ఇంద్రుడు చంద్రుడు (1989 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇంద్రుడు చంద్రుడు
(1989 తెలుగు సినిమా)
TeluguFilm IndruduChandrudu.jpg
దర్శకత్వం సురేష్ కృష్ణ
నిర్మాణం డి.రామానాయుడు
రచన కమల్ హాసన్ (స్క్రీన్ ప్లే), పరుచూరి బ్రదర్స్ (కథ)
తారాగణం కమలహాసన్
శ్రీవిద్య
విజయశాంతి
జయలలిత (నటి)
చరణ్‌రాజ్
సంగీతం ఇళయరాజా
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
పి.సుశీల
ఎస్.జానకి
పంపిణీ సురేష్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ 24 నవంబరు 1989 (1989-11-24)
దేశం భారతదేశం
భాష తెలుగు

ఇంద్రుడు చంద్రుడు 1989లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో రాజకీయ నేపథ్యంలో వచ్చిన చిత్రం. ఇందులో కమల్ హాసన్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇతర ముఖ్యపాత్రల్లో చరణ్ రాజ్, గొల్లపూడి, శ్రీవిద్య, నగేష్, పి. ఎల్. నారాయణ తదితరులు నటించారు. ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించాడు.

కథ[మార్చు]

జి.కె. రాయుడు (కమల్ హాసన్) ఒక అవినీతిపరుడైన మేయర్. తన పి. ఎ త్రిపాఠి (చరణ్ రాజ్) సహాయంతో ఎన్నో అక్రమాలకు పాల్పడుతుంటాడు. వీటిని బయట పెట్టడానికి సాహసవంతురాలైన విలేకరి దుర్గ (విజయశాంతి) ప్రయత్నిస్తుంటుంది. అది తెలుసుకున్న జి. కె. రాయుడు ఆమెను బెదిరించి పంపేస్తాడు. కానీ దుర్గ మాత్రం అతన్ని గురించి మరింత సమాచారం సేకరిస్తుంది. అది తను పనిచేసే సాయంకాలం అనే పత్రికలో ప్రచురించబోయే సమయానికి జి. కె. రాయుడు వచ్చి ఆ ప్రెస్సును ధ్వంసం చేస్తాడు. మళ్ళీ దుర్గను బెదిరించపోగా మేయరు పేరు అడ్డుపెట్టుకుని త్రిపాఠి పెట్రోలు దొంగతనం గురించి చెబుతుంది. అంతే కాకుండా అతని దగ్గర పనిచేసే మీనా (జయలలిత) నిజానికి త్రిపాఠి భార్యయనీ, ఆమెను అడ్డుపెట్టుకుని త్రిపాఠి అక్రమంగా సంపాదిస్తున్నట్లు తెలుసుకుంటాడు.

రాయుడిలో పరివర్తన మొదలవుతుంది. త్రిపాఠిని, మీనాను నమ్ముకుని తాను ఎలా మోసపోయిందీ, తన కుటుంబానికి తాను ఎలా అన్యాయం చేస్తున్నాడో తెలుసుకుని త్రిపాఠి ఇంటికి వెళ్ళి అతను అక్రమంగా సంపాదించిన వజ్రాలు తీసుకుని ఇంటికి వస్తాడు. తన చిన్న కూతురికిచ్చి ఆమెనే తీసుకోమంటాడు. తరువాత వెళ్ళి త్రిపాఠిని, మీనాను నిలదీస్తాడు. ముగ్గురి మధ్య పోరాటం మొదలవుతుంది. చివరికి త్రిపాఠి, మీనా కలిసి రాయుడిని చంపి ఒక శీతల గిడ్డంగిలో దాస్తారు. కానీ అంతకు మునుపే రాయుడు ఒక హాంకాంగ్ కంపెనీతో 30 కోట్ల రూపాయలకు కాంట్రాక్టు కుదుర్చుకుని ఉంటాడు. అది ఎలా సంపాదించాలో ఆలోచిస్తుంటే పిచ్చాసుపత్రినుంచి పారిపోయి వస్తున్న చంద్రం (కమల్ హాసన్) కనిపిస్తాడు. అతనిలో రాయుడి పోలికలు కనిపిస్తాయి. కానీ పిచ్చాసుపత్రి వాళ్ళు అతన్ని తీసుకువెళ్ళి పోతారు.

చంద్రం ఒక నృత్య కళాకారుడు. ఒక ప్రదర్శనలో చంద్రం సహ నర్తకిని చూసి వల్లభ రావు (గొల్లపూడి మారుతీ రావు) అనే కాంట్రాక్టరు ఆమె మీద మోజు పడతాడు. వాళ్ళిద్దరికీ సినిమాలో అవకాశాలిప్పిస్తానని చెప్పి ఒక హోటల్ కి రమ్మంటాడు. అక్కడ పరిస్థితులను చూడగానే అది వ్యభిచారాన్ని ప్రోత్సహించే స్థలమేమోనని చంద్రానికి అనుమానం వస్తుంది. ఈలోపు వల్లభరావు అతన్ని ఏదో పనిమీద బయటకు పంపిస్తాడు. కానీ అతను మధ్యలోనే తిరిగి హోటల్ గదికి వెళ్ళగా అక్కడ వల్లభరావు ఆమెను మానభంగం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. చంద్రం తిరగబడబోతే ఆమెను కిటికీలో తోసేసి ఆమె మరణానికి కారణమవుతాడు. ఆ కేసును చంద్రం మీదకు తోసేస్తాడు. జైలు శిక్ష తప్పించుకోవడానికి చంద్రం పిచ్చివాడిలా నటించి పిచ్చాసుపత్రికి చేరి అక్కడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఇది గమనించిన వల్లభరావు పిచ్చాసుపత్రిలో ఒక డాక్టరును లంచంతో కొని అతనికి విషపు ఇంజక్షన్ ఇచ్చి చంపేయమంటాడు. కానీ ఇదే సమయానికి త్రిపాఠి వచ్చి మరి కొంచెం ఎక్కువ డబ్బిచ్చి అతనిని తనకు అప్పజెప్పమంటాడు.

అలా చంద్రాన్ని తీసుకువచ్చిన త్రిపాఠి మేయర్ లా కనింపించేందుకు కావలసిన శిక్షణ ఇస్తాడు. అదే సమయంలో దుర్గతో ప్రేమలో పడతాడు. దుర్గ కూడా చంద్రానికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకుని అతనికి సహకరిస్తుంది. ఈలోపు చంద్రం కూడా మేయర్ శవాన్ని గురించి తెలుసుకుని త్రిపాఠిని ఇరుకులో పెడతాడు. వల్లభ రావు, త్రిపాఠి కలిసి చంద్రం అమ్మను అపహరించి అతన్ని హాంకాంగ్ కాంట్రాక్టు తమకు దక్కేలా చూడమంటారు. కానీ చంద్రం తెలివిగా వాళ్ళ మోసాన్ని ప్రజలకు తెలియజేసి తల్లిని కాపాడుకుంటాడు.

నటీనటులు[మార్చు]

పాటలు[మార్చు]

విశేషాలు[మార్చు]

  • ఈ చిత్రంలో ఒక ఛేజ్ సీనులో పోలీసు అధికారిగా ఇవివి కనిపించారు

బయటి లింకులు[మార్చు]