ఆన్స్కో
ఆన్స్కో (ఆంగ్లం: Ansco) అమెరికాలోని న్యూయార్క్కు చెందిన ఒకప్పటి ఫిలిం, కెమెరా తయారీదారు. ఈస్ట్‌మన్ కొడాక్ కంటే ముందే ఆన్స్కో ఫోటోగ్రఫీ రంగం లోకి అడుగుపెట్టింది. అమెరికాలో మొట్టమొదటి డాగురోటైప్ ను, ఫిలింను తయారు చేసింది ఆన్స్కో నే.[1] అయితే కొడాక్ యొక్క దుందుడుకు వ్యాపార విధానాల వలన కొడాక్ కు వచ్చినంత గుర్తింపు ఆన్స్కోకు దక్కలేదు. కొడాక్ ను ఎదుర్కోవటానికి ఆన్స్కో పలు సంస్థలతో చేతులు కలిపిననూ, ఫిలిం రేసులో కొడాక్ వేగానికి ఆన్స్కో కళ్ళాలు వేయలేకపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, జర్మను సంస్థతో సంబంధాలు కలిగి ఉండటంతో ఆన్స్కోను అమెరికా ప్రభుత్వం స్వాధీన పరచుకొంది. 1990వ దశకంలో హాంగ్ కాంగ్ కు చెందిన హేకింగ్ ఎంటర్ప్రైజెస్, ఆన్స్కోను కొనివేయటం తో, ఆన్స్కో అనే పేరు భూమిపై నుండి అదృశ్యమైంది.
చరిత్ర
[మార్చు]స్కోవిల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ
[మార్చు]1802 లో స్థాపించబడిన స్కోవిల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇత్తడి బొత్తాములు, కుట్టుపనికి కావలసిన పరికరాలు, రాగి వస్తువులను తయారు చేయటం మొదలు పెట్టింది.[2]
అమెరికా మొట్టమొదటి డాగురోటైప్ ను తయారు చేసిన స్కోవిల్
[మార్చు]1839 లో అప్పటి ఫోటోగ్రఫిక్ ప్లేట్ ల తయారీ ఇత్తడి/వెండిలతో తయారు చేయబడటంతో స్కోవిల్ సంస్థ ఫోటోగ్రఫీ వైపు అడుగులు వేసింది. డాగురోటైప్ లు ఫ్రాన్సు దేశం కనిపెట్టిననూ, అక్కడి నుండి దిగుమతి అవుతున్న డాగురోటైపు ప్లేట్లకు దీటుగా స్కోవిల్ సంస్థ 1839 నాటికి అమెరికాలోనే వాటిని తయారు చేయగలిగింది. కొడాక్ సంస్థ ఫోటోగ్రఫీ లోకి అడుగు పెట్టక ముందే అమెరికాలో మొట్టమొదటి డాగురోటైప్ ను తయారు చేసింది స్కోవిల్ సంస్థ.
అమెరికన్ ఆప్టికల్ కంపెనీని కొనివేసిన స్కోవిల్
[మార్చు]తక్కువ ధరలోనే ఎక్కువ నాణ్యతతో కూడిన పెట్టె కెమెరాలు, ఇతర దృశ్య సాధనాలను తయారు చేసే అమెరికన్ ఆప్టికల్ కంపెనీని 1867లో స్కోవిల్ కొనివేసింది.
మొట్ట మొదటి ఫిలిం చుట్టను తయారు చేసిన స్కోవిల్
[మార్చు]హానిబాల్ గుడ్ విన్ గ్లాస్ ప్లేట్లకు ప్రత్యామ్నాయంగా పారదర్శక ఫిలిం రోల్ ను కనుగొన్నాడు. చాలా ప్రయత్నాల తర్వాత గుడ్విన్ ఫిలిం పై పేటెంటు హక్కులను పొందాడు. గుడ్విన్ తో ఒప్పందం ప్రకారం పేటెంటు హక్కులు గల ఫిలింను స్కోవిల్ సంస్థ తయారు చేయటం మొదలు పెట్టింది.
స్కోవిల్ అండ్ ఆడంస్
[మార్చు]1889 లో స్కోవిల్ సంస్థలోని ఆడంస్ అనే కార్యదర్శి సంస్థను స్వంతం చేసుకోవటంతో సంస్థ పేరు స్కోవిల్ అండ్ ఆడంస్ గా పేరు మార్చబడింది.
1901లో స్కోవిల్ అండ్ ఆడంస్ 'గుడ్విన్ ఫిలిం అండ్ కెమెరా ' కంపెనీని కొన్నది.
ఈ & హెచ్ టి ఆంటోని కంపెని
[మార్చు]1902 లో స్కోవిల్ సంస్థ కొడాక్ కు వ్యతిరేకంగా శక్తులను కూడగడుతూ ఇతర ఫిలిం/కెమెరా తయారీదార్లతో బాటుగా ఈ & హెచ్ టి ఆంటోని కంపెనీ అనే సంస్థతో కలిసిపోయింది.[3]
కొడాక్ తో యుద్ధం
[మార్చు]ఈ సమయంలో ఈ & హెచ్ టి ఆంటోని కంపెనీ ఫోటీగ్రఫీ పరికరాలను విక్రయిస్తూ ఉండగా ఈ సంస్థచే తయారు చేయబడ్డ ఫోటోగ్రఫిక్ ప్లేట్ లకు అప్పుడే కొత్తగా పుట్టుకొచ్చిన కొడాక్ పంపిణీదారుగా వ్యవహరించింది. దుందుడుకుదనం గల కొడాక్ పంపిణీదారుగా సంతృప్తి చెందలేదు. కొడాక్ కూడా ప్రత్యేకంగా కెమెరాలు తయారు చేయటం మొదలు పెట్టింది. తమ కెమెరాలలో మాత్రమే వాడగల ఫిలింను తయారు చేసింది. దీనితో ఆంటోనీ కంపెనీ, కొడాక్ ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చిన్న చితకా ఫిలిం తయారీదార్లు/పంపిణీదార్లను కొనివేస్తూ, కొడాక్ వ్యాపారంలో దూసుకెళ్ళిపోయింది.
తమతో ఒప్పందం లేకుండా తమకు మాత్రమే పేటెంటు హక్కులు గల ట్రాన్స్పరెంట్ ఫిలింను తయారు చేస్తూ లాభాలు గడిస్తోన్న కొడాక్ పై 1902 లో ఆంటోనీ కంపెనీ పేటెంటు హక్కుల ఉల్లంఘన దావా వేసింది. దశాబ్దం తర్వాత దోషిగా నిరూపించబడిన కొడాక్ కు ఐదు మిలియన్ డాలర్ల జరిమానా విధించబడింది. సుదీర్ఘకాలం తర్వాత సాధించిన విజయం వలన ఆంటోనీ కంపెనీకి అప్పటికే జరిగిన నష్టంతో పోలిస్తే, చేకూరిన లాభం తక్కువే. ఈ విజయం ఆంటోనీ కంపెనీకి వేడినీటిలో చల్లనీరు వలె తమ ఉనికిని నిలబెట్టుకోవటానికి మాత్రమే పనికి వచ్చింది.
ఆన్స్కో
[మార్చు]1907 లో ఆంటోనీ కంపెనీని ఆంటోని & స్కోవిల్ కో (AnSco) గా పేరు మార్చటం జరిగింది.
ఆగ్ఫా/ఇతర సంస్థల లో విలీనం
[మార్చు]1928 లో ఆగ్ఫాలో విలీనం తర్వాత సంస్థ పేరు ఆగ్ఫా-ఆన్స్కో గా పేరు మార్చుబడింది. చవక కెమెరాల విభాగంలో ఆగ్ఫా-ఆన్స్కో వ్యాపారం బాగానే ఉన్నా, ఖరీదైన కెమెరాల విభాగంలో మాత్రం కొడాక్ యే ముందుండేది.
స్విట్జర్లాండ్కు చెందిన Internationale Gesellschaft für Chemische Unternehmungen AG లో విలీనం అయిన తర్వాత ఆగ్ఫా-ఆన్స్కో IG Chemie గా పేరు మార్చుకొంది. 1929 నుండి మరికొన్ని పేర్లు మారాయి.
గుర్తింపులు
[మార్చు]1936 లో మొదటి సారిగా ఇన్ఫ్రారెడ్ ఫిలింను కనుగొన్నందుకు గాను, ఆ తర్వాత రెండవ సారి పాన్ మోషన్ పిక్చర్ ఫిలింను కనుగొన్నందుకుగానూ మోషన్ పిక్చర్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ నుండి ఐ జీ కెమీ గుర్తింపు పొందింది.
జనరల్ అనిలిన్ & ఫిలిం
[మార్చు]తర్వాత 1939లో General Aniline & Film పేరు మార్చబడింది.
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆన్స్కో
[మార్చు]జర్మను సంస్థతో సంబంధాలు ఉండటం, జర్మనీతో అమెరికా వైరం వంటి కారణాల వలన రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ప్రభుత్వం జనరల్ అనిలిన్ అండ్ ఫిలింను స్వాధీనపరచుకొంది. కెమెరాల తయారీకి బదులుగా యుద్ధాలకు కావలసిన ఫిలిం, ఇతర కటకాలు తయారు చేయటానికి అమెరికా ప్రభుత్వం ఈ సంస్థను వినియోగించుకొంది. 1944 నాటికి అమెరికా ప్రభుత్వం సంస్థ పేరును మరల ఆన్స్కోగా మార్చింది.
60ల నుండి 80ల వరకు ఆన్స్కో అనేక ఫిలిం చుట్టలను, కెమెరాలను నిర్మించింది. అంతరిక్ష పరిశోధనలకు కావలసిన హై స్పీడ్ రివర్సిబుల్ ఫిలిం వంటి ఆవిష్కరణలు చేసినా ఆన్స్కో కొడాక్ ను ఎప్పటికీ అధిగమించలేకపోయింది.
స్లైడ్ ఫిలింలలోనూ కొడాక్ తో ఢీ కొనలేక పోయిన ఆన్స్కో
[మార్చు]కొడాక్ యొక్క ఫిలిం చుట్టలు కొడాక్రోం, ఏక్తాక్రోం లతో పోలిస్తే, ఆన్స్కో తయారు చేసిన ఆన్స్కో కలర్, ఆన్స్కోక్రోంలు అన్ని విధాల మేలురకంగా తయారీ చేయబడిననూ, కొడాక్ ను ఆన్స్కో ఎన్నడు తలదన్నలేకపోయింది.[4]
మళ్ళీ పుట్టిన జనరల్ అనిలిన్ & ఫిలిం
[మార్చు]1967 లో మరల పేరు General Aniline & Film (GAF) గా మారింది. ఒకానొక దశలో ఆన్స్కో డిస్నీల్యాండ్ యొక్క అధికారిక ఫిలింగా కూడా వ్యవహరించింది.
హేకింగ్ ఎంటర్ ప్రైజెస్ లో ఆన్స్కో విలీనం
[మార్చు]1978 లో హాంగ్ కాంగ్ కు చెందిన హేకింగ్ ఎంటర్ ప్రైజెస్ ఆన్స్కోను కొనుగోలు చేయటంతో ఆన్స్కో పేరు భూమి పై నుండి చెరిగిపోయింది. ఆన్స్కో పేరు పై నిర్మాణించబడే కెమెరాలు చిట్టచివర 90వ దశకంలో నిర్మించబడ్డాయి.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "ఆన్స్కో చరిత్ర". Archived from the original on 2016-04-22. Retrieved 2018-10-30.
- ↑ "స్కోవిల్ సంస్థ స్థాపన". Archived from the original on 2016-03-15. Retrieved 2018-10-30.
- ↑ కొడాక్ ను దెబ్బతీయటానికి చేతులు కలిపిన ఆంటోని-స్కోవిల్ , ఇతర సంస్థలు
- ↑ కొడాక్ కంటే మేలు రకం ఫిలిం ను తయారు చేయగలిగిననూ కొడాక్ కు స్థానభ్రంశం చేయలేకపోయిన ఆన్స్కో