కందుకూరి అనంతము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కందుకూరి అనంతము
జననంకందుకూరి అనంతము
1901, ఏప్రిల్ 17
తణుకు తాలూకా కాపవరం గ్రామం
మరణం1956, డిసెంబర్ 23
నివాస ప్రాంతంతణుకు
వృత్తికథా రచయిత, రంగస్థల నటుడు
భార్య / భర్తసుందరమ్మ

కందుకూరి అనంతము (1901 - 1956) ప్రముఖ తెలుగు కథా రచయిత, రంగస్థల నటుడు. వీరు కరుణకుమార అనే కలం పేరుతో రచనలు చేశారు.

వీరు తణుకు తాలూకా కాపవరం గ్రామంలో జన్మించారు. వీరు కళాశాల విద్య మధ్యలో ఆపివేసి, డిప్యూటీ తాసీల్దారు గా ఉద్యోగంలో చేరి కొద్దికాలంలో తహసీల్దారు పదవిని నిర్వహించారు.

వీరు రాసిన కథలలో గ్రామాలలో నివసించే పేదరైతులు, కష్టజీవులే ఇతివృత్తాలు. వీరి కథలు ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, కిన్నెర, స్వతంత్ర మొదలైన పత్రికలలో ప్రచురించబడ్డాయి.

వీరు నటుడిగా కూడా ప్రసిద్ధులు. హరిశ్చంద్రుడు, సారంగధరుడు, బాహుకుడు, అర్జునుడు ఆయనికి అభిమాన పాత్రలు.

వీరు 1956 లో పరమపదించారు.

బాల్యం, విద్య

[మార్చు]

వీరు 1901, ఏప్రిల్ 17వ తేదీన కాపవరం గ్రామంలో మల్లికార్జునరావు, శేషమ్మ దంపతులకు జన్మించారు. వీరు ఉన్నత పాఠశాల విద్యను తణుకులో చదివారు. తరువాత మహారాజా కళాశాల, విజయనగరంలో ఎఫ్.ఎ.లో చేరి ఆర్థిక పరిస్థితుల వల్ల మధ్యలో చదువు ఆపివేశారు.[1]

ఉద్యోగం

[మార్చు]

1920లో వీరు శింగరాయకొండ - కనిగిరి గ్రామల మధ్య వేసిన మొట్టమొదటి పెట్రోలు బస్సులో కండక్టర్‌గా నెలకు 10 రూపాయల జీతంతో ఉద్యోగం ప్రారంభించారు. తరువాత కనిగిరి తాలూకా ఆఫీసులో రెవెన్యూ డిపార్ట్‌మెంటులో ప్రభుత్వోద్యోగిగా చేరారు. తరువాత మహిమలూరు, కోవూరు, కొడవలూరు, పేరూరులలో రెవెన్యూ ఇన్‌స్పెక్టరుగా పనిచేశారు. 1940లో నెల్లూరు జిల్లా కలెక్టరు కార్యాలయంలోను, 1941-42లలో మద్రాసులోను పనిచేశారు. తరువాత ప్రమోషన్‌పై విజయవాడలో డెప్యుటీ తాసీల్దారుగా పనిచేశారు. అదే హోదాలో దర్శి, ముత్తుకూరు, సూళ్ళూరుపేట, వెంకటగిరిలలో పనిచేశారు. 1950లో మద్రాసు హరిజన సంక్షేమ శాఖలో పనిచేసి 1956లో పదవీ విరమణ చేశారు.[1]

నాటకరంగం

[మార్చు]

వీరు కనిగిరిలో ఉద్యోగిస్తున్నప్పుడు అక్కడ న్యాయవాదిగా పనిచేస్తున్న గొంట్ల శ్రీరాములు సెట్టి ప్రోత్సాహంతో "శ్రీరామభక్తనాటక సమాజం" అనే నాటక సంస్థను స్థాపించి అనేక నాటకాలు వేశారు. వీరు హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్రునిగా, చిత్రనళీయం నాటకంలో నలునిగా, బాహుకునిగా, పాదుకా పట్టాభిషేక నాటకంలో దశరథునిగా, పాండవోద్యోగ విజయం నాటకంలో కృష్ణునిగా, చింతామణి నాటకంలో బిల్వమంగళునిగా, వరవిక్రయంలో పురుషోత్తమరావుగా నటించి ప్రేక్షకులను మెప్పించారు.[1]

సాహిత్యరంగం

[మార్చు]

వీరికి వెన్నెలకంటి రాఘవయ్య, చింతా దీక్షితులు, అడివి బాపిరాజు, కోలవెన్ను రామకోటీశ్వరరావు మొదలైన సాహితీవేత్తలతో సన్నిహిత సంబంధాలున్నాయి. మల్లంపల్లి సోమశేఖరశర్మ వీరికి బావ. మల్లంపల్లి సోమశేఖరశర్మతో కలిసి ఆధునిక వాఙ్మయ కుటీరం అనే పేరుతో ఒక ప్రచురణ సంస్థను స్థాపించారు.[1]

రచనలు

[మార్చు]
  • కరుణకుమార కథలు
  • బిళ్ళల మొలతాడు
  • సన్నజీవాలు (కథాసంపుటం)

కథల జాబితా

[మార్చు]

కథానిలయంలో లభ్యమౌతున్న కందుకూరి అనంతం కథల జాబితా:[2]

  1. లంఘనం పరమౌషధం
  2. అయ్యవారిని చేయబోతే కోతయింది
  3. కొత్త చెప్పులు
  4. కయ్య కాలువ
  5. పెండ్లి ముచ్చట
  6. పోలయ్య
  7. మొక్కుబడి
  8. భూతవైద్యం
  9. పశువుల కొఠం
  10. వెంకన్న
  11. అంటు జాడ్యం
  12. దివాన్ జీగారి ముసాఫరు
  13. సేవాధర్మం
  14. కూలిమనిషి
  15. టార్చిలైటు
  16. గుండెజబ్బు
  17. నమ్మినబంటు
  18. సారాయి డబ్బులు
  19. మాంబళం
  20. 512
  21. జాకీ
  22. బిళ్లల మొలత్రాడు
  23. రిక్షావాలా
  24. ఉన్నతోద్యోగాలు
  25. గరుడ సేవ
  26. చలిజ్వరం
  27. కనువిప్పు
  28. గ్రాంధిక భాషావాది
  29. హిందీపరీక్ష
  30. నాలుగు బస్సులు
  31. అర్ధ రూపాయి
  32. ఆకలి మంటలు
  33. టార్చిలైటు
  34. ఉద్యోగ పర్వం
  35. పశువుల కొఠం

పరిశోధన

[మార్చు]

"కరుణకుమార కథలలో దళిత జీవన చిత్రణ" అనే అంశంపై కామవరపు విజయలక్ష్మి అనే విద్యార్థి తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రి పీఠం నుండి కర్రి సంజీవరావు పర్యవేక్షణలో పరిశోధన చేసి 1996లో ఎం.ఫిల్. పట్టా సంపాదించారు.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 కామవరపు, విజయలక్ష్మి (1 December 1996). కరుణకుమార కథలు దళిత జీవన చిత్రణ (1 ed.). pp. 3–5.[permanent dead link]
  2. కథానిలయం జాలస్థలిలో కందుకూరి అనంతం వివరాలు