాల అధికారిగా మేజర్‌ ఏ.జడ్‌ జహంగీర్‌ ప్రధాన భూమికలను చాకచక్యంగా నిర్వర్తించారు.

అబిద్‌ హసన్‌ సఫ్రాని సహాయం

[మార్చు]

ఈ పరిణామాల నేపథ్యంలో ఐరోపా‌ నుండి ఆసియాకు రావాల్సిందిగా కోరుతున్న విప్లవోద్యమ నేతల ఒత్తిడి పెరగడంతో నేతాజీ తూర్పు ఆసియాకు వెళ్ళాలని నిర్ణయిచారు. జపాన్‌-జర్మనీల సహకారంతో బ్రిటన్‌ దాని మిత్రపక్షాల సైన్యాలతో పోరాడుతున్న సుభాష్‌ చంద్రబోస్‌ ఆసియాకు వెళ్ళడం ప్రమాదకరం. అందువల్ల బ్రిటీష్‌ గూఢాచారి వ్యవస్థ డేగకళ్ళ నుండి తప్పించుకుని గమ్యస్థానం చేరడానికి నేతాజి రహస్యంగా జలాంతర్గమి ప్రయాణం తప్ప మరోకమార్గం లేకపోయింది.1943 ఫిబ్రవరి 8న ఆరంభమైన చరిత్రాత్మక జలాంతర్గమి ప్రయాణంలో అబిద్‌ హసన్‌ సప్రాని నేతాజీ వెంట సాగారు. శత్రు పక్షాల నిఘానీడల్లో మూడు మాసాలపాటు సముద్ర గర్భంలో 25,600 కిలోమీటర్లు సాగిన జలాంతర్గమి ప్రయాణంలో సుభాష్‌్‌కు తోడుగా నిలిచి, భవిష్యత్తు కార్యక్రమాల రూపకల్పనలో అతనుకు తోడ్పడి అబిద్‌ హసన్‌ సఫ్రాని చరిత్ర సృష్టించారు.

'ఆజాద్‌ హింద్‌'

[మార్చు]

1943 మే16న సుభాష్‌-అబిద్‌లు టోక్యో చేరుకున్నాక 1943 జూలై నాల్గున సింగపూర్‌లో జరిగిన సమావేశంలో తూర్పు ఆసియాలో సాగుతున్న భారత స్వాతంత్ర్యోద్యమం నాయకత్వాన్ని సుభాష్‌ చంద్రబోస్‌ చేపట్టారు. ఆ మరుసటి రోజున భారత జాతీయ సైన్యం ఆధికారుల నుండి సైనికవందనం స్వీకరించి 1943 అక్టోబరు 23న 'ఆజాద్‌ హింద్‌' ప్రభుత్వాన్ని ప్రకటించి 'చలో ఢిల్లీ' నినాదమిచ్చారు. ఈ సందర్భంగా 1757 నాటి సిరాజుద్దౌలా పోరాటం నుండి హైదర్‌ అలీ, టిపూ సుల్తాన్‌, 1857 నాటి బేగం హజరత్‌ మహాల్‌, బహుదర్‌ షా జఫర్‌ లాంటి యోధులు ఆంగ్లేయుల నుండి మాతృభూమిని విముక్తం చేయడానికి సాగించిన పోరాటాల క్రమాన్ని వివరిస్తూ అలనాటి యోధుల సాహసోపేత త్యాగాలను ప్రస్తుతించారు. భారత జాతీయ సైన్యం పతాకం మీద ప్రప్రథమ జాతీయవాదిగా ఖ్యాతిగడించిన మైసూరు పులి టిపూసుల్తాన్‌కు గుర్తుగా 'పులి' చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. ఆనాడు ఆజాద్‌ హింద్‌ రేడియా కేంద్రం ప్రసారం చేసిన ప్రతి కార్యక్రమం, మొగల్‌ చక్రవర్తి బహుదూర్‌ షా జఫర్‌ స్వయంగా రాసిన గీతంలోని 'స్వాతంత్ర్య పోరాటం జరుపుతున్న యోధులలో ఆత్మవిశ్వాసం ఉన్నంతకాలం లండన్‌ గుండెల్లో భారతీయుల ఖడ్గం దూసుకపోతూనే ఉంటుంది' అను చరణాలతో ఆరంభమై అలనాటి స్వాతంత్ర్యోద్యమ సూర్తిని భారత జాతీయ సైనికులలో నింపడానికి ప్రయత్నించింది.

భారత జాతీయ సైన్యంలో చేరమంటూ భారతీయులను కోరుతూ ఆజాద్‌ హింద్‌ రేడియా కేంద్రం ప్రసారం చేసిన ప్రతి కార్యక్రమంలో, మొగల్‌ చక్రవర్తి బహుదూర్‌ షా జఫర్‌ స్వయంగా రాసిన గీతంలోని 'స్వాతంత్ర్య పోరాటం జరుపు తున్న యోధులలో ఆత్మవిశ్వాసం ఉన్నంతకాలం లండన్‌ గుండెల్లో భారతీయుల ఖడ్గం దూసుకపోతూనే ఉంటుంది' అను చరణాలతో ఆలాపించడం అనవాయితయ్యింది.

ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ సర్వసైన్యాధ్యకక్షులుగా, అజాద్‌ హింద్‌ ప్రభుత్వం అధినేతగా బాధ్యతలు స్వీకరించిన సుభాష్‌ చంద్ర బోస్‌ పలు ప్రధాన శాఖలను ఏర్పాటు చేసి ఆయా శాఖల బాధ్యతలను లెఫ్టినెన్ట్‌ కల్నల్‌ అజీజ్‌ అహమ్మద్‌, లెఫ్టినెన్ట్‌ కల్నల్‌ ఎం.జడ్‌ కియానిలకు అప్పగించారు. బర్మాకు చెందిన మౌలానా కరీం గని ప్రచార కార్యక్రమాల సారథిగా, బషీర్‌ అహమ్మద్‌ను ప్రభుత్వ ప్రత్యేక సలహాదారునిగా నియమించారు. లెఫ్టినెంట్‌ కల్నల్‌ షానవాజ్‌ ఖాన్‌ సాయుధ దళాల ప్రతినిధిగా నియక్తులయ్యారు. ఆ ఏర్పడిన మూడు డివిజన్లకు గాను రెండిటికి మేజర్‌ జనరల్‌ షా నవాజ్‌ ఖాన్‌, ఎం.జడ్‌ కియానిలు ప్రధానాధికారులుగా బాధ్యతలు చేపట్టగా, రెజిమెంటల్‌ కమాండర్లుగా ఐ.జె కియాని, ఎస్‌. ఎం. హుసైన్‌, బుర్హానుద్దీన్‌, షౌకత్‌ అలీ మలిక్‌ తదితరులు నియక్తులయ్యారు.

నేతాజీ నిధికి సహాయం

[మార్చు]

స్వతంత్ర భారత ప్రభుత్వం, భారత జాతీయ సైన్యం ఏర్పడ్డాక అన్నిరకాల సహాయసహకారాలు అందించాల్సిందిగా సుభాష్‌ చంద్రబోస్‌ ప్రజలకు చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ రంగూన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి హబీబ్‌ సాహెబ్‌ తన రాజప్రసాదాన్ని, పొలాలు-స్థలాలు, కోటిన్నర రూపాయల విలువ చేసే ఆభరణాలను ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌కు ధారాదత్తం చేసి ఆజాద్‌ హింద్‌ ప్రభుత్వం సేవకునిగా ప్రకటించుకున్నారు. ఈ క్రమంలో బషీర్‌ సాహెబ్‌, నిజామి సాహెబ్‌ అను మరో ఇరువురు సంపన్నులు విడివిడిగా 50 లక్షల రూపాయలను నేతాజీకి అందించగా, మరో ముస్లిం వ్యాపారి తనకున్న మూడు ప్రింటింగ్‌ ప్రెస్‌లను, యావదాస్తిని 'నేతాజీ నిధి'కి అందజేశారు. సంపన్నులు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విజయనగరం జిల్లా వేపాడు (ప్రస్తుతం) నివాసి షేక్‌ ఖాదర్‌ మొహిద్దీన్‌ లాంటి సామాన్యులు రబ్బర్‌ తోటల్లో కూలీగా పనిచేస్తూ కూడపెట్టుకున్న 20వేలను 'నేతాజి నిధి'కి అప్పగించి, తాను కూడా రైఫిల్‌మన్‌గా సేవలందించారు.

మహిళల పాత్ర

[మార్చు]

మాతృభూమి విముక్తి ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్న భారత జాతీయ సైన్యంలో ముస్లిం మహిళలు కూడా భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా సుభాష్‌ చంద్ర బోస్‌ ప్రత్యేక ఆసక్తితో ఏర్పాటు చేసిన 'ఝాన్సీరాణి రెజిమెంట్‌'లో ఎం.ఫాతిమా బీబి, సయ్యద్‌ ముంతాజ్‌, మెహరాజ్‌ బీబి, బషీరున్‌ బీబీ లాంటి నారీమణులు బాధ్యతలు నిర్వహించారు.

చలో ఢిల్లీ

[మార్చు]

విముక్తి పోరాటంలో తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి సర్వదా సిద్ధంగా ఉన్న భారత జాతీయ సైన్యం యుద్ధభేరి మ్రోగించింది. 'చలో ఢిల్లీ' పిలుపును సాకారం చేయడానికి అరకాన్‌ యుద్దరంగంలో తొలిసారిగా తుపాకి పేల్చిన ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌, స్వేచ్ఛా-స్వాతంత్ర్యాల సాధనకు కట్టుబడి ఉన్న సైన్యాధికారులు బర్మా-ఇండియా సరిహద్దుల వైపు సాగారు. కల్నల్‌ ఎస్‌.యం మలిక్‌ నేతృత్వంలోని భారతీయ జాతీయ సైన్యం బ్రిటీష్‌ సైన్యాలను మట్టికరిపించి మాతృభూమి మీద అడుగు పెట్టి మణిపూర్‌లోని మొయిరాంగ్‌ వద్ద త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసింది. ఆ తరువాత భారత జాతీయ సైన్యంలోని రెండు డివిజన్‌లకు విడివిడిగా నేతృత్వం వహిస్తున్న కల్నల్‌ షానవాజ్‌ ఖాన్‌, మేజర్‌ జనరల్‌ ఎం.జడ్‌ కియానిలో ప్రళయకాళరుద్రుల్లా ముందుకు దూసుకు పోతున్న భారత జాతీయ సైనికులను ఉత్సాహపర్చుతూ ఇంఫాలా, కోహిమాల వైపు దృష్టి సారించారు.

'చలో ఢిల్లీ' పిలుపును సాకారం చేయడానికి అరకాన్‌ యుద్ధరంగంలో తొలిసారిగా కల్నల్‌ ఎస్‌.యం మలిక్‌ నేతృత్వంలోని భారతీయ జాతీయ సైన్యం బ్రిటీష్‌ సైన్యాలను మట్టికరిపించి మాతృభూమి మీద అడుగు పెట్టి మణిపూర్‌లోని మొయిరాంగ్‌ వద్ద త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసింది. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌లోని వివిధ శాఖలలో అధికారులుగా బాధ్యతలను నిర్వహించిన యోధులలో దేశం వివిధ ప్రాంతాలకు చెందిన నక్కి అహ్మద్‌ చౌదరి, అష్రాఫ్‌ మండలం ‌, అమీర్‌ హయత్‌, అబ్దుల్‌ రజాఖ్‌, ఆఖ్తర్‌ అలీ, మహమ్మద్‌ అలీషా, అటా మహమ్మద్‌, అహమ్మద్‌ ఖాన్‌, ఎ.కె. మీర్జా, అబూ ఖాన్‌, యస్‌. అఖ్తర్‌ అలీ, అహమ్మదుల్లా, అబ్దుర్‌ రహమాన్‌ ఖాన్‌ లాంటి వారున్నారు. చరిత్ర సృష్టించిన ఈ పోరాటంలో ఆంధ్ర పదేశ్‌కు చెందిన ముస్లింలూ భారీ సంఖ్య భాగస్వాముల య్యారు. మన రాష్ట్రం నుండి అబిద్‌ హసన్‌ సప్రానితో పాటుగా ఖమురుల్‌ ఇస్లాం, తాజుద్దీన్‌ గౌస్‌, హైదరాబాదు‌ చార్మినార్‌ సిగరెట్‌ కంపెనీ (వజీర్‌ సుల్తాన్‌ టొబాకో కంపెనీ) యజమాని కుమారుడు అలీ సుల్తాన్‌ కూడా భారత జాతీయ సైన్యంలో పనిచేశారు. హైదరాబాదు సంస్థానానికి చెందిన షరీఫుద్దీన్‌, అబ్దుల్‌ సయీద్‌ ఉస్మా ని, అబ్దుల్‌ లతీఫ్‌, ఇమాముద్దీన్‌, ముహమ్మద్‌ ఖాన్‌ లాంటి పలువురు నేతాజీ బాటలో నిర్భయంగా నడిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా వేపాడు గ్రామానికి చెందిన షేక్‌ ఖాదర్‌ మొహిద్దీన్‌, ప్రకాశం జిల్లా దర్శి తాలూకా చెందిన షేక్‌ బాదుషా, చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన యస్‌.అబ్దుల్‌ అలీ, చిత్తూరు జిల్లాకు చెందిన మహా మ్మద్‌ అఫ్జల్‌ సాహెబ్‌, పుంగనూరుకు చెందిన పి.పి.మహ మ్మద్‌ ఇబ్రహీం, కడపజిల్లా రాయచోటికి చెందిన అబ్దుల్‌ ఖాదర్‌, పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన షేక్‌ అహమ్మద్‌ ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ పోరాటాలలో భాగస్వాములయ్యారు.

ఇంఫాలా-కోహిమాలను ఆక్రమించి అస్సాం లోకి అడుగుపెట్టాలని ముందుకు సాగుతున్న భారత జాతీయ సైన్యానికి ఒకవైపున ప్రకృతి మరోవైపున ఆహారం, ఆయుధాలు, రవాణా తదిరల అవసరాల తీవ్ర కొరత దెబ్బతీసింది. ఈ లోగా భారీ సైనిక బలగాలను సమ కూర్చుకున్న బ్రిటన్‌ దాని మిత్ర పక్షాల సైన్యం దాడులను మరింత తీవ్రతరం చేసింది.

జపాన్ ఓటమి అంగీకారం

[మార్చు]

జపాన్‌ సైనిక దళాల నుండి అవసరమైనంతగా ఆయుధాలు, వాహనాలు ఇతర సదుపాయాలు అందకున్నా భారత సైనికులు అసమాన ప్రతిభ చూపుతూ, అరకొర అయుధాలు, ఆహారంతో మాతృభూమి విముక్తి ప్రధాన అంతిమ లక్ష్యంగా ఇంఫాలా-కోహిమాల వైపు సాగారు. ఈ ప్రాంతాల మీద పట్టుకోసం ఇరు పక్షాల మధ్య సుమారు ఐదు మాసాలు భీకర సమరం సాగింది. ఈ సందర్భంగా జరిగిన వివిధ పోరాటాలలో మేజర్‌ జనరల్‌ షానవాజ్‌ ఖాన్‌ బాధ్యతలు నిర్వహించగా కల్నల్‌ యం.జడ్‌ కియాని, లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఇషాన్‌ ఖాదిరి, లెఫ్టినెంట్‌ కల్నల్‌ అజీజ్‌ అహమ్మద్‌ ఖాన్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌ హబీబుర్‌ రెహమాన్‌, కల్నల్‌ ఇనాయత్‌ కియాని, కల్నల్‌ మున్వర్‌ హుసైన్‌, కల్నల్‌ అజీజ్‌ అహమ్మద్‌, కల్నల్‌ బుర్హానుద్దీన్‌, లెఫ్టినెంట్‌ నజీర్‌ అహమ్మద్‌, కల్నల్‌ మలిక్‌, మేజర్‌ మహబూబ్‌ అద్వితీయమైన ప్రతిభతోపాటుగా ప్రాణాంతక పరిస్థితులలో కూడా శత్రువు మీద దాడులు చేయడంలో దృఢసంకల్పాన్ని ప్రదర్శిస్తూ తమ సహచరులకు ఆదర్శంగా నిలిచారు.

ఈ సందర్భంగా చిట్టచివరివరకు శత్రువుతో పోరాడిన, తమ ప్రాణాలను అడ్డువేసి శత్రువును నిలువరించిన పలువురు యోధులలో హకీం అలీ, మహమ్మద్‌ హసన్‌, అబ్దులా ఖాన్‌, యాసిన్‌ ఖాన్‌, అబ్దుల్‌ మన్నాన్‌, ఖాన్‌ ముహమ్మద్‌ లాంటి వారు స్వయంగా నేతాజీచే ప్రసంశించబడి 'వీర్‌-యే-హింద్‌' 'సర్దార్‌-యే-జంగ్‌', 'తంగాహ్‌ా-యే-బహదూరి', 'శత్రునాశ్‌' లాంటి గౌరవ పురస్కారాలు పొందారు. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌లోని వివిధ శాఖలలో అధికారులుగా బృహత్తర బాధ్యతలను నిర్వహించి, తమ ప్రాణాలను అడ్డుపెట్టి విముక్తి పోరాటానికి అంకితమై పనిచేసిన యోధులలో వివిధ ప్రాంతాలకు చెందిన నక్కి అహ్మద్‌ చౌదరి, అష్రాఫ్‌ మండలం ‌, అమీర్‌ హయత్‌, అబ్దుల్‌ రజాఖ్‌, ఆఖ్తర్‌ అలీ, మహమ్మద్‌ అలీషా, అటా మహమ్మద్‌, అహమ్మద్‌ ఖాన్‌, ఎ.కె. మీర్జా, అబూ ఖాన్‌, యస్‌. అఖ్తర్‌ అలీ, అహమ్మదుల్లా, అబ్దుర్‌ రహమాన్‌ ఖాన్‌ లాంటి వారు పలువురు ఉన్నారు.

ఈ పోరాటంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముస్లింలూ భారీ సంఖ్య పాల్గొన్నారు. ఆంగ్లేయులను మట్టికరిపించాలన్న లక్ష్యంతో హైదరాబాదుకు చెందిన అబిద్‌ హసన్‌ సఫ్రాని లాంటి వారు ఉన్నత స్థానాలలో బాధ్యతలు నిర్వహించగా, అబిద్‌తోపాటుగా ఖమురుల్‌ ఇస్లాం, తాజుద్దీన్‌ గౌస్‌, హైదరాబాదు‌ చార్మినార్‌ సిగరెట్‌ కంపెనీ (వజీర్‌ సుల్తాన్‌ టొబాకో కంపెనీ) యజమాని కుమారుడు అలీ సుల్తాన్‌ కూడా భారత జాతీయ సైన్యంలో పనిచేశారు. హైదరాబాదు సంస్థానానికి చెందిన షరీఫుద్దీన్‌, అబ్దుల్‌ సయీద్‌ ఉస్మాని, అబ్దుల్‌ లతీఫ్‌, ఇమాముద్దీన్‌, ముహమ్మద్‌ ఖాన్‌ లాంటి పలువురు నేతాజీ బాటలో నిర్భయంగా నడిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా వేపాడు గ్రామాస్తులు షేక్‌ ఖాదర్‌ మొహిద్దీన్‌, ప్రకాశం జిల్లా దర్శి తాలూకా చెందిన షేక్‌ బాదుషా, చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన యస్‌.అబ్దుల్‌ అలీ, చిత్తూరు జిల్లాకు చెందిన మహమ్మద్‌ అఫ్జల్‌ సాహెబ్‌, పుంగనూరుకు చెందిన పి.పి.మహమ్మద్‌ ఇబ్రహీం, కడప జిల్లా రాయచోటికి చెందిన అబ్దుల్‌ ఖాదర్‌, పశ్చిమగోదావరి జిల్లా తణుకు చెందిన షేక్‌ అహమ్మద్‌ ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ పోరాటాలలో భాగస్వాములయ్యారు.

భారత జాతీయ సైన్యం అప్రతిహతంగా కొహిమా-ఇంఫాలా వైపుకు సాగుతున్న తరుణంలో అకాల వర్షాలు ముంచెత్తి ప్రకృతి పరమైన ఆటంకాలు ఎదురయ్యాయి. ఆనాడు ఇంఫాలాను ఆక్రమించి అస్సాంలో భారత జాతీయ సైన్యం ప్రవేశించి ఉంటే భారత సైన్యానికి తిరుగు ఉండేది కాదు. ప్రతికూల పరిస్థితులకు తోడు ప్రకృతి ఆగ్రహించడంతో భారత జాతీయ సైన్యం అష్టకష్టాలను అనుభవించాల్సి వచ్చింది. ఈ లోగా భారీ సైనిక బలగాలను, వైమానిక దళాన్ని సమకూర్చుకున్న బ్రిటీష్‌, దాని మిత్ర పక్షాల పైన్యం భీకర దాడులు ఆరంభించింది. బ్రిటీష్‌ వైమానిక దాడుల నుండి భారతీయ జాతీయ సైనికులకు, జపాన్‌ సేనల రక్షణ కరువయ్యింది. పర్వత-అటవీ ప్రాంతాలలో ఎదురవుతున్న ఆనారోగ్య పరిస్థితులు భారత జాతీయ సైన్యాన్ని కుంగదీస్తుండగా ఒకవైపున కుండపోతగా వర్షం, మరోవైపున వైమానిక దాడులు, విరామం లేకుండా కురుస్తున్న శత్రువు తుపాకి గుండ్లకు ఎదురొడ్డి ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ యోధులు పోరాడసాగారు. ఎంతటి దృఢ సంకల్పం కలిగి ఉన్నా, అడుగు ముందుకు వేయడం సాధ్యంకాని దుర్భర వాతావరణం, ప్రతికూల పరిస్థితి ఎదురయ్యింది. ఆ తరుణంలో భారత జాతీయ సైన్యానికి అరకొరగా నైనా ఆర్థిక-ఆయుధ సహకారం అందిస్తున్న జపాన్‌ ద్వితీయ ప్రపంచ సంగ్రామంలో దారుణంగా దెబ్బతిన్నది, మరోవైపున జర్మనీ కుప్పకూలింది. బ్రిటన్‌-అమెరికాలు పక్షాలు విజయం సాధించడంతో బర్మా నుండి జపాన్‌ సేనల తిరోగమనం ఆరంభమైంది. చివరకు 1945 ఆగస్టు 15న జపాన్‌ తన ఓటమిని అంగీకరిస్తూ ప్రకటన విడుదల చేసింది.

నేతాజీ ప్రాణాలకు రక్షణ

[మార్చు]

బ్రిటన్‌-అమెరికా పక్షం దళాలు ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ ఆక్రమిత ప్రాంతాల మీద, స్థావరాల మీద భయానక వైమానిక దాడులు జరపసాగాయి. ఆచ్ఛాదన ఏమీ లేకుండా, ఆయుధాల లేమితో సతమతమౌతూ సరైన రవాణా సౌకర్యాలు, వాహనాలు కూడా లేక ఇబ్బందులు పడుతూ కాలినడకన, నదినదానాలు, పర్వత శ్రేణులు దాటుకుంటూ ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ ప్రముఖులు, సైనికులు 'ఝాన్సీరాణి రెజిమెంటు' దళాలను ప్రమాదకర ప్రాంతం నుండి తప్పించడానికి ప్రయత్నాలు చేశారు. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ ప్రముఖులంతా కలసి ఆ దాడుల నుండి నేతాజీని తప్పిస్తూ అతను రష్యా వెళ్ళే ఏర్పాటుకు శత విధాల కృషి చేశారు. ఈ కృషిలో భాగంగా శత్రువులు జరిపిన వైమానిక దాడులలో సుభాష్‌ చంద్రబోస్‌ తృటిలో తప్పించుకున్నారు. ఆ ప్రమాదకర దాడిలో కెప్టన్‌ నాజిర్‌ అహమ్మద్‌ తన ప్రాణాలను అడ్డువేసి నేతాజీ ప్రాణాలను కాపాడడంలో సఫలీకృతులయ్యారు.

నేతాజీ అస్తమయం

[మార్చు]

చివరకు గమ్యం చేరిన నేతాజీతోపాటుగా రష్యా వెళ్ళేందుకు ఇతర అధికారులతోపాటుగా మేజర్‌ అబిద్‌ హసన్‌ సప్రాని, కల్నల్‌ హబీబుర్రెహమాన్‌ సిద్దమయ్యారు. జపాన్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానంలో అందరికి అవకాశం లేకుండా పోవడంతో ఆగస్టు 18న కల్నల్‌ హబీబ్‌ను అతను ఎంపిక చేసుకోగా, అతను నేతాజీ వెంట బాంబర్‌ విమానంలో బయలుదేరారు. ఆకాశంలోకి ఎగిరిన ఆ విమానం ఫోర్‌మొసా ద్వీపంలో కూలిపోవడంతో తీవ్రంగా గాయపడిన సుభాష్‌ చంద్రబోస్‌ 1945 ఆగస్టు 19న కన్నుమూశారు.[ఆధారం చూపాలి] అతనుతోపాటు ప్రయాణించిన కల్నల్‌ హబీబుర్రెహమాన్‌ గాయపడి చికిత్స అనంతరం బతికి బయటపడి యుద్ద ఖైదీగా ఇతర అధికారులతో కలపి ఇండియాకు తరలించబడ్డారు.

చివరి సందేశం

[మార్చు]

ఆ దుర్భర చిట్టచివరి క్షణాలలో కూడా మాతృభూమి విముక్తి కోసం పోరాడుతున్న భారతీయులలో మరింత నిబద్దతను నింపేందుకు నేతాజి సుభాష్‌ చంద్రబోస్‌ తన చివరి సందేశాన్ని పంపారు. అతను సహచరుడు కల్నల్‌ హబీబుర్రెహమాన్‌తో అతి కష్టం మీద మాట్లాడుతూ 'హబీబ్‌, నాకు తుది ఘడియలు సమీపించాయి. జీవితాంతం నేను దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడాను. నేను నా దేశ స్వాతంత్ర్యం కోసం మరణిస్తున్నాను. భారత స్వాతంత్ర్య పోరాటం సాగించమని నా ప్రజలకు చెప్పు. త్వరలోనే భారతదేశం విముక్తి చెందుతుంది' అని అన్నారు. ఈ విధంగా నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ప్రజలకు చేరవేయదలచిన చివరి సందేశాన్ని కల్నల్‌ హబీబుర్రెహమాన్‌ భారతీయులకు అందించారు.

నేరారోపణలు

[మార్చు]

జపాన్‌, భారత జాతీయ సైన్యం ఆధీనంలో ఉన్న భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న ఆంగ్ల ప్రభుత్వం భారత సైనికులను, అధికారులను వివిధ ప్రాంతాల నుండి అరెస్టు చేసి ఇండియాకు తరలించింది. చాలా మందిని ఎటువంటి విచారణ జరపకుండా కొన్ని చోట్ల కాల్చి చంపింది. అందరి మీద వివిధ నేరాల మీద కేసులు నమోదయ్యాయి. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ వీరుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించసాగింది. విచారణలంటూ శిక్షలు విధించడం ఆరంభించింది. ఆ క్రమంలో ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ యోధుడు రషీద్‌ అలీకి ఏడు సంవత్సరాల జైలుశిక్ష విధించారు. ఈ విచారణ-తీర్పు పట్ల భారతీయులు తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తూ ఊరేగింపులు జరిపారు. ఆ తరువాత మేజర్‌ జనరల్‌ షానవాజ్‌ ఖాన్‌, కల్నల్‌ ప్రేమ్‌ కుమార్‌ సహగల్‌, కల్నల్‌ ధిల్లాన్‌ మీద 'దేశద్రోహం' నేరారోపణలు చేసి సైనిక విచారణ నిమిత్తం ఢిల్లీలోని ఎర్రకోటలో నిర్బంధించడంతో భారతదేశమంతా అట్టుడికినట్టయ్యింది.

'డిఫెన్స్‌ కౌన్సిల్‌'

[మార్చు]

ఈ విచారణలో భరతమాత ముద్ద్దుబిడ్దలైన సాయుధ పోరాటయోధులకు ప్రాణాంతక శిక్షలు పడవచ్చని ప్రచారం జరగడంతో ప్రజలు మండిపడ్టారు ఆందోళనలు, నిరసనలు ఉవ్వెత్తున సాగాయి. ప్రజల నుండి వ్యక్తం అవుతున్న అభిమాన సముద్రాన్ని గమనించిన భారత జాతీయ కాంగ్రెస్‌ నేతలు భారత జాతీయ సైన్యం పోరాట యోధుల పక్షాన నిలవాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ వీరుల విడుదల కోసం భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షలు మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ తగు చర్యలు తీసుకుని ఆసఫ్‌ అలీ, పండిట్‌ నెహ్రూ లాంటి ప్రముఖులతో 'డిఫెన్స్‌ కౌన్సిల్‌' ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా అఖిల భారత ముస్లిం లీగ్‌ నాయకుడు మహమ్మద్‌ అలీ జిన్నా స్వయంగా వచ్చి మేజర్‌ జనరల్‌ షానవాజ్‌ ఖాన్‌ను కలసి అతను పక్షంగా న్యాయస్థాంలో వాదిస్తానని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను పూర్తిగా తిరస్కరిస్తూ, 'స్వాతంత్ర్య సమరంలో మేం భుజం భుజం కలిపి పోరాడాం. మా నాయకత్వం స్ఫూర్తితో మా కామ్రేడ్స్‌ యుద్ధభూమిలో వీరోచితంగా పోరాడుతూ ప్రాణాలు వదిలారు. నిలబడినా, నేలకూలినా కలిసే ఉంటాం', అని షా నవాజ్‌ ఖాన్‌ స్పష్టం చేసి, మతం పేరుతో మనుషులను వేరేచేసే ప్రయత్నాలను వమ్ముచేశారు.

ముస్లింల సేవ భారతదేశానికి గర్వకారణం

[మార్చు]

ఈ విధంగా భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో అద్భుత ఘట్టాన్ని సృష్టించిన భారత జాతీయ సైన్యం సర్వసైన్యాధ్యకక్షులు, ఆజాద్‌ హింద్‌ ప్రభుత్వాధినేత నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ కలకత్తాలోని తన ఇంటి నుండి జర్మనీకి బయలుదేరిన ప్రయాణం తొలిథలో అతనుకు తోడ్పాటు నిచ్చింది మియా అక్బర్‌ షా కాగా, అత్యంత ప్రమాదకరంగా సాగిన 90 రోజుల చారత్రిక జలాంతర్గమి ప్రయాణంలో నేతాజీ వెంట ఉన్న సహచరుడుగా మేజర్‌ అబిద్‌ హసన్‌ సప్రాని ఖ్యాతిగాంచారు. నేతాజీ నేతృత్వంలో సాగిన విముక్తి పోరాటంలో అన్ని విధాల అతనుకు అండగా నిలచిన వారిలో మేజర్‌ జనరల్‌ షానవాజ్‌ ఖాన్‌, మేజర్‌ జనరల్‌ మమ్మద్‌ జమాన్‌ ఖియాని, కల్నల్‌ మల్లిక్‌ లాంటి యోధులు పలువురున్నారు. భారత జాతీయ సైన్యం తొలిసారిగా ఏర్పడినప్పటి నుండి అది భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో అద్భుత అంకాన్ని నిర్ధారించుకుని ప్రతికూల పరిస్థితిలలో అనివార్యంగా వెనక్కు తగ్గాల్సి వచ్చిన సందర్భం నుండి, భారత జాతీయ సైన్యం నడకను-నడతను నిర్థారించి చరిత్ర సృష్టించిన యోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ సాహస పోరాట యాత్ర అరంభం నుండి ప్రారంభమై అతను అంతిమ విమాన ప్రయాణంలో కూడా అతను వెంట ఉండటం మాత్రమే కాకుండా, అతను చివరి సందేశాన్ని ప్రజలకు అందించిన సహచరుడు ముస్లిం పోరాట యోధులు కావడం ముస్లిం సమాజానికి గర్వకారణం.

మూలాల

[మార్చు]

యితర లింకులు

[మార్చు]