ఉత్తరార్ధగోళం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నీలం రంగులో ఉన్నది ఉత్తరార్ధగోళం. ఈ బొమ్మలో అంటార్కిటికా కబడడంలేదు కాబట్టి, ఇది దక్షిణార్ధగోళం కంటే పెద్దదిగా కనిపిస్తోంది గానీ, రెండు అర్ధగోళాలూ సమానంగానే ఉంటాయి.
ఉత్తర ధ్రువం నుండి ఉత్తరార్ధగోళం

భూమధ్య రేఖకు ఉత్తరాన ఉన్న భూభాగమే ఉత్తరార్థగోళం. సౌరకుటుంబంలోని ఇతర గ్రహాల ఉత్తర దిశ, భూమి యొక్క ఉత్తర ధృవం సౌరకుటుంబపు తలానికి ఎటువైపున ఉంటుందో, అటువైపే ఉంటుంది.[1]

భూపరిభ్రమణతలం నుండి భూమి అక్షం కొంత కోణంలో వంగి ఉన్న కారణంగా ఉత్తరార్థగోళంలో శీతాకాలం డిసెంబరు ఆయనం (డిసెంబరు 21) నుండి మార్చి విషువత్తు (మార్చి 20) వరకూ ఉంటుంది. వేసవి కాలం జూన్ ఆయనం (జూన్ 21) నుండి సెప్టెంబరు విషువత్తు (సెప్టెంబరు 23) వరకూ ఉంటుంది. కాలెండరు సంవత్సరానికి, ఖగోళ సంవత్సరానికీ మధ్య ఉన్నతేడా వలన ఈ తేదీలు ప్రతీ ఏడాదీ ఒకేలా ఉండక కొద్దిగా మారుతూ ఉంటాయి.

ఉత్తరార్థగోళంలో భూమి 60.7% నీటితో నిండి ఉంటుంది. దక్షిణార్థగోళంలో ఇది 80.9% గా ఉంది. భూమిపై ఉన్న మొత్తం నేలలో 67.3% ఉత్తరార్థగోళంలో ఉంది.[2]

భౌగోళికం, శీతోష్ణస్థితి

[మార్చు]

ఆర్కిటిక్ వలయానికి ఉత్తరాన ఉన్న ప్రాంతాన్ని ఆర్కిటిక్ అంటారు. అక్కడి శీతోష్ణస్థితిని బాగా చలిగా ఉండే చలికాలం, చల్లగా ఉండే వేసవి కాలంగానూ చెప్పవచ్చు. అవక్షేపణం అధికభాగం మంచు రూపంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో వేసవిలో కొన్ని రోజులపాటు సూర్యాస్తమయం అసలే జరగదు. శీతాకాలంలో కొన్ని రోజులపాటు సూర్యుడు ఉదయించనే ఉదయించడు. ఈ వ్యవధి ఒక్కొక్కచోట ఒక్కో రకంగా ఉంటుంది. ఆర్కిటిక్ వలయం వద్ద ఒకరోజు ఉండగా, ఉత్తర ధృవం వద్ద కొన్ని నెలలపాటు ఉంటుంది. 

ఆర్కిటిక్ వలయానికి, కర్కట రేఖకూ మధ్య ఉత్తర సమశీతోష్ణ ప్రాంతముంటుంది. సాధారణంగా ఈ ప్రాంతంలో వేసవి, శీతాకాలాల మధ్య తేడా స్వల్పంగా ఉంటుంది. అయితే, ఈ శీతోష్ణస్థితి అనూహ్యంగా మారుతూ ఉంటుంది. 

భూమధ్య రేఖకు, కర్కట రేఖకూ మధ్య ఉన్నవి ఉష్ణ ప్రాంతాలు. ఇక్కడ సాధారణంగా ఏడాది పొడుగునా వేడిగా ఉంటుంది. వేసవిలో వర్షాకాలం వస్తుంది. శీతాకాలంలో పొడిగా ఉంటుంది.

ఉత్తరార్థగోళంలో, భూతలంపైన కదులుతున్న వస్తువులు కుడివైపు తిరిగే ప్రయత్నం చేస్తూంటాయి. దీనికి కారణం కొరియోలిస్ ఎఫెక్ట్. ఈ కారణంగా, భూతలంపై ప్రయాణించే గాలి, నీటి ప్రవాహాలు కుడివైపు సుళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు, ఒక బకెట్టులో కొంత ఎత్తునుండి నీళ్ళు పోసినపుడు ఆ నీళ్ళు కుడివైపు సుడి తిరగడం గమనించవచ్చు. 

ఇదే కారణం చేత, ఎత్తులనుండి ఉత్తరార్థగోళపు భూతలంవైపు కిందికి వచ్చే గాలి ప్రవాహాలు సవ్యదిశలో తిరుగుతూ నేలపై పరుచుకుంటాయి. అంచేత, అధికపీడన వాతావరణంలో సవ్యదిశలో గాలి సుళ్ళు తిరగడం ఇక్కడి లక్షణం. ఇందుకు విరుద్ధంగా, భూతలం నుండి పైకిలేచే గాలి సృష్టించే అల్పపీడన ప్రాంతంలోకి చుట్టుపక్కల నుండి లాక్కునే గాలి అపసవ్య దిశలో సుడి తిరుగుతుంది. ఉత్తరార్థగోళంలో హరికేన్లు, తుపానులూ అపసవ్యదిశలో సుడి తిరుగుతాయి. 

నీడగడియారపు నీడ, ఉత్తరార్థగోళంలో సవ్యదిశలో తిరుగుతుంది. పగటివేళ, సూర్యుడు నడినెత్తికి చేరేక్రమంలో కొద్దిగా దక్షిణం వైపుకు ఉంటాడు. అయితే కర్కట రేఖకు, భూమధ్యరేఖకూ మధ్య మాత్రం, ఏడాదిలోని సమయాన్ని బట్టి ఉత్తరానికిగాని, నడినెత్తినగాని, దక్షిణానికి గాని ఉంటాడు.

దక్షిణార్థగోళంతో పోలిస్తే, చంద్రుడు ఉత్తరార్థగోళం నుండి చూసినపుడు తిరగేసినట్లుగా కనిపిస్తాడు.[3][4] ఉత్తరార్థగోళం పాలపుంత యొక్క కేందం నుండి పెడగా (దూరంగా) ఉంటుంది. అందుచేత దక్షిణార్థగోళంతో పోలిస్తే ఇక్కడ పాలపుంత తక్కువ కాంతితో, మసకగా కనిపిస్తుంది. ఈ కారణంచేత ఉత్తరార్థగోళం, సుదూర అంతరిక్ష శోధనలకు అనుకూలంగా ఉంటుంది - పాలపుంత యొక్క వెలుతురు కమ్మెయ్యదు కాబట్టి.

జనాభా విస్తృతి

[మార్చు]

భూమిపై ఉన్న 730 కోట్ల మొత్తం జనాభాలో 657 కోట్లమంది ఉత్త్తరార్థగోళంలోనే నివసిస్తున్నారు.[5][6]

ఖండాల జాబితా

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Report of the IAU Working Group on cartographic coordinates and rotational elements: 2009" (PDF). Archived from the original (PDF) on 2012-02-17. Retrieved 2017-01-19.
  2. Life on Earth: A - G.. 1. ABC-CLIO. 2002. p. 528. ISBN 9781576072868. Retrieved 8 September 2016.
  3. Laura Spitler. "Does the Moon look different in the northern and southern hemispheres? (Beginner) - Curious About Astronomy? Ask an Astronomer". cornell.edu. Retrieved 10 November 2015.
  4. "Perspective of the Moon from the Northern and Southern Hemispheres". Retrieved 22 October 2013.
  5. "90% Of People Live In The Northern Hemisphere - Business Insider". Business Insider. 4 May 2012. Retrieved 10 November 2015.
  6. "GIC - Article". galegroup.com. Retrieved 10 November 2015.