వెన్నెలకంటి రాఘవయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెన్నెలకంటి రాఘవయ్య

వెన్నెలకంటి రాఘవయ్య (జూన్ 4, 1897 - నవంబరు 24, 1981) స్వరాజ్య సంఘం స్థాపకుడు. స్వాతంత్ర్య పోరాట యోధులు. భారత ప్రభుత్వం నుండి పద్మ భూషన్ అవార్డ్ గ్రహీత. ‘నెల్లూరు గాంధీ’ గా పేరు పొందిన వెన్నెలకంటి రాఘవయ్య ప్రముఖ న్యాయవాది, రాజకీయవేత్త, సంఘ సేవకుడు. ఆంధ్రదేశంలో రాఘవయ్య గారి పేరు తెలియని వారుండరు. ఆయన స్ఫురద్రూపి. శుద్ధ ఖద్దరు వస్త్రాలను ధరించి, పట్టుదలతో, కార్యదీక్షతో, ధైర్యస్థైర్యాలతో ముందుకు నడిచిన దేశభక్తుడు. ఏ అంశాన్ని చేపట్టినా దాన్ని సాధించేవరకూ పట్టువీడని వెన్నెలకంటి, ఒక వినూత్న చరిత్రను సృష్టించిన చరిత్రకారుడు.

జననం[మార్చు]

నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా శింగపేట గ్రామంలో 1897, జూన్ 4 న జన్మించారు. తల్లిదండ్రులు సుబ్బమ్మ, పాపయ్యలు. అయిదో యేట తల్లిని పోగొట్టుకున్నారు. అక్క దగ్గర పెరిగారు. ప్రాథమిక విద్యాభ్యాసం శింగపేట, అల్లూరు. 1909లో నెల్లూరు వెంకటగిరి రాజా ఉన్నత పాఠశాల. మద్రాసు పచ్చియప్ప కళాశాలలో 1918లో బి.ఎ. చదివారు.

స్వాతంత్ర పోరాటంలో[మార్చు]

నెల్లూరు జిల్లా కాంగ్రెస్‌కి తొలి కార్యదర్శి .పొణకా కనకమ్మ, బాలసరస్వతమ్మ, వేమూరి లక్ష్మయ్య, చతుర్వేదుల వెంకటకృష్ణయ్య వంటి వారిని సంఘటితంచేసి 'స్వరాజ్య సంఘం' స్థాపించారు. 1928లో బి.ఎల్. పట్టా పొంది న్యాయవాద వృత్తి చేపట్టారు.

వెంకటగిరి రాజాకు, రైతులకు మధ్య కొనసాగిన వివాదాల్లో ఆచార్య ఎన్. జి. రంగా గారితో కలసి రైతుల పక్షాన నిలిచి పోరాడారు. ప్రకాశం పంతులుతో కలిసి స్వరాజ్యోద్యమంలో ఉత్సాహంతో పాల్గొన్నారు. పెన్నార్- కృష్ణ ప్రాజెక్టు కోసం ఆందోళన జరిపారు. 1929లో 'ఆది- ఆంధ్ర ఉద్ధరణ సంఘం' ఏర్పాటు చేశారు. ఆ సంఘం పక్షాన హరిజన బాలబాలికలకు వేర్వేరు హాస్టళ్లు ఏర్పరచారు.

1946లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 1947 వరకు ప్రకాశంపంతులుకి పార్లమెంటరీ కార్యదర్శిగా పనిచేశారు. ప్రజలు ఆయన్ని "నెల్లూరు గాంధీ" అని పిలిచేవారు.

ఎరుకలు, యానాదులు, లంబాడీలు, చెంచులు, బుడబుక్కల, ఇతర సంచార, విముక్త ఆదిమ జాతుల్ని సంఘటితంచేసి వారిలో చైతన్యం తెచ్చాడు. గిరిజనుల జీవిత సమస్యలపై అనేక గ్రంథాలు వ్రాశారు. వారి హక్కుల కోసం పోరాడారు. హాస్టళ్లు కాలనీలను ఏర్పాటు చేశారు. భారతీయ ఆదిమజాతి సేవక్ సంఘ్‌లో సభ్యులు. థక్కర్ బాపాతో కలసి గిరిజనులను మైదాన ప్రాంతాల వారి దోపిడీ నుంచి రక్షించడానికి కృషి చేశారు. క్రిమినల్ ట్రైబ్స్ చట్టం 1952లో రద్దు చేయించారు. బాలికలను అమ్మే పనిమనుషులుగా మార్చే ఆచారాన్ని గిరిజనులు తిరస్కరించేలా చేశారు.

1973లో పద్మభూషణ్ అవార్డు పొందారు.

మరణం[మార్చు]

1981, నవంబరు 24 న తుదిశ్వాస విడిచారు.

రచనలు[మార్చు]

  • ఆంగ్లంలో ఇరవై రెండు గ్రంథాలు, తెలుగులో పది గ్రంథాలు రాశారు.
  • ఆంగ్ల గ్రంథాలు --యానాదులు, ప్రపంచంలో సంచార జాతులు, సంచార జీవనం, కారణాలు - పరిష్కారం, ట్రైబల్ అప్రోచ్, ట్రైబల్ జస్టిస్, గిరిజనుల గుడిసెలు, గిరిజన ప్రపంచం వింతలు, గిరిజనుల వివాహాలు, ధక్కర్ బాపా జీవితం, వ్యవసాయ కూలీలు, ఆదివాసుల తిరుగుబాట్లు, ఆదివాసుల జీవనంలో వెలుగు చీకట్లు, భారతదేశంలో ఆదివాసులు, నేరస్థ గిరిజన జాతుల చట్టం, చెంచులు, గిరిజనులకు విద్య, అల్లూరి సీతారామరాజు, ఆదివాసి బాలలు, హిందువుల పౌరాణిక దృక్పథం, ఆదివాసుల సమస్యలు, అంటరానితనం -రాజకీయ హేతువులు వంటివి .
  • తెలుగులో - 'అడవిపూలు, మురియాలు, గుర్తింపు, నాగులు, చెంచులు, సంచార జాతులు, ఆదివాసుల వివాహ వ్యస్థ - సంప్రదాయాలు, గిరిజనుల జానపద గీతాలు, మన కర్తవ్యం ఏమిటి? టాల్‌స్టాయ్ నవల వంటివి. వాటన్నింటినీ కేంద్రప్రభుత్వ ఆర్థిక సహకారంతో ప్రచురించారు.

పద్మభూషణ్ వెన్నెలకంటి రాఘవయ్య స్మ్రుతి శకలాలు, (స్వీయ చరిత్ర), సంపాదకులు: డాక్టర్ కాళిదాసు పురుషోత్తం. sOCIETY FOR sOCIAL cHANGE, nELLORE. 524 003. AP.

ఇవీ చూడండి[మార్చు]