ఉత్తర ధ్రువం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆర్క్‌టిక్ మహాసముద్రంలో ఉత్తర ధ్రువం పాయింట్
మందపాటి మంచుతో కప్పబడివున్న ఉత్తర ధ్రువం

ఉత్తరార్ధగోళంలో, భూమి భ్రమణాక్షం దాని ఉపరితలాన్ని కలిసే బిందువును ఉత్తర ధ్రువం అంటారు. దీన్ని భౌగోళిక ఉత్తర ధ్రువం అని, భూమి ఉత్తర ధ్రువం అనీ కూడా అంటారు.

ఉత్తర ధ్రువం భూగోళంపై ఉత్తర కొనన ఉన్న బిందువు. ఇది దక్షిణ ధ్రువానికి సరిగ్గా అవతలి వైపున ఉంది. జియోడెటిక్ అక్షాంశం 90 ° ఉత్తరంను, అలాగే నిజమైన ఉత్తరం దిశనూ ఇది నిర్వచిస్తుంది. ఉత్తర ధ్రువం దగ్గర నుండి ఎటు చూసినా ఆ దిశలన్నీ దక్షిణమే; రేఖాంశాలన్నీ అక్కడ కలుస్తాయి, కాబట్టి, ఉత్తర ధ్రువ రేఖాంశం ఏది అంటే, ఏదైనా చెప్పవచ్చు. అక్షాంశ వృత్తాల వెంట, అపసవ్య దిశ తూర్పు, సవ్యదిశ పడమర అవుతాయి. ఉత్తర ధ్రువం ఉత్తర అర్ధగోళానికి మధ్యన ఉంది. దీనికి అత్యంత సమీపంలో ఉన్న నేల, గ్రీన్లాండ్ ఉత్తర తీరానికి 700 కి.మీ. దూరంలో నున్న కాఫెక్లుబ్బెన్ ద్వీపం అని అంటారు. అయితే, కొన్ని సెమీ శాశ్వత కంకర గుట్టలు ఇంకొంచెం దగ్గర లోనే ఉంటాయి. కెనడాలో, నూనావట్ లోని క్విక్తాలుక్ ప్రాంతంలోని అలెర్ట్, ధ్రువం నుండి అత్యంత దగ్గరలో మానవ నివాస స్థలం. ఇది ధ్రువం నుండి 817 కి.మీ. దూరంలో ఉంది.

దక్షిణ ధ్రువం ఖండంలోని నేల ప్రాంతంలో ఉండగా, ఉత్తర ధ్రువం మాత్రం ఆర్కిటిక్ మహాసముద్రం మధ్యలో ఉంది. ఇక్కడి నీళ్ళు దాదాపుగా శాశ్వతంగా సముద్రపు మంచుతో కప్పబడి ఉంటాయి. ఈ మంచు కూడా కదులుతూ ఉంటుంది. ఉత్తర ధ్రువం వద్ద సముద్రం లోతు 4,261 మీటర్లని 2007 లో రష్యన్ మీర్ సబ్మెర్సిబుల్ కొలిచింది. 1958 లో USS నాటిలస్ కొలిచినపుడు ఇది 4,087 మీటర్లుంది. [1] [2] దీనివల్ల, ఉత్తర ధ్రువం వద్ద ( దక్షిణ ధ్రువం వలె కాకుండా ) శాశ్వత స్థావరాన్ని నిర్మించడం అసాధ్యం. అయితే, సోవియట్ యూనియన్, ఆ తరువాత రష్యా 1937 నుండి వార్షిక ప్రాతిపదికన మనుషులుండే డ్రిఫ్టింగ్ స్టేషన్లు చాలానే నిర్మించాయి. వాటిలో కొన్ని ధ్రువం గుండా పోయేవి, లేదా చాలా దగ్గరగా ఉండేవి. 2002 నుండి, రష్యన్లు ఏటా ధ్రువానికి దగ్గరగా ఉన్న బార్నియో అనే స్థావరాన్ని కూడా స్థాపిస్తూ వస్తున్నారు. వసంత ఋతువు ప్రారంభంలో ఇది కొన్ని వారాలు పనిచేస్తుంది. ఆర్కిటిక్ మంచు తగ్గుతూండడం కారణంగా ఉత్తర ధ్రువం కాలానుగుణంగా మంచు రహితంగా మారుతుందని 2000 లలో చేసిన అధ్యయనాలు అంచనా వేశాయి. 2016 [3] [4] నుండి 21 వ శతాబ్దం చివరి లోగా ఎప్పుడైనా ఇది మొదలవవచ్చు.

19 వ శతాబ్దం చివరలో ఉత్తర ధ్రువానికి చేరే ప్రయత్నాలు మొదలయ్యాయి. అనేక సందర్భాల్లో "సుదూర ఉత్తరం" రికార్డును అధిగమించారు. ఉత్తర ధ్రువానికి చేరుకున్న మొట్టమొదటి వివాదాతీతమైన యాత్ర ఎయిర్ షిప్ నోర్గె, చేసింది. 1926 లో ఈ ప్రాంతం మీదుగా అది 16 మందితో ఎగిరింది. వీరిలో యాత్ర నాయకుడు రోల్డ్ అముండ్సేన్ ఉన్నాడు. అంతకు ముందు ఫ్రెడరిక్ కుక్ (1908, భూమి), రాబర్ట్ పియరీ (1909, భూమి), రిచర్డ్ ఇ. బైర్డ్ (1926, వైమానిక) నేతృత్వంలో జరిగిన యాత్రలు కూడా ధ్రువానికి చేరుకున్నట్లు గతంలో అంగీకరించారు. అయితే, ఆ తరువాత యాత్ర డేటాను విశ్లేషించినపుడు వారి వాదనల కచ్చితత్వంపై సందేహాలు కలిగాయి.

ఖచ్చితమైన నిర్వచనం

[మార్చు]

భూమి యొక్క భ్రమణాక్షం భూమి ఉపరితలంతో పోలిస్తే స్థిరంగా ఉంటుందని భావించేవారు. దాంతోపాటే అందుకే ఉత్తర ధ్రువం స్థానం కూడా. కానీ, 18 వ శతాబ్దంలో, గణిత శాస్త్రజ్ఞుడు లియోన్హార్డ్ అయిలర్ అక్షం కొద్దిగా "చలిస్తుంద"ని అంచనా వేసాక, ఆ భావన మారింది. 20 వ శతాబ్దం ప్రారంభంలో ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాల పరిశీలన నుండి భూమిపై నున్న స్థిర బిందువులో ఒక చిన్న "అక్షాంశ వైవిధ్యాన్ని" గమనించారు. ఈ వైవిధ్యంలో కొంత భాగం భూమి యొక్క ఉపరితలంపై ధ్రువం కొన్ని మీటర్ల దూరం చలించడం కారణమని చెప్పవచ్చు. ఈ చలనంలో క్రమపద్ధతిలో పునరావృతమయ్యే అనేక భాగాలు, క్రమరహితమైన భాగం ఒకటీ ఉన్నాయి. సుమారు 435 రోజుల ఆవర్తన సమయం ఉన్న భాగం, ఐలెర్ ఊహించిన ఎనిమిది నెలల సంచారంతో సరిపోయింది. దానిని కనుగొన్న శాస్త్రవేత్త పేరిట దాన్ని చాండ్లర్ చలనం అని పిలుస్తారు. భూమి భ్రమణాక్షం, భూ ఉపరితలమూ ఖండించుకునే కచ్చితమైన బిందువును ఆ క్షణానికి "తక్షణ ధ్రువం" అని పిలవ్వచ్చు. కానీ మీటర్లలో కచ్చితత్వం అవసరమైనపుడు స్థిర ఉత్తర ధ్రువానికి నిర్వచనంగా దీన్ని వాడలేం.

భూమి కోఆర్డినేట్ల వ్యవస్థను (అక్షాంశం, రేఖాంశం, ఎలివేషన్స్ లేదా ఓరోగ్రఫీ ) స్థిర ల్యాండ్‌ఫార్మ్‌లకు కట్టబెట్టడం అవసరం. అయితే, ప్లేట్ టెక్టోనిక్స్, ఐసోస్టాసీలను పరిగణిస్తే తీసుకుంటే, భౌగోళిక లక్షణాలన్నిటినీ చూపించే వ్యవస్థ లేదు. అయినా సరే, ఇంటర్నేషనల్ ఎర్త్ రొటేషన్ అండ్ రిఫరెన్స్ సిస్టమ్స్ సర్వీస్, ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్లు కలిసి, ఇంటర్నేషనల్ టెరెస్ట్రియల్ రిఫరెన్స్ సిస్టమ్ అనే ఫ్రేమ్‌వర్క్‌ను నిర్వచించాయి.

అన్వేషణ

[మార్చు]

1900 కి పూర్వం

[మార్చు]
గెరార్డస్ మెర్కేటర్ ఉత్తర ధ్రువం మ్యాప్ - 1595
CG జోర్గ్‌డ్రేజర్స్ 1720 నుండి ఉత్తర ధ్రువం మ్యాప్

16 వ శతాబ్దం నాటికి, ఉత్తర ధ్రువం ఒక సముద్రంలో ఉందని చాలా మంది ప్రముఖులు సరిగ్గానే విశ్వసించారు. దీనిని 19 వ శతాబ్దంలో పాలీనియా లేదా ఓపెన్ పోలార్ సీ అని పిలిచేవారు. [5] అందువల్ల, అనుకూలంగా ఉండే సమయాల్లో, మంచు గడ్డల మీదుగా ప్రయాణించి ధ్రువాన్ని చేరవచ్చని భావించేవారు. చల్లటి ఉత్తర అక్షాంశాలలో ఇప్పటికే ఉపయోగంలో ఉన్న తిమింగలం నౌకల్లో, ఉత్తర ధ్రువానికి మార్గం కనుగొనేందుకు అనేక యాత్రలు బయల్దేరాయి.

ఉత్తర ధ్రువానికి చేరుకోవాలనే స్పష్టమైన ఉద్దేశంతో బయలుదేరిన తొలి యాత్రలలో ఒకటి బ్రిటిష్ నావికాదళ అధికారి విలియం ఎడ్వర్డ్ ప్యారీ చేసింది. 1827 లో తడు 82 ° 45 ఉత్తర అక్షాంశం చేరుకున్నాడు. 1871 లో, అమెరికాకు చెందిన చార్లెస్ ఫ్రాన్సిస్ హాల్ నేతృత్వంలో చేసిన పొలారిస్ యాత్ర విపత్తుకు లోనై ముగిసింది. కమాండర్ ఆల్బర్ట్ హెచ్. మార్ఖం చేసిన యాత్రలో 1876 మేలో 83 ° 20'26 "ఉత్తర అక్షాంశం వద్దకు చేరుకున్నాడు. అప్పటికి అదే రికార్డు. యుఎస్ నావికాదళ అధికారి జార్జ్ డబ్ల్యూ. డెలాంగ్ నేతృత్వంలో 1879–1881 లో యుఎస్ఎస్ జీనెట్ అనే ఓడలో యాత్ర చేసాడు. ఈ ఓడ మంచులో ఇరుక్కుని ముక్కలైపోవడంతో విషాదకరంగా ముగిసింది. డెలాంగ్‌తో సహా సగానికి పైగా సిబ్బంది గల్లంతై పోయారు.

ఆర్కిటిక్ మంచులో నాన్సెన్ ఓడ ఫ్రామ్

ఏప్రిల్ 1895 లో, నార్వేజియన్ అన్వేషకులు ఫ్రిడ్జోఫ్ నాన్సెన్, హల్మార్ జోహన్సేన్ లు, నాన్సెన్ ఓడ ఫ్రామ్ లో ప్రయాణించి, అది మంచులో ఆగిపోయినపుడు, వాళ్ళు స్కీలమీద వెళ్ళారు. వీళ్ళిద్దరూ 86 ° 14' ఉత్తర అక్షాంశానికి చేరుకున్నారు. అక్కడినుండి వెనుదిరిగి, దక్షిణ దిశగా వెళ్తూ, చివరికి ఫ్రాంజ్ జోసెఫ్ ల్యాండ్‌ చేరుకున్నారు.

1897 లో, స్వీడన్ ఇంజనీర్ సాలమన్ ఆగస్ట్ ఆండ్రీ, మరో ఇద్దరు సహచరులు హైడ్రోజన్ బెలూన్ ఓర్నెన్ లో("ఈగిల్") ఉత్తర ధ్రువం చేరుకోవడానికి ప్రయత్నించారు, కాని క్విటోయాకు 300 కి.మీ. దూరంలో కిందికి దిగారు. ఇది స్వాల్‌బార్డ్ ఆర్కిపెలాగోకు ఈశాన్య కొనన ఉంది. . వారు క్విటోయాకు నడుస్తూ వెళ్ళారు, కాని మూడు నెలల తరువాత అక్కడ మరణించారు. 1930 లో ఈ యాత్ర అవశేషాలను నార్వేజియన్ బ్రాట్వాగ్ యాత్రలో కనుగొన్నారు.

ఇటాలియన్ అన్వేషకుడు డ్యూక్ ఆఫ్ ది అబ్రుజ్జి అయిన లుయిగి అమేడియో, ఇటాలియన్ రాయల్ నేవీ (రెజియా మెరీనా) లో కెప్టెనయిన ఉంబెర్టో కాగ్ని 1899 లో నార్వే నుండి యాత్ర చేసారు. తిమింగల నౌక స్టెల్లా పోలారే ("పోల్ స్టార్") లో తగు మార్పులు చేసుకుని అందులో ప్రయాణించారు. 1900 మార్చి 11 న, కాగ్ని నేతృత్వంలో ఒక బృందం మంచు మీద నడుస్తూ బయల్దేరి ఏప్రిల్ 25 న 86 ° 34 ' ఉత్తర అక్షాంశం వద్దకు చేరుకుంది. 1895 లో నాన్‌సెన్ సాధించిన ఫలితాన్ని 35 నుండి 40 కి.మీ. మించి, కొత్త రికార్డు సృష్టించారు. కాగ్ని అతి కష్టం మీద శిబిరానికి తిరిగి వచ్చాడు. జూన్ 23 వరకూ అక్కడే ఉన్నాడు. ఆగస్టు 16 న, స్టెల్లా పోలారే రుడాల్ఫ్ ద్వీపాన్ని వదిలి, దక్షిణ దిశగా యాత్ర చేస్తూ తిరిగి నార్వే చేరుకుంది.

1909 లో ఉత్తర ధ్రువం అని పియరీ స్లెడ్జ్ పార్టీ వారు పేర్కొన్నారు. ఎడమ నుండి: ఓక్వియా, ఓటా, హెన్సన్, ఎగింగ్వా, సీగ్లో. [6]

పగలు, రాత్రి

[మార్చు]

ఉత్తర ధ్రువం వద్ద సూర్యుడు వేసవిలో అంతా దిగంతానికి పైననే ఉంటాడు. శీతాకాల మంతా దిగంతానికి క్రిందనే ఉంటాడు. సూర్యోదయం మార్చి విషువత్తుకు కొద్దిగా ముందు (మార్చి 20 కి కాస్త అటూ ఇటూ) అవుతుంది. మూడునెలల్లో ఉత్తరాయనం (జూన్ 21 న) నాటికి సూర్యుడు 23½° ఎత్తుకు చేరుకుంటాడు. ఆ తరువాత సూర్యుడు దిగపోవడం మొదలౌతుంది. సెప్టెంబరు విషువత్తు తర్వాత (సెప్టెంబరు 23 కు కాస్త అటూఇటూ) సూర్యాస్తమయానికి చేరుకుంటుంది. ధ్రువాకాశంలో కనిపించే సూర్యుడు దిగంతంపై ఒక క్షితిజ సమాంతర వృత్తంలో కదులుతున్నట్లు కనిపిస్తుంది. ఈ వృత్తం క్రమంగా దిగంతం దగ్గర మొదలై లేస్తూ వేసవి అయనాంతం వద్ద దిగంతం పైన దాని గరిష్ఠ ఎత్తుకు (డిగ్రీలలో) పెరుగుతుంది. తరువాత దిగంతం వైపు దిగుతూ, శరద్ విషువత్తు వద్ద తిరిగి మునిగిపోతుంది. అందువల్ల ఉత్తర, దక్షిణ ధ్రువాల వద్దనే భూమిపై అత్యంత నెమ్మదైన సూర్యోదయ, సూర్యాస్తమయాలు జరుగుతాయి.

సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తరువాత సంభవించే సంధ్య కాలానికి మూడు వేర్వేరు నిర్వచనా లున్నాయి :

ఈ ప్రభావాలు భూమి భ్రమణాక్షపు వంపు, సూర్యుని చుట్టూ దాని పరిభ్రమణాల వలన సంభవిస్తాయి. భూమి భ్రమణాక్షపు వంపు యొక్క దిశ, భ్రమణాక్షానికీ, సూర్యుని చుట్టూ భూమి తిరిగే కక్ష్యా తలానికీ (జ్యోతిశ్చక్రానికీ) ఉన్న కోణం, ఒక సంవత్సరం వ్యవధిలో చాలా స్థిరంగా ఉంటాయి. (రెండూ దీర్ఘ కాలావధుల్లో ఇవి నెమ్మదిగా మారుతూంటాయి). ఉత్తర నడివేసవిలో ఉత్తర ధ్రువం గరిష్ఠ స్థాయిలో సూర్యుని వైపు ఉంటుంది. సంవత్సరం గడిచేకొద్దీ, భూమి సూర్యుని చుట్టూ కక్ష్యలో కదిలేకొద్దీ, ఉత్తర ధ్రువం క్రమంగా సూర్యుడి నుండి పెడమొహంగా పోతూ ఉంటుంది. నడి శీతాకాలంలో సూర్యుడికి ఆవలి వైపున (పెడగా) నుండి గరిష్ఠ స్థాయిలో ఉంటుంది. ఆరు నెలల సమయ వ్యత్యాసంతో దక్షిణ ధ్రువంలో ఇదే విధమైన క్రమాన్ని గమనించవచ్చు.

సమయం

[మార్చు]

భూమిపై చాలా ప్రదేశాలలో, స్థానిక సమయం ఆ స్థలం ఉన్న రేఖాంశాన్ని ద్వారా నిర్ణయించబడుతుంది. అంటే రోజులో సమయం ఆకాశంలో సూర్యుడు ఉన్న స్థానానికి కొంచెం అటూ ఇటూగా సమకాలీకరించబడుతుంది (ఉదాహరణకు, మధ్యాహ్నం సూర్యుడు దాని గరిష్ఠ స్థాయికి చేరుకుంటాడు). కానీ ఉత్తర ధ్రువంలో ఈ తర్కం నిలబడదు. ఇక్కడ సూర్యుడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఉదయిస్తాడు, ఒక్కసారి మాత్రమే అస్తమిస్తాడు. రేఖాంశాలన్నీ ఇక్కడ కలుస్తాయి. అందువల్ల సమయ మండలాలన్నీ ఇక్కడ కలుస్తాయి. ఉత్తర ధ్రువం వద్ద శాశ్వత మానవ ఆవాసాలు లేవు. అంచేత నిర్దుష్ట సమయ మండలాన్ని కేటాయించలేదు. ఇక్కడికి యాత్రలు చేసేవారు గ్రీన్విచ్ మీన్ టైమ్ లేదా వారు బయలుదేరిన దేశపు టైమ్ జోన్‌ను లేదా ఏదో ఒక సౌకర్యవంతమైన టైమ్ జోన్‌ను ఉపయోగించవచ్చు.

శీతోష్ణస్థితి

[మార్చు]
2005 తో పోలిస్తే 2007 నాటి ఆర్కిటిక్ మంచు సంకోచాలు 1979-2000 సగటుతో పోలిస్తే.

ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం కంటే బాగా వెచ్చగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక ఖండపు భూభాగంపై ఎత్తున కాకుండా, సముద్ర మట్టం వద్ద, సముద్రానికి మధ్యన (ఇది వేడి జలాశయంగా పనిచేస్తుంది) ఉంది. ఐస్ క్యాప్ అయినప్పటికీ, గ్రీన్‌ల్యాండ్‌లోని ఉత్తరాన ఉన్న వాతావరణ కేంద్రం వద్ద టండ్రా క్లైమేట్ (కొప్పెన్ ఇటి ) ఉంటుంది. జూలై, ఆగస్టుల్లో సగటు ఉష్ణోగ్రతలు సున్నకంటే కొద్దిగా పైన ఉండడం ఇందుకు కారణం.

గ్రీన్లాండ్‌లోని ఉత్తరాన ఉన్న వాతావరణ కేంద్రంలో శీతాకాలపు ఉష్ణోగ్రతలు సుమారు −50 to −13 °C (−58 to 9 °F), సగటున −31 °C (−24 °F) ఉంటాయి. ఉత్తర ధ్రువం వద్ద ఇంతకంటే ఇంకాస్త చల్లగా ఉంటుంది.A అయితే, 2015 డిసెంబరు 30 న, 87.45 ° N వద్ద అసాధారణంగా వచ్చిన ఒక తుఫాను వలన ఉష్ణోగ్రత 0.7 °C (33 °F)కు చేరుకుంది. ఆ సమయంలో ఉత్తర ధ్రువం వద్ద ఉష్ణోగ్రత 30 and 35 °F (−1 and 2 °C) మధ్య ఉందని అంచనా వేసారు. వేసవి ఉష్ణోగ్రతలు (జూన్, జూలై, ఆగస్టు) గడ్డకట్టే స్థానానికి ( 0 °C (32 °F) ) అటూ ఇటూ ఉంటాయి. ఇప్పటి వరకూ నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 13 °C (55 °F). దక్షిణ ధ్రువం వద్ద రికార్డైన అత్యధికం, −12.3 °C (9.9 °F) కంటే ఇది చాలా ఎక్కువ. [7] 2016 నవంబరు 15 న ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయి వరకూ పెరిగాయి. మరోసారి, 2018 ఫిబ్రవరిలో చాలా శక్తివంతమైన తుఫాను వచ్చినపుడు, గ్రీన్లాండ్‌లోని వాతావరణ కేంద్రమైన కేప్ మోరిస్ జెసప్ వద్ద ఉష్ణోగ్రతలు 6.1 °C (43 °F) చేరుకున్నాయి. వరుసగా 24 గంటల పాటు ఉష్ణోగ్రత సున్నాకు పైనే ఉంది. ఈ సమయంలో, ధ్రువం వద్ద 1.6 °C (35 °F) ఉండి ఉంటుందని అంచనా. ఆరోజున అదే సమయానికి లాస్ ఏంజిల్స్‌లోని హాలీవుడ్ బర్బాంక్ విమానాశ్రయంలో కూడా అంతే ఉష్ణోగ్రత (1.6 °C (35 °F)) రికార్డైంది.

ఉత్తర ధ్రువం వద్ద సముద్రపు ఐసు సాధారణంగా 2 to 3 m (6 ft 7 in to 9 ft 10 in) మందంగా ఉంటుంది. [8] మంచు మందం, దాని ప్రాదేశిక పరిధి, వాతావరణం వగైరాలను బట్టి మారుతూ ఉంటుంది. ఇటీవలి సంవత్సరాలలో సగటు మంచు మందం తగ్గిందని అధ్యయనాలు చెబుతున్నాయి. [9] గ్లోబల్ వార్మింగ్ దీనికి దోహదం చేసిందని తెలుస్తోంది. అయితే ఇటీవలి కాలంలో ఆకస్మికంగా మందం తగ్గడానికి, పూర్తిగా ఆర్కిటిక్‌లో గమనించిన వేడెక్కడమే కారణమని చెప్పలేం. రాబోయే కొన్ని దశాబ్దాల్లో ఆర్కిటిక్ మహాసముద్రం వేసవిలో ఆసలు మంచే లేకుండా ఉంటుందని నివేదికలు అంచనా వేస్తున్నాయి. [10] ఇది చాలా వాణిజ్య పరమైన చిక్కులను కలిగించవచ్చు.

ఆర్కిటిక్ సముద్రపు మంచు తిరోగమనం గ్లోబల్ వార్మింగ్‌ను వేగవంతం చేస్తుంది. ఎందుకంటే తక్కువ మంచు కవచం తక్కువ సౌర వికిరణాన్ని ప్రతిబింబిస్తుంది. ఆర్కిటిక్ సైక్లోన్ ఉద్భవానికికి దోహదం చేయడం ద్వారా తీవ్రమైన వాతావరణ ప్రభావాలను కలిగిస్తుంది. [11]

శీతోష్ణస్థితి డేటా - గ్రీన్‌లాండ్ వాతావరణ కేంద్రంA (పదకొండేళ్ళ సగటు పరిశీలనలు)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) −13
(9)
−14
(7)
−11
(12)
−6
(21)
3
(37)
10
(50)
13
(55)
12
(54)
7
(45)
9
(48)
0.6
(33.1)
0.7
(33.3)
13
(55)
సగటు అధిక °C (°F) −29
(−20)
−31
(−24)
−30
(−22)
−22
(−8)
−9
(16)
0
(32)
2
(36)
1
(34)
0
(32)
−8
(18)
−25
(−13)
−26
(−15)
−15
(6)
రోజువారీ సగటు °C (°F) −31
(−24)
−32
(−26)
−31
(−24)
−23
(−9)
−11
(12)
−1
(30)
1
(34)
0
(32)
−1
(30)
−10
(14)
−27
(−17)
−28
(−18)
−16
(3)
సగటు అల్ప °C (°F) −33
(−27)
−35
(−31)
−34
(−29)
−26
(−15)
−12
(10)
−2
(28)
0
(32)
−1
(30)
−2
(28)
−11
(12)
−30
(−22)
−31
(−24)
−18
(−1)
అత్యల్ప రికార్డు °C (°F) −47
(−53)
−50
(−58)
−50
(−58)
−41
(−42)
−24
(−11)
−12
(10)
−2
(28)
−12
(10)
−31
(−24)
−21
(−6)
−41
(−42)
−47
(−53)
−50
(−58)
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) 83.5 83.0 83.0 85.0 87.5 90.0 90.0 89.5 88.0 84.5 83.0 83.0 85.8
Source: వెదర్‌బేస్[12]

వృక్షజాలం, జంతుజాలం

[మార్చు]

ధ్రువ ఎలుగుబంట్లు 82 ° ఉత్తర అక్షాంశాన్ని దాటి పైకి పెద్దగా వెళ్ళవని భావిస్తారు. కానీ, ఉత్తర ధ్రువం సమీపంలో వీటి అడుగు జాడలు కనిపించాయి. ఆహార కొరత దీనికి కారణం కావచ్చు. 2006లో జరిగిన ఒక యాత్రలో ధ్రువ ఎలుగుబంటిని ధ్రువం నుండి కేవలం 1 మైలు దూరంలో చూసారు. [13] [14] ధ్రువంలో రింగ్డ్ సీల్ కూడా కనిపించింది. ఆర్కిటిక్ నక్కలు 60 కి.మీ. కన్నా తక్కువ దూరంలో 89 ° 40 వద్ద కనిపించాయి. [15] [16]

ధ్రువానికి సమీపంలో లేదా చాలా దగ్గరగా కనిపించే పక్షులలో మంచు బంటింగ్, నార్తర్న్ ఫుల్మార్, బ్లాక్-లెగ్డ్ కిట్టివాక్ ఉన్నాయి. అయితే పక్షులు ఓడలు, యాత్రలను అనుసరించి వెళ్తూంటాయి కాబట్టి కొన్ని పక్షులు కనబడితే అవి అక్కడ నివసించేవని పొరబడడం జరుగుతూంటుంది [17]

ఉత్తర ధ్రువం వద్ద నీటిలో చేపలు కనిపించాయి, అయితే చాలా తక్కువ. [17] 2007 ఆగస్టులో ఉత్తర ధ్రువ సముద్రం లోపలికి వెళ్ళిన రష్యన్ జట్టు సభ్యుడు అక్కడ సముద్ర జీవులేమీ కనిపించలేదని చెప్పాడు. [18] కానీ, రష్యా జట్టు సముద్రగర్భం మట్టి నుండి సముద్ర పుష్పాలను వెలికి తీసారని తరువాత తెలిసింది. ఆ వీడియోలో గుర్తు తెలియని చిన్నరొయ్యలు యాంఫీపోడ్‌లు కూడా కనిపించాయి. [19]

ఉత్తర ధ్రువం, ఆర్కిటిక్ ప్రాంతాల స్వామిత్వంపై వాదనలు

[మార్చు]
అంతర్జాతీయ డేట్‌లైన్, 2015 లో ఉత్తర ధ్రువం మీద సూర్యాస్తమయం

ప్రస్తుతం, అంతర్జాతీయ చట్టం ప్రకారం, ఉత్తర ధ్రువం లేదా దాని చుట్టూ ఉన్న ఆర్కిటిక్ మహాసముద్ర ప్రాంతం ఏ దేశానికీ చెందదు. చుట్టుపక్కల ఉన్న ఐదు ఆర్కిటిక్ దేశాలు, రష్యన్ ఫెడరేషన్, కెనడా, నార్వే, డెన్మార్క్ (గ్రీన్లాండ్ ద్వారా), యునైటెడ్ స్టేట్స్ ల హద్దులు వాటి సరిహద్దుల నుండి 200 నటికల్ మైళ్ళ వరకే పరిమితం. దానికి ఆవల ఉన్న ప్రాంతాన్ని అంతర్జాతీయ సముద్రగర్భ అథారిటీ నిర్వహిస్తుంది .

సముద్ర చట్టంపై ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని ఆమోదించిన తరువాత, ఒక దేశం తన 200-మైళ్ల ప్రత్యేక ఆర్థిక మండలానికి ఆవల విస్తరించిన ఖండాంతర షెల్ఫ్‌ గురించి దావా వేయడానికి 10 సంవత్సరాలు సమయమిచ్చింది. ధృవీకరించబడితే, అటువంటి దావా చేసిన ప్రాంతపు పరిధిలో సముద్రంలోను, అడుగునా ఉన్న వాటికి ఆ దేశం హక్కుదారు అవుతుంది. [20] నార్వే (1996 లో కన్వెన్షన్‌ను ఆమోదించింది [21] ), రష్యా (1997 లో ఆమోదించింది [21] ), కెనడా (2003 లో ఆమోదించింది [21] ), డెన్మార్క్ (2004 లో ఆమోదించింది [21] ) అన్నీ కొన్ని ప్రాథమిక ప్రాజెక్టులను ప్రారంభించాయి. ఆర్కిటిక్ ఖండాంతర షెల్ఫులపై తమకు సార్వభౌమ హక్కు కోరేందుకు భూమికలు ఆ ప్రాజెక్టులు . [22] [23]

1907 లో కెనడా తన తీరాల నుండి ఉత్తర ధ్రువం వరకు విస్తరించి ఉన్న ఒక రంగానికి సార్వభౌమాధికారాన్ని ప్రకటించడానికి "సెక్టార్ సూత్రాన్ని" లేవనెత్తింది. ఈ దావా విడిచిపెట్టలేదు, కానీ 2013 వరకు స్థిరంగా ఒత్తిడి చేయలేదు. [24]

సాంస్కృతిక సంఘాలు

[మార్చు]

కొన్ని పిల్లల పాశ్చాత్య సంస్కృతులలో, శాంతా క్లాజ్ యొక్క వర్క్‌షాపు, నివాసం భౌగోళిక ఉత్తర ధ్రువం అని వర్ణించారు. [25] [26] అయితే, వర్ణనలు భౌగోళిక ఉత్తర ధ్రువమా, అయస్కాంత ఉత్తర ధ్రువమా అనేది స్పష్టంగా లేవు. కెనడా పోస్టల్ శాఖ ఉత్తర ధ్రువానికి పోస్టల్ కోడ్ H0H 0H0 ను కేటాయించింది (సాంప్రదాయికంగా శాంటా యొక్క ఆశ్చర్యార్థకం - " హో హో హో !" ). [27]

ఈ అనుబంధం హైపర్బోరియా యొక్క పురాతన పురాణాన్ని తలపిస్తుంది. ఉత్తర ధ్రువం, మరోప్రపంచపు ప్రపంచాక్షం అనీ, దేవుడికి, మానవాతీత జీవులకూ నివాసమనీ ఇది పేర్కొంది. [28]

హెన్రీ కార్బిన్ డాక్యుమెంట్ చేసినట్లుగా, సూఫీయిజం, ఇరానియన్ మార్మికవాదాల సాంస్కృతిక ప్రపంచ దృష్టికోణంలో ఉత్తర ధృవానిది కీలక పాత్ర. "మార్మికత కోరిన ప్రాచ్యం, మా పటాలలో ఉండని ప్రాచ్యం, ఉత్తరం వైపున, ఉత్తరాన్ని దాటిన చోట ఉంది." [29]

సుదూరంగా ఉన్న దాని స్థానం కారణంగా, ధ్రువాన్ని కొన్నిసార్లు పురాతన ఇరానియన్ సంప్రదాయం లోని మార్మిక పర్వతంగా గుర్తిస్తారు. దీనిని మౌంట్ కాఫ్ (జబల్ కాఫ్) అని పిలుస్తారు, ఇది "భూమిపైనున్న సుదూర స్థానం". [30] [31] కొంతమంది రచయితల అభిప్రాయం ప్రకారం, ఈ జబల్ కాఫ్ అనేది, రూప్స్ నిగ్రా యొక్క మరో రూపం, దీన్ని ఎక్కడం అంటే, ఆధ్యాత్మిక స్థితుల ద్వారా యాత్రికులు పురోగమించడమని అర్థం. [32] ఇరానియన్ ఆధ్యాత్మికతలో, ఆధ్యాత్మిక అధిరోహణకు కేంద్ర బిందువు స్వర్గపు ధ్రువం. దాని "రాజభవనాలు అభౌతికమైన పదార్థంతో వెలుగుతూంటాయి". [33]

ఇవి కూడా చూడండి

[మార్చు]

గమనికలు

[మార్చు]
ఎ. ^ డేటా ఒక గ్రీన్లాండిక్ వాతావరణ స్టేషన్ నుండి 83°38′N 033°22′W / 83.633°N 33.367°W / 83.633; -33.367 (Greenlandic Weather Station) ఉన్న 709 km (441 mi) ఉత్తర ధ్రువం నుండి.

మూలాలు

[మార్చు]
 1. Андерсон, Уильям Роберт (1965). ""Наутилус" у Северного полюса". Воениздат. Retrieved 12 January 2012.
 2. Mouton, M.W. (1968). The International Regime of the Polar Regions. Acadimie de Droit International de La Ha. pp. 202 (34). ISBN 978-9028614420. Retrieved 12 January 2012.
 3. Black, Richard (8 April 2001). New warning on Arctic sea ice melt. BBC
 4. Ljunggren, David (5 March 2009). Arctic summer ice could vanish by 2013: expert Archived 2015-11-17 at the Wayback Machine. Reuters
 5. Wright, John K. (July 1953). "The Open Polar Sea". Geographical Review. 43 (3): 338–365. doi:10.2307/211752. JSTOR 211752.
 6. "At the North Pole, 6–7 April 1909: Newfoundland and Labrador Heritage Web". Heritage.nf.ca. Retrieved 16 February 2011.
 7. "Antarctic Sun: Heat Wave", US Antarctic Program
 8. Beyond "Polar Express": Fast Facts on the Real North Pole, National Geographic News
 9. "Arctic ice thickness drops by up to 19 percent" Archived 2014-11-05 at the Wayback Machine, The Daily Telegraph (28 October 2008).
 10. Jonathan Amos (12 December 2006). Arctic sea ice "faces rapid melt", BBC.
 11. "Future of Arctic Climate and Global Impacts". NOAA. Retrieved 6 March 2012.
 12. "CLOSEST DATA FOR NORTH POLE - 440 MI/709 KM, GREENLAND". Weatherbase. Retrieved 19 September 2015.
 13. "Oh no! The page you are looking for has gone extinct..." wwf.panda.org (in ఇంగ్లీష్). Retrieved 2023-02-15.
 14. "Laravel". amz-n.com. Archived from the original on 2022-12-18. Retrieved 2023-02-15.
 15. Halkka, Antti (February 2003). Ringed seal makes its home on the ice. suomenluonto.fi
 16. Tannerfeldt, Magnus. The Arctic Fox Alopex lagopus. zoologi.su.se
 17. 17.0 17.1 "FARTHEST NORTH POLAR BEAR (Ursus maritimus)" (PDF). Archived from the original (PDF) on 22 ఏప్రిల్ 2012. Retrieved 16 February 2011.
 18. Russia plants flag under N Pole, BBC News (2 August 2007).
 19. "North Pole sea anemone named most northerly species", Observer, 2 August 2009
 20. "United Nations Convention on the Law of the Sea (Annex 2, Article 4)". Retrieved 26 July 2007.
 21. 21.0 21.1 21.2 21.3 Status of the United Nations Convention on the Law of the Sea, of the Agreement relating to the implementation of Part XI of the Convention and of the Agreement for the implementation of the provisions of the Convention relating to the conservation and management of straddling fish stocks and highly migratory fish stocks. un.org (4 June 2007).
 22. "Territorial claims in the Arctic" (PDF). Retrieved 16 February 2011.
 23. The Battle for the Next Energy Frontier: The Russian Polar Expedition and the Future of Arctic Hydrocarbons, by Shamil Yenikeyeff and Timothy Fenton Krysiek, Oxford Institute for Energy Studies, August 2007
 24. "Arctic Sovereignty: Loss by Dereliction?". Northern Perspectives. 22 (4). Winter 1994–1995. Archived from the original on 23 November 2010. Retrieved 16 February 2011.
 25. Jeffers, Harry Paul (2000). Legends of Santa Claus. Twenty-First Century Books. p. 20. ISBN 978-0-8225-4983-3.
 26. "Meet your neighbor: Santa Claus of the North Pole".
 27. "Canada Post Launches 24th Annual Santa Letter-writing Program – Post Office Sends Joy to Salvation Army with $25,000 Donation". Archived from the original on 2008-04-11. Retrieved 2020-04-08.
 28. Godwin, Joscelyn (1993). Arktos: The Polar Myth in Science, Symbolism, and Nazi Survival. Grand Rapids: Phanes Press. ISBN 978-0932813350.
 29. Corbin, Henry (1978). The Man of Light in Iranian Sufism. Translated by Pearson, N. Shambhala. ISBN 978-0394734415.
 30. Ibrahim Muhawi; Sharif Kanaana. Speak, Bird, Speak Again: Palestinian Arab Folktales. Berkeley: University of California Press.
 31. Irgam Yigfagna. al-Jabal al-Lamma.
 32. Irgam Yigfagna. al-Jabal al-Lamma. p. 44.
 33. Irgam Yigfagna. al-Jabal al-Lamma. p. 11.

.