రట్టిహళ్లి నాగేంద్రరావు

వికీపీడియా నుండి
(ఆర్.నాగేంద్రరావు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రట్టిహళ్లి నాగేంద్రరావు

రట్టిహళ్లి నాగేంద్రరావు ( 1896 - 1977 ), ప్రముఖ రంగస్థల నటుడు, తొలితరం కన్నడ సినిమా నటుడు, ఈయన కన్నడ సినిమాలలోనే కాక తెలుగు, తమిళ చిత్రాలలో కూడా నటించాడు. వై.వి.రావు నిర్మించిన తొలి కన్నడ టాకీ చిత్రం సతీ సులోచనలో ఎం.వి.సుబ్బయ్యనాయుడుతో పాటు నాగేంద్రరావు కూడా నటించాడు.

నాగేంద్రరావు 1896, జూన్ 23న కర్ణాటక రాష్ట్రం, చిత్రదుర్గ జిల్లాలోని హొళల్కేరేలో ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి కృష్ణారావు మైసూరు రాజ్యపు అటవీ శాఖలో ఉద్యోగి. పరిస్థితుల ప్రభావం వల్ల నాగేంద్రరావు బాల్యం అంత సాఫీగా జరగలేదు. ఈయన తండ్రి ఉద్యోగ విరమణ చేసి, వ్యవసాయం చేపట్టాడు. కానీ వ్యవసాయం సరిగా చేతకాక పోవటం వల్ల కుటుంబం రోజువారీ తిండికోసం తిప్పలుపడేవారు. పేద బ్రాహ్మణులపై దయ ఉంచి సహాయం చేసేవారిపై ఆధారపడి బతికేవారు.[1] ఎనిమిదేళ్ల వయసులోనే రంగస్థలంపై నటించడం ప్రారంభించిన నాగేంద్రరావు త్వరలోనే బాగా పేరు తెచ్చుకున్నాడు. తొలిరోజుల్లో రంగస్థలంపై ఈయన సీత, చంద్రమతి, డెస్‌డెమోనా వంటి అనేక స్త్రీ పాత్రలను పోషించాడు. ఆ తరువాత పురుష పాత్రలను కూడా పోషించడం ప్రారంభించి, అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని కన్నడేతర ప్రాంతాలలో కూడా ప్రసిద్ధి చెందాడు. భారతదేశంలో 1931లో టాకీ చిత్రాల ప్రారంభంలో, బొంబాయి తరలి వెళ్ళాడు. అక్కడ ప్రసిద్ధ సినీ నిర్మాత, మూకీ సినిమాల నాయకుడైన రాజా సందౌ, నాగేంద్రరావును తన తమిళ సినిమాలలో నటింపజేశాడు. వాటిలో పారిజాతపుష్పాపహరణం (1932, నారద పాత్ర), కోవలన్ (1933, కథానాయకునిగా), రామదాసు (1933, తెలుగు చిత్రం, రామదాసుగా) చెప్పుకోదగినవి.

సతీ సులోచన

[మార్చు]

ఆ తరువాత బెంగుళూరుకు తిరిగివచ్చి, ప్రముఖ రంగ స్థల నటుడు, ఎం.వి.సుబ్బయ్యనాయుడుతో భాగస్వామిగా శ్రీ సాహిత్య సామ్రాజ్య నాటకమండలిలో చేరాడు. అప్పటికే నాగేంద్రరావు కన్నడ టాకీ చిత్రాన్ని తీసి చరిత్ర సృష్టించాలని తహతహలాడుతుండేవాడు. ఈయన తన కలైన కన్నడ టాకీ సినిమా ప్రాజెక్టును మైసూరు నగరంలోని ధనికులందరితో మాట్లాడిచూశాడు. కానీ వాళ్ళు సినిమాలలో పెట్టుబడి పెట్టడానికి వెనుకాడారు. అయితే బెంగుళూరులోని ఒక మార్వాడీ వ్యాపారస్తుడు, షా చమన్‌లాల్ దూంగాజీ, కన్నడ సినిమాలను నిర్మించాలనే ఆలోచనతో ఉన్నాడు. 1932లో సౌత్ ఇండియా మూవీటోన్ అనే ఒక సినిమా సంస్థను బెంగుళూరులో ప్రారంభించి, రావణుని జీవితంలోని కొంత భాగం, ఇంద్రజిత్తు, ఆయన భార్య సులోచనల జీవితం ఆధారంగా "సతీ సులోచన" అనే ఒక పౌరాణిక చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయించాడు. ఈ చిత్రాన్ని దర్శకత్వం చేయటానికి వై.వి.రావును నియమించాడు. దూంగాజీ రావణుని పాత్రకు నాగేంద్రరావును, ఇంద్రజిత్తు పాత్రకు ఈయన నాటక కంపెనీ భాగస్వామి ఎం.వి.సుబ్బయ్యనాయున్ని ఎంచుకున్నాడు. అదే ట్రూపులో ఉన్న లక్ష్మీబాయిని మండోదరి పాత్రకు ఎన్నుకున్నారు.

తొలుత ప్రముఖ హార్మోనియం వాద్యకారుడు, రంగస్థల సంగీతదర్శకుడు హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రిని సంగీతం సమకూర్చడానికి కుదుర్చుకున్నారు, కానీ తర్వాత నాగేంద్రరావే ఆ పనిని చేశాడు. శాస్త్రి అయనకు సహాయకునిగా పనిచేశాడు. మొత్తం యూనిట్లో దర్శకుడు కాక సినిమా అనుభవం కల ఏకైక వ్యక్తిగా నాగేంద్రరావుకు నిర్మాణ నిర్వహణ యొక్క అదనపు బాధ్యత అప్పగించబడింది. ఖర్చు తక్కువగా ఉంటుందని ఈయన చిత్రాన్ని కొల్హాపూరులో నిర్మించడానికి నిర్ణయించాడు. ఛత్రపతి స్టూడియోను నిర్మాణానికి ఖారారు చేసుకొని 1933 డిసెంబరులో నాగేంద్రరావు, వై.వి.రావు కొల్హాపూరు రైలు ఎక్కారు. రెండు నెలల్లో నిర్మాణం పూర్తి చేసుకొని 1934లో విడుదలై, తొలి కన్నడ టాకీ చిత్రంగా చరిత్ర సృష్టించింది.[2]

నటించిన తెలుగు సినిమాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]