చింతా దీక్షితులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చింతా దీక్షితులు
జననంచింతా దీక్షితులు
1901
తూర్పు గోదావరి జిల్లా లోని దంగేరు
మరణంఆగష్టు 25, 1960
ప్రసిద్ధిప్రముఖ కథా రచయిత , బాల గేయ వాజ్మయ ప్రముఖులు.

చింతా దీక్షితులు (1891 - ఆగష్టు 25, 1960) ప్రముఖ కథా రచయిత, బాల గేయ వాజ్మయ ప్రముఖులు. వీరు తూర్పు గోదావరి జిల్లా లోని దంగేరు గ్రామంలో జన్మించారు. వీరు బి.ఏ. ఎల్.టి పరీక్షలలో ఉత్తీర్ణులై ప్రభుత్వ విద్యాశాఖలో పనిచేశారు. వీరు తన బంధువైన చింతా శంకర దీక్షితులుతో కలసి జంటకవులు మాదిరిగా కవితారంగంలో ప్రవేశించారు.

వీరు మొదట చిత్రరేఖ (1912) అనే అపరాధ పరిశోధన నవలను రచించి తరువాత గేయ కవిత్వాన్ని అభిమానించి హరిణ దంపతులు (1923), కవి కన్య (1923) గేయాలను ప్రచురించారు. తర్వాత బాల గేయ వాజ్మయంపై తన దృష్టి నిల్పి "లక్క పిడతలు" అనే గేయ సంపుటిని ప్రచురించారు.[1] వీరు కొన్ని నాటకాలు కూడా రచించారు. వ్యావహారిక భాషలో వీరు రచించిన "అనుమానం మనిషి" ఒక గణనీయమైన నాటకంగా ప్రసిద్ధిపొందినది. 1925లో తోటి వనంలో అనే కథ సఖి అనే పత్రికలో ప్రచురితమై అందరి మన్ననలు పొందినది. "ఏకాదశి" అనే పేరుతో 11 కథల సంకలనాన్ని కూడా ప్రచురించారు.

వీరు తన పూర్వాచార ఘనతను ప్రశంసించడానికి, ఆధునిక నాగరికతను నిరసించడానికి "వటీరావు ఎం.ఏ." అనే పాత్ర సృష్టించి దాని ఆధారంగా ఎన్నో కథలను రచించారు. "బాలానందం" అనే పేరుతో పిల్లలకోసం దీక్షితులు కొన్ని కథలను రాశారు. ఇందులోని సూరి, వెంకి, సీతి పాత్రలు పిల్లలను, పెద్దలను బాగా ఆకర్షించాయి.

ఆధ్యాత్మిక విషయాసక్తితో వీరు హరనాథ బాబా భక్తవర్గంలో చేరి బాబా రచించిన ఆంగ్ల గ్రంథాన్ని తెలుగులోకి "ఉపదేశామృతము" అనే పేరుతో అనువదించారు. భారతదేశాన్ని గురించి పిల్లలకు అర్థమయ్యేలా మినూ మిసాని రాసిన గ్రంథాన్ని మన ఇండియా పేరిట తెనిగించారు.[2]

జీవిత విశేషాలు[మార్చు]

దీక్షితులు గారు 19వ శతాబ్ది చివరి దశకంలో 1901 లో తూ.గో.జిల్లా దంగేరు గ్రామంలో జన్మించారాయన.వారి జనకులు, పితామహులు పేరెన్నిక గన్న వైదిక సాంప్రదాయ నిష్ఠాగరిష్ఠులు.కానీ చిన్నప్పటినుంచీ శ్రీ దీక్షితులు గారు ఆంగ్ల బాధ అభ్యసించారు.క్రమక్రమంగా బి.ఏ, ఎల్.టి. పరీక్షలలో ఉత్తీర్ణులై ప్రభుత్వోన్నత పాఠశాలలో ఉపాద్యాయులుగా కుదురుకొన్నారు.ఉద్యోగరీత్యా కనిగిరి, రాజమండ్రి మొదలయిన పట్టణాలలో కొన్నేళ్ళపాటున్నారు.విద్యాశాఖలో డెప్యుటీ ఇంస్పెక్టర్ హోదాలో కోస్తాజిల్లాలలో పలుతావులలో పర్యటించారు.1960సం. బాగా ఆరోగ్యం పాడయినాక కుమారుని ఇంట కడలూరులో పరమపదించారు.

శ్రీ దీక్షితులు గారు సాహితీ సమితి ప్రప్రథమ సభ్యులలో ప్రముఖులు.సమితిలో ప్రవేశించక పూర్వమే అళహసింగరి మొదలయిన పరిశోధక నవలలు కొన్ని రచించారు.సమితిలో ప్రవేశించిన తరువాత ఆయన ఆధోరణి విరమించుకున్నారు.క్రమక్రమంగా తన కథానికలతో శ్రీ దీక్షితులు గారు ఆనాడు సమితిలో కథక చక్రవర్తి అని విఖ్యాతి గడించుకున్నారు. వాటినే ఏకాదశి అన్న పేరుతో 11 రచనలతో ఒక ప్రత్యేక సంపుటి వెలువరించారు. దీనిలో చెంచుదంపతులు చాలా గొప్ప కథ. సాహితికి కథ అన్న మరొక కథానిక శ్రీ దీక్షితులు గారి కథనా చాతుర్యానికి ఒక మచ్చు తునక.ఇది భారతీయ భాషలన్నింటిలోనికి ప్రచురించవచ్చునని పలువురి అభిప్రాయము.

రచనలు 

•ఏకాదశి

• శబరి

• వటీరావు కథలు

• లక్క పిడతలు

ఏకాంక రూపకాలు[మార్చు]

దీక్షితులు గారు కథానికలే కాక చక్రవాకమిధునము, వరూధిని, శర్మిష్ఠ, శ్రీకృష్నుడు, రేణుక మొదలగు 10-12 ఏకాంక నాటికలు రచించారు.వీటిలో కొన్ని భారతి ప్రచురించింది.వీటిలో శర్మిష్ఠ, రేణుక ఎన్నదగిన ఏకాంక నాటికలు.పూరు కుమారుని యౌవనం స్వీకరించి తనతో వయోభోగాలను అనుభవించాలని ఉవ్విళ్ళూరిన యయాతితో శార్మిష్ఠ సాగించిన ప్రసంగంతో ఇది ఒక సరికొత్త దృక్కోణంతో మనోజ్ఞంగా సాగిపోతుంది.దీక్షితులు గారు ఈ నాటికలేవీ ప్రదర్శన దృష్టితో రచించినట్లు కనబడదు. అదీకాక వీటిలో నటకీయత చాలా తక్కువ.చక్రవాక మిధునం మొదటినుంచి చివరిదాకా ఒక ఖండ కావ్యంలా సాగిపోతుంది.

శబరి[మార్చు]

ఆమూలాగ్రంగా వచనంలో రచించిన ఈనాటకం భారతి ధారావాహికంగా ప్రకటించింది. అయితే ఇది సంప్రదాయమయిన రూపకమార్గంలో రచించిన రచనకాదు.శబరి అమాయిక భక్తిపరిణితి ప్రద్ర్సనమే దీని ప్రధానలక్ష్యము. దీక్షితులు గారు ఈనాటకమ్లో సవరభాషలోని ఆటవీకుల పాటలు కొన్ని చేర్చారు. శాబరిలోని ఆటవిక కన్యక కల్ల, కపటము లేని సహజ సరళత కొక సాంకేతిక రూపకల్పన.రూపకాలు అనేక విధాలు.కొన్ని రంగస్థలమీద బాగా రక్తికట్టినట్టే కనిపిస్తాయిగాని, చదివినప్పుడూ బిగి, జిగి కనిపించవు.మరికొన్ని చదువుతూ ఉంటే ఆహా!! అనిపిస్తాయిగానీ ప్రేక్షకుల కేమాత్రము ఉత్సాహం కలిగించవు.మరికొన్ని సుదీర్ఘ కావ్యాలులా సాగిపోతాయి.దీక్షితులు గారి శబరి ఈవర్గంలోకి చేరుతుంది.నిజానికి ఇది ఒక గద్యకావ్యంవంటిదేమో అనిపిస్తుంది.

బాలసాహితీ పితామహుడు[మార్చు]

ఈరోజుల్లో బాలసారస్వతానికి క్రమక్రమంగా తగినంత ప్రాధాన్యం లభించడంలేదు. ప్రభుత్వం ప్రోత్సాహమూలేదు. కాని ఆరోజుల్లో భారతి చిన్న పిల్లల కథలు, పాటలు, బాగా ప్రోత్సహించేది. సూరి, సీతి, వెంకి అనే శీర్షికతో దీక్షితులు గారు భారతిలో చాలా కథలు ప్రచురించారు. లీలాసుందరి అన్న పేరుతో ప్రతిభలో ఇంకొక పెద్దకథ ప్రచురించారు. ఇలాగే పిల్లల గేయాలెన్నో రచించారు. ఇవన్నీ లక్క పిడతలు అనే సంపుటిలో వెలువడ్డాయి.దీనికి భారత ప్రభుత్వం బహుమతి లభించింది.వాస్తవానికి శిశు సారస్వతానికి దీక్షితులు గారు పితామహులు వంటివారని అనుకోవచ్చును.

చాలా ప్రాచీన కాలం నుంచి మన ఇళ్ళలో మహిళలనోట అనుశ్రుతంగా ప్రవహిస్తున్న పాటలలో అమూల్య ఖనులున్నాయని గుర్తించి దీక్షితులు గారు లాంటి వారు, శ్రీ నేదునూరి గంగాధరం గారు ఈ పాటల సేకరణకు ఉపక్రమిచారు.ప్రతిభలో ప్రచురించిన స్త్రీల సారస్వతము అన్న సుదీర్ఘ వ్యాసం వారి చిరకాల పరిశ్రమకు, అభఇరుచికి చక్కని తార్కాణం.

వ్యక్తి విశిష్ఠత[మార్చు]

దీక్షితులు గారు చాలా పొడగిరి. వర్చస్వి. సరళ హృదయులు.సత్కారాలన్న, సన్మానాలన్నా దూరదూరంగా తొలగిపోయేవారాయన.ఒకసారి తెనాలి నవ్యసాహిత్య పరిషత్తులో వారిని ఘనంగా గౌరవించాలని అభిమానులు కొదరు సంకల్పించారు. కాని ఆయన కది తెలిస్తే ముందుగానే మూటకట్టి వెళ్ళిపోతారేమోనని భయపడి అర్ధరాత్రి వేళ అతిరహస్యంగా ప్రయత్నాలు కొనసాగించారు. తెల్లవారిన తరువాత చాలామంది మిత్రులెంతో బలవంతం చేస్తే తప్ప ఆయన దానికంగీకరించలేదు.సామాన్యంగా రచయితలు ఇతరుల కృతులను ఒక పట్టాన మెచ్చుకోరు.మున్ముందుగా ఏదోలోపం పట్టుకోవాలని ప్రవృత్తి లోలోపల మొలకెత్తుతుంది. కాని దీక్షితులు గారి దృష్టి తమతోటి సాహితీపరుల రచనలలో దోసగులవైపే మళ్ళేదికాదు. ఇక యువరచయితలు వస్తే వారిని ఆకాశానికెత్తి ఎంతో ప్రోత్సహించేవారు.కాని సారస్వతంలో పెద్దలెవరైనా తప్పటడుగు వేస్తే నిర్భయంగా ఎదుర్కొనేవారాయన.ఒకసారి ఇల్లాంటి సందర్భంలో నలుగురైదుగురు సాహిత్యాభిమానుల సంతకాలతో స్వయంగా సంపాదక లేఖ వ్రాసి ఆవ్యవహారం రచ్చకీడ్చారు.అయితే ఆపత్రిక అంతగా ప్రసిద్ధమయినది కాకపోవడంవల్ల అట్టే గొడవబయలుదేరలేదు.

ఆధ్యాత్మిక దృష్టి[మార్చు]

అంతగా ఆస్తిపరులు కాకపోయినా దీక్షితులుగారి జీవిత సరణిలో చెప్పుగోదగిన ఒడిదుడుకులెమీ తటస్థ పడలేదు.బాగ సుఖంగానే సాగిపోయింది.కానీ చాలా అంతర్ముఖులాయన.లోలోపల దేనికోసమో అన్వేషిస్తున్నట్లుండేవారు.శబరి నాటక రచనకు పూర్వమే వారిలో ఒక విధమైన ఆధ్యాత్మిక దృష్టి బయలుదేరింది. అప్పటినుంచి ఎవరయినా సన్యాసులు గానీ, యోగులుగానీ తటస్థపడితే వారివెంటపడేవారు. రాజమండ్రిలో ఒక యోగి దగ్గరకి వెళ్ళాలని ఉవ్విళ్ళూరేవారట. ఆయనని కలిసాక, అటుపై అరుణాచలం లోని రమణ మహర్షి సందర్శన భాగ్యం లభించింది. ఆపైన క్రమక్రమంగా ఆయనదృష్టి అంతా అరుణాచలం మీదకి తిరిగింది. పోను పోను వారసలు సారస్వతం మాట స్మరించడమే మానేసారు.

చలంతో చెలిమి[మార్చు]

దీక్షితులు గారు, గుడిపాటి వెంకట చలం మంచి స్నేహితులు.కానీ ఈయన ఆచరణలలోనూ, ఆదర్సాలలోనూ కేవలం ఉత్తర దక్షిణ ధ్రువాలు. చలంగారొక పెద్ద జలపాతం వంటి వ్యక్తి! మరి దీక్షితులుగారో! నిర్మల క్షీరసరోవరము.ఒకరొకరి రచనల యెడల గౌరవంవల్ల నయితేనేమీ, నిశితమయిన నిజాయితీవల్ల నయితేనేమీ వీరిద్దరికీ చక్కని చెలిమి ఏర్పడినది. దీక్షితులుగారికి చలం గారు వ్రాసిన ఉత్తరాలు ఒక సంపుటి రూపంలో వెలువడ్డాయి.ఆ లేఖలలో అక్కడక్కడ వీరుభయులు ఎక్కడ మొహమాటం అన్నది లేకుండా మన సారస్వతాన్ని గూర్చి, సమస్యలను గూర్చి చర్చలు సాగించారు.ఇవి చదివాక దీక్షితులు గారి లేఖలు ప్రచురిస్తే ఇంత బావున్నో అనుకోవచ్చు!! క్రమక్రమంగా దీక్షితులు గారితో పాటు అరుణాచల యాత్రలు సాగించిన తరువాత చలంగారు సకుటుబంగా తిరువణ్ణామలై చేరుకొన్నారు. దీక్షితులుగారు మాత్రం అనారోగ్యం కారణం వల్ల కడలూరులోనే ఉండిపోయారు.

నివేదన[మార్చు]

శ్రీ దీక్షితులు గారు మహర్షినుద్దేశించి కూర్చిన రచనలతో నివేదన అని చిన్నపుస్తకం ప్రకటించారు. రమణ మహర్షి పరమపదించిన పిమ్మట ఆయన అమూల్య వస్తువులన్నీ క్రోడీకరించి జాగ్రత్త పెట్టవలసిన బాధ్యత ఆశ్రమంలో ఒక విఖ్యాత వ్యక్తిమీద పడింది. వాటిలో మహర్షి స్వదస్తూరితో వ్రాసి భద్రపరచుకొన్న నివేదన ప్రతిఒకటి దొరికింది. మహర్షి ఎలాంటి సందర్భాలలో నయినా సంతకం చేయడానికి అంగీకరించలేదు. పరిమిత వ్యక్తిత్వం లేక పోవడమే దాని ప్రధానకారణము. ఒకప్పుడాశ్రమం వాళ్ళు ఒక వీలునామా వ్రాసి, మున్ముందు ఆశ్రమ నిర్వహణలో చిక్కులేవయినా బయలుదేరవచ్చునని కనక ఆవీలునామాలో సంతకం చేయవలసినదనీ మహర్షిని నిర్బంధించారట. కాని ఆయన సుతారము దాని కంగీకరించలేదు. కాదు కూడదని కొందరు పట్టు పట్టడంతో ఆవీలునామా క్ర్ంద ఒక చిన్నగీత గీశారు.అంతేకానీ సంతకం మాత్రం చేయలేదు.ఆవిధంగా మమకారాలన్నీ నిర్మూలించుకొన్న ఆమహనీయవ్యక్తి శ్రీ దీక్షితులు గారి నివేదన స్వయంగా తిరిగి వ్రాసుకొని పరమపదించే పర్యంతము తమ దగ్గర భద్రపరచుకొన్నారు!

మూలాలు[మార్చు]

Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:
  1. బుడ్డిగ సుబ్బరాయన్ (1990). బాలల విజ్ఞాన సర్వస్వము - సంస్కృతి విభాగము (in Telugu).{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  2. మసానీ, మినూ; దీక్షితులు (అనువాదం), చింతా. మన ఇండియా. Retrieved 13 January 2015.