Jump to content

ఆనం చెంచుసుబ్బారెడ్డి

వికీపీడియా నుండి
(ఎ.సి.సుబ్బారెడ్డి నుండి దారిమార్పు చెందింది)
ఆనం చెంచుసుబ్బారెడ్డి
ఎ.సి.సుబ్బారెడ్డి
జననం
ఆనం చెంచుసుబ్బారెడ్డి

(1906-03-17)1906 మార్చి 17
మరణం1967 సెప్టెంబరు 20(1967-09-20) (వయసు 61)
జాతీయతభారతీయుడు
వృత్తిరాజకీయవేత్త
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రాష్ట్ర మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు

ఎ.సి.రెడ్డి గా పేరొందిన ఆనం చెంచుసుబ్బారెడ్డి నెల్లూరు ప్రాంతంలో సుప్రఖ్యాతులైన నాయకులు. స్వాతంత్ర్య సమరయోధులు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఎ.సి.సుబ్బారెడ్డి రాజమండ్రిలో మార్చి 17 1906 న జన్మించారు. ఆయన తండ్రి సుబ్బరామిరెడ్డి పోలీసు అధికారిగా పనిచేసేవాడు. ఆయన తల్లి నారాయణమ్మ. ఆయన ప్రాథమిక విద్యను తన స్వంత ఊరైన నెల్లూరులో పూర్తిచేసారు. ఆయన ఉన్నత విద్య కొరకు మద్రాసు వెళ్ళారు. మద్రాసులో ఆయనకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, నెల్లూరుకు చెందిన రేబాల దశరథరామిరెడ్డిలు సహాధ్యాయులు. ఆయన 1927 వరకు విద్యను కొనసాగించారు. ఆయన 15 వ యేట అన్నపూర్ణమ్మను వివాహమాడారు.[2] ఆయన ఇంటర్మీటియట్ ను మద్రాసు లోని పాచియప్ప కళాశాలలో చదువుతున్నప్పుడు గాంధీజీ యొక్క పిలుపు మేరకు చదువును మధ్యలో ఆపి స్వాతంత్ర్యోద్యమంలో చేరారు. ఆయన తండ్రి జూలై 14 1928 న మరణించడం ఆయనకు విషాదాన్ని మిగిల్చింది. ఆయన తండ్రి యొక్క కల అయిన శ్రీ వేణుగోపాలస్వామి విగ్రహ ప్రతిష్ఠను నెల్లూరు లోని మూల్‌పేట్ లో చేసి సాకారం చేసారు. ఆయన ఆ దేవస్థానానికి నిర్వాహకులైనారు కూడా.

రాజకీయ ప్రస్థానం

[మార్చు]

1934 లో ఆయన సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంకుకు డైరక్టరుగా ఎన్నికైనారు.1936లో తాలూకా బోర్డు ప్రెసిడెంటుగా ఎన్నికైనారు. 1937 లో ఆయన నెల్లూరు మ్యునిసిపాలిటీ చైర్మన్ గా ఎన్నికైనారు. ఆయన ప్రజలకు కులాలకతీతంగా సహాయాలను అందించిన మహోన్నత వ్యక్తిగా నిలిచారు. ఆయన నెల్లూరులో హరిజన హాస్టల్ ను నెలకొల్పారు. అనేకమంది హరిజన విద్యార్థులకు దీని మూలంగా సహకారమందింది.

ఆయన 1942 లో మ్యునిసిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయన వెల్లూరు సెంట్రల్ జైలులో 6 నెలల పాటు ఉన్నారు. ఆయన అక్టోబరు 5 1949 న తిరిగి నెల్లూరు మ్యునిసిపాలిటీ చైర్మన్ గా ఎన్నికైనారు. 1952 లో మరల నెల్లూరు మ్యునిసిపాలిటీ చైర్మన్ గా ఎన్నికైనారు. 1955 లో నెల్లూరు అసెంబ్లీ ఎన్నికలలో శాసన సభ్యునిగా ఎన్నికైనారు. మ్యునిసిపల్ చైర్మన్ గా 1957 వరకు మూడు సంవత్సరాలు కొనసాగారు. ఆయన అక్టోబరు 12 1959 న నెల్లూరు మ్యునిసిపల్ కౌన్సిల్ కు చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఆయన ఆ కాలంలో నెల్లూరు పట్టణానికి డ్రైనేజీ స్కీంను మంజూరు చేయడంలో బాధ్యత వహించారు. ఆయన నీటి పంపిణీ, పట్టన విద్యుదీకరణకు విశేష కృషి చేసారు. కొంత కాలం పాటు ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ ఫెడరేషన్ కు చైర్మన్ బాధ్యతలు కూడా చేపట్టారు.

ఆయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి వైస్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలో తెలియని అనిశ్చితి నెలకొన్నప్పుడు ఆయన హరిజనులకు చెందినవారు ముఖ్యమంత్రి ఉండాలనే తలంపుతో దామోదర సంజీవయ్య పేరును ప్రతిపాదించారు.

ఆంధ్ర శాసన సభలో

[మార్చు]
  • ఆయన 1960 లో సంజీవయ్య మంత్రిమండలిలో చేరి భారీ పరిశ్రమలు, గనులు, ఇండస్ట్రియల్ ట్రస్టుఫండు, వాణిజ్య గృహనిర్మాణం, పురపాలక నిర్వాహణ శాఖ మంత్రిగా యున్నారు.
  • 1962 లో సంజీవయ్య మంత్రివర్గంలో పి.డబ్ల్యూ.డి శాఖామంత్రిగా యున్నారు.
  • 1967 లో బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో పోలీసు, గృహవ్యవహారాలు, ఆయుధానచట్టం, సినిమా, పోటోగ్రఫీ వాణిజ్య శాఖామంత్రిగా ఉన్నారు.
  • 1960 నుంచి 1966 వరకు నెల్లూరి జిల్లా నీటిపారుదలలో 131 స్కీములు రెండు కోట్ల రూపాయలకు పైగా శాంక్షన్ చేయించారు.[1]

కుటుంబం

[మార్చు]

ఆయన సోదరుడు ఆనం వెంకటరెడ్డి ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యునిగా పనిచేసారు. వెంకటరెడ్డి కుమారులు ఆనం రామనారాయణరెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి కూడా శాసన సభ్యులుగా నెల్లూరు జిల్లా రాజకీయాలలో ప్రసిద్ధులైనారు. ఆనం రామనారాయణరెడ్డి 2012 నాటికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ క్యాబినెట్ లో ఆర్థికశాఖమంత్రిగా ఉన్నారు. ఇతను భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయ పార్టీ యొక్క సభ్యుడు.

మరణం

[మార్చు]

ఆయన కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో హోం మంత్రిగా ఉన్నప్పుడు కేన్సర్ వ్యాధికి గురిఅయినారు. ఆయనకు వైద్యులు మద్రాసులో వైద్యం చేసుకోమని సలహా యిచ్చారు. ఆయన మద్రాసులోని కేన్సర్ ఇనిస్టిట్యూట్ లో వైద్యం చేయించుకొని హైదరాబాదు తిరిగి వచ్చారు. కానీ క్యాన్సర్ వ్యాధి తిరిగి వచ్చింది. ఆయన మరల మద్రాసు లోని ప్రైవేటు వైద్యశాలలో చేరారు. ఆయన హెచ్.టి.వీరారెడ్డి ఆసుపత్రిలో చేరి వైద్యం చేసుకున్నప్పటికీ కొంతకాలం తరువాత ఆయన సెప్టెంబరు 20 1967 న కన్నుమూసారు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 ఎ.సి.రెడ్డి చరిత్ర. పైడిమర్రి వెంకటసుబ్బారావు. Retrieved 2020-07-10.
  2. Full text of "A.C.REDDY CHARITRA"

ఇతర లింకులు

[మార్చు]