Jump to content

ఎం. పురుషోత్తమాచార్యులు

వికీపీడియా నుండి
ఎం. పురుషోత్తమాచార్యులు
ఎం. పురుషోత్తమాచార్యులు
జననంముడుంబై పురుషోత్తమాచార్యులు
హుజుర్ నగర్, సూర్యాపేట జిల్లా, తెలంగాణ
ప్రసిద్ధికవి, రచయిత, సినీ విమర్శకుడు
తండ్రివెంకటనర్సింహాచార్యులు
తల్లిమంగతాయారమ్మ

ఎం. పురుషోత్తమాచార్యులు తెలంగాణకు చెందిన కవి, రచయిత, సినీ విమర్శకుడు. వృత్తి రీత్యా తెలుగు ఉపాధ్యాయుడైన పురుషోత్తమాచార్యులు మిసిమి మాస పత్రికలో సినిమా పాటలపై విమర్శనాత్మక వ్యాసాల రచనకు 2021 సంవత్సరానికి జాతీయ ఉత్తమ సినీ విమర్శకుడిగా ఎంపికయ్యాడు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

పురుషోత్తమాచార్యులు తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌ పట్టణంలో జన్మించాడు.[2] తల్లిదండ్రులు వెంకటనర్సింహాచార్యులు, మంగతాయారమ్మ. సంగీత విద్వాంసులైన తన తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న పురుషోత్తమాచార్యులు స్వగ్రామంలో హైస్కూల్‌ విద్యాభ్యాసం చదివి, ఉన్నత విద్యను వరంగల్‌లో పూర్తిచేశాడు. నల్లగొండలోని రామగిరి గీతా విజ్ఞాన మందిర్‌లో తెలుగు ఉపాధ్యాయుడుగా పనిచేసి 2006లో రిటైర్డ్‌ అయ్యాడు.

వృత్తి జీవితం

[మార్చు]

1992లో ఆకాశవాణిలో లలిత సంగీత గానం చేశాడు. 1979-85 వరకు శ్రీత్యాగరాజ ఉత్సవ సమితి కాద్యదర్శిగా అనేక సంగీత కార్యక్రమాలు నిర్వహించాడు. శ్రీ అన్నమాచార్య సంకీర్తనా ప్రచార సమితి అధ్యక్షుడిగా, ఘంటసాల కల్చరల్ అసోసియేషన్ ద్వారా 2 వేలకు పైగా సినీ సంగీత కార్యక్రమాలు నిర్వహించాడు. శ్రీనాథబ్రహ్మ సంగీత కళాశాల ద్వారా 500 మందికి పైగా సంగీత విద్యను బోధించాడు. 1985లో తపస్విని వీడియో చిత్రానికి సంగీత దర్శకుడిగా, 2000 సంవత్సరంలో అందరికీ విద్య ఆడియో సీడీ, 2006 నుంచి అన్నమయ్య పదశ్రుతి, అన్నమయ్య నృసింహ కీర్తనలు, అలంపురం జోగులాంబ కీర్తనలు, శ్రీనివాస చరితం లాంటి పలు సీడీలకు సంగీత దర్శకుడిగా పనిచేశాడు. 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నంది నాటకోత్సవ పోటీలకు, 1999లో అన్నమాచార్య భావనావాహిని హైదరాబాద్ వారు ' నిర్వహించిన నంది నాటక పోటీలకు న్యాయనిర్ణేతగా ఉన్నాడు.[3]

ఎం పురుషోత్తమాచార్య - సత్కళాభారతి సత్కారం

రచనా ప్రస్థానం

[మార్చు]

పురుషోత్తమాచార్యులు 'యాదగిరి లక్ష్మీ నర సింహ ప్రభు' అనే మకుటంతో 108 శార్దూల మత్తేభాలతో శతకం రచించాడు. ఈ శతకం 1970లో అచ్చయింది. చందాల కేశవదాసు జీవితం సాహిత్యం అన్న అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందాడు. తెలుగు సినిమాలో పాటలు, వాటి సాహిత్యం, సంగీతాలపై అవగాహన ఉండడంతో మిసిమి మాసపత్రికలో సినిమా పాటల్లో శాస్త్రీయ సంగీతంపై పరిశోధన చేస్తూ వ్యాసాలు రాశాడు.

రచనలు

[మార్చు]
  • మన ఘంటసాల సంగీత వైభవం[4]
  • మహాభక్త శబరి (పౌరాణిక నాటకం)[5]
  • వెన్నెల కుప్పలు (పిల్లల పాటలు)
  • తపస్విని (బాలల గేయాలు)
  • వరూధిని (నాటకం)
  • శ్రీసుదర్శన ప్రభావం (పద్యనాటకం)
  • హరిసంకీర్తనాచార్య (పద్యనాటకం)
  • రహస్యభూతము (పద్య కవిత)
  • లలిత గీతాల్లో సరాగాలు
  • శాస్త్రీయ గీతాల్లో కృతి రాగాలు
  • సరాగాలు (పాటలు)
  • విరిమువ్వలు (వచన కవితలు)
  • పదో తరగతి తెలుగు పాఠ్యాంశ కథలు
  • మన ఘంటసాల సంగీత వైభవం

పాటలపై పరిశోధన

[మార్చు]

మిసిమి ఎడిటర్‌ అశ్వన్‌ కుమార్‌ సూచనతో 2020 నుంచి సినిమా విమర్శ వ్యాసాలు రాస్తున్నాడు. సినిమా పాటల్లో ఉన్న సాహిత్యపు విలువలు, ట్యూన్‌ చేసిన విధానం, గాయకులు పాడిన తీరును పరిశీలించి ఆ పాటలను ఏయే సందర్భంలో ఉపయోగించారనే కోణంలో పరిశీలించి మిసిమి మాస పత్రికలో విమర్శనాత్మక వ్యాసాలుగా ప్రచురించాడు. క్లాసికల్‌ పాటలను సినిమాల్లో సినీ టిక్‌ (ప్రేక్షకులకు నచ్చే విధంగా) పద్ధతిలో పాడుతూ ఉంటే వాటిలో మంచిని మంచి అని, చెడును చెడును చెడు అని విమర్శ చేసి వ్యాసం రూపంలో రాశాడు. వీటిని పరిశీలించిన నేషనల్‌ జ్యూరీ బృందం క్రిటిక్‌ విభాగంలో అవార్డుకు ఎంపిక చేసింది.[6]

పురస్కారాలు

[మార్చు]
సత్కళాభారతి సత్కారం
  1. 2014: వరూధిని నాటక పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయ సాహితీ పురస్కారం (తెలుగు విశ్వవిద్యాలయం, 2016, డిసెంబరు 1)[7]
  2. 2019: రహస్యభూతము గ్రంథానికి తెలుగు విశ్వవిద్యాలయ సాహితీ పురస్కారం (తెలుగు విశ్వవిద్యాలయం, 2022, జూలై 7)[8][9]
  3. మచిలీపట్నం కళాపీఠం వారి ఘంటసాల కమెండేషన్ అవార్డు
  4. హైదరాబాద్ శ్రీకళానిధి సంస్థ వారి ఉత్తమ సంగీత విద్వాన్ పురస్కారం
  5. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డా. కె.వి. రమణాచారి, ఎఫ్.డి.సి చైర్మన్ అనిల్ కుర్మాచలం నుండి సత్కళాభారతి సత్కారం (రవీంద్రభారతి, 2023.09.05)

మూలాలు

[మార్చు]
  1. "National Awards 2023: జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్‌.. 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల విజేతలు వీళ్లే". EENADU. 2023-08-24. Archived from the original on 2023-08-24. Retrieved 2023-08-24.
  2. Sakshi (26 August 2023). "ప్రతిభ ఉంటే అవార్డులు వరిస్తాయి". Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  3. Eenadu (26 August 2023). "సాహితీ వారసుడు పురుషోత్తమాచార్యులు". Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  4. "మన ఘంటసాల సంగీత వైభవం". lit.andhrajyothy.com. Archived from the original on 2016-07-17. Retrieved 2023-08-24.
  5. "Mythological narrative". The Hindu. 2016-08-04. ISSN 0971-751X. Retrieved 2023-08-24.
  6. Namasthe Telangana (26 August 2023). "పాటల పరిశోధనకు జాతీయ గుర్తింపు". Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  7. "1 న తెలుగు యూనివర్శిటీ పురస్కారాల ప్రదానం". 2016-11-28. Archived from the original on 2023-08-24. Retrieved 2023-08-24.
  8. "తెలుగు వర్సిటీ-2019 సాహితీ పురస్కారాల ప్రదానం.. సీనియర్ జర్నలిస్టు కృష్ణారావుకు పురస్కారం". Prabha News. 2022-07-07. Archived from the original on 2023-01-27. Retrieved 2023-08-24.
  9. telugu, NT News (2022-07-08). "సమాజాన్ని జాగృతం చేసిన రచయితలకు సత్కారం". www.ntnews.com. Archived from the original on 2022-07-08. Retrieved 2023-08-24.